నిజంగా ఇది కేసీఆర్ కు కష్టకాలమే. ఓటమి ఓవైపు ఇంకా వేధిస్తూనే ఉంది. ఫామ్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకుందామన్నా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఇంటా బయటా ఆయనకు మనో వేదననే మిగిల్చుతున్నారు.
కేటీఆర్‌కు పగ్గాలప్పగించాడు కేసీఆర్. తండ్రి లేకున్నా.. కేసీఆర్ రాకున్నా కేటీఆర్ అన్ని విధాల ఆలోటు తీర్చుతాడు.. అని జనం అనుకునేలా చేయాలనేది కేసీఆర్ ప్లాన్. అందుకే ఈ ఓటమి కాలాన్ని కేటీఆర్‌కు అప్రెంటీస్ కాలంగా భావించాడాయన. ఎలాగూ కాబోయే సీఎం.. అప్పుడు మిస్ అయ్యింది. ఇప్పుడు నిత్యం ప్రజల మధ్య ఉంచడం మూలంగా.. జనాలకు మరింత దగ్గరయ్యి.. మాకు మరో కేసీఆర్.. అని జనం అనుకునేలా తీర్చిదిద్దాలనుకున్నాడాయన.
కానీ ఆయన అనుకున్నదొక్కటి. జరుగుతున్నదొక్కటి. అసెంబ్లీకి పోవాలని కేసీఆర్‌కు లేదు. ఇవాళ జరిగిన బీఆరెస్ ఆందోళన చూస్తే.. కేటీఆర్‌కు కూడా అసెంబ్లీలో కూర్చుని .. ఓపిగ్గా కాంగ్రెస్ సభ్యులు చెప్పే మాటలు వినాలని లేదు. అందుకే తొలిరోజే దండయాత్ర మొదలు పెట్టాడు. నిజానికి ఇలా బ్లాక్ టీషర్టులు, దానిపై రాతలతో వెళ్లాల్సిన పని లేదు.
ఆల్రెడీ వెయ్యి రోజుల పాలనపై బీఆరెస్ కార్యాచరణ తీసుకున్నది. ఇదీ తిరగబడింది. మా పాలనపైనే విమర్శలా? అయితే వెయ్యి రోజుల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు కదా కేసీఆర్.. ఆయన రాజీనామా చేయాలి.. ఇంట్లో ఉండి జీతభత్యాలు ఎందుకు తీసుకుంటుండు? అని సీఎం రేవంత్ ఎదురుదాడికి దిగడంతో పోటాపోటీ నిరసనలు మొదలయ్యాయి.
జనానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎవరేం చేస్తున్నారో తెలియదు. ఈ ఇరు పార్టీల కార్యాచరణతో జనాలకు ఏం లాభం ఒనగూరుతుందో అర్థం కాక తలలు గోక్కున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్‌లో మళ్లీ కేటీఆర్ తనదైన డైరెక్షన్‌ను అమలు చేశాడు. బ్లాక్ టీ షర్టులైతే ఓకే అంటుండే.. కానీ రాతలపైనే అభ్యంతరాలు చెప్పారు స్పీకర్. ఈ విషయాన్ని పోలీసాఫీసర్ కూడా క్లారిటీ ఇచ్చారు.
ఇక హరీశ్ అంగీ ఇప్పి బనీను ప్రదర్శన చేయడం ఓవరే అయ్యింది. దీన్ని బట్టి ఇది పక్కా హంగామా ప్రోగ్రాంగానే చూశారు జనం. మాజీ మహిళా మంత్రుల పట్ల పోలీసులు ప్రవర్తన బాగాలేదు..అనే అంశాన్ని హైలెట్ చేసుకుందామనుకున్నారు. నిజంగానే అక్కడ తోపులాట జరిగింది. వారు ఇబ్బంది కూడా పడ్డారు. కానీ మధ్యలో ఎమ్మెల్సీ తాతా మధు మితిమీరిన ఓవర్ యాక్షన్‌తో పాటు సోయితప్పి మాట్లాడిన బూతు డైలాగు .. నేరుగా స్పీకర్‌కే తాకింది. మొత్తం బూమరాంగ్ అయ్యింది.
అప్పటి దాకా అనుకున్నది అనుకున్నట్టే జరుగుతున్నది. మధ్యలో సీన్‌లోకి ఎక్కడ్నుంచి వచ్చాడో.. తాతా… మొత్తం చెడగొట్టేశాడు. అది ఏకంగా కేసీఆర్‌కే తాకింది. దళిత స్పీకర్ పట్ల ఇంతలా అవమానకర రీతిలో బూతులకు దిగిన వైనానికి క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేయడంతో అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది.
ఇటు బీఆరెఎస్ నేతలు… మహిళా నేతలని కూడా చూడకుండా అసభ్యంగా పోలీసులు ప్రవర్తించారని, వెంటనే సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కేసీఆర్ మరీ ఇబ్బంది పడినట్టే ఉంది. ఎందుకంటే.. ఆయన కోరుకునే నిరసనలు, ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలనుకున్నవి ..ఇలాంటివైతే కచ్చితంగా కావనే అనుకుంటున్నారు. ఇదంతా కేటీఆర్ నిర్దేశకత్వంలో కొనసాగింపబడిన కార్యక్రమం. కానీ అది ఇలా బోల్తా కొట్టి.. బీఆరెస్ దళిత వ్యతిరేక పార్టీ అనే ముద్రను వేసుకున్నది.