Hyderabad Drains: అధికారులకు బాధ్యత లేదు. మ్యాన్‌హోల్స్‌కు మూతలు లేవు. విశ్వనగరంలో నడిరోడ్డుపై మృత్యుకూపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. నగరంలో వానపడితే నరకమే.. రోడ్డుపై అడుగు వేయాలంటే భయమే. మియాపూర్‌లో ఓ వ్యక్తి.. ఓపెన్ నాలాకు బలయ్యాడు. ఇంకెన్ని ప్రాణాలు పోవాలి. హైటెక్ ముసుగువేసుకున్న నగరంలో కనీసం మ్యాన్‌మోల్స్‌కి మూతలు వేసే దిక్కులేదా? నాలాలకు గ్రిల్స్ వేసే అవసరం లేదా?
కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఫ్లైఓవర్లు, మెరిసిపోయే బిల్డింగ్‌లు, గ్లోబల్ సిటీ అని డప్పు కొట్టుకునే గొప్పలు.. ఇవన్నీ ఇప్పుడు మియాపూర్ ఓపెన్ నాలా ముందు సిగ్గుతో తలదించుకున్నాయి. ఓ వ్యక్తి నమ్మకంతో అడుగులు వేశాడు. కానీ అది అతని ఆఖరి అడుగు అయ్యింది. ఓపెన్ నాలాల పడి కొట్టుకుపోయాడు. అతని కేకలు ఆ వరద హోరులో కలిసిపోయాయి. చివరికి అతిని కుటుంబానికి మిగిలింది ఆరని కన్నీళ్లు, తీరని గుండెకోత.
Also Read: ఇసుక నేలపై కాళేశ్వరం పునాది.. కట్టిన వారానికే లీకేజీ.. మంత్రి ఉత్తమ్ ఫైర్
ఇది ప్రమాదమా.. కానే కాదు.. అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ముసుగులో జరిగిన పరోక్ష హత్య. ఎస్ ఇదీ ముమ్మాటికి వ్యవస్థ చేసిన హత్య. ఇంకెన్నీ ప్రాణాలు పోవాలి. ప్రతి వానాకాలం రాకముందే సమీక్షలు పెట్టి అన్నీ సిద్ధం చేశామని మీడియా మైకులు ముందు గొప్పగా చెప్పుకున్న బిల్డప్‌లు ఏమయ్యాయి?
అధికారుల్లారా ఇప్పటికైనా రోటిన్ డ్రామాలు ఆపండి. హడావుడిగా ఘటనా స్థలానికి రావడం.. దర్యాప్తు చేస్తామని మీడియా కెమెరాలకు ముఖాలు దాచుకోవడం. ఆఖరికి లక్కీ డ్రా తీసినట్టు కొన్ని లక్షల పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం. ఇదేనా నగరవాసులకు మీరు చేసే ప్రజా సర్వీస్. మ్యాన్‌హోల్స్‌కి మూతలు వేయడానికి, ఓపెన్ నాలాలకు గ్రిల్స్ వేయడానికి ఉన్న అడ్డంకులు ఏంటి? బడ్జెట్ లెక్కలు తేలడం లేదా? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?
Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తొలిసారి తీసుకుంటున్నారా? ముందు ఈ 4 విషయాలు తప్పక చెక్ చేయండి