దేవేందర్ రెడ్డి, 9848070809
స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం:
Irregularities in MedPlus: తెలంగాణలోని మెడ్ ప్లస్ స్టోర్ల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై స్వేచ్ఛ-బిగ్ టీవీ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌తో ఎట్టకేలకు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కదలిక వచ్చింది. రాష్ట్రంలోని 50కి పైగా మెడ్ ప్లస్ స్టోర్లలో మత్తు డోసు అధికంగా ఉన్న మందులను అమ్మటం, డాక్టర్ రాసిన చీటీ లేకుండా అడిగిన వారికి అడిగినట్లుగా మందులు అమ్మటం, సర్టిఫైడ్ ఫార్మసిస్టులకు బదులుగా పది, ఇంటర్ చదివిన విద్యార్థుల చేత మందులు అమ్మించటం, ఫార్మా సర్టిఫికెట్లను అద్దెకు తెచ్చుకుని ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులూ మెడికల్ షాపులు నడపటం వంటి అనేక అక్రమాలు స్వేచ్ఛ-బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డాయి. తాజాగా, దీనిపై డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి స్పందించారు. స్వేచ్ఛ-బిగ్ టీవీ కథనానికి స్పందనగా తమ శాఖ ఈ విషయంలో ఇప్పటివరకు చేసిన అంశాలను వివరిస్తూ లేఖ రాశారు.
లేఖలో డీజీ వివరణ
తెలంగాణలోని మెడికల్ షాపులు నిబంధనల ప్రకారం నడిచేలా చూసేందుకు తమ విభాగం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఆగస్టు 8 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 54 మెడ్ ప్లస్ ఔట్‌లెట్ల మీద తమ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారని తెలిపారు డీజీ కమలాసన్ రెడ్డి. ఈ తనిఖీల్లో ఆయా షాపుల్లో అనేక అక్రమాలను గుర్తించినట్లు చెప్పారు. కొన్ని షాపుల్లో డాక్టర్ ప్రిస్స్రిప్షన్ లేకుండానే మందులు అమ్మటం, ఫార్మసిస్టు లేకపోవడం, మెడిసిన్స్ రిజిస్టర్లు సరిగ్గా నిర్వహించకపోవటం, బిల్లులు లేకపోవటం, తాము కొన్న మందుల బిల్లులు షాపుల వాళ్లు చూపలేకపోవటం, తేదీల వారీగా రికార్డు చేయకపోవటం వంటి అనేక లోపాలు గుర్తించినట్లు వివరించారు. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం ప్రకారం సదరు 54 మెడ్ ప్లస్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, వారి వివరణ విన్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు డీజీ.
2024లో పెట్టిన కేసులు
తనిఖీలలో మెడ్ ప్లస్ షాపుల నుంచి 44 మందుల శాంపిళ్లను సేకరించి, వాటి నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని డ్రగ్స్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. తమ విభాగం అనుక్షణం అప్రమత్తంగా, చిత్తశుద్ధితో పనిచేస్తోందని 2024 సంవత్సరంలో తమ దృష్టికి వచ్చిన అక్రమాలపై తాము నమోదు చేసిన కేసులే ఇందుకు సాక్ష్యమన్నారు కమలాసన్ రెడ్డి. ఈ ఏడాదిలో ఇప్పటికి నకిలీ మందుల తయారీదారులపై 6 కేసులు, ధరల విషయంలో మోసానికి పాల్పడుతున్న షాపులపై 65 కేసులు, తప్పుడు ప్రకటనలతో మందులు అమ్ముతున్న వారిపై 107 కేసులు, లైసెన్సులు లేకుండా నడుస్తున్న మందుల షాపులు, గోడౌన్ల మీద 35 కేసులు, తగిన అనుమతులు లేకుండానే కొన్ని రకాల మందులను నిల్వ చేయటం, అమ్మటం అనే అంశంలో 60 కేసులు, ఔషధాలుగా తీసుకోవాల్సిన వాటిని ఆహార పదార్థాలుగానో లేదా పోషక విలువలున్న వాటిగా అమ్ముతున్న వారిపై 14 కేసులు, లైసెన్స్ లేని కాస్మొటిక్స్ విక్రయదారులపై 4 కేసులు, నిషేధిత మందులు అమ్మేవారిపై 2 కేసులు పెట్టినట్లు లేఖలో వివరించారు.
Also Read: Fire Accident: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. జేసీబీతో గోడలు బద్ధలుకొట్టి
ఫిర్యాదు చేయండి
తమ విభాగం అధికారులు ఈ రంగంలో జరిగే అక్రమాలపై నిరంతరాయంగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, ఈ విషయంలో చిన్న, పెద్ద కంపెనీలనే తేడా లేకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు డీజీ. నకిలీ మందుల తయారీకి చెక్ పెట్టేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నామని, స్వేచ్ఛ-బిగ్ టీవీ కథనంలో ఆరోపించినట్టుగా తాము ఏ సంస్థ లేదా ఏ వ్యక్తితో లాలూచీ పడలేదని స్పష్టం చేశారు. ప్రజలు ఔషధ రంగానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులనైనా, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో గానీ, 1800-599-6969 టోల్ ఫ్రీ నెంబర్‌లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదు చేయొచ్చని లేఖలో సూచించారు డీజీ కమలాసన్ రెడ్డి.
ఈ ప్రశ్నలకు బదులేది?
తెలంగాణలోని మెజారిటీ మందుల షాపుల్లో ఫార్మసిస్టులకు బదులు పదో తరగతి, ఇంటర్ విద్యార్థులే మందులు అమ్ముతున్నారు. అలాగని ఫార్మా చదివిన వారు అందుబాటులో లేరా అంటే కాదు. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ బీఫార్మసీ కాలేజీల నుంచి ఏటా 8 వేల మంది ఈ కోర్సు చదివిన వారు బయటికి వస్తున్నారు. అయితే, వారికి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే మెడ్ ప్లస్ లాంటి పెద్ద షాపులు కూడా తక్కువ జీతాలకు వచ్చే వారిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ సదరు షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారిచ్చే వివరణలతో సరిపెడుతుందా? లేదా కఠిన చర్యలకు దిగుతుందా అనేది చూడాల్సి ఉంది. అలాగే, ఇదే విధంగా ఫార్మసిస్టులు లేకుండా మందులు అమ్ముతున్న వేలాది షాపుల మీద ఎలాంటి వైఖరి తీసుకుంటుందో కూడా చూడాలి. ఏటా మన దేశంలో తప్పుడు మందుల అమ్మకాల వల్ల 7 లక్షలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ భవిష్యత్తులో తీసుకోబోయే చర్యల మీదనే తెలంగాణలోని రోగుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.