Google Data Center: విశాఖలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఒకే ఒక్క ప్రాజెక్ట్ లక్ష కోట్లకు పైగా పెట్టుబడిని, లక్షలాది ఉద్యోగాలను మోసుకొస్తోంది. విశాఖను గ్లోబల్ మ్యాప్‌లో నిలబెడుతూ.. ఐటీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది గూగుల్ ఏఐ డేటా సెంటర్. ఏపీ ఐటీ సెక్టార్ హిస్టరీని తిరగరాసేలా.. విశాఖపట్టణంలోని తర్లువాడలో.. గూగుల్ ఏఐ డేటా హబ్‌కు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్. గూగుల్ డేటా సెంటర్ రాకతో.. విశాఖ ముఖచిత్రమే మారబోతోంది. ఏఐ డేటా హబ్‌గా, సబ్‌సీ కేబుల్ నెట్‌వర్క్‌కి కేంద్రంగా అవతరించబోతోంది. గూగుల్ క్లౌడ్ పరంగా ఆసియాకే.. విశాఖ ఏఐ హబ్ గేట్‌వేగా మారనుంది. దేశంలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్‌గానూ అవతరించబోతోంది.
లక్షా 35 వేల వేల కోట్ల పెట్టుబడితో.. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. గిగా వాట్‌కు పైగా కెపాసిటీతో.. మూడు చోట్ల వీటిని ఏర్పాటు చేస్తోంది. 2028నాటికి మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది గూగుల్. తొలి దశలో తర్లువాడలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం తర్లువాడలో 267 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి దగ్గర 175 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు, లక్షలాది మంది యువత కలల సాకారం. గూగుల్ ఏఐ హబ్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా.. లక్షా 88 వేల ఉద్యోగావకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. నిర్మాణ దశలోనే 60 వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీ డిమాండ్ రానుంది. అదేవిధంగా.. మెయింటెనెన్స్, నెట్‌వర్క్ ఇంజనీరింగ్, గ్రీన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ లాంటి విభాగాల్లో వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది.
గూగుల్ రాక విశాఖకే కాదు.. ఏపీకి ఒక గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు చెప్పారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్.. ఏపీ టెక్నాలజీతో పాటు దేశానికే గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందన్నారు. టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకొని నిలబడుతుందని, కొత్త ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని చెప్పారు. గూగుల్ ఇన్నోవేషన్స్, ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండూ కలిశాయన్నారు. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం పూర్తవుతుందని ఆశించారు.
వచ్చే జులైలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. పెట్టుబడులు, ఒప్పందాలే కాదు, ప్రారంభంలోనూ ముందున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక.. దేశం గర్వించే విజనరీ లీడర్ చంద్రబాబు అన్నారు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్. బాబు నాయకత్వంలో.. విశాఖపట్నం.. ఐటీపట్నం కాబోతోందని తెలిపారు. జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. అంతేకాదు, బుల్లెట్ ట్రైన్స్ ద్వారా సౌతిండియా ముఖచిత్రం మారబోతోందన్నారు. అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెరగబోతోందని తెలిపారు. 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లొచ్చన్నారు అశ్వినీ వైష్ణవ్.
విశాఖ ముఖచిత్రం మారబోతోందన్నారు మంత్రి లోకేశ్. గూగుల్ డేటా సెంటర్ కోసం జరిగింది భూమి పూజ మాత్రమే కాదని, కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు అని చెప్పారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో విశాఖ ఉంటుందన్నారు. వైజాగ్‌లో జీ అంటే.. గూగుల్ అనే సౌండ్.. రీసౌండ్ వస్తుందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనాలు చూస్తున్నామని, పెట్టుబడులతో ఏపీ చరిత్ర సృష్టిస్తోందని లోకేశ్ అన్నారు.
నవ్యాంధ్ర ఐటీ క్యాపిటల్ విశాఖ.. ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్, పోర్ట్‌కే పరిమితమైంది. గూగుల్ రాకతో.. వైజాగ్.. సిలికాన్ కోస్ట్‌గా మారుతోంది. ఇక్కడ ఏర్పాటు కానున్న సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా విశాఖ నేరుగా అంతర్జాతీయ డిజిటల్ నెట్‌వర్క్‌తో లింక్ అవుతుంది. ఈ డేటా సెంటర్‌లో సబ్‌సీ కేబుల్స్‌దే కీరోల్. ఈ ప్రపంచంలోని 99 శాతం ఇంటర్నెట్ డేటా సముద్రం అడుగున ఉండే ఈ భారీ కేబుల్స్ ద్వారానే ట్రావెల్ చేస్తుంది. ఇవి కొన్ని వేల కిలోమీటర్ల పొడవు ఉండి, ఒక ఖండాన్ని.. మరో ఖండంతో అనుసంధానిస్తాయి. అలాంటి.. ఈ సబ్‌సీ కేబుల్స్.. ఇప్పుడు విశాఖకు రాబోతున్నాయ్. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, వియత్నాం మీదుగా.. పసిఫిక్ మహాసముద్రం ద్వారా అమెరికా దాకా వెళ్తాయి. ముంబై, చెన్నై మీదుగా మిడిల్ ఈస్ట్ ద్వరా యూరప్ దేశాలకు కనెక్ట్ అవుతాయి. విశాఖపట్నం బంగాళాఖాతం తీరంలో ఉండటం వల్ల, ఆగ్నేయాసియా దేశాలకు ఓ డిజిటల్ గేట్ వేగా మారనుంది.
శాటిలైట్ కంటే కేబుల్స్ ద్వారా డేటా చాలా వేగంగా ప్రయాణిస్తుంది. గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలకు ఇది చాలా ముఖ్యం. సబ్‌సీ కేబుల్స్ నేరుగా విశాఖకు రావడం వల్ల ఇక్కడ ఇంటర్నెట్ వేగం రాకెట్ స్పీడ్‌లో ఉంటుంది. పైగా.. ఏఐ ప్రాసెస్ చేయడానికి భారీ మొత్తంలో డేటా అవసరం. ప్రస్తుతం ఇండియాలో ముంబై, చెన్నై మాత్రమే ల్యాండింగ్ పాయింట్లుగా ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా హబ్‌తో.. విశాఖపట్నం మూడో అతిపెద్ద హబ్‌గా మారబోతోంది. దీనివల్ల.. ప్రపంచస్థాయి కంపెనీలు తమ సర్వర్లని.. విశాఖలో పెట్టేందుకు ముందుకొచ్చేందుకు అవకాశాలున్నాయి. ఇప్పుడు ఒక్క గూగుల్ మాత్రమే వచ్చింది. ఫ్యూచర్‌లో మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి సంస్థలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖకు రాబోయే ఈ సబ్‌సీ కేబుల్స్.. వైజాగ్‌కి డిజిటల్ బ్యాక్‌బోన్ లాంటివని చెబుతున్నారు. గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీ.. విశాఖలో సెటిల్ అవ్వడంతో.. మరిన్ని ఐటీ స్టార్టప్‌లు, సెమీకండక్టర్ కంపెనీలు.. వైజాగ్ వైపు చూసే అవకాశాలున్నాయ్.
తెలుగు నేలపై ఐటీ రెవల్యూషన్ అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది.. 1990ల నాటి హైదరాబాద్. అప్పట్లో.. మైక్రోసాఫ్ట్ ఎంట్రీ ఎలాగైతే.. హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడు గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చిందో.. ఇప్పుడు విశాఖలో తీరంలోనూ అలాంటి మ్యాజిక్కే జరగబోతోంది. అందుకే అంటున్నారు.. ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్.. ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో గ్రేట్ మైల్ స్టోన్‌గా నిలుస్తుందని!
గూగుల్ ఏర్పాటు చేయబోతున్న భారీ ఏఐ డేటా సెంటర్ ఓ భవనం కాదు. నవ్యాంధ్ర దశను మార్చే డిజిటల్ పవర్ హౌస్. అందుకే.. అంటున్నది హిస్టరీ రిపీట్ అవుతోందని! హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ రాకతో.. ప్రపంచం దృష్టి అంతా హైదరాబాద్ మ్యాప్‌పై పడింది. ఇప్పుడు.. భారీ పెట్టుబడితో గూగుల్ విశాఖలో అడుగుపెట్టడమనేది ఏపీ ఐటీ రంగానికి.. ఓ బిగ్ బ్యాంగ్ మూమెంట్ అనే చెప్పాలి. ఇది.. రాష్ట్రానికి ఆదాయాన్ని మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై ఓ బ్రాండ్ ఇమేజ్‌ని సృష్టిస్తుంది.
ఒకప్పుడు వైజాగ్ అంటే.. వెంటనే స్టీల్ ప్లాంట్ గుర్తొచ్చేది. ఇప్పిటికీ.. విశాఖకు అదో గర్వకారణం. ఇంకొన్నేళ్లలో.. గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురానుంది. 2028 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయ్. గూగుల్ లాంటి దిగ్గజమే వైజాగ్‌లో ల్యాండ్ అయ్యాక.. దాని వెంటే వేలాది అనుబంధ కంపెనీలు, మిగతా ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా క్యూ కట్టేస్తాయ్. గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి ఇతర గ్లోబల్ టెక్ సంస్థలు కూడా విశాఖ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నుంచి క్లౌజ్ మేనేజ్‌మెంట్ వరకు.. విశాఖ కంప్లీట్ ఐటీ ఎకో సిస్టమ్‌గా మారిపోతుంది. లక్షలాది మంది యువతకు.. ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు వస్తాయి. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తున్న ఏపీ యువతకు.. సొంత రాష్ట్రంలోనే గ్లోబల్ స్టాండర్డ్ ఉద్యోగాలు లభిస్తాయ్. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్.. కేవలం డేటాని స్టోర్ చేయడానికి మాత్రమే కాదు, భవిష్యత్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ని నడిపించే ఇంజిన్‌గా పనిచేస్తుంది. సముద్ర గర్భం నుంచి వచ్చే అతివేగవంతమైన సబ్‌సీ ఇంటర్నెట్ కేబుల్స్.. నేరుగా విశాఖకు కనెక్ట్ అవడం వల్ల.. డేటా ప్రాసెసింగ్ వేగంలో విశాఖ ప్రపంచంతో పోటీ పడుతుంది.
గూగుల్ ప్రాజెక్ట్ కేవలం టెక్నాలజీకే పరిమితం కాలేదు. గూగుల్ తన డేటా సెంటర్ల కోసం భారీగా గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోనుంది. ఇది రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగానికి కూడా ఊతమిస్తుంది. ఇక, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు, వెనువెంటనే వస్తున్న క్లియరెన్స్‌లు చూశాక.. 2028 నాటికి ఏపీ ఐటీ ఎగుమతులు ఊహించని స్థాయికి చేరుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా.. విశాఖ గడ్డపై గూగుల్ అడుగు పడటమంటే.. అదొక కొత్త ఐటీ రెవల్యూషన్‌కి నాంది. నవ్యాంధ్ర ఐటీ ఆశయాలని వెలిగించే ఇంధనం. ఇంకొన్ని నెలల్లోనే.. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. దక్షిణ భారతంలోనే అత్యంత శక్తిమంతమైన డిజిటల్ హబ్‌గా విశాఖ అవతరించడం ఖాయం.
Also Read: బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా కూడా చేస్తారా..? నడి రోడ్డుపై పెట్రోల్ పోసి.. వీడియో మస్త్ వైరల్
Story by: Anup, Big Tv