China Vs America Tariffs: ట్రంప్ టారిఫ్‌లు ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తే.. డ్రాగన్ కంట్రీ ట్రంప్‌కే షాక్ ఇచ్చింది. పరస్పర సుంకాలతో అమెరికా-చైనాల మధ్య టారిఫ్ వార్ ప్రస్తుతం పీక్స్‌కి వెళ్లింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే లెవల్లో ఇరు దేశాల అధ్యక్షులూ ఏ మాత్రం తగ్గట్లేదు. సై అంటే సై అంటూ… సుంకాల పేరుతో స్టాక్ మార్కెట్లకు చెమటలు పుట్టిస్తున్నారు. ప్రపంచ సరఫరా గొలుసు గాడి తప్పుతోందని నిపుణులంతా గగ్గోలు పెడుతున్నా… సుంకాల సమరం మాత్రం ఆగట్లేదు. తాజాగా, అమెరికాకు కీలకమైన రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతులను చైనా బంద్ చేసింది. బోయింగ్ విమానాల ఇంజన్లు, విడిభాగాల దిగుమతులు, కొత్త ఆర్డర్లను కూడా క్లోజ్ చేసింది. ఇంతకీ, చైనా ఇంకేం చేయబోతుంది..? చైనా చర్యలకు అమెరికా కౌంటర్ ఏంటీ..? ఈ పరిణామం దేనికి దారితీస్తుంది..?
అమెరికా-చైనాల మధ్య తీవ్రమైన వాణిజ్య పోరు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ డ్రాగన్ కంట్రీని తట్టి లేపినట్లయ్యింది. రెండు దేశాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రతీకార చర్యలు ఇప్పుడు భగ్గుమన్నాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య పోరు ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. ట్రంప్ టారిఫ్ వార్‌లో చైనా అస్త్రాలను సంధించడం మొదలు పెట్టింది. ప్రారంభం నుండీ దశలవారిగా చైనాపై సుంకాల రేట్లను పెంచుతూ వచ్చిన అమెరికాకు ఇప్పుడు డ్రాగన్ కంట్రీ భారీ షాక్ ఇచ్చింది.
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత లోహాలు…
అమెరికాలో పలు కీలక వస్తువల తయారీకి అవసరమయ్యే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత లోహాలు, అయస్కాంతాల ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు సహా అనేక కీలక రంగాలకు అత్యవసరమైన ఈ ముడిసరుకుల సరఫరాను ఆపేసింది. అయితే, ఇలాంటి ఖనిజాల ఎగుమతులను నియంత్రించడం ద్వారా పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఇరుకున పెట్టేందుకు బీజింగ్ సరికొత్త వ్యూహం పన్నింది.
కార్ల నుంచి క్షిపణుల వరకు అనేక ఉత్పత్తుల తయారీకి..
ఎగుమతుల కోసం చైనా ప్రభుత్వం సరికొత్త నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానాలు ఖరారయ్యే వరకు, కార్ల నుంచి క్షిపణుల వరకు అనేక ఉత్పత్తుల తయారీకి అత్యవసరమైన అయస్కాంతాల రవాణాను పలు ఓడరేవుల్లో చైనా నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే, అమెరికా సైనిక కాంట్రాక్టర్లతో సహా కొన్ని నిర్దిష్ట కంపెనీలకు ఈ కీలక పదార్థాల సరఫరా శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ప్రపంచంలోని రేర్ ఎర్త్స్ ఉత్పత్తిలో 90 శాతం చైనాలోనే
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా ఉత్పత్తులపై సుంకాలు భారీగా పెంచిన నేపథ్యంలో ప్రతీకారంగా చైనా ఈ ఆంక్షలను విధించింది. ప్రపంచంలోని రేర్ ఎర్త్స్ ఉత్పత్తిలో దాదాపు 90 శాతం చైనాలోనే జరుగుతోంది. రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో ఉపయోగించే సమేరియం, టెర్బియం, లుటేషియం, స్కాండియం, యట్రియం, గాడోలినియం, డిస్ప్రోసియం వంటి ఏడు కీలకమైన మీడియం, హెవీ రేర్ ఎర్త్స్‌లను ఎగుమతుల నియంత్రణ జాబితాలో చేర్చింది చైనా. ఇవి F-35 జెట్లు, మిసైళ్లు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు వంటి అధునాతన సాంకేతికతల తయారీలో కీలకమైనవి.
ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోట్లు, క్షిపణులు, స్మార్ట్‌ఫోన్లు..
అయితే, అమెరికా వద్ద కొంతమేరకు రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నప్పటికీ… అవి సరిపోవు. అందుకే, దీర్ఘకాల సరఫరా కోసం చైనాపై ఆధారపడుతోంది. టెస్లా, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా చైనా రేర్ ఎర్త్స్‌పై ఆధారపడుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోట్లు, క్షిపణులు, స్మార్ట్‌ఫోన్లు, AI సర్వర్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి గుండెకాయ వంటి కీలక భాగాల తయారీలో ఈ ఖనిజ లోహాలు అత్యంత ఆవశ్యకంగా ఉన్నాయి. అయితే, వీటి ఎగుమతులను ఆపేసిన చైనా తాజా చర్యతో… ప్రపంచ సప్లై చైన్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
అమెరికాలోని లాక్ హీడ్ మార్టిన్, టెస్లా, యాపిల్ వంటి కంపెనీలు..
ఇది ప్రపంచంలో వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ప్రపంచ రేర్ ఎర్త్ ఉత్పత్తిలో ఆధిపత్యం చెలాయిస్తోంది. దాదాపు 60% నుండి 70% సరఫరాను చైనా ఒక్కటే నియంత్రిస్తుంది. కాగా, ఇలా ఎగుమతి నిషేధం వల్ల అమెరికాలోని లాక్‌హీడ్ మార్టిన్, టెస్లా, యాపిల్ వంటి కంపెనీలు… అలాగే రక్షణ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.
అమెరికా కంపెనీల నుంచి విమాన సంబంధిత భాగాలు..
అయితే, చైనా ప్రతీకారం ఇంతటితో ఆగలేదు… చైనా ప్రభుత్వం తన స్వదేశీ విమానయాన సంస్థలకు అమెరికాకు చెందిన బోయింగ్ జెట్ విమానాల డెలివరీలను స్వీకరించవద్దని, అమెరికా కంపెనీల నుంచి విమాన సంబంధిత భాగాలు, సామగ్రి కొనుగోలు చేయవద్దని ఆదేశించింది. ఈ చర్య అమెరికా-చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధాన్ని మరింత పీక్స్‌కు తీసుకెళ్లనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… చైనా దిగుమతులపై 145% వరకు టారిఫ్‌లు విధించిన తర్వాత… దానికి ప్రతీకారంగా చైనా అమెరికా ఉత్పత్తులపై 125% సుంకాలు విధించింది. కాగా… ఈ టారిఫ్‌లు బోయింగ్ విమానాలు, విడి భాగాల ధరలను రెట్టింపు చేస్తాయి.
2025-2027 మధ్య ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్..
దీంతో చైనా విమానయాన సంస్థలకు ఈ డెలివరీలు ఆర్థికంగా భారమవుతాయనే అభిప్రాయాలు ఉన్నాయి. చైనా తాజా నిర్ణయం బోయింగ్‌పై కూడా ప్రభావం చూపనుంది. చైనా బోయింగ్‌కు కీలకమైన మార్కెట్. గతంలో దాని డెలివరీల్లో 25% చైనాకు వెళ్లేవి. ప్రస్తుతం చైనా ఎయిర్‌లైన్స్ 2025-2027 మధ్య ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్, చైనా సదరన్ సంస్థలకు 130 బోయింగ్ విమానాల డెలివరీలు షెడ్యూల్ అయ్యాయి. అయితే, చైనా తాజా ఆదేశాలతో ఈ డెలివరీలు నిలిచిపోయే అవకాశం ఉంది.
చైనా C919 ప్రోగ్రామ్‌కి ఆటంకం కలిగే అవకాశం
కాగా, ఈ నిర్ణయం తర్వాత అమెరికా నుండి అపేసిన దిగుమతులకు బదులుగా… చైనా ఎయిర్‌లైన్స్‌ను ఐరోపాకు సంబంధించిన ఎయిర్‌బస్, స్వదేశీ తయారీదారు COMAC వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఎయిర్‌బస్‌కు చైనా డిమాండ్‌ను పూర్తిగా తీర్చే సామర్థ్యం లేకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే, చైనా తీసుకున్న నిర్ణయం, బోయింగ్ కంపెనీకి తక్షణ నష్టం కలిగించినప్పటికీ, దీర్ఘకాలంలో చైనాకు కూడా సవాళ్లు తప్పవనే సంకేతాలు ఉన్నాయి. ఉదాహరణకు, అమెరికా నుండి దిగుమతి అయ్యే విడిభాగాలపై నిషేధం విధించడం వల్ల… చైనా C919 ప్రోగ్రామ్‌కి ఆటంకం కలిగే అవకాశాం ఉంది. ఎందుకంటే, ఈ విమానాలు కొన్ని అమెరికా-తయారీ విడిభాగాలపై ఆధారపడతాయి.
Also Read: బండి VS కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. గొడవ ఇదేనా?
బోయింగ్‌తో పాటు గ్లోబల్ ఏవియేషన్ పరిశ్రమపై ప్రభావం
ప్రస్తుతం అయితే, బోయింగ్ విమానాలను లీజుకు తీసుకున్న ఎయిర్‌లైన్స్‌కు చైనా ఆర్థిక సహాయం అందించే దిశగా ఆలోచిస్తోంది. దీంతో, టారిఫ్‌ల వల్ల పెరిగే ఎయిర్‌లైన్స్ ఖర్చుల భారాన్ని తగ్గించే ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ చర్యలు రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇది బోయింగ్‌తో పాటు గ్లోబల్ ఏవియేషన్ పరిశ్రమపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారత్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి..
ఇక, చైనా చర్యలకు కౌంటర్‌గా… అమెరికా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి స్వదేశీ ఉత్పత్తిని పెంచడంతో పాటు… భారత్, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల నుంచి దిగుమతులపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇటీవల ఇండియా కూడా రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్‌లో పెట్టుబడులను పెంచుతోంది. కాబట్టి, ఇది భవిష్యత్తులో అమెరికాకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ… చైనా ప్రకటించిన నిషేధం వల్ల గ్లోబల్ సప్లై చైన్‌లపై, ముఖ్యంగా, సాంకేతిక, రక్షణ రంగాలపై గణనీయమైన ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. …స్పాట్….