ఎన్నాళ్లకెన్నాళ్లకు. నాలుగేళ్ల సుధీర్ఘకాలం తరువాత కొత్త పింఛన్ల మోక్షం లభించింది తెలంగాణ జనానికి. కేసీఆర్ తన పాలన చివరలో అంటే.. ఒక ఏడాదికి ముందే.. పది లక్షల కొత్త పింఛన్లు ఇచ్చేసి.. పుల్‌స్టాప్ పెట్టేశాడు.
ఆ తరువాత ఎన్నికల ఏడాదిగా మారిపోయింది. పోటాపోటీ ఎన్నికల హామీల్లో తడిచి ముద్దయిపోయాయి పింఛన్లు. అధికారం మారింది. కానీ పింఛన్లు మాత్రం చేతికి రాలేదు. కొత్తవి లేవు. పాతవి పెరగలేదు. దాదాపుగా నాలుగేండ్లు గడుస్తున్న సందర్బంలో.. ఎట్టకేలకు ఈ దసరా నుంచి కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది.
దాదాపుగా 2.50 లక్షల పింఛన్లు ఇవ్వాలని ఇప్పటికే జిల్లాల యంత్రాంగాలకు ఆదేశాలిచ్చింది. వృద్దులు, వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళలకు సంబంధించిన పింఛన్లే పెరగనున్నాయి. గతంలో కేసీఆర్ పాలనలో ఇచ్చిన ఆసరా పింఛన్ల లిస్టులో చాలానే ఉన్నాయి. బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ పేషెంట్లు, ఇలా లిస్టు పెద్దగానే ఉంది. వీటన్నింటిని యథాతథంగా ఈసర్కార్ అమలు చేస్తున్నా.. కొత్త దరఖాస్తులు మాత్రం తీసుకోలేదు.
దాదాపు 6లక్షల కొత్త దరఖాస్తులు రాగా, వీటిని స్క్రూటినీ చేసి, అర్హులను గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్‌కు అప్పగించారు. ఇంకా అధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పింఛన్లన్నీ కలిపి దాదాపుగా 45 లక్షల వరకు ఉన్నాయి. ఈ దసరా తరువాత మరో రెండున్నర లక్షల చేయూత పింఛన్లు పెరగనున్నాయి.
నిధుల లేమి కారణంగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి కొత్త పింఛన్ల జోలికి వెళ్లలేదు. దీని ప్రస్తావనే తీయలేదు. ఇచ్చిన హామీ ప్రకారం కాకుండా.. పాత పద్దతిలోనే పింఛన్లు ఇచ్చేందుకు కొత్త వాటికి దరఖాస్తులు స్వీకరించింది. దసరా నుంచి ఇవ్వాలనే సంకల్పం పెట్టుకున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఇది సాధ్యమయ్యేనా అనిపించేలా ఉంది.
దీనికి తోడు.. సర్కార్ తరపున కూడా ఎలాంటి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం లేదు. దీనిపై సర్కార్ కూడా పెద్ద శ్రద్ద పెట్టినట్టుగా కనిపించడం లేదు. కొత్తగా పెరిగే రెండున్నర లక్షల పింఛన్లతో బడ్జెట్‌పై భారం భారీగానే పడనుంది. దీంతో ఈ దసరాకు ఇద్దామనుకున్న ఈ కొత్త పింఛన్ల విడుదల తేదీని మళ్లీ మారుస్తారా? అనే అనుమానాలూ లేకపోలేదు.
ఇక రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ రూ. 4వేల పింఛన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితైతే కనిపించడం లేదు. ఎన్నికల ఏడాదిలోనే దీనికేమైనా మోక్షం దొరుకుతుందనే ఆశలో ఉన్నారు జనం. ఈ దసరాకు కొత్త పింఛన్లు వస్తే నిజంగా ఆ ఇంటికి పండుగొచ్చినట్టేనని భావిస్తున్నారు. అంత ఘోరంగా తయారయ్యాయి మరి బతుకులు. ఈ పింఛనే కొండంత అండగా బతుకుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో.