BigTV English

Iran-Israel Conflict: రంగంలోకి అగ్ర దేశాలు.. వరల్డ్ వార్ 3 పక్కా..?

Iran-Israel Conflict: రంగంలోకి అగ్ర దేశాలు.. వరల్డ్ వార్ 3 పక్కా..?

Iran-Israel Conflict: యుద్ధం మొదలైంది. ఇప్పటికే ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య రగులుతున్న కార్చిచ్చులో అమెరికా చేసిన దాడులు మరింత ఆజ్యం పోశాయి. దీంతో మిడిల్‌ ఈస్ట్‌లో డేంజర్ బెల్స్‌ మోగుతున్నాయి. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్.. ఎవరూ తగ్గేదేలే అని స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంతకీ అమెరికా చేసిన దాడులు యుద్ధం అంతానికా? ఆరంభానికా?


మిడిల్ ఈస్ట్‌లో అమెరికా మంటలు

ఇరాన్‌ అణు స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం


న్యూక్లియర్ సెంటర్లే టార్గెట్‌గా దాడులు

ఈ దాడులతో ట్రంప్ ఇచ్చిన సందేశమేంటి?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌ న్యూక్లియర్ సెంటర్లపై దాడులు చేసింది. అమెరికా ఇలాంటి సాహసం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అమెరికా చేసిన ఈ సర్‌ప్రైజ్‌ అటాక్‌తో ఇరాన్‌కే కాదు.. ప్రపంచ దేశాలకు షాక్‌ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

ఫోర్దో, నతాంజ్ ఇస్ఫాహాన్ అణుకేంద్రాలపై దాడులు

ఫోర్దో, నతాంజ్, ఇస్ఫాహన్.. ఇరాన్‌లోని అత్యంత ముఖ్యమైన అణుస్థావరాలు. వీటిపైనే దాడులు చేసింది అమెరికా. వీటి కోసం బీ-2 స్టెల్త్ బాంబర్లను వాడింది. గ్వామ్ ద్వీపం నుంచి వచ్చి ఈ బాంబర్లు దాడులు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ దాడుల్లో అమెరికన్ సబ్‌మెరైన్లు కూడా ఉపయోగించినట్టు సమాచారం. 30 తోమహాక్ క్షిపణులను ఈ సబ్‌మెరైన్ల నుంచి ప్రయోగించినట్టు తెలుస్తోంది.

ఇజ్రాయెల్ వద్ద లేని దాడి చేసే సత్తా

నిజానికి ఏ అణుకేంద్రం ఎక్కడ ఉంది? అందులో ఏం జరుగుతోంది? అనే విషయాన్ని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌కు తెలుసు. కానీ వాటిపై దాడి చేసే సత్తా ఇజ్రాయెల్ వద్ద లేదు. ఎందుకంటే ఇవి భూమికి చాలా లోపల నిర్మించారు. వాటిని చేధించగల బంకర్ బస్టర్‌ బాంబులు ఇజ్రాయెల్ వద్ద లేవు. అందుకే అమెరికా దాడులు చేయాలని కోరుతూ వచ్చింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఆ మాటను నిజం చేసింది అమెరికా.

ఒక్కొటి 13 వేల నుంచి 15 వేల కిలోల బరువు

జీబీయూ-57.. ఇవే ఇప్పుడు అమెరికా ఉపయోగించిన బాంబులు. ఒక్కోటి 13 వేల నుంచి 15 వేల కిలోల బరువు.. 20 అడుగుల పొడుగు ఉండే ఈ బాంబులను శత్రు దేశాల రాడార్లకు చిక్కక్కుండా తరలించాంటే బీ-2 స్టెల్త్ విమానాలకు మాత్రమే సాధ్యం. ఈ బాంబులు కొండలనైనా చీల్చుకుంటూ 61 మీటర్ల వరకు చొచ్చుకుపోయి అక్కడ పేలతాయి. 13 టన్నులకు పైగా బరువుంటే ఈ బాంబులో.. కేవలం 2 టన్నుల పేలుడు పదార్థాలే ఉంటాయి. మీగతాది మొత్తం కేసింగే. అంతేకాదు ఈ బాంబులను శత్రు దేశాలపై ప్రయోగించడం అమెరికాకు ఇదే తొలిసారి కావడం విశేషం.

300 అడుగుల లోతులో ఫోర్దో అణుకేంద్రం

నిజానికి ఇరాన్‌లోని ఫోర్దో అణుకేంద్రం పర్వతం కింద నిర్మించారు. 300 అడుగుల లోతులో ఈ నిర్మాణం ఉంది. అక్కడి నుంచి ఇంకెంత లోతులో యురేనియాన్ని శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్‌ల హాల్ ఉందో ప్రపంచానికి తెలియదు. అందుకే ఈ దాడికి కేవలం రెండు జీబీయూ-57 బాంబులు సరిపోతాయని అంచనా వేశారు. కానీ ఏకంగా ఆరు బాంబులను ప్రయోగించినట్టు తెలుస్తోంది.

దాడులిలో రెండు కంటే ఎక్కువ బీ-2 బాంబర్ల ఉపయోగం

ఒక్కో బీ-2 బాంబర్‌ కేవలం రెండు జీబీయూ-57 బాంబులను మోసుకెళ్లగలదు. దీనిని బట్టి చూస్తే రెండు కంటే ఎక్కువ బీ-2 బాంబర్లను ఉపయోగించినట్టు అర్థమవుతోంది. అయితే ఈ బాంబర్లు గ్వామ్ ఎయిర్‌బేస్‌ నుంచి తరలించారా? లేక డియాగో గార్సియా బేస్‌ నుంచి తరలించారా? అనేది క్లారిటీ లేదు. కానీ ఎక్కువశాతం ఈ బాంబర్లు డియాగో నుంచి వచ్చి దాడులు చేసి తిరిగి వెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. ఏ బేస్‌ నుంచి ఈ బాంబర్లు బయల్దేరిన కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలో అనేక దేశాలు ఉన్నాయి. కానీ ఏ దేశ డిఫెన్స్‌ వ్యవస్థ కూడా వీటిని గమనించలేకపోయాయి. దాదాపుగా 18 గంటల పాటు ఈ బాంబర్లు నాన్‌స్టాప్‌గా ప్రయాణించినట్టు తెలుస్తోంది.

ఇరాన్ వార్‌కు ఎండ్ కార్డ్ వేయాలన్న ట్రంప్

తాము చేసిన దాడులు సక్సెస్ అయ్యాయి.. ఇప్పుడు ఇరాన్ వార్‌కు ఎండ్‌ కార్డ్ వేయాల్సిందే అంటున్నారు ట్రంప్. తాము ఇరాన్ అణు సామర్థ్యాన్ని అంతం చేయాలనుకున్నాం.. చేశామన్నారు. ఇక మిడిల్ ఈస్ట్‌లో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత టెహ్రాన్‌దే అంటున్నారు ట్రంప్. తమ లిస్ట్‌లో చాలా టార్గెట్లు ఉన్నాయని.. కేవలం కొన్నింటిపైనే దాడులు చేశామన్నారు.

ట్రంప్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారన్న నెతన్యాహు

అమెరికా దాడులు చేయగానే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా రెస్పాండ్ అయ్యారు. ట్రంప్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ట్రంప్ సరికొత్త చరిత్రను సృష్టించారన్నారు నెతన్యాహు.

అమెరికాతో దౌత్యం అనే కాన్సెప్టే లేదన్న ఇరాన్

ఈ దాడులపై ఇరాన్‌ మాత్రం ఒంటికాలుపై లేచింది. ఇకపై అమెరికాతో దౌత్యం అనే అంశమే ఉండదని తేల్చి చెప్పింది. అమెరికా హిస్టరీలో ఓ మర్చిపోలేని గాయం ఖాయమైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ దేశ విదేశాంగమంత్రి సయ్యద్ అబ్బాస్. తాము శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణు కేంద్రాలపై అమెరికా దాడులను తీవ్రంగా ఖండించారు ఆయన.

నిజంగా ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయా?

మరి అమెరికా దాడుల్లో నిజంగా ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయా? అసలు ప్రపంచాన్ని దాడుల విషయంలో ట్రంప్ ఏ విధంగా ఏమర్చారు? ఇప్పుడు ఇరాన్‌ ఒంటరిగా మారిందా? లేక కొన్ని దేశాలు తోడుగా రానున్నాయా? అమెరికా దాడులు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి తెర లేపాయా? దాడులు చేసి.. ఇప్పుడు ట్రంప్ జపిస్తున్న శాంతి మంత్రం వర్కౌట్ అవుతుందా?

మరి అమెరికా చేసిన పని ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది?

వ్యూహం.. ఏ దాడి సక్సెస్ కావాలన్న, ఏ యుద్ధం గెలవాలన్న అవసరమైంది. అనేక యుద్ధాల్లో ఆరితేరిన అమెరికాకు ఇది వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆపరేషన్ మిడ్‌నైట్ హమార్‌ పేరుతో ఇరాన్‌పై సర్‌ప్రైజ్ అటాక్ చేసింది. అయితే ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు 125 యుద్ధ విమానాలను, 12కు పైగా బంకర్ బస్టర్ బాంబులు, రెండు డజన్లకు పైగా తోమహక్ మిసైల్స్‌ను ఉపయోగించి.. జస్ట్ 25 నిమిషాల్లో ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసింది యూఎస్ ఆర్మీ. మరి అమెరికా చేసిన పని ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? దాని ఇంపాక్ట్ ఇతర దేశాలపై ఏ విధంగా పడనుంది?

ట్రంప్ మాటలను ఎంత మేరకు నమ్మొచ్చు

అమెరికా ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడులు చేసింది నిజమే. కానీ అవి ఎంత మాత్రం సక్సెస్‌ అయ్యాయనేది ప్రస్తుతం మిస్టరీగానే ఉంది. దాడులు సక్సెస్‌ అయ్యాయని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. కానీ ట్రంప్‌ మాటలను ఎంత మేరకు నమ్మాలనేది కాస్త అనుమానమే. ఎందుకంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. మరోవైపు అమెరికా చేసిన దాడుల్లో తమకు పెద్ద నష్టం ఏం జరగలేదని ఇరాన్ ప్రకటించింది. దాడులు జరిగింది నిజమే కానీ.. వారు ఆశించినట్టుగా నష్టం జరగలేదని ప్రకటించింది. కీలకంగా భావించే మూడు అణు స్థావరాలను కీలకమైన వాటన్నింటిని ముందే తరలించామని తెలిపింది.

రెండు వారాల సమయం తీసుకుంటానన్న ట్రంప్

ఇక్కడ రెండు కీలకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు 2 వారాల సమయం తీసుకుంటానని చెప్పారు ట్రంప్. కానీ రెండు రోజుల్లోనే దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజానికి ప్రపంచాన్ని ట్రంప్ ఏమర్చారు. రెండు వారాల సమయం ఉందని ఇరాన్ భావించింది. ఆలోపు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు లేదా ఇజ్రాయెల్‌పై దాడులు తీవ్రతరం చేయవచ్చు అని భావించింది. అంతేకాదు వెంటనే దాడులను ఆపేయాలంటూ సంధి ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. కానీ ట్రంప్ మాత్రం రెండు రోజుల్లోనే దాడులు చేసి షాక్ ఇచ్చారు. నిజానికి ఈ దాడిని ఇరాన్‌ అస్సలు ఊహించి ఉండదు.

అణు కేంద్రాల వద్ద పెరిగిన మూమెంట్

ఇక రెండో అంశం.. ఇరాన్ అ్రపమత్తత. ఇరాన్ అణు కేంద్రాలపై నిత్యం నిఘా ఉంచాయి ఇజ్రాయెల్, అమెరికా దేశాలు. అక్కడ చీమ చిటుక్కుమన్న పట్టేస్తున్నాయి. రీసెంట్‌గా ఈ అణు కేంద్రాల వద్ద మూమెంట్ పెరిగినట్టు గుర్తించాయి. భారీ యంత్రాలు, భారీగా వాహనాలు అణు కేంద్రాల నుంచి రావడం, వెళ్లడం గమనించాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. అందుకే దాడులను మరింత త్వరగా చేయాలని ఇజ్రాయెల్, అమెరికా భావించినట్టు అర్థమవుతోంది.

వైట్‌మ్యాన్ ఎయిర్‌బేస్‌లో 19 బీ-2 స్టెల్త్ బాంబర్లు

అమెరికన్ ఆర్మీ కూడా శత్రు దేశాలను ఏమార్చడంలో సక్సెస్ అయ్యింది. వైట్‌మ్యాన్ ఎయిర్‌బేస్.. ఇది బీ-2 స్టెల్త్ బాంబర్ల ఫ్లీట్‌కు హోమ్‌ బేస్. ఇక్కడే 19 బీ-2 స్టెల్త్ బాంబర్లు ఉంటాయి. ముందుగా ఇక్కడి నుంచి రెండు బీ-2లు టేకాఫ్ అయ్యాయి. అక్కడి నుంచి పసిఫిక్ సముద్రంవైపు వెళ్లాయి. ఈ సమయంలో గాల్లోనే పలుసార్లు ఇంధనం నింపుకున్నాయి. అదే సమయంలో డియాగో గార్సియా నుంచి మరో రెండు బీ-2లు టేకాఫ్‌ తీసుకున్నాయి. అంతకుముందే మరో బీ-2 గ్రూప్ కూడా చక్కర్లు కొట్టడం ప్రారంభించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎవరైనా వీటన్నింటిని ట్రాక్ చేసిన రోటిన్ ఎక్సర్‌సైజ్‌లా కనిపించేలా ప్లాన్ చేసింది అమెరికన్ ఆర్మీ.

ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌లో భారీగానే ఆస్తి నష్టం

అమెరికా దాడులు చేయగానే.. తీవ్రంగా స్పందించిన ఇరాన్.. తన ప్రకోపాన్ని ఇజ్రాయెల్‌పై చూపించింది. మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌లో భారీగానే ఆస్తి నష్టం జరిగింది. ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్‌ కూడా స్వల్పంగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇజ్రాయెల్ ఏకంగా తన ఎయిర్‌స్పేస్‌ను మూసివేసి.. ఎమర్జెన్సీ ప్రకటించింది అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో.

దాడులు చేసేందుకు సిద్దంగా ఉన్నామంటూ హౌతీల ప్రకటన

అమెరికా ఇరాన్‌పై దాడులు చేస్తే రెడ్‌సీలోని అమెరికా నౌకలపై దాడులు చేస్తామని ఇప్పటికే హౌతీలు ప్రకటించారు. ఇప్పుడు తాము దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు. అంతేకాదు అమెరికా బేస్‌లపై దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇక ఇరాన్‌ హార్మూజ్ జలసంధిని మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే చమురు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. నిజంగా మూసివేయకున్నా.. మూసివేస్తానని ఇరాన్ అధికారికంగా ప్రకటిస్తే చాలు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.

దాడులను ఖండించిన చైనా, పాకిస్థాన్, రష్యా

మరోవైపు అమెరికా దాడుల తర్వాత అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే చైనా, పాకిస్థాన్, రష్యా ఈ దాడులను ఖండించాయి. అన్ని దేశాల చేతుల్లో కీలుబొమ్మ అయిన పాకిస్థాన్‌ను పక్కన పెడితే.. ఇప్పుడు చైనా, రష్యా ఎలా రియాక్ట్ అవుతాయనే దాన్ని బట్టే.. మూడో ప్రపంచయుద్ధం వస్తుందా? రాదా? అనేది తేలనుంది. ఇప్పటికే ఇరాన్ విదేశాంగమంత్రి రష్యాతో మంతనాలు జరుపుతున్నారు. నిజానికి ఇరాన్‌కు రష్యా మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇరాన్‌కు మద్దతుగా రష్యా యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే ఉక్రెయిన్‌ పక్కలో బల్లెంలా ఉండటంతో పాటు.. ఇజ్రాయెల్‌లో దాదాపు 20 లక్షల మంది రష్యన్లు ఉన్నారు.

ఇజ్రాయెల్‌లో దాదాపు 20 లక్షల మంది రష్యన్లు

అంతేకాదు ఇజ్రాయెల్‌ దాదాపుగా రష్యన్ మాట్లాడే దేశం అంటూ ఏకంగా పుతిన్‌ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీనిని బట్టి ఈ యుద్ధానికి రష్యా దూరంగా ఉండే అవకాశమే కనిపిస్తోంది. అయితే ఏ దేశమైనా ఇరాన్‌కు న్యూక్లియర్ వార్ హెడ్‌లను తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ ప్రొగ్రామ్‌కు ఎలాంటి నష్టం చేకూరలేదన్నారు ఆయన.

అమెరికాకు మద్దతు పలుకుతున్న అరబ్ దేశాలు

ఇక చైనా సంగతి తెలిసిందే. తనకు కనీసం పైసా అయినా లాభం లేకపోతే.. ఏ పని చేయదు. అలాంటిది ఏకంగా అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో కలిసి అడుగులు వేసే అవకాశమే లేదు. నిజానికి ఇరాన్‌లో చైనాకు చెందిన అనేక రిసెర్చ్ సెంటర్‌లు ఉన్నాయి. వాటి జోలికి రానంత వరకు చైనా అసలు జోక్యం చేసుకునే అవకాశమే లేదు. ఇక అరబ్ దేశాలన్ని ఇప్పటి వరకు అమెరికాకే మద్దతుగా నిలుస్తున్నాయి. ఒకవేళ అమెరికాకు వ్యతిరేకంగా ఏవైనా అడుగులు వేస్తే మాత్రం.. వాటి మధ్య కొరివి రాజేయడం అమెరికాకు పెద్ద పని కాదు.

ప్రస్తుతానికి మూడో ప్రపంచ యుద్ధ భయాలు లేనట్టే

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. మూడో ప్రపంచ యుద్ధ భయాలు అయితే లేవు. అలాగని ఇరాన్ ఒంటరిది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే హర్మూజ్ జలసంధి అనేది అనేక ఏషియన్ దేశాలకు అవసరం. సో.. ఇరాన్‌కు మద్దతు లభిస్తుంది. కానీ అది మాటల వరకే. ప్రస్తుతం యుద్ధం విషయంలో మాత్రం ఇరాన్‌ ఒంటరే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×