1975 ఎమర్జెన్సీ తర్వాత..1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ, కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూశాయి. దేశంలో తొలిసారి కాంగ్రెస్ కేంద్ర అధికారానికి దూరమైందప్పుడు. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. కానీ.. అంతర్గత విభేదాలు..నాయకత్వ పోరు..రాజకీయ అస్థిరత.. జనతా ప్రభుత్వాన్ని బలహీనపరిచాయి.1979లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయగా, చరణ్‌సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. కానీ.. పార్లమెంట్‌లో మెజారిటీ నిరూపించుకోకముందే ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో లోక్‌సభ రద్దయి.. 1980లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.
ఈ పరిణామాలు ఇందిరాగాంధీకి రాజకీయ పునరాగమనానికి అవకాశం ఇచ్చినట్టయ్యింది. 1980 ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) ఘన విజయం సాధించింది. ఎన్నికలు జనవరి 1980లో జరగగా, జనవరి 14న ఇందిరాగాంధీ మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయిన నాయకురాలు.. కేవలం మూడేళ్లలోనే.. మళ్లీ దేశ ప్రధానిగా పీఠమెక్కి జాతీయ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు.
1980లో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. జనతా పార్టీ ప్రయోగం విఫలమైన తర్వాత.. మాజీ జనసంఘ్ నేతలు కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ—బీజేపీ ఆవిర్భవించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో బీజేపీ చిన్న రాజకీయ శక్తి మాత్రమే. కానీ.. తర్వాతి నాలుగు దశాబ్దాల్లో భారత రాజకీయాలను ప్రభావితం చేసే ప్రధాన జాతీయ పార్టీగా ఎదిగింది.
Also Read: వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!
Also Read: 80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్