BigTV English

BJP Telangana: బీజేపీలో కుమ్ములాటలు.. టేబుల్స్ తుడుచు.. సీటు పట్టు!

BJP Telangana: బీజేపీలో కుమ్ములాటలు.. టేబుల్స్ తుడుచు.. సీటు పట్టు!

BJP Telangana: బీజేపీలో అగ్రనేతగా కొనసాగుతున్న మేకప్ మాన్ ఎవరు..? ఆ మేకప్ మాన్ ఆఫీస్‌లో టేబుల్స్ తుడిచే నేతలెవరూ..? టేబుల్స్ తుడిస్తే పదవులు, సీట్లు దక్కుతాయా.? గెలిచినా, ఓడినా ఎమ్మెల్యే, ఎంపీలకు టేబుల్స్ తూడిస్తేనే సీట్లు, అవకాశాలు దక్కుతున్నాయా..?అసలు బీజేపీలో వ్యక్తిగతంగా నేతలు టార్గెట్ ఎందుకు అవుతున్నారు..? బండి సంజయ్ వర్సెస్ గిరీష్ ధారామోని, కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్ రచ్చ ఎప్పటికప్పుడు ఎందుకు హైలెట్ అవుతోంది?


బీజేపీలో సొంత అజెండాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా?

బీజేపీలో ఏ నేతకు ఎవరి అండదండలున్నాయి..? సీనియర్ నేతలకు కేంద్ర మంత్రి పదవులొచ్చినా ఇంకా పదవుల దాహం తీరలేదా..? పార్టీ ఎజెండా పక్కన పడేసి, సొంత అజెండాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా..?
నేతలెందుకు క్యాడర్‌ను గందరగోళానికి గురి చేస్తున్నారు..? క్రమశిక్షణకు మారుపేరైన హిందుత్వ పార్టీలో వ్యక్తిగత స్వార్ధాలు ఎందుకు రాజ్యమేలుతోన్నాయి..?


బీజేపీలో టేబుల్స్, కుర్చీలు తుడిస్తేనో పదవులు దక్కుతాయా?

అధికారం సాధిస్తామనే లక్ష్యమేమో కానీ అంతర్గత కుమ్ములాటలతో నేతలు వార్తల్లో కెక్కి పరువెందుకు తీసుకుంటున్నారు..? బీజేపీలో టేబుల్ తుడిస్తేనో, కుర్చీలు తుడేస్తేనో, ఇంకేదో చేస్తేనో పదవులు దక్కుతాయా..? ఇవే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. పార్టీ కోసం పని చేసి, నేతల గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలు, ఓట్లేసిన ప్రజలను పక్కనపెట్టి.. పార్టీలో పాత, కొత్త నేతలు, సంఘ్ నేతలు, ఇతరాత్రా నాయకుల మధ్య చోటు చేసుకుంటున్న రచ్చ మాత్రం.. మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లు తయారవుతదోందంట. ఆ క్రమంలో నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు లోటస్ పార్టీలో వేసవి సెగలను పుట్టిస్తోంది. ఆ సెగలతో డిల్లీ పెద్దలు కూడా ఇటు వైపు రావడానికి కూడా జంకుతున్నారనే టాక్ సైతం వినిపిస్తుంది.

పార్టీ ప్రతిష్టను నానాటికీ దిగజారుస్తున్న కొందరు నేతల తీరు

తెలంగాణలో అధికారంలోకి రావాలనే బీజేపీ ఆశ నిరాశగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. పొద్దు పొడిస్తే ప్రజాపాలనపై నోరు పారేసుకుంటున్న కమలం పరివారులు, తమ కింద గురివింద గింజ నలుపును గుర్తించ లేకపోతున్నారనే టాక్ సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. కొందరు నాయకుల తీరు కారణంగా కమలం పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోయే ప్రమాదంలో ఉందనే చర్చ కూడా జరుగుతోంది. నాడు క్రమశిక్షణకు, సిద్ధాంతాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన పరివార్ పార్టీలో కొంత మంది నేతలు వ్యవహరిస్తున్న తీరు పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందంటున్నారు.

బీజేపీలో పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు

సొంత పార్టీలోనే ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు, దూషణలు, కుమ్ములాటలు, ఇళ్లపైకి వెళ్లి దాడులు చేసుకునే స్థాయికి వెళ్ళారంటే దాన్ని క్రమశిక్షణకు మారు పేరు అనాలా..? హిందుత్వ ఐక్యత అనాలా..? దిగజారుడు రాజకీయాలకు ప్రతిక అనాలా?. ఆ పార్టీ అగ్ర నేతలే సమాధానాలు చెప్పాలన్న వాదనలు పొలిటికల్ జంక్షన్ లో బలంగా వినిపిస్తున్నాయి. కాషాయ పరివార్ పార్టీ క్రమశిక్షణ బ్రాండ్ ను తొలగించుకొని, అంతర్గత కుమ్ములాటలకే ప్రాధాన్యమిస్తుండటం చర్చనీయాంశంగా మారింది ..

కిషన్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్న రాజాసింగ్

ఇప్పటికే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే కాదు ఏకంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.. నిరంతర వార్త శ్రవంతి.. నిత్యం చూస్తూనే ఉండండి అన్నట్టు బులిటెన్ బులిటెన్‌లుగా వరుస కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. పార్టీలో ఉన్న మేకప్ మెన్లు, పాత సామాన్ల లాంటి అగ్రనేతలు నియంత, నిరంకుశ ధోరణలు తగ్గాలని .. ఆ మేకప్ మెన్లు, పాత సామాన్లు పార్టీ నుంచి వైదొలిగితే తప్ప తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని రాజాసింగ్ ఉగాది పంచాంగం చెప్పినట్టు ఖరాఖండిగా బద్దలు కొట్టేస్తున్నారు.. కాషాయ వనంలో అలాంటి గంజాయి మొక్కలు ఎవరో అనేది రాజాసింగ్, గిరీష్ దారమోనిలతో పాటు ఆ పార్టీలోని ముఖ్యులకే తెలియాలి

నాంపల్లి క్రాస్ రోడ్డులో రచ్చకెక్కుతున్న కాషాయ నేతలు

ఏదో రకంగా రాష్ట్ర బీజేపీ నేతలు నేనంటే నేనంటూ వార్తల్లో కెక్కి, రోజుకో ఇష్యూతో నాంపల్లి క్రాస్ రోడ్డులో రచ్చకెక్కుతున్నారు. ఆయా కూడళ్లలో ప్రచార హార్డింగ్ ఫ్లెక్సీలలో నేతల ఆనందాలు, ఐక్యత కనిపిస్తున్నాయి తప్ప ఆచరణలో మాత్రం ఆ సఖ్యత కనిపించడం లేదు. గతంలో బండి సంజయ్‌ను స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఫలంగా తొలగించడం వెనుక ఆ పార్టీ సీనియర్లే చక్రం తిప్పారంటారు. బండి తర్వాత కొత్తగా వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అమ్ముకున్నారనే ప్రచారం జరిగింది. టికెట్ల వివాదంతో ఏకంగా స్టేట్ పార్టీ ఆఫీసు ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వాళ్ళు ఉన్నారు.

బండి సంజయ్‌ని టార్గెట్ చేస్తున్న గిరీష్ దారమోని

ఈ మధ్య కాలంలో కిషన్ రెడ్డిని ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ టార్గెట్ చేస్తుంటే..? బండి సంజయ్‌ని ఆ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జిగా సుదీర్ఘ కాలం కొనసాగిన గిరీష్ దారమోనితో పాటు, ఆయన వర్గాలు టార్గెట్ చేస్తున్నాయి. అయితే బండిని టార్గెట్ చేసిన గిరీష్ దారమోనిపై దాడులు జరిగాయి. అవి చేయించింది బండి సంజయ్ వర్గమే అన్న టాక్ నడుస్తోంది. అదలా ఉంటే కిషన్‌రెడ్డి తో పాటు, రాష్ట్ర నాయకత్వాన్ని రాజసింగ్ టార్గెట్ చేస్తున్నారు. ఈ నేఫధ్యంలో రాజాసింగ్‌కు కూడా గిరీష్ గతే పడుతుందని, కచ్చితంగా రాజాసింగ్‌కు వార్నింగ్‌లు, దాడులు తప్పవని సంకేతాలు వినపడుతున్నాయి. రాజాసింగ్ ఇష్టమొచ్చినట్టు నోటికొచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయని ఆ పార్టీ వర్గాల్లో, ఆయా నేతల వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: చంద్రబాబా.. మజాకా..? కొలికపూడికి సైలెంట్ వార్నింగ్

గ్రేటర్‌లో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ తన కార్యాలయంపై దాడి చేశారని, ఇంటిపైకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని బీజేపీ బహిష్కృత నేత గిరీష్ విమర్శలు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇదే తంతు రేపు రాజాసింగ్ పై జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన కాషాయశ్రేణుల్లో వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. కరుడు గట్టిన హిందుత్వ ముద్రతో పాటు మాస్ ఇమేజ్ పుష్కలంగా ఉన్న లీడర్ ఆయన. కొద్ది రోజుల నుంచి నిత్యం సొంత పార్టీ నాయకత్వాన్ని ఏకిపారేస్తున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్‌రావుపై రాజాసింగ్ విమర్శలు

తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపైనా రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీలో అగ్రనేతగా ఓ మెకప్ మెన్ కొనసాగుతున్నారని. ఆ మెకప్ మెన్ ఆఫీసులో కుర్చీలు, టేబుల్స్ క్లీన్ చేసే వారికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తున్నట్లు రాజాసింగ్ చేసిన కామెంట్లు ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

రాజాసింగ్ సొంత పార్టీ వారికే టార్గెట్ అవుతారా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మేకప్ మెన్ అంటూ.. ఆయన టేబుల్ క్లీన్ చేసే వాళ్లకు పదవులు, టికెట్లు అంటూ రాజాసింగ్ చేసిన కామెంట్లతో రాష్ట్ర నాయకత్వం ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉందంట. పార్టీ ఆఫీస్లో టేబుల్స్ తుడిచిన వాళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్నారని రాజాసింగ్ అంటున్నారు. ప్రస్తుతం గెలిచిన వారంతా అలాంటి వారేనా? ఇంతకూ రాజాసింగ్ ఎలా గెలిచారు..? అనే క్వశ్చన్స్ కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి బండి సంజయ్ పై ఆరోపణలు చేశారని గిరీష్ పై బండి వర్గాలు దాడి చేశారని వార్తలు వస్తున్న తరుణంలో, రేపో మాపో రాజాసింగ్ పైన కూడా దాడులు ఉంటాయన్న ప్రచారంతో . బీజేపీలో నేతల మధ్య ఏం జరుగుతుందనేది ఇంట్రస్టింగా మారింది.

ఇతర పార్టీలను మించిపోతున్న బీజేపీ అంతర్గత విభేదాలు

మొత్తానికి కొత్త, పాత నేతల పంచాయితీలు, వ్యక్తిగత ఇజాలు, విమర్శలు, కుమ్ములాటలు, దూషణలు, దాడులు వంటివి ఇతర పార్టీల్లో ఎలా ఉన్నా… బీజేపీకి మాత్రం డిసిప్లీన్ బ్రాండ్ ఉండేది. ఒకవేళ అంతర్గతంగా విభేదాలు ఉన్నా బయటకు రాకుండా ఎథిక్స్ పటించేది.కానీ పదవుల వ్యామోహమో, మారుతున్న కాలమో కానీ, కాషాయ పరివారులు సైతం ఈ అంశంలో ఇతర పార్టీలను మించిపోతూ.. తమ సిద్ధాంతాలను విస్మరిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని అధిష్టానం పెద్దలు ఎలా చక్కదిద్దుతారో చూడాలి
ఎలా చక్కదిద్దుతారో చూడాలి

 

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×