2008 Malegaon blast case: మాలేగావ్ బ్లాస్ట్. 17 ఏళ్ల క్రితం రంజాన్, నవరాత్రి కలగలసిన సమయంలో జరిగిన ఒకానొక ఘటన. ఈ దుర్ఘటన ద్వారా అరడజను మందిమృతి చెందడంతో పాటు, పలువురికి గాయాలయ్యాయి. వీటితో పాటు వెలుగు చూసిన మాట కాషాయ ఉగ్రవాదం. మరి ఆనాటి కేసులో నేటి తీర్పు ఏం తేల్చింది? నిందితులు నిర్దోషులుగా ఎలా మారారు? ఇన్నేళ్ల విచారణ వృధా ప్రయాసేనా? ఈ తీర్పుపై కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం తదితర పార్టీల స్పందనేంటి? మరీ ముఖ్యంగా ఈ కేసులో నిందితులుగా ముద్ర పడ్డ వారి ప్రతిస్పందన ఎలాంటిది?
కేసు దర్యాప్తు చేపట్టిన ATS
ఈ కేసును మొదట మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్త చేసింది. ప్రజ్ఞా ఠాగూర్ సహా 16 మందిని నిందితులుగా చెబుతూ.. ఎంకోకా అంటే మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అభియోగాలు నమోదు చేసింది. 2011లో ఈ కేసు దర్యాప్తు NIA చేతికి వచ్చింది. ఈ కేసులో సాక్షులందరినీ విచారించిన NIA ప్రజ్ఞాఠాకూర్ సహా మరికొందరికి 2016లో క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇదే NIA తిరిగి యూటర్న్ తీస్కుని.. ప్రజ్ఞాఠాగూర్ సహా ఈ కేసులో ఏడుగురి నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కానీ కోర్టు ఆ విజ్ఞప్తిని తోసి పుచ్చింది. ఆ ఏడుగురినీ నిర్దోషులుగా ప్రకటించింది. దర్యాప్తు సంస్థల మార్పుతో పాటు.. 17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ కేసుపై ఐదుగురు న్యాయమూర్తులు విచారణ జరిపిన పరిస్థితి కూడా ఉండటం గుర్తించాల్సిన విషయం. పదిహేడేళ్ల నాటి ఈ కేసుపై ముంబై స్పెషల్ కోర్టు.. గురువారం తీర్పునిచ్చింది. బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఏడుగురినీ నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసింది.
ప్రూవ్ చేయలేక పోయారు-కోర్టు కామెంట్
పేలుళ్లకు ఉపయోగించిన బైక్ ప్రజ్ఞాఠాకూర్ దేనని, ఆ బైక్ ఆమె పేరిట రిజిస్టర్ అయిందని ప్రూవ్ చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, ఆ బైకుపైనే బాంబు పెట్టి పేల్చారన్న విషయాన్ని నిర్దారించలేక పోయారని తన తీర్పు ద్వారా తెలియ చేసింది ముంబై స్పెషల్ కోర్టు. అనుమానం కొద్దీ ఎవరినీ దోషులుగా లెక్కించలేమని కామెంట్ చేసిందీ ప్రత్యేక న్యాయ స్థానం. ఉగ్రవాదానికి మతం లేదని అంటారు ఈ కేసును విచారించిన స్పెషల్ జడ్జి ఏకే లహోటీ. ఈ కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని అన్న ఆయన.. నిందితులపై ఆరోపణలు నిరూపించలేక పోవడంతో వారికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం సముచితమని అభిప్రాయ పడ్డారు. అంతే కాదు.. ఈ కేసును చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం- ఉపా నిబంధనలు వర్తించవని కూడా తేల్చి చెప్పారు. ఈ పేలుళ్ల ద్వారా మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున, గాయపడ్డ 101 మందికి రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది ముంబై స్పెషల్ కోర్టు. ఈ తీర్పు వినగానే ఏడుగురు నిందితులైన ప్రజ్ఞా ఠాకూర్, ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ, అజయ్ రహీర్కర్, సుధాకర్ ద్వివేదీ, సుదాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి.. హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పునిచ్చిన జడ్జి, తమతరఫున వాదించిన లాయర్లకు కృతజ్ఞతలు చెప్పారు. ఇది కేవలం విజయం కాదు కాషాయ విజయం అని కామెంట్ చేశారు ప్రజ్ఞా ఠాగూర్.
ఆ దేవుడు శిక్షిస్తాడని శపించిన ప్రజ్ఞా ఠాగూర్
ఈ కేసు కారణంగా తన పదిహేడేళ్ల విలువైన కాలం పూర్తి నాశనమైందని అన్నారు ప్రజ్ఞా ఠాగూర్. అంతే కాదు కాషాయ ధ్వజాన్ని అవమానించడానికి ప్రయత్నించిన వారిని దేవుడు శిక్షిస్తాడంటూ శాపనార్ధాలు పెట్టారామె. ఇక బీజేపీ సైతం కోర్టు తీర్పును స్వాగతించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాటి గుజరాతీ సీఎం మోడీ ఎదుగుదలను అడ్డుకోడానికి, ముస్లిం ఓటర్లను బుజ్జగించడానికి హిందూ ఉగ్రవాదమనే కొత్త సిద్ధాంతం తెరపైకి తెచ్చారనీ.. తప్పు పట్టింది. అప్పుడే కాదు ఇప్పుడూ ఎప్పుడూ కాషాయ ఉగ్రవాదం అంటూ ఏదీ లేదని అన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. కాషాయ ఉగ్రవాదం అంటూ విష ప్రచారం చేసిన కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఐటీ విభాగాధిపతి మాలవీయ, శివసే ఎంపీ శ్రీకాంత్ షిండే. ఉగ్రవాదంతో ఏ మతంతోనూ ముడి పెట్టకూడదని.. ఏ మతమూ హింసను ప్రేరేపించదనీ.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయితే కోర్టు తీర్పును మహా గవర్నమెంట్ హైకోర్టులో సవాల్ చేయాలని అన్నారు మహారాష్ట్ర-ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్. ఇక హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ కేసు తీర్పు తమను తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు. మతాన్ని లక్ష్యం చేసుకుని జరిగిన దాడి కేసు దర్యాప్తులో ప్రాసిక్యూషన్ ఉదాసీన వైఖరి ప్రదర్శించినట్టు చెప్పారు. అందుకే నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారని అన్నారాయన. ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో నిందితుల విడుదలపై తక్షణమే స్టే కోరిన మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నాయి ఎందుకని నిలదీశారాయన.
హూ ఆర్ ద మెయిన్ కల్ ప్రిట్స్ ఆఫ్ మాలేగావ్ బ్లాస్ట్?
మరి ఈ ఆరుగురిని చంపిన వారెవరు? ఈ బ్లాస్ట్ లో వాడిన బైక్ ఫలానా ఠాకూర్ ది కాదన్నారు. సరే, పురోహిత్ పేలుడు పదార్ధాలు నిల్వ చేయలేదనడం ఓకే.. మరి ఆ బైకు ఎవరిది?, పేలుడు పదార్ధాలు.. ఎక్కడి నుంచి వచ్చాయ్? ఉగ్రవాదానికి మతం లేదు.. కేవలం అనుమానం అంటున్నారు బాగానే ఉంది.. మరి ఆరుగురి మృతికి బాధ్యులెవరు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ఒక దుర్ఘటనకు చెందిన కేసులో అసలు దోషులెవరో తేల్చడం ముఖ్యమా? ఫలానా వారే దోషులు అవునా కాదా అనడం ముఖ్యమా? అన్నదిప్పుడు అతి పెద్ద చర్చనీయాంశమైంది. కారణం.. ఫలానా వారు దోషులు కాదంటున్నారు కానీ అసలు దోషులెవరో తేల్చలేక పోవడానికి గల కారణమేంటి? ఆ ఘటనలో కీలకమైన బైక్ ప్రజ్ఞాది కాదంటున్నారు సరే. మరి ఆ బైకు ఎవరో ఒకరిది అయ్యే ఉంటుందిగా? మరి వారెవరు? ఇక ఆ పేలుడు పదార్ధాల నిల్వ ఫలానా పురోహిత్ దగ్గర లేదంటున్నారు సరే.. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దిశగా కేసుల ముందుకు నడవలేదు ఎందుకని? ఇంతకీ ఈ కేసు విషయంలో కోర్టు లేవనెత్తిన పాయింట్లుఎలాంటివి?
ఎవరు ఈ విషయంపై దృష్టి సారించలేదన్న కామెంట్
ఈ కేసును ఇక్కడితో వదిలేస్తారా? తిరగదోడతారా?హూ కిల్డ్ జస్సికా అంటూ నేషన్ లెవల్లో, హూ కిల్డ్ బాబాయ్ అంటూ స్టేట్ లెవల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తిన విధం చూసే ఉంటాం. ఇప్పుడు హూ ఆర్ ద మెయిన్ కల్ ప్రిట్స్ ఆఫ్ మాలేగావ్ బ్లాస్ట్ అన్నది అతి ప్రధానమైన ప్రశ్నగా మారింది. కోర్టులను, దర్యాప్తు సంస్థలను తప్పు పట్టరాదు. వాటి విషయంలో కామెంట్ చేసే ముందు జాగ్రత్త వహించాలని అంటారు. కానీ ఇక్కడ మాలేగావ్ బ్లాస్ట్ కేసు విషయంలో ఒక ప్రధాన తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందని అంటారు. మాలేగావ్ బ్లాస్ట్ ప్రధాన కారకులు ఫలానా వారా కాదా? అన్న దర్యాప్తు జరిగినట్టుంది తప్ప.. ఎవరు కారకులో దర్యాప్తు జరిగినట్టు లేదన్న మాట వినిపిస్తోంది. ఈ విషయంలో ఇటు దర్యాప్తు సంస్థలు కానీ, అటు కోర్టులు గానీ పెద్దగా దృష్టి సారించ లేదన్న కామెంట్ వినిపిస్తోంది. బైక్ ఎవరి పేరిట ఉందో చూడాల్సింది పోయి.. బైక్ ప్రజ్ఞా ఠాగూర్ పేరిట ఉందా? లేదా అని చూసి.. ఆమె పేరు లేదు కాబట్టి ఈ కేసును నీరుగార్చడంలో అర్ధం లేదంటారు కొందరు న్యాయనిపుణులు. బైకు ప్రజ్జా ఠాగూ్ర్ కాకుంటే మరొకరిపై ఉండొచ్చు. ఆ మరొకరు ఎవరు? మరి ఆ కోణంలో దర్యాప్తు ఏదీ? అసలు ఎవరి పేరు మీద రిజిస్టర్ కాని బైకైతే ఉండదుగా అన్నది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోన్న ప్రశ్న.
పురోహిత్ ఇంట్లో RDX ఉన్నట్టు కనుగొనలేక పోయారు
పురోహిత్ బాంబు తయారు చేశారనడానికి ఆధారాల్లేవంటున్నారు. పురోహిత్ ఇంట్లో ఆర్డీఎక్స్ కి సంబంధించి ఎలాంటి ఎవిడెన్సులు కనుగొనలేక పోయారని చెబుతున్నారు. వాహనాన్ని ఎవరు పార్క్ చేశారో.. బాంబును ఎవరు అమర్చారో స్పష్టమైన ఎవిడెన్సులు సంపాదించలేక పోయారని అంటున్నారు. మరి ఎవరూ పెట్టకుండా ఆ బైక్ పైకి ఆ పేలుడు పదార్ధం ఎలా వచ్చింది? ఆ బాంబును బైకుపై ఎవరు పెట్టినట్టు? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన స్పాట్ పంచనామా తప్పుల తడకగా ఉందంటున్నారు. మాలేగావ్ పేలుడు జరిగిన స్థలం నుంచి ఆధారాల సేకరణ సరిగా జరగలేదంటున్నారు. ఆ మాటకొస్తే ఆ ఘటనా స్థలం కలుషితమైనట్టు చెబుతున్నారు. కాబట్టి ఫలితం ఇదీ అని సరిగా చెప్పలేమంటున్నారు. వీటన్నిటినీ బట్టీ చూస్తే అసలు ఘటన జరిగినట్టా జరగనట్టా? మరి ఆ ఆరుగురు ఎలా చనిపోయినట్టు? వారికిపుడు పదిలక్షల రూపాయల మేర నష్టపరిహారం ఎవరి ఖాతా నుంచి ఇస్తున్నట్టు? ఆ 101 మందికి యాభై వేల నష్ట పరిహారం ఎవరి కోసం ఎందుకోసం ఇవ్వాలి? ఇవి ఇస్తున్నపుడు.. ఆ ఘటన జరిగినట్టే కదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ప్రాసిక్యూషన్ అనుమతి పత్రాలే తప్పు..
ఫరీదా బాద్, భోపాల్ సమావేశాల్లో కుట్రకు పథక రచన జరిగిందని మొదట అన్నారు. తర్వాత సాక్షులు తారుమారయ్యారు. కాబట్టి ప్రాసిక్యూషన్ కుట్రను నిరూపించడంలో విఫలమైందని అంటోంది న్యాయ స్థానం. ప్రాసిక్యూషన్ అనుమతి పత్రాలే తప్పుగా ఉన్నాయి కాబట్టి ఉపా చట్టం అమలు చేయలేమని తేల్చి చెప్పేశారు. ఇదంత నమ్మశక్యంగా లేదన్నది ప్రతిపక్షాలంటోన్న మాట. ఇక నిధులకు సంబంధించి చూస్తే.. రమేష్ ఉపాధ్యాయ్ స్థాపించిన అభినవ్ భారత్ సంస్థకు అజయ్ రహీర్కర్ కోశాధికారి కాగా, పురోహిత్ ట్రస్టీగా ఉన్నారు. ఈ నిధులను పురోహిత్ ఇంటి నిర్మాణం, ఎల్ ఐ సీ ప్రీమియం చెల్లింపు వంటి వ్యక్తిగత పనులకు వాడారు. కానీ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించినట్టు ఎలాంటి ఆధారాల్లేదని తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే కుట్ర పై అనుమానాలుండొచ్చుగానీ నిరూపించడానికి తగిన ఆధారాల్లేవని తేలిపోయింది. మరి ఆ బాంబు ఎలా సమకూరింది? వాటికంటూ ఖర్చు చేసిన వారెవరు? ఈ కోణంలో జరగాల్సిన దర్యాప్తు ఎందుకు జరగలేదు? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
దర్యాప్తు అధికారుల విలువైన కాలం వృధా అయినట్టేనా?
ఈ పదిహేడేళ్ల పాటు ఇటు నిందితుల సమయం అటు కోర్టు, న్యాయమూర్తులు, దర్యాప్తు అధికారుల విలువైన కాలం వృధా అయినట్టేనా? ఘటన జరిగినపుడు అందుకంటూ ఎవరో ఒక కారకులుంటారు. అదేం ప్రకృతి వైపరీత్యం కాదు. మరి దీని అసలు కారకులెవరు? వీరినెలా గుర్తించాలి. ఈ కోర్టు తీర్పుతో ఈ కేసు సమసిపోతుందా? మహారాష్ట్ర ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ కోరినట్టు హైకోర్టును ఆశ్రయిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. మాలేగావ్ కేసు దర్యాప్తు చేసిన ఏటీఎస్ లో పని చేసిన మాజీ పోలీసు అధికారి ఈ తీర్పు సందర్భంగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని అరెస్టు చేయాల్సిందిగా తనను ఆదేశించారనీ అంటారాయన. అది తన శక్తికి మించిన పని కావడంతో తానా పని చేయలేక పోయానని.. దీంతో తన 40 ఏళ్ల కెరీర్ నాశనమైందని అంటారు ముజావర్ అనే ఈ మాజీ ఏటీఎస్ అధికారి.
ఘటన జరిగింది నిజం. ఆరుగురు మరణించింది నిజం. వారి కుటుంబాలకంటూ నష్టపరిహారం ఇవ్వాల్సి రావడం నిజం. మరి ఈ ఘటనకు కారకులంటూ ఎవరో ఒకరు ఉంటారు. మరి వారేమయ్యారన్నది తేలాల్సిన అసలు నిజంగా మారింది. మరి ఇదెప్పుడు తేలేను? అదే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. ఎలాగూ ఇది రకరకాలుగా మారుతూ వచ్చిన కేసు. ఈ కేసును తిరగదోడి హైకోర్టు, సుప్రీం కోర్టుకు ఎక్కినా అదే ఫలితం వస్తుందని ఎంఐఎం వంటి పార్టీలు లైట్ తీస్కుంటాయా? లేక మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేయడం కోసం పోరాడుతూనే ఉంటాయా? తేలాల్సి ఉంది.
Story By Adinarayana, Bigtv