BigTV English

Hyderabad Real Estate: ఎవరూ ఊహించనంతగా పెరిగిన రియల్ బూమ్.. సర్వేల్లో తేలింది ఇదే

Hyderabad Real Estate: ఎవరూ ఊహించనంతగా పెరిగిన రియల్ బూమ్.. సర్వేల్లో తేలింది ఇదే

హైదరాబాద్ బ్రాండ్ అంటే బ్రాండే అని మరోసారి ప్రూవ్ అయింది. అవును దేశంలో ఎక్కడా లేనంతగా, ఎవరూ ఊహించనంతగా రియల్ బూమ్ ఇక్కడే ఉంది మరి. ఇది వివిధ సంస్థలు సర్వేలు చేసి చెబుతున్న మాట. జరిగిన రిజిస్ట్రేషన్లు చెబుతున్న మాట. అవును తాజాగా నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో చూడొచ్చు. బయట జరుగుతున్న ప్రచారానికి, అవుతున్న రిజిస్ట్రేషన్లకు అసలు లింకే లేదు. అంతలా టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉందో ఆధారాలతో సహా ఓ లుక్కేద్దాం.


రియల్ ఎస్టేట్ పడిపోతోంది… ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణం అన్న వాళ్లకు దీటైన, ఘాటైన సమాధానాలు వచ్చేశాయ్. అవును హైదరాబాద్ బ్రాండ్ ను తగ్గించాలని చూసినా.. తగ్గుతోందని ప్రచారం చేసినా అది రివర్సే అవుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ షాన్.. దేశ్ కీ జాన్. భాగ్యనగరం ఏ రంగంలోనైనా ట్రెండింగ్ లో ఉండాల్సిందేనని మరోసారి నిరూపించింది. నిజానికి రియల్ ఎస్టేట్ రంగం దేశమంతా కాస్త డౌన్ ట్రెండ్ చూపిస్తే.. మన దగ్గర మాత్రం తగ్గేదేలే అంటోంది.

హైదరాబాద్ సిటీ బ్రాండ్ అంటే బ్రాండే. అందుకే అది ఎక్కడా తగ్గదు అని మరోసారి నిరూపించింది. తాజాగా నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రైమ్​ సిటీ ఇండెక్స్​ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్​ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశంలోని 6 ప్రధాన నగరాల్లో హైదరాబాద్​ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో బెంగళూరు ఉంది. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై సిటీలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన, స్థిరాస్తి రంగం విస్తరణ, ప్రభుత్వ విధానాలు పరిపాలన, జనాభా పెరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా నగరాల విస్తరణ తీరును ఈ నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ విశ్లేషించింది. హైదరాబాద్ సిటీలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రతి ఏటా 10 శాతం చొప్పున వృద్ధి కనబరుస్తూ వస్తోందని రిపోర్ట్ ఇచ్చింది.


2023లో హైదరాబాద్ రెసిడెన్షియల్​ రియల్​ ఎస్టేట్​ రంగం 11 శాతం వృద్ధి సాధించింది. పెట్టుబడిదారులు, వినియోగదారులు హైదరాబాద్​ లో స్థిరాస్తులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. విశాలమైన రోడ్లు, అండర్​ పాస్​ లు, రింగ్​ రోడ్డు, మెట్రో విస్తరణ కారణంగా రవాణా సదుపాయాలు నగరం నలువైపులా పెరుగుతున్నాయి. అది నగర విస్తరణకు, స్థిరాస్తి రంగ వృద్ధికి చాలా యూస్ ఫుల్ గా మారింది. సో సిటీలో ఎక్కడి నుంచి, ఎక్కడైనా మెట్రో ద్వారా గంటలో చేరుకునే ఛాన్స్ ఉండడం కూడా రియల్ ఎస్టేట్ నలువైపులా విస్తరించేందుకు కారణంగా మారింది. హైదరాబాద్ ​లో ఐటీతో పోటీ పడేలా ఫార్మాసూటికల్స్​, బయో టెక్నాలజీ రంగాలు కూడా విస్తరిస్తుండడం మరింత అడ్వాంటేజ్ గా మారింది. దీంతో ఆటోమేటిక్ గా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు స్థిరాస్థి రంగానికీ డిమాండ్​ పెరిగింది.

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఏదో ఆశామాషీగా పెరుగుతోందనడానికి లేదు. ఇక్కడ వర్త్ అలా ఉంటుంది. పెట్టుబడిదారులు, వినియోగదారులు కూడా ఇక్కడ స్థిరాస్తులను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోతుందన్న ప్రచారానికి ఈ రిపోర్ట్ చెక్ పెట్టినట్లయింది. నెగెటివిటీని పూర్తిగా తిప్పికొట్టేలా ఈ రిపోర్ట్ రావడంతో రియల్ రంగానికి మరింత జోరు కలిసి రావడం ఖాయంగానే కనిపిస్తోంది.

సంస్థలు ఇచ్చే రిపోర్ట్ కాదు.. అసలు జనవరి టూ ఆగస్ట్ మధ్య జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య చూద్దాం. ఇది రియల్ డేటా. సో ఆ లెక్కలు తీసుకున్నా హైదరాబాద్ లో ఏ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో గుర్తించవచ్చు. రేట్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో డిమాండ్ కూడా పెరుగుతోంది. అంటే ఎక్కడా డౌన్ ట్రెండే లేదు. ఓసారి హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన రిజిస్ట్రేషన్ల లెక్కలు చూద్దాం.

ఈ ఆగస్ట్ లో హైదరాబాద్ సిటీలో 6439 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్‌ జరిగిన స్థిరాస్తుల విలువ 4043 కోట్ల రూపాయలు. అంటే గతేడాదితో పోలిస్తే 17 శాతం విలువ పెరిగింది. ఇళ్ల ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ వరకు 8 నెలల్లో 54 వేల 483 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 18 శాతం అధికం. సో ఏ లెక్కలు ఏ యాంగిల్ లో తీసుకున్నా హైదరాబాద్ రియల్ జోరు ఏ దశలోనూ తగ్గలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో, అలాగే కొంత సంగారెడ్డి జిల్లా ఏరియాలో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా ఇక్కడే ఎక్కువ.

ఓసారి 2022 నుంచి 2024 దాకా జనవరి నుంచి ఆగస్ట్ వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. 2022లో జనవరి నుంచి ఆగస్ట్ మధ్య 46 వేల 646 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అది వార్షిక వృద్ధిలో మైనస్ 17 శాతంగా నాడు నమోదైంది. ఇక 2023 తొలి 8 నెలల్లో 46 వేల 287 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ ఏడాది మైనస్ 1 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ మధ్యలో 54 వేల 483 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరగగా 18 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. ఈ లెక్కలు చాలు.. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ రియల్ రంగం ఎలా దూసుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కలే.

ఆగస్టు నెల రిజిస్ట్రేషన్లలో ఎక్కువ వాల్యూ కలిగిన ఐదు స్థిరాస్తులు బంజారాహిల్స్‌లోనే జరిగాయి. 3 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో గల ఇళ్లు ఐదు రిజిస్ట్రేషన్‌ జరిగాయి. వీటి మార్కెట్‌ విలువ ఒక్కోటి 5.37 కోట్ల నుంచి గరిష్ఠంగా 7.78 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. బంజారాహిల్స్‌ను మించి ఐటీ కారిడార్‌ కోకాపేట ప్రాంతాల్లో ప్రతినెల అత్యధిక విలువ కలిగిన రిజిస్ట్రేషన్లు నమోదయ్యేవి. ఈ ఆగస్ట్ లో మొదటి ఐదు లావాదేవీల్లో కోకాపేటకు చోటు దక్కలేదు. అటు రిజిస్ట్రేషన్లు జరిగిన ఇళ్లలో అత్యధికం 50 లక్షల లోపు మార్కెట్‌ విలువైనవే. వాస్తవ ధరలు ఇంతకు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి వాటా 59 శాతంగా ఉంది. 50 లక్షల నుంచి కోటి రూపాయల లోపు మార్కెట్‌ విలువపై రిజిస్ట్రేషన్లు జరిగిన ఇళ్ల వాటా 26 శాతం నమోదైంది. గత ఏడాది 24 శాతం మాత్రమే ఉంది. కోటి రూపాయలపైన విలువ కలిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్ల వాటా 9 నుంచి ఏకంగా 15 శాతానికి పెరిగింది. ఇంటి విస్తీర్ణం వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల మధ్య ఉండాలని 69 శాతం మంది కోరుకుంటున్నారు.

మరోవైపు ట్రిపుల్ బెడ్ రూమ్ ఇండ్ల రిజిస్ట్రేషన్లు గత ఏడాది 56 శాతం ఉంటే.. ఈసారి 64 శాతానికి పెరిగింది. ప్రభుత్వం భూముల ధరలను సవరిస్తుందనే ప్రచారం నేపథ్యంలో జులైలో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రికార్డు స్థాయిలో 8781 ఇళ్ల రిజిస్ట్రేషన్‌ జరిగాయి. పెంపు వాయిదా పడటంతో ఆగస్ట్ పై ఎఫెక్ట్ పడినప్పటికీ మ్యాటర్ ఎక్కడా తగ్గలేదు. జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. హైదరాబాద్ నలు మూలల కూడా ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతున్నాయి. అదే సమయంలో అమ్మకాల జోరు కూడా ఉంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ, శేరిలింగంపల్లి, కొండాపూర్, అలాగే హైదరాబాద్ వెస్ట్‌ పరిధిలోని మియాపూర్‌ అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలుగా ఉన్నట్లు ప్రొప్ టైగర్ డాట్ కామ్ రిపోర్ట్ లో క్లారిటీ ఇచ్చింది. అటు హైదరాబాద్ నార్త్‌లోని కొంపల్లి, తెల్లాపూర్, కూకట్‌పల్లి, శామీర్‌పేట, హైదరాబాద్ సౌత్‌లోని సైదాబాద్, షాద్‌నగర్ అలాగే మహేశ్వరం, ఇటు హైదరాబాద్ ఈస్ట్‌లోని ఎల్‌బి నగర్, నాగోల్, ఉప్పల్, హైదరాబాద్ సెంట్రల్‌లోని సోమాజిగూడ, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్‌లోని మల్లాపూర్, సైనిక్‌పురి, ఏఎస్ రావు నగర్ అలాగే ఓఆర్ఆర్ సౌత్‌లోని శంషాబాద్, ఆదిబట్ల, పోచారం ఇలాంటి ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోంది. కారణం నలుమూలలా సిటీ విస్తరించడం, రవాణా సదుపాయాలు మెరుగవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడమే.

Also Read: ఆ మాజీ ఎమ్మెల్యేతో నాకు ప్రాణహాని.. బీఆర్ఎస్ నేతపై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆరోపణ

మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్​ మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ ​కారిడార్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మరోవైపు సర్కార్ ఆదేశాలతో ప్రస్తుతం 7,350 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్ ​మెంట్​ అథారిటీ పరిధిని మరో 100 చదరపు కిలోమీటర్లు పెంచాలని హెచ్ఎండీఏ గతంలోనే నిర్ణయించింది. ఓఆర్ఆర్​ బయట పీపీపీ విధానంలో శాటిలైట్ టౌన్ ​షిప్ ​ల నిర్మాణానికి రెడీ అవుతోంది. తక్కువలో తక్కువ 100 ఎకరాలు ఉండే టౌన్ షిప్ లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించి, విధివిధానాలు రూపొందిస్తున్నారు. ఇలాంటి సానుకూల పరిణామాలతో హైదరాబాద్​, దాని చుట్టుపక్కల జిల్లాల్లో స్థిరాస్తి రంగం పుంజుకున్నట్టు రియల్​ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×