IPL Cricket: రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌ని సేల్‌కి పెట్టారు.. రాజస్థాన్ రాయల్స్‌లో వాటా అమ్మేస్తున్నారు.. బీసీసీఐ కూడా వెయ్యి మందికి పైగా ప్లేయర్ల పేర్లని ఐపీఎల్ వేలం నుంచి తొలగించేసింది. అసలేం జరుగుతోంది? ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఎందుకు పడిపోతోంది? ఫ్రాంచైజీలు.. తమ టీమ్స్‌ని ఎందుకు అమ్మేయాలనుకుంటున్నాయ్? ఇంత క్రేజీ ఫార్మాట్‌లో.. ఇన్నేళ్ల తర్వాత ఎక్కడ తేడా కొట్టింది?
వచ్చే వారమే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా ఆక్షన్ మొదలవనుంది. అయితే.. ఈసారి ఏ ప్లేయర్, ఏ టీమ్‌లోకి వెళతాడు, ఎలాంటి మార్పులు కనిపించబోతున్నాయ్? ఫ్రాంచైజీలు ఎవరెవరిని అట్టిపెట్టుకుంటాయ్? అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో కొనసాగుతుంది. అయితే.. అంతకంటే ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. ఈసారి కొత్త జట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయ్. పాపులర్ ఫ్రాంచైజీలు.. చేతులు మారనున్నాయ్. అసలు.. ఐపీఎల్ స్వరూపమే మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. జరుగుతున్న పరిణామాలు, కనిపిస్తున్న పరిస్థితులు అలా ఉన్నాయ్. ఐపీఎల్ 2026 సీజన్‌కి ముందే.. ఈ నెలలో మెగా ఆక్షన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. 350 మంది ప్లేయర్లు.. వేలంలోని రానున్నారు. ఇప్పటికే.. ఆక్షన్ కోసం నమోదు చేసుకున్న ప్లేయర్ల జాబితా నుంచి బీసీసీఐ.. ఎవరూ ఊహించని విధంగా 1005 మంది పేర్లను తొలగించింది. అదేవిధంగా.. 35 మంది కొత్త ప్లేయర్ల పేర్లను వేలంలోకి చేర్చింది.
350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్.. డిసెంబర్ 16న.. అబుదాబీలో జరగనుంది. ఈ మేరకు.. బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు మెయిల్స్ కూడా పంపింది. మొదటగా బిడ్డింగ్ ప్రాసెస్.. బ్యాట్స్‌మెన్లు, ఆల్ రౌండర్లు, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా.. క్యాప్డ్ ప్లేయర్లతో మొదలవుతుంది. తర్వాత.. అన్‌క్యాప్ట్ ఆటగాళ్ల వేలం మొదలవుతుంది. ఈ 350 మంది ప్లేయర్లలో.. ఎవరు ఏ టీమ్‌లోకి వెళ్తారు.. ఏ జట్టు నుంచి.. ఏ ఫ్రాంచైజీకి షిప్ట్ అవుతారనే దానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కొన్ని ఫ్రాంచైజీలు కొత్తగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే.. ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అమ్మకానికి పెట్టిన న్యూస్ క్రికెట్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కూడా చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టీమ్స్‌ని దక్కించుకునేందుకు.. నలుగురైదుగురు బయ్యర్లు రేసులో ఉన్నారు. వారిలో.. ఈ ఫ్రాంచైజీలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తిగా మారింది. పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, అమెరికా సహా.. కొత్త ఓనర్లు ఎక్కడి నుంచి వస్తారన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం.. రాజస్థాన్ రాయల్స్ టీమ్.. రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ చేతుల్లో ఉంది. ఈ కంపెనీకి.. ఫ్రాంచైజీలో 65 శాతం వాటా ఉంది. దాంతో.. రాజస్థాన్ రాయల్స్ మెజారిటీ వాటా అమ్మాలని చూస్తోంది. తమ టీమ్ విలువ.. బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్.. తమ టీమ్‌లో వాటా అమ్మడానికి ప్రధాన కారణం.. ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ విపరీతంగా పెరగడమే. ఈ అధిక విలువని నగుదు రూపంలోకి మార్చుకోవాలని.. ఇప్పుడున్న ఓనర్లు భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ బదాలే నేతృత్వంలోని ఓనర్లంతా.. తమ మెజారిటీ వాటాని గానీ, పూర్తిగా ఫ్రాంచైజీని అమ్మడానికి గానూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. గేమింగ్ దిగ్గజం క్రాఫ్టన్ ఇండియా, అదానీ గ్రూప్ లాంటి పెద్ద కంపెనీలతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. ఇటీవలే.. ఆర్సీబీ ఓనర్ అయిన డియాజియో కంపెనీ కూడా.. ఫ్రాంచైజీ సేల్ ప్రాసెస్‌ని మొదలుపెట్టింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నామని.. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆ సంస్థ తెలిపింది.
అయితే.. లేటెస్ట్ డేటా ప్రకారం.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఈ ఏడాది 20 శాతం తగ్గింది. గతేడాది 12 బిలియన్ డాలర్లుగా ఉన్న ఐపీఎల్ వాల్యూ.. ఇప్పుడు 9.6 బిలియన్లకు చేరింది. దేశంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మెగా వేలం చుట్టూ ఉన్న అనిశ్చితుల కారణంగానే.. ఐపీఎల్ విలువ కోల్పోయిందనే చర్చ జరుగుతోంది. భారత్-పాక్ వివాదం, భద్రతా సమస్యల కారణంగా.. ఈ ఏడాది వారం పాటు ఐపీఎల్‌ని నిలిపేయాల్సి వచ్చింది. కోవిడ్ మహమ్మారి బారిన పడిన 2020 సీజన్ కాకుండా.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ భారీగా పడిపోయిన ఏకైక సంవత్సరం ఇదే. ఇప్పటికే.. లీగా వాల్యుయేషన్‌లో.. రెండేళ్లు క్షీణించింది. ఓ రిపోర్ట్ ప్రకారం.. 2023లో.. ఐపీఎల్ వాల్యూ 92 వేల 500 కోట్లుగా ఉంది. అదే.. 2024కి వచ్చేసరికి.. 82 వేల 700 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది.. ఐపీఎల్ వాల్యూ మరింత పడిపోయింది. ఇప్పుడు.. ఐపీఎల్ విలువ కేవలం 76 వేల 100 కోట్లుగా ఉంది. రియల్ మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లపై ప్రభుత్వం విధించిన నిషేధం వల్లే.. ఐపీఎల్ గ్రోత్ తగ్గేందుకు కారణమైందని చెబుతున్నారు.
ఒక్క.. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ మాత్రమే పెరిగింది. ముంబై ఇండియన్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా.. 108 మిలియన్ డాలర్లతో తమ స్థానాన్ని నిలుపుకుంది. అయినప్పటికీ.. ఎంఐ టీమ్ బ్రాండ్ వాల్యూ కూడా 9 శాతం తగ్గింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సీజన్‌లో తమ తొలి టైటిల్ సాధించినప్పటికీ.. 10 శాతం వాల్యూ తగ్గిపోయింది. ప్రస్తుతం.. 105 మిలియన్ డాలర్ల వాల్యూతో.. రెండో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ కూడా 24 శాతం తగ్గి.. 93 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 33% తగ్గి 73 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది.. ఎంతో కొంత వృద్ధిని నమోదు చేసిన ఏకైక ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ మాత్రమే. ఆ టీమ్ బ్రాండ్ విలువ 2% పెరిగి 70 మిలియన్ డాలర్లకు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ 3 శాతం, లక్నో టీమ్ 2 శాతం, ఢిల్లీ క్యాపిటల్స్ 26 శాతం, సన్‌రైజర్స్ హైదరాబాద్ 34 శాతం, రాజస్థాన్ రాయల్స్ వాల్యుయేషన్ 35% పడిపోవడంతో 53 మిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇది.. ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కానే కాదు. 2023 నుంచే.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పడిపోతూ వస్తోంది. గత రెండేళ్లుగా అది మరింత క్షీణిస్తోంది. ఇందుకు.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు మెగా వేలం చుట్టూ ఉన్న అనిశ్చితి కూడా కారణంగా కనిపిస్తోంది. వాటి ఫలితంగానే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇవి కాక.. ఈ క్రేజీ ఫార్మాట్ డౌన్‌ఫాల్‌కు మరిన్ని కారణాలున్నాయ్. మరి.. ఐపీఎల్‌కి పూర్వ వైభవం తెచ్చేందుకు.. బీసీసీఐ ఏం చేయబోతోంది?
ప్రపంచ క్రికెట్ అటెన్షన్‌ని గ్రాబ్ చేసిన.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎకోసిస్టమ్ విలువ దారుణంగా పడిపోవడం ఇప్పడు క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఈ ఏడాది జరిగిన సీజన్.. దిద్దుబాటు కాలంగా కనిపిస్తోంది. ఈ లీగ్ తిరిగి పుంజుకునేలా.. లాంగ్ టర్మ్ బ్రాండ్ వాల్యూని బలోపేతం చేసే దిశగా పయనిస్తోంది. ఏటా సుమారు వంద రోజుల పాటు జరిగే ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఒక్క భారత్‌లోనే 15 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించిందని రిపోర్టులు చెబుతున్నాయ్. అలాంటి లీగ్ బ్రాండా వాల్యూ పడిపోవడంపైనే ఇప్పుడు చర్చంతా నడుస్తోంది. ఐపీఎల్ అంటే.. కేవలం ఓ క్రికెట్ టోర్నమెంట్ కాదు. భారతదేశంలో ఓ గేమింగ్ కల్చర్. ప్రపంచ క్రీడా ఆర్థిక వ్యవస్థలో.. కీలకమైన శక్తి. అయితే.. 2023 నుంచి ఈ మెగా ఈవెంట్ బ్రాండ్ వాల్యూ క్షీణిస్తోందనే రిపోర్టులు ఆందోళన కలిగిస్తున్నాయ్. ఈ డౌన్ ఫాల్‌కు అనేక కారణాలున్నాయ్. ప్రధానంగా స్పాన్సర్‌షిప్, పెట్టుబడుల విషయంలో.. అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల నిర్ణయాలపై అనిశ్చితి నెలకొంది. ఇక.. ప్రతి మూడు, నాలుగేళ్లకోసారి జరిగే మెగా వేలం.. జట్టు కూర్పులపై భారీ మార్పులు తెస్తుంది. దీనివల్ల.. ఫ్రాంచైజీల దీర్ఘకాలిక వ్యూహాలు దెబ్బతిని.. అభిమానులకు ఇష్టమైన ఆటగాళ్లు.. తమ పాత టీమ్‌లని విడిచి వెళ్లాల్సి వస్తోంది. ఇది.. టీమ్‌తో అభిమానులకు ఉన్న ఎమోషనల్ కనెక్షన్‌ని తగ్గిస్తోంది.
ఇక.. కొన్ని లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు.. వన్ సైడ్‌గా ఉండటం, ఏమాత్రం పోటీ లేకుండా మారుతుండటం కూడా క్రికెట్ అభిమానుల్లో.. ఐపీఎల్ మ్యాచులపై ఆసక్తి తగ్గుతోంది. ఇంటర్నేషనల్ ఆటగాళ్ల పనిభారం కారణంగా.. కొందరు మెయిన్ ప్లేయర్లు టోర్నీ మధ్యలోనే వెళ్లిపోవడం, రెస్ట్ తీసుకోవడం వల్ల.. మ్యాచ్‌ల్లో క్వాలిటీ తగ్గుతోంది. పైగా.. అనేక కొత్త టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయ్. ఐపీఎల్ ఆటగాళ్లను, స్పాన్సర్లను ఆకర్షిస్తున్నాయ్. దాంతో.. ఐపీఎల్‌పై ఇంట్రస్ట్ తగ్గుతూ వస్తోంది. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూని పెంచడానికి.. దాని స్థానాన్ని పటిష్టం చేయడానికి బీసీసీఐ కీలక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది. ఐపీఎల్ పూర్వ వైభవం తెచ్చే దిశగా బీసీసీఐ ఫోకస్ పెట్టాల్సిన కీలకమైన అశం.. మెగా వేలం. ప్రతి మెగా వేలంలో ఫ్రాంచైజీలు నిలుపుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలి. లీగ్ స్టేజ్ మ్యాచ్‌ల్లో బ్యాటింగ్-బౌలింగ్ మధ్య సమతుల్యతను అందించే అధఇక నాణ్యత గల పిచ్‌లని నిర్వహించేలా ఫ్రాంచైజీలను ప్రోత్సహించాలి. విదేశీ ప్లేయర్లు లీగ్ మధ్యలో వారి దేశానికి వెళ్లాల్సి వస్తే.. ఆ ఫ్రాంచైజీలు వారి స్థానంలో స్టార్ ప్లేయర్లను ఆటగాళ్లను త్వరగా తీసుకునేలా రూల్స్ సడలించాలి.
ఇక.. ఐపీఎల్ గ్లోబల్ రీచ్‌ని పెంచేలా బీసీసీఐ చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో జట్ల సంఖ్యని కూడా పెంచే ప్రణాళికలను కూడా స్పష్టం చేయాలి. దీని ద్వారా మరిన్ని ప్రాంతీయ మార్కెట్లు, స్పాన్సర్‌లు, ఆదాయ వనరులు పెరుగుతాయ్. ప్రధాన స్పాన్సర్‌షిప్‌ల విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ.. లోకల్ స్పాన్సర్‌షిప్ ప్యాకేజీలను అందించాలి. అభిమానులు ఎక్కువగా ఇష్టపడే మ్యాచ్‌ల టైమింగ్స్, ప్రసార భాషలు, కంటెంటా ఫార్మాట్‌లని విశ్లేషించి.. అందుకు అనుగుణంగా ప్రసార ప్రణాళికలను మార్చాలి. క్రికెట్ ప్రపంచంలో.. అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌గా.. ఐపీఎల్ తన స్థానాన్ని నిలుపుకోవాలంటే.. బీసీసీఐ తక్షణ ఆదాయంపై కాకుండా.. దీర్ఘకాలిక బ్రాండ్ వాల్యూపై దృష్టిసారించాలి. మెగా వేలం చుట్టూ ఉన్న అనిశ్చితిని తగ్గించడంతో పాటు అభిమానుల అనుబంధాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రపంచ క్రికెట్ క్యాలెండర్‌లో తన స్థానాన్ని వ్యూహాత్మకంగా పటిష్టం చేసుకోవడం ద్వారా మాత్రమే ఐపీఎల్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతుంది. మరింత బలమైన గ్లోబల్ క్రీడా శక్తిగా ఎదుగుతుంది.
Story By Anup, Big Tv