Marathi Raj Thackeray| మహారాష్ట్రలో భాషా రాజకీయం రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. మఖ్యంగా ప్రతిపక్ష పార్టీలైన నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్), ఉద్ధవ్ ఠాక్రే శివ సేన పార్టీల కార్యకర్తలు రాజధాని ముంబైలో నివసించే స్థానికేతరులపై, చిరువ్యాపారులపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మహారాష్ట్రలో మరాఠీ భాష మాట్లాడని వారిపై తన ఆగ్రహాన్ని మరింత తీవ్రం చేశారు. మరాఠీ భాష అర్థం కాదని చెప్పేవారికి చెంప దెబ్బ కొట్టాలని హెచ్చరించారు.
ముంబైలోని మీరా-భయందర్ ప్రాంతంలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. “మీ చెవిలో మరాఠీ మాట్లాడినా అర్థం కాకపోతే, చెంప మీద గట్టిగా ఒకటిస్తాం. కొందరు ఏ విషయానికైనా గొడవ చేస్తారు,” అని అన్నారు. కొన్ని రోజుల క్రితం ఒక షాపు యజమాని మరాఠీ మాట్లాడలేదని కారణంగా ఎంఎన్ఎస్ కార్యకర్తలు అతనిపై దాడి చేసిన సంఘటన గురించి కూడా ఆయన సభలో ప్రస్తావించారు.
ఆ సంఘటనను గుర్తు చేస్తూ, షాపు యజమానిపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ స్థానిక వ్యాపారులు చేసిన నిరసనలను ఎద్దేవా చేశారు. “ఆ షాపు యజమానిపై దాడి జరిగిందంటే అది అతని వైఖరి వల్లే. కానీ అకారణంగా ఇతర వ్యాపారులు దుకాణాలు మూసివేయాలని పిలుపునిచ్చారు. ఆ ఒత్తిడితో దుకాణాలు మూసేస్తే, ఎంతకాలం మూసి ఉంచగలరు? మేము కొనడం ఆపేస్తే, మీ దుకాణాలు ఏమవుతాయి?” అని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. “మీరంతా ఇక్కడికి వచ్చారు, నిశ్శబ్దంగా మీ పని చేసుకోండి. అలా కాదని, ఇక్కడ గొడవలు చేస్తే, చెంపదెబ్బ తప్పదు,” అని హెచ్చరించారు. రాజ్ ఠాక్రే తాను ఏ భాషకూ వ్యతిరేకం కాదని, కానీ బలవంతంగా ఏదీ సహించబోమని చెప్పారు. “నేను ఏ భాషనూ వ్యతిరేకించను. కానీ, ఇక్కడ ఎవరైనా బలవంతం చేస్తే, అది సహించేది లేదు,” అని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మరాఠీ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, దాన్ని అవమానించే వారిని ఉపేక్షించబోమని ఆయన తేల్చిచెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను ఉద్దేశించి.. రాజ్ ఠాక్రే మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తే, ఆ స్కూళ్లను తమ పార్టీ కార్యకర్తలు మూసివేస్తారని హెచ్చరించారు.
ఈ నెల ప్రారంభంలో.. మహారాష్ట్రలో బిజేపీ కూటమి ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ రెండు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎంఎన్ఎస్, శివసేన (యూబీటీ) వంటి పలు సంస్థలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
Also Read: కర్ణాటక సిఎం చనిపోయారా? మెటా కంపెనీ బ్లండర్‌పై మండిపడ్డ సిద్దరామయ్య
రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు రాష్ట్రంలో మరోసారి వివాదానికి దారితీశాయి. మరాఠీ భాష, సంస్కృతిని కాపాడుకోవాలనే ఆయన వాదన ఒకవైపు మద్దతు పొందుతుండగా, ఆయన హెచ్చరికలు, దాడులు మాత్రం విమర్శలకు గురవుతున్నాయి. ఈ వివాదం మహారాష్ట్ర రాజకీయాల్లో, సమాజంలో మరింత చర్చనీయాంశంగా మారింది.