Tirumala Prasadam: శ్రీవారి ఆలయంలో నైవేద్య కైంకర్యాలకు వైఖానస ఆగమ సంప్రదాయమే ఆధారం. ఆలయ పోటులో నైవేద్య పదార్థాలను సంప్రదాయ పద్ధతుల్లో సిద్ధం చేస్తారు. పదార్థాల ఎంపిక నుంచి.. పాత్రలు, వంట విధానం వరకు ప్రత్యేక నియమాలు పాటిస్తారు. శ్రీవారి నైవేద్యంలో ఎండుమిర్చి, పచ్చిమిర్చికి బదులుగా నల్లమిరియాలను ఉపయోగించే సంప్రదాయం కొనసాగుతోంది. భక్తులు పులిహోరగా పిలిచే ప్రసాదాన్ని ‘తింత్రిణీరసాన్నం’ అంటారు. నెయ్యి పొంగలిని ముద్గాన్నం, బెల్లం అన్నంను గుడాన్నం, మిరియాల అన్నాన్ని మరీచ్యాన్నం, వడను మాషాపూపం, దోశను చక్రప్పం అంటారు. అంటే.. మనకు తెలిసిన ప్రతి ప్రసాదం వెనుక ఒక ప్రత్యేక ఆగమ పేరు, సంప్రదాయం ఉంది.
ఉదయం నుంచి రాజభోగం వరకు నిత్యం శ్రీవారికి 45 రకాల ప్రసాదాలు నివేదిస్తారు. ఇందులో 20 రకాల అన్నప్రసాదాలు.. 25 రకాల పిండిపదార్థాలు ఉంటాయి. మొదటి గంట అనంతరం ఉదయం నైవేద్యం, మాత్రాన్నం, ముద్గాన్నం, తింత్రిణీరసాన్నం, దధ్యోదనం, గుడాన్నం, శాకాన్నం, శర్కరాన్నం వంటి అన్నప్రసాదాలను సమర్పిస్తారు. వీటితో పాటు లడుకం, మాషాపూపం, గుడప్పం, చక్రప్పం వంటి పణ్యారములను కూడా నివేదిస్తారు. రెండో గంట అనంతరం రాజభోగం. శుద్ధాన్నం, పులిహోర, గుడాన్నం, దధ్యోదనం, శీరా లేదా శక్కరభాత్ వంటి ప్రసాదాలను సమర్పిస్తారు. ఇక మూడో గంట అనంతరం మిరియాల అన్నం, చక్రప్పం, లడుకం, మాషాపూపం, శర్కరాన్నం తదితర ప్రసాదాలను శ్రీవారికి సమర్పిస్తారు. రోజులో చివరిగా జరిగే ఏకాంత సేవలో వెచ్చని పాలు, కాలానుగుణ పండ్ల ముక్కలు, నెయ్యిలో వేయించిన ఎండు పండ్లను సమర్పిస్తారు.
శ్రీవారికి సమర్పించే ఒక్కో ప్రసాదానికి ఓ పేరు.. ఒక్కో నైవేద్యానికి ఓ నియమం ఒక్కో కైంకర్యం వెనుక శతాబ్దాల ఆగమ సంప్రదాయం. 45 రకాల నైవేద్యాలతో.. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సాగే ఈ కైంకర్యాలు తిరుమల శ్రీవారి ఆలయ ప్రాచీన వైఖానస సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
Also read: విశాఖ మున్సిపల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రజలు ఎక్కువగా కోరుతున్న కోరిక ఇదే?