Amaravati Issue: అమరావతి గురించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పైన కూటమి నేతలు మండిపడ్డారు. జగన్ కు ఇంకా అమరావతి పైన అక్కసు తగ్గలేదని మండిపడుతున్నారు. కాగా, ఇప్పుడు జగన్ వ్యాఖ్యల పైన చోటు చేసుకుంటున్న చర్చ.. వివాదం వేళ వైసీపీ అధికారికంగా స్పందిం చింది. అమరావతి పై జగన్ చేసిన వ్యాఖ్యల పై స్పష్టత ఇచ్చింది. తమ వైఖరి తేల్చి చెప్పింది. జగన్ బాష్యాలను సమర్ధించుకునే క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు, మాట్లాడుతున్న మాటలు కూడా తీవ్ర విమర్శల పాలువున్నాయి..
సీఎం ఎక్కడ కూర్చొంటే అదే రాజధాని అంటున్న జగన్..
ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే సచివాలయం.. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్న మాట ఇది. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాష్ట్ర రాజధాని అవుతుందని ముఖ్యమంత్రిగానూ, మాజీ అయ్యాక జగన్ రాజధానికి చెప్తున్న కొత్త బాష్యం.
మొదట్లో అమరావతి రాజధానికి జగన్ ఆమోదం..
అమరావతిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిగా ప్రకటించినప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ అసెంబ్లీ సాక్షిగా ఆమెదం తెలిపారు. అయితే 2019లో అధికారంలోకి రాగానే అధికార వీకేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రకటన చేసి అమరావతికి భూములిచ్చిన రైతుల ఆగ్రహానికి గురయ్యారు. కర్నూలు, విశాఖలను మూడు రాజధానులని ప్రకటించినా ఆయా ప్రాంతాల్లో కూడా వైసీపీకి చావుదెబ్బే తగిలింది. జగన్ పాలనపై వ్యతిరేకత, తీసుకున్న నిర్ణయాలు బూమరాంగ్ అయి వైసీపీ గత ఎన్నికల్లోకనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.. అంత చేదు అనుభవం ఎదురైనా జగన్ అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. రాజధానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని, విజయవాడ – గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ వద్ద 35 ఎకరాలు సరిపోదా అంటున్నారు
రివర్ బేసిన్లో రాజధాని నిర్మిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు
తాజాగా మాజీ సీఎం జగన్ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రివర్ బేసిన్‌లో ఏపీ రాజధాని నిర్మిస్తున్నారంట.. నదిలో భవనాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం కరెక్టా? అని జాతీయ మీడియా ముందు ఇంగ్లీషులో ప్రశ్నలు సంధించారు. రాజధాని నిర్మాణానికి అమరావతి సరైన ప్రదేశం కాదని, విజయవాడ-గుంటూరు మధ్య అయితే ఫర్వాలేదంటున్నారు. అక్కడితో ఆగని మాజీ ముఖ్యమంత్రి అసలు రాజధాని అన్న పదానికే అర్థం లేదని కొత్త బాష్యం చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అంట.
జాతీయ మీడియా ముందు అమరావతిపై బురదజల్లే ప్రయత్నం..
సీఎం ఉన్న చోటుకే మంత్రులు, హెచ్ఓడీలు అందరూ వస్తారని అక్కడ నుంచే పాలన సాగుతుందని జాతీయ మీడియాకి ఆంగ్లంలో వివరిస్తూ.. అమరావతిపై బురదజల్లే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఏకంగా నగరాన్నే రివర్ బేసిన్‌లో కడుతున్నారని, సుప్రీంకోర్టు దీన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని జగన్ వాదిస్తున్నారు. ఆ క్రమలో అమరావతిని ఉద్దేశించిజగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరం అంటూ, రివర్ బేసిన్‌లో నగర నిర్మాణం సాధ్యం కాదన్న వ్యాఖ్యలు ప్రజల్లో, ముఖ్యంగా రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
రంగంలోకి సజ్జల, పేర్ని నాని వంటి నేతలు
ఈ వ్యతిరేకత నేపథ్యంలో వైసీపీ నష్ట నివారణ చర్యలకు దిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని వంటి నేతలు రంగంలోకి దిగి, జగన్ అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించ లేదని చెప్పారు. అమరావతిలో అన్యాయం, అవినీతిపై ఎందుకు ప్రశ్నించకూడదని నిలదీసారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు కొట్టుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు సమాధానాలు లేవని ఆక్షేపించారు. జగన్ అమరావతి పై పలు ప్రశ్నలు సంధించారని.. తొలిదశ 50 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారన్నారు. ముందు ఇచ్చిన రైతులకు ఏమీ చేయకుండా రెండవ దశకు వెళ్ళటం తప్పు కదా అని ప్రశ్నించారని వివరించారు.
జగన్ మాటలను వక్రీకరిస్తున్నారని విమర్శ..
చంద్రబాబుకు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ గా అభివర్ణించారు. జగన్ అమరావతి లో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు.. చంద్ర బాబు పదేళ్ల తర్వాత ఇప్పుడు ఇల్లు మొదలుపెట్టారన్నారు. డీ సెంట్రలైజ్ అని చెప్పినప్పుడు కూడా అమరావతి ని వదిలి పెట్టలేదన్నారు. కావాలనే జగన్ మాటలను ఇష్టానుసారం వక్రీకరిస్తున్నారని విమర్శించారు. వైజాగ్ అయితే వేగంగా అభివృద్ది జరుగుతుందని అన్నారు తప్ప మరో కారణం లేదని స్పష్టం చేసారు.
జగన్‌కు అవగాహన లేదని చంద్రబాబు ఎద్దేవా..
జగన్ తీరును మరోసారి తప్పుబట్టారు సీఎం చంద్రబాబు. నదులు ఎక్కడ పుడతాయో, నాగరికత ఎక్కడ మొదలైందో జగన్ కి తెలియదని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కు కనీసం సింధూ నాగరికత గురించి కూడా అవగాహన లేదని మండిపడ్డారు. నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలు నదీతీరాల వెంబడి ఉన్నందునే అభివృద్ధి చెందాయని అన్నారు. అంతేకాదు లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలు నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలు బుద్ధి చెప్పినా.. రాజధానిపై ఇప్పటికీ విషం చిమ్ముతూనే ఉన్నారని జగన్ పై నిప్పులు చెరిగారు.
Also Read: కేసీఆర్‌పై ఆగ్రహం గజ్వేల్‌లో కథ రివర్స్..!
మరోవైపు అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ వైసీపీ దృష్టిలో రాష్ట్ర రాజధాని ఎక్కడో చెప్పాలన్నారు. అమరావతి రాజధాని అని తమకు పూర్తి క్లారిటీ ఉందని.. వైసీపీ కూడా రాజధానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రివర్ బెడ్‌కు రివర్ బేసిన్‌కు తేడా తెలియకుండా మాట్లాడారని వ్యాఖ్యలు చేశారు. చాలా నగరాలు రివర్ బేసిన్‌లోనే మహా నగరాలుగా అభివృద్ధి చెందాయని మంత్రి ఎత్తి చూపించారు. మొత్తానికి అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలతోపెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కుల ముద్రను అంటగట్టి అమరావతిని తన హయాంలో పాడుపెట్టిన జగన్.. పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే దానికి మళ్లీ అదే గతి పట్టిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Story By Apparao, Bigtv