Sand Mafia: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఇప్పుడు యథేచ్చగా ఇసుక దందా కొనసాగుతోంది. కళ్ల ముందే ఇసుక అక్రమంగా మాయమవుతున్నా.. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు ఈ దందా ఎలా సాగుతుందో చూద్దాం…స్పాట్
సాంబాయిగూడెం, రామానుజవరం, అన్నారం, అనంతారం గ్రామ సరిహద్దుల్లో నుంచి గోదావరి నది భద్రాచలం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఈ ప్రాంతంలో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలు, నది ఉధృతితో ఈ గ్రామాల్లో ఇసుక మేటలు వేస్తాయి. ఈ ఇసుక మేటలను తొలగించేందుకు రైతులు సంబంధిత రెవిన్యూ మైనింగ్ అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకుంటారు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైవుతుంది. గ్రామాల్లోని ఇసుక మేటల తొలగింపు పేరుతో అనుమతులు వచ్చిన తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. ఇసుకపై కన్నేసిన కాంట్రాక్టర్లు తెరపైకి వస్తారు. ఈ కాంట్రాక్టర్లు రైతులను ముగ్గులోకి దింపి ఆ తర్వాత చక్రం తిప్పుతున్నారు.
సమీప పంట భూములలో ఇసుక మేటలను తొలగిస్తామని రైతులను కాంట్రాక్టర్లు ఒప్పిస్తున్నారు. ఇసుక తవ్వకాల కోసం రెవిన్యూ, మైనింగ్ శాఖ నుంచి అనుమతులు కూడా ఇప్పించే విధంగా కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. నిజానికి ఆదివాసీల సొసైటీ సంఘ సభ్యులతో ఎలాంటి యంత్రాల సాయం లేకుండానే సహజసిద్ధమైన పద్ధతుల్లో ఆ ఇసుకను తొలగించాలి. అధికారులు కూడా ఇవే నిబంధనలు పెట్టి అనుమతులు ఇస్తారు. కానీ ఆచరణలో మాత్రం అలా జరగడం లేదు. ఆదివాసీ సొసైటీ సంఘ సభ్యులతో ముందు కుదుర్చుకున్న ఒప్పందంతో కొందరు బడా బాబులు. కాంట్రాక్టర్లు రంగంలోకి దిగుతున్నారు. ఆ పొలాల నుంచి సోసైటీ సభ్యులు ఎలాంటి ఇసుక తీయాల్సిన అవసరం లేదని.. కేవలం గోదావరి నది ఒడ్డున సభ్యులు డేరాలు వేసుకుని ఉంటే చాలు అని చెప్తున్నారు. మిగతాదంతా తామే చూసుకుంటామని కాంట్రాక్టర్లు చెబుతున్నారట. అందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టర్లు రోజుకు వేలాది రూపాయలు సోసైటీ సభ్యులకు చెల్లిస్తూ ఉంటారనే టాక్ వినిపిస్తోంది.
ఈ ఇసుకాసురల చేతిలో పడి గోదారమ్మ తల్లడిల్లిపోతోంది. పంట భూముల్లో ఇసుకను తొలగిస్తున్నామంటూ అనుమతి తీసుకున్నా… అంతకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అనుమతులు తీసుకునేది గోరంతయితే.. కొండంత తొలచివేస్తున్నారు. అయినా దీనిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సాంబయ్యగూడెం గ్రామం ఇసుక ర్యాంపుల్లో కొందరు ఇసుకాసురులు అక్రమ ఇసుక రవాణాను వ్యాపారంగా మల్చుకొని రోజుకు లక్షల రూపాయలు దోచుకుంటున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు.
ఇక్కడ ఓ తిరకాసు కూడా ఉంది. రైతుల భూముల్లో ఇసుక లేకపోయినా కూడా.. ఉన్నట్లు స్ధానిక మండల అధికారుల నుంచి నివేదికలు సృష్టించడం… ఇసుక మేటలు తొలగించేందుకు సొసైటీల పేరిట అనుమతులు తీసుకునేలా కాంట్రాక్టర్లు ప్లాన్ వేస్తుంటారని స్థానికంగా చర్చ నడుస్తోంది. లక్ష క్యూబిక్ మీటర్ ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం రాయల్టీ రూపంలో వంద రూపాయిలు నుంచి 120 రూపాయల వరకూ చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించే రాయల్టీలోను పది శాతం మాత్రమే సొసైటీ సభ్యులకు ఇస్తూ మిగిలింది వాళ్ల జేబుల్లోకి వేసుకుంటున్నారని సమాచారం.
సాంబాయిగూడెం, రామానుజవరం, అన్నారం, అనంతారం గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. సాంబాయిగూడెం, రామానుజవరం రైతులకు సంబంధించిన భూ సర్వే నెంబర్ల ఆధారంగా ఇసుకను తొలగించుకునేందుకు అనుమతులు పొందిన అనంతరం కాంట్రాక్టర్లు సమీపంలోని గోదావరి నదిలోని ఇసుకపై కన్నేస్తున్నారు. గోదావరి నదిలోనూ సుమారు కిలోమీటర్ల కొద్దీ ప్రత్యేకంగా రోడ్లు వేసుకుని నదిలోని ఇసుకను కొల్లగొడుతున్నారు. గోదావరి నది ఒడ్డు నుంచి పది అడుగుల మేరకు ప్రత్యేకంగా మెటల్ రోడ్డు వేసుకొని ఒకే సారి రెండు వాహనాలు రాకపోకలు కొనసాగే విధంగా ఆ రోడ్లు వేసుకున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ఒక్కో టన్ను గోదావరి ఇసుక 1200 నుంచి మొదలుకొని 1500 రూపాయల వరకు బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారు కేటుగాళ్లు. ప్రతిరోజు రాత్రివేళల్లో వందలాది లారీలు.. పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ తదితర నగరాలకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ లక్షల రూపాయలను జేబులు నింపుకుంటున్నారు.
మణుగూరు మండల కేంద్రంలో గోదావరి నది పరిసర ప్రాంతాలలో 12కు పైగా ఇసుక ర్యాంపులు ఉన్నాయి. అవన్నీ సొసైటీ ఇసుక ర్యాంపులే. కానీ అక్కడ మాత్రం కాంట్రాక్టర్లదే హవా. గోదావరి నదిలో జరుగుతున్న ఇసుక రవాణా, అక్రమాలపై ఆధారాలతో సహా స్థానికులు పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందనేది స్ధానికుల వాదన. యథేచ్చేగా ఇసుక వ్యాపారం జరుగుతున్నా… అధికార యంత్రాంగం స్పందించపోవటం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులకు వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే గోదావరి ముంపు వలన రైతుల భూముల్లో మేటలు వేసిన ఇసుకను తీసేందుకు సొసైటీల ద్వారా అక్రమ వ్యాపారానికి తెరలేపినటువంటి ఓ బడా కాంట్రాక్టర్… సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పూడికతీత మరో వరప్రదాయనిగా మారిందనేది టాక్.
ఇక మరో గ్రామం గుండ్లసింగారం పరిస్ధితి మరీ విచిత్రంగా ఉందనే చెప్పాలి. మండల రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది డిజార్ట్ విలేజ్. 40 ఏళ్ల క్రితమే మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో కలిసిపోయిందని పక్కగా రికార్డులో ఉంది. సింగరేణి సంస్థ ఆధీనంలోనే ఈ గ్రామం ఉందని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. దీనినే అదునుగా మార్చుకున్నారు కాంట్రాక్టర్లు. గుండ్లసింగారం పక్కనే ఉన్న గోదావరి నదిలో పూడిక తీసేందుకు అప్పటీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీతమ్మ సాగర్ పేరుతో డెసిల్టేషన్ పూడిక తీసేలా.. టెండర్లు పిలిచింది..ఆ టెండర్లను కాంట్రాక్టర్లకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న శ్రీకర్ అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మణుగూరు ప్రాంతంలో ఉన్న సాంబాయిగూడెం, రామానుజవరం, గుండ్ల సింగారం గ్రామాల నుంచి గోదావరి నదిలోకి వెళ్లాలంటే మధ్యలో సింగరేణి భూముల్లోంచి వేళ్లాల్సి ఉంటుంది. ఇసుక లోడింగ్ కోసం లారీలు గోదావరిలోకి వెళ్లేందుకు సింగరేణి భూముల్లో మెటల్ రోడ్డును నిర్మించారు ఇసుక కేటుగాళ్లు. సదురు కాంట్రాక్టర్లు రాజకీయ పలుకుబడితో సింగరేణి భూములు నుంచి 40 అడుగుల మెటల్ రోడ్డును రెండు వాహనాలు ఈజీగా వెళ్లే విధంగా గోదావరి నది మధ్యలో వరకు వెళ్లిందంటే ఈ బడా కాంట్రాక్టర్‌కు ఉన్న రేంజ్ అండ్ రాజకీయ అండదండలు ఏ పాటివో అర్థం చేసుకోవచ్చు. శ్రీకర్ అనే బడా కాంట్రాక్టర్ వద్ద నుంచి మరికొంతమంది వ్యక్తులు సబ్ లీజుకు తీసుకొని అడ్డూ అదుపు లేకుండా ప్రతి రోజు వందలాది లారీలు మణుగూరు పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సింగరేణి స్థలం అంటేనే ప్రొహిబిటేడ్ భూములు… ఆ ప్రాంతంలోకి అనుమతులు లేనిదే బయట వ్యక్తులు లోపలికి వెళ్లకూడదు. అలాంటిది ఆ భూముల్లో రోడ్లు వేసుకొని యథేచ్చగా లారీలు నడుపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
నిత్యం మందలాది లారీలు ఈ గ్రామాల నుంచి వెళ్లడంతో ప్రధాన రహదారులంతా గుంతలమయంగా మారాయి. దీంతో ప్రయాణికులు, గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంబాయిగూడెం, రామానుజవరం, గుండ్ల సింగారం, అన్నారం, అనంతారం ఇసుకర్యాంపుల్లో రాత్రి 8 గంటలు దాటిన తర్వాత కూడా లారీలకు లోడు చేస్తున్నా టీఎస్ఎండీసీ అధికారులు పట్టించుకోవడంలేదనే స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఇసుకాసురులను దండించే ఆ రాముడు ఏ రూపంలో, ఎప్పుడు వస్తాడో…. గోదావరిలో జరుగుతోన్న అక్రమాలకు తిలోకాలకు చెక్ పెట్టేది ఎప్పుడో అని స్ధానికులు ఎదురుచూస్తున్నారు.
Also Read: బంగారం కొంటేనే అక్షయ తృతీయనా? పురాణాల అసలు సందేశం ఏమిటి?