హైడ్రా ఇప్పుడు రెండు పార్టీల ఇష్యూగా మారింది. హైకోర్టు తీర్పుతో బీఆరెస్ ఎగిరి గంతేసింది. రంగనాథ్‌ను తప్పించండి.. అని వచ్చిన ఆదేశాలు తమ పార్టీ పాలసీకి అనుగుణంగా ఉన్నాయని, దీన్ని ప్రజలు తమ విజయంగానే భావిస్తారని అనుకున్నారు బీఆరెస్ శ్రేణులు.
వెంటనే దీనిపై ప్రెస్‌మీట్ల మీద ప్రెస్‌మీట్లు పెట్టి.. చెంపపెట్టు.. గుణపాఠం.. అరాచకం అని ఏవేవో మాట్లాడారు. కానీ మనం ముందుగా అనుకున్నట్టు సీఎం.. రంగనాథ్‌ను వదిలేలా లేడు. హైకోర్టు ఆదేశాలపైనా ఆయన తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చాడు. అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమని కోర్టుకు, బీఆరెస్ నేతలకు ఈ విధంగా ఒకేసారి సమాధానమిచ్చాడు.
దీంతో హైడ్రా దూకుడు ఆగేది లేదు… బుల్డోజర్లకు బ్రేకులు పడేది లేదు.. అనే విషయాన్ని స్పష్టం చేశాడు సీఎం. అంతే కాదు.. ఏకంగా బీఆరెస్ నేతలు కోర్టునే తప్పుదోవ పట్టించారని విరుచుకుపడ్డాడు రేవంత్ రెడ్డి. కబ్జాలు చేసిందే కాక తప్పుడు పత్రాలతో కోర్టు కంటెంప్ట్ అంటూ రంగనాథ్‌ను టార్గెట్ చేయడం మూలంగానే హైకోర్టు ఈ విధమైన అభిప్రాయానికి వచ్చిందన్నాడు.
బతుకమ్మ కుంటను కబ్జా చేసుకున్నది బీఆరెస్ అంబర్‌పేట్ నియోజకవర్గ ఇంచార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి కాదా? ఆ కుంటను కబ్జా చేసుకోవడానికి చాన్స్ ఇచ్చినందుకు ఏకంగా కేసీఆర్ వచ్చిన సందర్భంగా హెలికాప్టర్‌తో పువ్వులు చల్లించాడని గుర్తు చేశారు. మరో ఇష్యూలో ముఖీం పైనా ఇదే విధంగా కబ్జా చెర నుంచి జాగాను విడిపించామని వివరించాడు.
అందుకే బీఆరెస్ నేతలు తప్పుడు పత్రాలతో కోర్టుకెక్కి… కోర్టు ధిక్కరణ చేశారంటూ ఉల్టా మామీదే తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డాడు సీఎం. సోమేశ్ కుమార్‌పై 400కు పైగా కోర్టు కంటెంప్ట్ కేసులున్నాయని గుర్తు చేశాడు సీఎం రేవంత్‌రెడ్డి. హైడ్రా వల్ల ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని, వీరంతా బీఆరెస్‌కు చెందిన వారే కావడంతోనే ఆ పార్టీ నేతలు హైడ్రాపై విషం చిమ్ముతున్నరన్నాడు.
సీఎం మాటలతో హైడ్రాపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని అందరికీ అర్థమైపోయింది. రంగనాథే కమిషనర్‌గా కొనసాగనున్నాడనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక మరింత దూకుడుగా బుల్డోజర్ దూసుకుపోతుందనే సిగ్నల్స్ ఇచ్చేశాడు రేవంత్‌రెడ్డి. మొన్నటి దాకా ఏమన్నా ఉపేక్షించినవి కూడా ఇకపై టార్గెట్ అయినా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.