Iran Military Strategy: అఫెన్స్ ఎలాగైనా ఉండని.. అవతలి వైపు నుంచి శత్రువు ఎంత బలంగానైనా కొట్టని.. డిఫెన్స్ గట్టిగా ఉంటే, అఫెన్స్‌లో అగ్రరాజ్యం ఉన్నా.. ఆలోచనలో పడుతుంది. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడిదే జరుగుతోంది. యుద్ధం మొదలై.. రెండు వారాలు దాటినా, ఎటూ తేలట్లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నా.. ఇరాన్ లొంగట్లేదు.
ఇరాన్‌పై.. ఇజ్రాయెల్ వేస్తున్న బాంబులన్నీ పేలుతున్నాయ్. కానీ.. లాభం లేదు. అమెరికా.. రకరకాలుగా దాడులు చేస్తోంది. కానీ, ప్రయోజనం లేదు. అగ్రరాజ్యం, శత్రుదేశం కలిసినా.. ఇరాన్ రక్షణ కవచాన్ని ఛేదించలేకపోతున్నాయ్. ఈ యుద్ధంలో.. ఇరాన్ ఓటమిని అసాధ్యంగా మార్చింది.. ఆ ఒక్కడే. అతడే.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ కమాండ్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ అలి జఫారీ. అయతుల్లా అలీ ఖమేనీ లాంటి అగ్రనేతలను.. యుద్ధం మొదలైన రోజే కోల్పోయినా, వరుస దాడుల్లో ఇరాన్ కుప్పకూలకుండా రెండు వారాలుగా పోరాడుతోందంటే.. అందుకు వన్ అండ్ ఓన్లీ రీజన్.. అలీ జఫారీ సృష్టించిన రక్షణ కవచమే! అతని మాస్టర్ మైండ్, అతని వ్యూహమే.. ఓటమిని ఇరాన్ దరి చేరనివ్వట్లేదు. అందుకే.. ప్రపంచానికి ఇప్పుడు అతనొక డిఫెండర్‌లా కనిపిస్తున్నాడు.
23 ఏళ్ల కిందట.. ఇరాక్‌పై యుద్ధం చేసిన అమెరికా.. నెల రోజుల్లోపే సద్దాం హుస్సేన్ సైన్యాన్ని మట్టికరిపించాయ్. ఇప్పుడు కూడా ఇరాన్‌ని వారం లోపే గెలుస్తామన్న ధీమాతో, ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది అగ్రరాజ్యం. తొలిరోజే సుప్రీం లీడర్ ఖమేనీని ఖతం చేయడంతో.. ఇరాన్ పతనం ఖాయమనుకుంది. అయితే, ఒకప్పటి ఇరాక్ ఓటమినే పాఠాలుగా మలచుకున్న ఓ మిలటరీ కమాండర్.. ఇప్పుడు తమను అడ్డుకుంటాడని అమెరికా అస్సలు ఊహించలేదు. మహ్మద్ అలీ జఫారీ సృష్టించిన మొజాయిక్ రక్షణ కవచం.. అమెరికాకు అస్సలు మింగుడుపడటం లేదు.
ఈ యుద్ధంలో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాల్లో.. డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతం అత్యంత కీలకమైనది. అధినాయకత్వం తుడిచిపెట్టుకుపోయినా, పట్టు వదలకుండా పోరాడటమే దీని ఉద్దేశం. దీనిని.. డిజైన్ చేసింది అలీ జఫారీనే. ఈ స్ట్రాటజీ ఆధారంగా ముందే రూపొందించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం.. పనిచేయగలిగేలా, వేగంగా నిర్ణయాలు తీసుకునేలా.. పాక్షిక స్వతంత్ర విభాగాలకు అధికారాన్ని అప్పగించారు. అందువల్ల.. ఫిబ్రవరి 28 నాటి దాడుల్లోనే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా ఐఆర్‌జీసీ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహ్మద్ పాక్పోర్, డిఫెన్స్ మినిస్టర్ అజీజ్ నజీర్‌జాదే, మిలటరీ బలగాల చీఫ్ లాంటి ముఖ్య నేతలను కోల్పోయినా.. రణభూమిలో ఇరాన్ ఇంకా ప్రతిఘటిస్తూనే ఉంది. ఇరాన్ కూడా 20 ఏళ్లుగా.. తమ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో అమెరికా ఓటములను అధ్యయనం చేస్తూ వచ్చింది. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంది. అందువల్ల.. ఈ యుద్ధం ఎప్పుడు, ఎక్కడ ముగించాలో.. డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ వారికి నేర్పింది. ఈ స్ట్రాటజీ యుద్ధంలో ఇరాన్‌ని గెలిపిస్తుందో, లేదో తెలియదు గానీ, అంత ఈజీగా ఓడించడం సులువు కాదనే విషయాన్ని మాత్రం అందరికీ అర్థమయ్యేలా చేసింది.
ఇరాన్ మాజీ జనరల్ జఫారీ కెరీర్.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ యూనిట్‌లో మొదలైంది. ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత కుర్దిస్థాన్ ప్రావిన్స్‌లో పనిచేశారు. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పనిచేసి, మిలటరీలో ఎదిగారు. ఆ యుద్ధం తర్వాత.. ఐఆర్‌జీసీ గ్రౌండ్ ఫోర్సెస్‌కు కమాండర్‌గా ప్రమోట్ అయ్యారు. 2005లో ఐఆర్‌జీసీ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. అంతకు రెండేళ్ల ముందే అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్‌పై.. రీసెర్చ్ చేశారు. అందులో నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నారు. ఇరాక్‌పై అమెరికా దాడి చేసి, సద్దాం హుస్సేన్ చుట్టూ ఉన్న హైలెవెల్ కమాండ్ వ్యవస్థని ధ్వంసం చేసింది. దాంతో.. ఇరాక్ ఆర్మీ, రిపబ్లికన్ గార్డ్ యూనిట్ల మధ్య సమన్వయం లేకుండా పోయింది. దాంతో.. ఇరాక్ బలగాలు నిర్ణయాలు తీసుకోలేక, సొంతంగా పోరాడలేక అమెరికాకు లొంగిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నింటిని దగ్గరి నుంచి గమనించిన అలీ జఫారీ.. మొజాయిక్ వ్యూహాన్ని రూపొందించారు. 2007లో ఐఆర్‌జీసీ కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక దానిని అమల్లోకి తెచ్చారు.
మొజాయిక్ స్ట్రాటజీ అమల్లోకి వచ్చాక.. ఐఆర్‌జీసీని 31 సెమీ అటానమస్ ప్రావిన్సియల్ కమాండ్స్‌గా విభజించారు. అధికారాన్ని వికేంద్రీకరించారు. ప్రతి కమాండ్‌కు స్వతంత్ర హెడ్‌క్వార్టర్, కమాండ్ కంట్రోల్ నోడ్స్, మిసైళ్లు, డ్రోన్ల లాంటి ఆయుధ వ్యవస్థల్ని సమకూర్చారు. ఆయుధాల నిల్వ, నిఘా వ్యవస్థలు, స్వతంత్రంగా ఆపరేషన్లను నిర్వహించడం లాంటివన్నీ వాటి బాధ్యతే. అత్యవసర పరిస్థితుల్లో హైకమాండ్ ఆదేశాలు లేకున్నా.. సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం వీటికి ఉంటుంది. ఆ నిర్ణయాలు ఎలా ఉండాలన్న దానిపై ముందే కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇప్పుడు.. ఆ మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతమే.. అగ్రరాజ్యం అమెరికాని, శత్రుదేశం ఇజ్రాయెల్‌ని.. ఇరాన్ నిలువరించేలా చేస్తోంది.
యుద్ధరంగంలో బాంబులు, మిసైళ్లు మాత్రమే మాట్లాడవు. వాటిని ఎప్పుడు వాడాలి? ఎంత మోతాదులో వాడాలి? అనేది ఓ మాస్టర్ మైండ్ డిసైడ్ చేస్తుంది. ఆ మెదడు రచించే వ్యూహమే.. గెలుపోటములను శాసిస్తుంది. ఈ యుద్ధంలో.. అమెరికా, ఇజ్రాయెల్ అత్యాధునిక టెక్నాలజీని, భారీ ఆయుధ సంపత్తిని నమ్ముకుంటే.. ఇరాన్ సింపుల్‌గా తమ మొజాయిక్ డిఫెన్స్‌ని నమ్ముకుంది. అదే.. ఇరాన్‌ని కాపాడుతోంది. శత్రువులను నిలువరిస్తోంది.
సాధారణంగా ఏదైనా దేశంపై దాడి జరిగినా.. ఆ దేశ సైన్యం ఓ సెంట్రలైజ్డ్ కమాండ్ ద్వారా స్పందిస్తుంది. కానీ, ఇరాన్ అనుసరిస్తున్న మొజాయిక్ డిఫెన్స్ ఇందుకు భిన్నం. ఇరాన్ తన సైనిక శక్తిని.. స్వయం ప్రతిపత్తి గల యూనిట్లుగా విభజించింది. ఒకవేళ ప్రధాన కమాండ్ సెంటర్ ధ్వంసమైనా, ఈ చిన్న విభాగాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని శత్రువుపై దాడి చేస్తాయ్. శత్రువుకు చిక్కకుండా, దొరికిన చోటల్లా దెబ్బతీయడమే ఈ వ్యూహం ఉద్దేశం. ఇరాన్ తన పర్వత ప్రాంతాలను, సముద్ర తీరాలను.. మొజాయిక్ డిఫెన్స్‌కు అనుగుణంగా మార్చుకుంది. అమెరికా లాంటి దేశాలతో యుద్ధం చేయడమంటే.. అది సూసైడ్ లాంటిదేనని ఇరాన్‌కు తెలుసు. అందుకే.. ఆ దేశం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. వందల కోట్ల విలువైన అమెరికా యుద్ధ నౌకలను, మిసైళ్లను.. లక్షలు విలువ చేసే సూసైడ్ డ్రోన్లు, స్పీడ్ బోట్లతో ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఉండొచ్చు, అమెరికా దగ్గర ఎఫ్-35 లాంటి స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉండొచ్చు. కానీ, ఇరాన్ తన దగ్గరున్న పరిమిత ఆయుధాలతో, సూసైడ్ డ్రోన్లు, మిసైళ్లతోనే.. రెండు దేశాలను సవాల్ చేస్తోంది.
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తన టెక్నిక్ వాడుతోంది. వందలాది చిన్న చిన్న స్పీడ్ బోట్లతో.. ఒక్కసారిగా శత్రు నౌకపై విరుచుకుపడతాయి. అతిపెద్ద యుద్ధ నౌక కూడా ఇన్ని చిన్న లక్ష్యాలను ఒకేసారి ఎదుర్కోవడం అసాధ్యం. ఇది శత్రువును మానసికంగా, భౌతికంగా దెబ్బతీస్తుంది. దశాబ్దాలుగా అమెరికా యుద్ధ రీతిని, వ్యూహాన్ని గమనించిన ఇరాన్.. ఇప్పుడు అంతకుమించిన వ్యూహంతో దెబ్బ కొడుతోంది. శత్రువు తమ దాకా వస్తే.. ఇరాన్‌లోని ప్రతి నగరం, ప్రతి వీధి యుద్ధ క్షేత్రంగా మారుతుంది. ఒక్క అయతుల్లా అలీ ఖమేనిని అంతం చేసినంత మాత్రాన.. ఇరాన్‌ని గెలిచినట్లు కాదు. మొత్తం దేశమే.. ఓ పజిల్‌లా ఉందిప్పుడు. దీనిని ఛేదించడం అమెరికా, ఇజ్రాయెల్ వల్ల కావట్లేదు.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత.. ఇరాన్ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో.. ఇరాన్‌లో కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయ్. ఇరాన్‌లో పాలన మారాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నట్లు.. అమెరికా, ఇజ్రాయెల్ సంకేతాలిచ్చాయ్. కానీ, ఇరాన్ పాలకులు అంత తేలిగ్గా కూలగొట్టేందుకు సాధ్యం కాని, అధికార వ్యవస్థను నిర్మించారు. ఇందులో ఒక తలని నరికేస్తే.. మరో కొత్త తల పుట్టుకొస్తుంది. ఇందుకు, అలీ ఖమేనీ కొడుకు మోజ్తాబా ఖమేనీని సుప్రీం లీడర్‌గా నియమించడమే ఎగ్జాంపుల్. అతని తండ్రి చనిపోయిన రెండు వారాల్లోపే ఈ నియామకం జరిగింది. తండ్రి తరహాలోనే.. మోజ్తాబా కూడా కఠినమైన పాలన కొనసాగిస్తారని చాలామంది భావిస్తున్నారు. అయితే.. ఇరాన్‌లో ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైన నియంతృత్వం మాదిరిగా కాకుండా.. ఆ దేశంలో బహుళ నియంతృత్వ పాలన ఉందని విశ్లేషిస్తుంటారు. అంటే, పొలిటికల్ ఇస్లాంకు చెందిన మద్దతుదారులు, ఇరాన్ జాతీయవాదాన్ని ఆచరించే వారి మధ్య పొత్తుతో.. దేశంలో పాలన కొనసాగుతోంది. ఇరాన్‌లో మత సంస్థలు, సాయుధ దళాలు, ఆర్థిక వ్యవస్థలోని ఉన్నత వర్గాల మధ్య కూడా అధికార విభజన జరిగింది. ఒకే నేత నియంతృత్వం కింద కాకుండా.. అంత తేలిగ్గా కదపలేని పునాదులతో ఈ వ్యవస్థ నిర్మితమైంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా అలాగే ఉంది.
యుద్ధం అంటే కేవలం విధ్వంసం కాదు. వ్యూహాల చదరంగం కూడా! అమెరికా, ఇజ్రాయెల్ ఆయుధాల మెరుపులని నమ్ముకుంటే, ఇరాన్ ధైర్యాన్ని, పోరాట పటిమని, మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతాన్ని కవచంగా మార్చుకుంది. ఎదుట ఉన్నది ఎంతటి భారీ శత్రువైనా, వ్యూహం పటిష్టంగా ఉంటే ఓటమిని నిలువరించడమే కాదు.. ఎదురుదాడి కూడా చేయొచ్చని ఇరాన్ ప్రపంచానికి చాటిచెబుతోంది.
Also Read: గ్రేటర్ గడ్డపై కాంగ్రెస్ ‘మైండ్ గేమ్’.. ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న పీసీసీ స్కెచ్!
Story by: Anup, Big Tv