ఉజ్జయినీ వెళ్లేందుకు ఓ వ్యక్తి రైలు ఎక్కాడు. అప్పటికే రైలు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. కొంత దూరం వెళ్లాక తోపులాట జరగడంతో ఓ వ్యక్తి రైల్లో నుంచి పడిపోయాడు. ఈ ఘటనలో అతడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పరిహారం చెల్లించాలని రైల్వేను కోరారు. అతడికి టికెట్ లేదనే సాకుతో పరిహారం ఇచ్చేందుకు నిరాకరించాయి. అయితే, సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ వ్యక్తి భార్య, కొడుకుకు రూ.8 లక్షలు చెల్లించాలని రైల్వేను ఆదేశించింది. 8 ఏళ్ల పోరాటం ఫలించడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
మే 19, 2017న ఉజ్జయినీ వెళ్లడానికి ఇండోర్ రైల్వే జంక్షన్ లో ఓ వ్యక్తి సెకండ్ క్లాస్ రైల్వే టికెట్ కొన్నాడు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ రైలు ఎక్కాడు. రైలు నార్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే సమయంలో ప్రయాణీకులు తోసుకున్నారు. ఈ ఘటనలో సదరు వ్యక్తి రైల్లో నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలై చనిపోయాడు. అయితే, సెక్షన్ 174 CrPC కింద విచారణ చేసి కేసు క్లోజ్ చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందంటూ ఫైల్ క్లోజ్ చేశారు. తలకు తగిలిన గాయం కారణంగా తీవ్ర రక్తస్రావం జరిగి ఆయన చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది.
భర్తను కోల్పోయిన భార్య, ఆమె మైనర్ కుమారుడు సహా కుటుంబ సభ్యులు భోపాల్ లోని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. రూ. 12,00,000 పరిహారాన్ని కోరారు. అయితే, రైలు ప్రయాణం చేస్తున్న వ్యక్తి టికెట్ లేకుండా రైలు ఎక్కాడని, అందుకే పరిహారం అందించలేమని రైల్వే వాదించింది. ఆయన దగ్గర టికెట్ లేదని వెల్లడించింది. ట్రిబ్యునల్ రైల్వే వాదనతో అంగీకరించి పిటీషన్ ను తోపిపుచ్చింది.
Read Also: రైల్లో సీటు కోసం అన్నాదమ్ముల కంత్రీ ఐడియా.. చివరికి కటకటాల్లోకి..
ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ హైకోర్టుకు అప్పీల్ చేశారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 123(c)(2) ప్రకారం ఇది దారుణమైన ఘటన అని కోర్టు అంగీకరించినప్పటికీ, మరణించిన వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణించాడనే ట్రిబ్యునల్ తీర్మానంతో ఏకీభవించింది. అప్పీల్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో అసంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్టోబర్ 8, 2025న సుప్రీంకోర్టు బాధితులకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు రైల్వేకు రూ. 8 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. టికెట్ దొరకలేదనే కారణంతో అతడు టికెట్ లేకుండా ప్రయాణం చేశాడని చెప్పడం సరికాదన్నారు. కచ్చితంగా బాధితులకు పరిహారం అందించాల్సిందేనని తేల్చి చెప్పింది. 8 ఏళ్ల పోరాటం తర్వాత కేసు గెలవడం పట్ల బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.
Read Also: రణరంగంగా మారిన రైల్వే స్టేషన్, పిచ్చ పిచ్చగా కొట్టుకున్న రైల్వే సిబ్బంది.. నెట్టింట వీడియో వైరల్!