NEET Success: ఇక్కడ కిచిడీ సర్వ్ చేస్తున్న ఈ కుర్రాళ్లను చూశారా? సాధారణ వ్యాపారులు అనుకుంటే పొరపాటే. వీరు రేపు కాబోయే డాక్టర్లు. అవును.. నీట్ ఫలితాల్లో మెరిసి, ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకున్నారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన షకీబ్, బిలాల్. ఇద్దరి తల్లిదండ్రులు రోడ్డు పక్కన కిచిడీ బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పదో తరగతి వరకు స్థానిక జెడ్పీ స్కూల్లో, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు.
ఇంటర్ పూర్తయ్యాక రెండేళ్ల పాటు పట్టుదలతో నీట్ కోచింగ్ తీసుకున్నారు బిలాల్, షకీబ్. పగలు బండి వద్ద కష్టం.. రాత్రి వేళల్లో పుస్తకాలతో యుద్ధం. ప్రతిరోజూ ఉదయం 3:30 గంటలకు లేచి కిచిడీ తయారీలో సహాయపడటం. 5:30కు నమాజ్ ముగించుకుని, 6 గంటలకల్లా బండిని రోడ్డుపైకి చేర్చడం. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యే సమయానికి కస్టమర్లకు వేడివేడి కిచిడీ అందించడం.. ఆ తర్వాత తాము కాలేజీకి వెళ్లడం. సాయంత్రం రాగానే మళ్లీ బండి పనుల్లో నిమగ్నమయ్యేవారు.
Also read: నిమజ్జనానికే కాదు.. విగ్రహం తెచ్చేటప్పుడే రచ్చ రంబోలా.. మారుతున్న గణేష్ ఉత్సవాలు!
నిజమైన కృషి ఉంటే సాధించలేనిదేమీ లేదని ఈ ఇద్దరూ నిరూపించారు ఈ అన్నదమ్ములు. వీరి శ్రమ ఫలించింది. బిలాల్.. ఆల్ ఇండియా స్థాయిలో 1,20,325 ర్యాంక్ సాధించగా.. షకీబ్‌కు 1,47,283 ర్యాంక్ వచ్చింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే బిలాల్‌కు నిర్మల్ మెడికల్ కాలేజీలో, షకీబ్‌కు కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చాయి. పిల్లలు డాక్టర్ సీటు సాధించడంతో ఆ పేద తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. పేదరికం తమ చదువుకు అడ్డంకి కాదని, పట్టుదల ఉంటే అనుకున్న గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకోవచ్చని నిరూపించిన బిలాల్, షకీబ్‌లు నేటి తరానికి నిజమైన స్పూర్తి.
Also read: అన్ని అకౌంట్లకూ ఒకే పాస్‌వర్డ్ వాడేస్తున్నారా? జాగ్రత్త