ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడికి వచ్చిన అందరు నేతల్ని పలకరించారు. వారిపై చేయివేసి, దగ్గరకు తీసుకుని ఫొటోలు దిగారు. కానీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని మాత్రం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదు. ఆయనతో కనీసం మాట్లాడలేదు కూడా. ఇది చంద్రబాబు మార్క్ మాస్ వార్నింగ్ అనుకోవాల్సిందే. ఇప్పటికే పార్టీలో రచ్చ చేస్తున్న కొలికపూడికి ఈ సైలెంట్ వార్నింగ్ పనిచేస్తుందో లేదో చూడాలి.
క్రమశిక్షణ లేకపోతే ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత ప్రజాదరణ ఉన్న నాయకుడైనా క్షమించేది లేదు.. అనేది చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం. అప్పటికప్పుడు పార్టీకి నష్టమైనా అలాంటి వారిని ఎప్పుడూ ఆయన ఎంటర్టైన్ చేయలేదు. తాజాగా అలాంటి మరో సందర్భం ఇప్పుడు చంద్రబాబుకి ఎదురైంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీకి పంటికింద రాయిలా మారారు. సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు చేస్తున్నారు. పార్టీకే డెడ్ లైన్లు పెట్టి మరీ తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఈ విషయంలో అధిష్టానం కూడా సీరియస్ అయింది. గతంలో కూడా కొలికపూడి ఇలాగే రచ్చ చేశారు. ఓ బహిరంగ సభలో రైతుల్ని అవమానించారు, మరో చోట తమ ప్రభుత్వంలో పనులు కావట్లేదన్నారు, ఇంకో సందర్భంలో వైన్ షాపుల విషయంలో జగన్ ని సపోర్ట్ చేసేట్టు మాట్లాడారు. ఇవన్నీ పార్టీ లెక్కలు వేస్తోంది. ఒకసారి కొలికపూడికి పార్టీ పరోక్ష హెచ్చరికలు కూడా ఇచ్చింది. కానీ ఆయన పద్ధతి మారలేదు. ఇటీవల 48 గంటల డెడ్ లైన్ తర్వాత పార్టీ పూర్తిగా ఆయనపై నిఘా పెట్టింది.
సైలెంట్ వార్నింగ్..
ఈ దశలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అందరు నేతలను ఆయన ఆప్యాయంగా పలకరించినా కొలికపూడిని మాత్రం పట్టించుకోలేదు. అప్పటికే ఆయనపై చంద్రబాబుకి చాలా ఫిర్యాదులందాయి. ఈ దశలో కొలికపూడిని పిలిచి మాట్లాడ్డానికి కూడా చంద్రబాబు ఇష్టపడినట్టు లేరు. అందుకే ఆయన్ను పట్టించుకోకుండా తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇకనైనా కొలికపూడి పార్టీ లైన్ దాటకుండా ఉంటారా..? లేక యథావిధిగా తన మార్కు రాజకీయాలు చేసి టీడీపీకి దూరమవుతారా..? వేచి చూడాలి.
ఇదే అవకాశం…
ఇలాంటి అవకాశం కోసమే జగన్ మీడియా ఎదురు చూస్తోంది. చంద్రబాబు పర్యటనలో దళిత ఎమ్మెల్యేకి అవమానం అంటూ పెద్ద వార్త ఇచ్చేసింది. దళిత ఎమ్మెల్యేని సీఎం చంద్రబాబు ఘోరంగా అవమానించారని, బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజునే కొలికపూడికి అవమానం జరగడం ఘోరం అంటూ ఓ కథనం రాసుకొచ్చారు. చంద్రబాబుకు కొలికపూడి నమస్కారం పెట్టి పలకరించినా కూడా ఆయన పట్టించుకోలేదని, కనీసం కొలికపూడికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదని సాక్షి తన బాధని వెళ్లగక్కింది. పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేకి సైలెంట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. కానీ సాక్షి మాత్రం దళిత కార్డ్ బయటకు తీసింది. కొలికపూడిపై ఎక్కడలేని సింపతీ చూపిస్తోంది. ఇదే కొలికపూడిపై గతంలో సాక్షి ఎన్ని నెగెటివ్ వార్తలు రాసిందో అందరికీ తెలుసని అంటున్నారు టీడీపీ నేతలు. తమ పార్టీలో గొడవలు పెట్టాలనుకుంటున్న సాక్షి వ్యూహం నెరవేరదని తేల్చి చెబుతున్నారు.