Ganesh Festival: స్వేచ్ఛ బ్యూరో: చారిత్రక భాగ్యనగరం గణేష్ నవరాత్రి ఉత్సవాల శోభను సంతరించుకుంది. ఈ నెల 14వ తేదీన వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రతి ఇంట్లో, అపార్ట్ మెంట్లతో పాటు యువజన సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలతో పాటు వివిధ స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగేలా ఏర్పాట్లు తుది దశలో ఉన్నాయి. ముఖ్యంగా గణేష్ విగ్రహాలను తయారు చేసే దూల్ పేట నుంచి గడిచిన వారం రోజులుగా గణనాధుల విగ్రహాలు మండపాల వైపు తరలి వెళ్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని గణేష్ మండపాల నిర్వాహకులే గాక, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, వికారాబాద్, మహాబూబ్ నగర్ తదితర జిల్లాలకు కూడా దూళ్ పేట నుంచి గణేష్ విగ్రహాలు తరలి వెళ్తున్నాయి.
మండపాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వినాయకుడికి బ్యాండ్ మేళాలు, యువకుల నాట్య విన్యాసాలతో స్వాగతం పలుకుతున్నారు. సాధారణంగా నిమజ్జనం రోజున బ్యాండ్ మేళాల, యువకుల కేరింతలు, నినాదాలతో గణేషుడికి గుడ్ బై చెప్పే వారు. కానీ చవితికి ముందు వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చేటపుడు గణనాథుడికి ఘనస్వాగతం పలికే ఆనవాయితీ క్రమంగా పెరుగుతుంది. అలాగే సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లు, మెయిన్ రోడ్లలో, అపార్ట్ మెంట్లలో కూడా గణనాధుడ్ని ప్రతిష్టించి, పదకొండు రోజుల పాటు సాంప్రదాయంగా పూజాధికాలను నిర్వహించేలా, పూజానంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించేలా ప్రతి మండపం వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. బేగంపేట, పాతబస్తీతో పాటు సికిందరాబాద్ మోండా మార్కెట్, రాంగోపాల్ పేట తదితర ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి ప్రాంతాలతో పాటు శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే వినాయక మండపాలను ఏర్పాటు చేసి, రంగురంగుల విద్యుత్ దీపాలతో జిగేల్ మన్పిస్తున్నారు.
గడిచిన నాలుగైదు రోజుల నుంచి దూల్ పేట పరిసర ప్రాంతాల నుంచి భారీ విగ్రహాలు తరలి వెళ్లేందుకు వీలుగా దూల్ పేట చుట్టూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా భారీ విగ్రహాలు తరలి వెళ్లేలా పలు రూట్లలో వన్ వే ను అమలు చేస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఎంతో ఆసక్తికరంగా మారిన ఖైరతాబాద్ భారీ గణపయ్య విగ్రహాం తయారీ ఇప్పటికే పూర్తయింది. ఈ నెల 14వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని బడా గణపయ్యకు ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. బడా గణపయ్యకు గవర్నర్, సీఎంలు సైతం పూజలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి గణేష్ మండపానికి ఈ సారి సర్కారు విద్యుత్ సరఫరాను ఉచితం చేయటం పట్ల మండప నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
Also read: గూగుల్ డ్రైవ్‌లో ఫైల్స్ అప్లోడింగ్ చాలా స్లోగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చూసి చూడండి!
హైదరాబాద్ జిల్లాతో పాటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాలోని గల్లీ గల్లీల్లో ప్రతిష్టించి గణేష్ మండపాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పదకొండు రోజుల పాటు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మండపం వద్ద ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ తో బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. చార్మినార్ జోన్ పరిధిలోని దాదాపు 16 సమస్యాత్మక పోలీస్ స్టేషన్ల పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, ఘనంగా జరిగేందుకు వీలుగా సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, సాయుధ బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. దీనికి తోడు వినాయక చవితి 14న జరగనున్నందున, ఆ తర్వాత మూడు రోజుల్లో అంటే 16వ తేదీన మూడు రోజుల నిమజ్జన కార్యక్రమాలు కూడా మొదలు కానున్నందున క్యూర్ సిటీ పరిధిలోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కమిషనర్లు బందోబస్తు ఏర్పాట్లపై స్పెషల్ గా ఫోకస్ పెట్టారు.
18న అయిదో రోజు, 20న ఏడో రోజు, 22న తొమ్మిదో రోజున, 25న ఫైనల్ పదకొండు రోజుల నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మిషనరీ, మ్యాన్ పవర్ ను సిద్దం చేశారు. చెరువుల వద్ద భారీ క్రేన్లను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. చిన్న చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం బేబీ పాండ్లను ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ప్రధాన శోభ యాత్ర జరగనున్న బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు నిమజ్జనం రూట్ లో పేరుకుపోయే చెత్త చెదారాన్ని ఎప్పటికపుడు తొలగించేందుకు మూడు కార్పొరేషన్ల పరిధిలో గణేష్ యాక్షన్ టీమ్ లను సిద్దం చేశారు. ఈ టీమ్ లు ప్రతి అయిదు గంటల మీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తూ, ఎప్పటికపుడు వ్యర్థాలను సేకరించనున్నాయి. హుస్సేన్ సాగర్ ఒక వైపు అప్పర్ టాంక్ బండ్ పై, అలాగే ఎన్టీఆర్ మార్క్ లో ప్రత్యేకంగా 27 భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఫైనల్ నిమజ్జనం జరిగే ఈ నెల 25వ తేదీన ఖైరతాబాద్ బడా గణపయ్యను నిమజ్జనం చేసేందుకు స్పెషల్ క్రేన్ ను ఎన్టీఆర్ మార్గ్ కు తెప్పించనున్నట్లు తెలిసింది. ఫైనల్ నిమజ్జనం 26వ తేదీ సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలున్నాయి.
Also read: ఈ సక్సెస్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు… నెగిటివిటీ పై కన్నీళ్లు పెట్టుకున్న వైష్ణవి!