IPL 2026: ఐపీఎల్ అంటేనే క్రికెట్‌లో జంబో ప్యాక్. ఇక్కడ అన్నీ దొరుకుతాయ్. ఆటను ఆస్వాదించే వాళ్లకు మ్యాగ్జిమమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అందుకే.. సీజన్ మొదలవడానికి ముందే హీట్ పీక్స్‌కి చేరింది. యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం కళ్లు పెద్దవి చేసుకొని ఎదురుచూస్తోంది. మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే సూపర్ ఫైట్‌తో.. మెగా టోర్నీ గ్రాండ్‌గా మొదలుకానుంది. మరి.. ఈ సీజన్ ధమాకా ఎలా ఉండబోతోంది? టైటిల్ ఫేవరెట్లుగా ఏయే టీమ్స్ ఉన్నాయ్?
గత సీజన్‍లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి కప్పు కొట్టి చరిత్ర సృష్టించింది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న బెంగళూరుపై భారీ అంచనాలే ఉన్నాయ్. అయితే, ఐదుసార్లు ఛాంపియన్లు అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కప్పును ముద్దాడాలనే కసితో ఉన్నాయ్. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 2016 సీన్‌ని రిపీట్ చేయాలని చూస్తోంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా టైటిల్ రేసులో ఉన్నాయ్.
ఈ సీజన్‌లోనూ సిక్సర్ల సునామీతో బౌండరీల బాదుడుతో.. పరుగుల వరద పారించేందుకు అన్ని టీమ్స్‌లోనూ హిట్టర్లు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ మరోసారి పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. గత సీజన్ విజేతగా నిలిచిన జోష్‌తో విరాట్ కోహ్లీ మరోసారి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలవనున్నాడు. టీ20 నెంబర్ వన్ బ్యాటర్, వినూత్న షాట్లతో మైదానం మొత్తాన్ని కవర్ చేసే ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా మరోసారి మెరిసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో దుమ్మురేపిన సంజూ శాంసన్‌పైనే ఇప్పుడు అందరి అటెన్షన్ ఉంది. ఈ లీగ్‌లోనూ అతను స్టేడియం దద్దరిల్లేలా ఆడతాడా? లేదా? అని అంతా వెయిట్ చేస్తున్నారు. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా, బాదడం తప్ప మరో ఆలోచన లేకుండా కనిపించే హెన్రిచ్ క్లాసెన్.. సేమ్ ఫామ్ కంటిన్యూ చేస్తాడని ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక.. రింకూ సింగ్ ఫినిషర్ రోల్‌లో తన పవర్ మరోసారి చూపించే ఛాన్స్ ఉంది. రిషబ్ పంత్.. ఈసారి లక్నో టీమ్ కెప్టెన్ బాధ్యతలతో పాటు బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఐపీఎల్ సీజన్‌లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని టీమ్స్‌లో కెప్టెన్లు, ప్లేయర్లు మారిపోయారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్.. రియాన్ పరాగ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్.. ఈసారి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మెరుపులు చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో.. రోహిత్ శర్మ, బుమ్రా లాంటి స్టార్లతో.. ముంబై ఫుల్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఈ సీజన్.. బ్యాటర్లదే అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఈసారి బౌలర్లు కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. గ్రౌండ్‌లోకి దిగితే ఆటగాళ్లుగా కాకుండా వికెట్ల వేటగాళ్లుగా మారిపోనున్నారు. డెత్ ఓవర్ల కింగ్ బుమ్రా ముంబైకి వెన్నెముకలా నిలవనున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున రషీద్ ఖాన్ మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. గత సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్.. ప్రసిద్ధ్ కృష్ణ.. ఈసారి కూడా ఫేవరెట్‌గా ఉన్నాడు.
ఐపీఎల్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు. అదొక ఎమోషన్. ఈ సీజన్.. క్రికెట్ ప్రపంచంలో ముందెన్నడూ లేని ఉత్కంఠను చూస్తున్నాం. ఓ వైపు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, మరోవైపు దేశంలో 5 అసెంబ్లీల ఎన్నికల హడావుడి నడుమ.. ఐపీఎల్ మనందరినీ ఎలా అలరించబోతోంది? కొత్త కుర్రాళ్లు ఏ రేంజ్‌లో హిట్ అవుతారు? టైటిల్ విన్నర్‌గా నిలవబోయే టీమ్ ఏది? లాంటి అంశాలన్నీ.. ఎంతో ఆసక్తి రేపుతున్నాయ్. ఎందుకంటే.. ప్రతి ఐపీఎల్ సీజన్.. కొత్త హీరోలను పుట్టిస్తుంది. ఈసారి వేలంలో ఫ్రాంచైజీలు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు కూడా కోట్లు కుమ్మరించడం చూశాక.. కుర్రాళ్లు కుమ్మేయడం ఖాయమనే వైబ్స్ కనిపిస్తున్నాయ్.
రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్న యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఈసారి కూడా అవే మెరుపులు మెరిపిస్తాడా? ఫ్యూచర్ సూపర్ స్టార్ అనిపించుకుంటాడా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ అనే కుర్రాళ్లని ఒక్కొక్కరికి 14 కోట్లకు పైగా ఖర్చు చేసి వేలంలో దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్‌లో సిక్సర్ల వాన కురిపించిన కార్తీక్ శర్మ, ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్.. ఈ సీజన్ గేమ్ ఛేంజర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ 5 కోట్లకు పైగా ఖర్చు చేసి మంగేష్ యాదవ్‌ని దక్కించుకుంది. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.
ఈసారి టైటిల్ పోరు చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. ముఖ్యంగా మూడు జట్ల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్‌గా నిలవాలనే కసితో ఉన్నాయ్. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లాంటి దిగ్గజాలతో ముంబై ఫుల్ స్ట్రాంగ్‌గా ఉంది. బుమ్రా, బౌల్ట్ జోడీ ప్రత్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేయడం ఖాయం. ఆర్సీబీ కూడా బ్యాట్ టు బ్యాక్ టైటిల్ కొట్టాలనే ఆలోచనతో ఉంది. హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ గత సీజన్ వైఫల్యాలను అధిగమించి, విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాలని చూస్తోంది.
Also Read: Water Crisis: నిప్పులు చెరుగుతున్న భానుడు.. కంటికి కనిపించని చలివేంద్రాలు
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఐపీఎల్‌పై కొంత నెగటివ్ ఇంపాక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయ్. విమాన ప్రయాణాల్లో ఆటంకాలు, ఇంధన కొరత లాంటి సమస్యలు కనిపిస్తున్నప్పటికీ, బీసీసీఐ ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి, యుద్ధం తాలూకా టెన్షన్ల నుంచి క్రికెట్ ఫ్యాన్స్‌కి.. ఈ ఐపీఎల్ బిగ్ స్ట్రెస్ బస్టర్‌గా మారనుంది. సాయంత్రమైందంటే చాలు, టీవీల ముందు చేరి టెన్షన్లన్నీ మర్చిపోయి అసలు, సిసలైన క్రికెట్ మజాని ఆస్వాదించేందుకు భారతీయులంతా సిద్ధమవుతున్నారు. జియో పొలిటికల్ టెన్షన్స్, యుద్ధాలు దేశాల మధ్య గోడలు కడితే, వాటన్నింటిని దాటుకొని.. ఆటను అభిమానించే వాళ్లందరినీ క్రికెట్ ఏకం చేస్తుంది. ఈ సీజన్ కూడా అదే స్ఫూర్తితో సాగి.. కొన్ని రోజుల పాటు అందరికీ అసలైన వినోదాన్ని, అంతకుమించిన ఆనందాన్ని పంచుతుందని చెబుతున్నారు.
2026 ఐపీఎల్ సీజన్ కేవలం క్రికెట్ మాత్రమే కాదు. మునుపెన్నడూ లేని ఓ మెగా ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలా ఉండబోతోంది. అభిమానులను ఉర్రూతలూగించేందుకు సీజన్ సిద్ధమైంది. గతంలో.. 74 మ్యాచ్‌లు ఉంటే, ఈసారి మ్యాచ్‌ల సంఖ్యని 84కి పెంచారు. దాదాపు రెండు నెలల పాటు ప్రతి రోజూ క్రికెట్ మజా పక్కా అన్నమాట! ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో హై-వోల్టేజ్ గ్యారంటీ. సింపుల్‌గా చెప్పాలంటే.. యుద్ధం టెన్షన్లు, రాజకీయ వేడిని మర్చిపోయేలా సాయంత్రం వేళ అరుపులు, కేకలు, సిక్సర్ల మోతతో ఈ ఐపీఎల్ మనందరినీ.. మరో ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. కుర్ర ప్లేయర్ల మెరుపులు, సీనియర్ల సొగసైన ఆట, నరాలు తెగేంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో.. ఐపీఎల్ 2026 క్రికెట్ అభిమానులందరినీ అలరించడానికి సిద్ధమైంది. మార్చి 28న బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో మెగా ఎంటర్‌టైన్‌మెంట్ మొదలవుతుంది.
Storey By: Anup Big Tv
Also Read: PNG Connection Mandatory: గ్యాస్ వినియోగదారులకు షాక్.. వారికి ఎల్‌పీజీ కట్.. కేంద్రం కొత్త ఆర్డర్!