అందివచ్చిన అవకాశాన్ని తమ వైఖరి వల్ల బీఆరెస్ చేజేతులా కాలరాసుకుంటుందా? ప్రపంచమంతా ఆ ఎమ్మెల్సీ తీట మాటలను విన్నారు. చూశారు. అది ఆవేశంతో వచ్చినవా? పోలీసులు పిడిగుద్దులు గుద్దితే వచ్చినవా? ప్యాంటు లాగేందుకు ప్రయత్నం చేయడంతో ఆవేశాన్ని తట్టుకోలేక వచ్చినవా? అనేది ప్రజలకు అనవసరం.
ఆ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు మళ్లీ వెనక్కి తీసుకోలేరు. కానీ పశ్చాత్తాపం కూడా ప్రకటించకుండా ఆ మాటలను సమర్థించుకునే ప్రయత్నంలో బీఆరెస్ మరింత దిగుజారుడు రాజకీయాలకు పాల్పడిందనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. సరే, అయితే ఏందీ..? ఉద్దేశ్య పూర్వకంగా అనలే కదా? అంటే అన్నాడులే.. ఒకవేళ స్పీకర్ బాధపడి ఉంటే ఇదిగో విచారం వ్యక్తం చేస్తున్నాం.. సరేనా? ఇక్కడితే ఈ వివాదం ఆపేద్దామా? అంటూ హరీశ్ సభలో మాట్లాడిన తీరు అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టే అయ్యిందంటున్నారు.
ఇక నిన్న కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇంచుమించు ఇవే మాటలు చెప్పాడు. కేసీఆర్ కూడా సరే బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేసి వదిలేయండి… అని అన్నాడట. బీఆర్ఎస్ మహిళా సభ్యులు పోలీసుల తోపులాటలో ఇబ్బంది పడ్డారు. ఈ వీడియోను కూడా అంతా చూశారు. దీనిపై కూడా సర్కార్ తరపున విచారం వ్యక్తం చేయడం.. విచారణకు ఆదేశించడం చేస్తే ఇంకా బాగుండేది. కానీ సర్కార్ కూడా అలా చేయలేదు.
ఇక కేటీఆర్ ఓ మాటన్నాడు. దళితులపై అంత ప్రేమ ఉంటే.. ఈ అసెంబ్లీ సెషన్స్ లో ఎస్సీ డిక్లరేషన్ పై చర్చించాలని డిమాండ్ చేశాడు. ఇది బాగానే ఉంది.. కానీ ఈ సందర్భంలో ఈ మాటలను పట్టించుకోవడం లేదు జనం. అక్కడ బీఆర్ఎస్ నేతల తీరుపైనే చర్చ జరుగుతోంది. ఇంకా వీరిలో అహంకారం తగ్గలేదా? ప్రతిపక్షంలో ఉంటేనే ఇట్లా ఉంది.. ఇక అధికారంలోకి వస్తే వీరి తీరు ఇంకెలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది.
బూతులు మాట్లాడే సీఎంతో నేను చర్చకు రావాలా? అని కేసీఆర్ జనానికి ఓ మెసేజ్ ఇస్తూనే.. తమ పార్టీ సభ్యుడు ఇలా మితిమీరి బూతు భాష ..అదీ స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడటాన్ని.. వీరు సమర్థించేలా నడుచుకునే దోరణిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తిడితే తప్పేంటి..? మనవాడు చేసింది కరెక్టే.. అట్లనే చేయాలి.. అనే విధంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు దోరణి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దళిత వ్యతిరేకతను ఆ పార్టీ మూగట్టుకున్నా.. డోంట్ కేర్ అనే అంటున్నారు. ఈ వ్యవహార శైలితో ఎంత డ్యామేజీ ఉంటుందో అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు బీఆర్‌ఎస్ పార్టీ.