Karimnagar Politics: కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఆ ఇద్దరు నాయకుల తీరు బండి సంజయ్‌కు అసహనం తెప్పిస్తోందా? మిగతా వారు కలిసి నడుస్తుంటే, ఆ ఇద్దరు మాత్రం కేంద్ర సహాయ మంత్రితో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్నారా? అసలు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో నివురు గప్పిన నిప్పులా మారిన ఈ పంచాయతీ ఏంటి? లోకల్ ఎంపీతో అంతలా విభేదిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు? అసలు ఎంపీ, ఎంపీల మధ్య అంత గ్యాప్ ఎందుకొచ్చింది?
కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్‌కు నలుగురు ఎమ్మెల్యేలు
కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో రాజకీయాలు ఇప్పుడు కాస్త భిన్నంగా, రంజుగా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల మధ్య నిప్పులు రాజుకుంటున్నాయి. అయితే, ఈ పరిస్థితి అన్ని చోట్లా కాదు… పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమేనట. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మిగిలిన నాలుగు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది.
మానుకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేల సత్యనారామణ, మేడిపల్లి సత్యం
మానకొండూర్‌లో కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండిలో మేడిపల్లి సత్యం, హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్, వేములవాడలో ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక అక్కడి నుంచి ఎంపీగా ఉన్న బండి సంజయ్, ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉంటూ, నియోజకవర్గంలో కేంద్ర నిధులతో అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో వేగం పెంచుతున్నారు. ఆ క్రమంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర నిధులతో చేసే పనులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహకరిస్తుండగా, మరికొన్ని చోట్ల సహకరించడం లేదని బండి సంజయ్ అసహనంగా ఉన్నారట
బండితో కలిసి శంకుస్థాపనల్లో పాల్గొంటున్న మేడిపల్లి, కవ్వంపల్లి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో రోడ్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం బండి సంజయ్‌తో కలిసి శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు. కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, అభివృద్ది విషయంలో బండి సంజయ్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఆది శ్రీనివాస్, పొన్నంలపై అసహనంతో ఉన్న బండి సంజయ్
అయితే, ప్రభుత్వ విప్‌గా ఉన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం బండి సంజయ్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కలిసిరావడం పక్కన పెడితే.., అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయకుండా అడ్డుకుంటున్నారని బండి సంజయ్ వారిపై అసంతృప్తితో ఉన్నారంటున్నారు.
ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చాలని చూస్తున్న బీజేపీ
ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోందట బిజేపీ.. ప్రజా అవసరాల కోసం చేసే పనుల్లో ఒకే పార్టీ ఎమ్మెల్యేలు ఒక చోట సహకరిస్తూ, మరో చోట సహకరించకపోవడాన్ని.. ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చాలని చూస్తోందంట. ఆది శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్ తీరు వల్ల వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు సాఫీగా సాగడం లేదని కాషాయ క్యాడర్‌తో చెబుతున్నారంట బండి సంజయ్. వారి వైఖరి అలాగే కొనసాగితే, తాను నేరుగా ఆ నియోజకవర్గాల్లోకి వెళ్లి పనులు ప్రారంభించేందుకు సిద్ధమని సన్నిహితుల వద్ద స్పష్టం చేశారంట.
Also Read: లంక అడవుల్లో అడవి ఆవుల భయం
ఎంపీ సంజయ్‌తో సమన్వయం పాటించని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
నిజానికి, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా నాటి ఎమ్మెల్యేలు, అప్పట్లో ఎంపీగా ఉన్న బండి సంజయ్ మధ్య పెద్దగా సమన్వయం ఉండేది కాదంట. అయితే ఇప్పుడు రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరంటూ కాంగ్రెస్‌లోని ఇద్దరు ఎమ్మెల్యేలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కానీ, మిగతా ఇద్దరిని రాజకీయ వైరుధ్యాలే నడిపిస్తున్నాయా అనే చర్చ జరుగుతోంది. ఈ పంచాయతీ ఎక్కడి వరకు వెళుతుందో కానీ రాజకీయాలు ఎలా ఉన్నా, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో గ్యాప్ ఏంటని ప్రజలు పెదవి విరుస్తున్నారు.