AP News: తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ ఎందుకో మాజీ సీఎం జగన్‌కు వరుసగా టార్గెట్ అవుతున్నారు. గతంలో తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు సుబ్బరాయుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నారని, తమ నాయకులపై పోక్సోకేసు పెట్టి వేధిస్తున్నారని.. ఆయన్ని తాము అధికారంలోకి వచ్చాక ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని మీడియా ముందుకొచ్చి జగన్ వార్నింగ్ ఇచ్చారు.. సుబ్బరాయుడు తిరుపతి నుంచి బదిలీ అయిన తర్వాత కూడా సుబ్బరాయుడు మీద ఆయన కక్ష తీరినట్లు లేదు.. తాజాగా సింహాచలం ఘటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మరోసారి సుబ్బరాయుడుపై నిప్పులు చెరిగారు .. అసలు ఎందుకు సుబ్బరాయుడుపై జగన్‌కి అంత కక్ష?
తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడు
అనంతపురం జిల్లాకు చెందిన సుబ్బరాయుడు తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి. గతంలో 2014 నుంచి 19 వరకు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక భద్రతాధికారిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తెలంగాణకు వెళ్లిపోయారు. తెలంగాణలో పలుచోట్ల సమర్థవంతమైన ఎస్పీగా పేరు తెచ్చుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తిరిగి ఏపీలో అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు తిరిగి సుబ్బరాయుడును ఏపీకి డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నారు. తన సొంత జిల్లా అయినా తిరుపతి ఎస్పీగా ఆయనకు బాధ్యతలు అప్పజెప్పారు.
తిరుమల కొండపై టికెట్లు ఇష్యూ సందర్భంగా తొక్కిసలాట
తనకు అప్పచెప్పిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న సుబ్బరాయుడు బదిలీకి అనుకోని విధంగా ఓ డీఎస్పీ స్థాయి అధికారి , టీటీడీ అధికారి నిర్వాకం కారణమైంది. తిరుమల కొండపై ఏకాదశి ముందు టికెట్లు ఇష్యూ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడంతో సీఎం ఆయనను బదిలీ చేసి, రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు రాష్ట్రంలో మద్యం స్కామ్‌పై ఏర్పాటు చేసిన సిట్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుబ్బరాయుడు నిత్యం సీఎంఓతో టచ్‌లో ఉండే అధికారి కావడంతో ప్రతిపక్షం ఆయన పైన ఓ కన్నేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తిరుపతి ఎస్పీగా సీరియస్‌గా వ్యవహరించిన సుబ్బరాయుడు
సుబ్బరాయుడు తిరుపతి ఎస్పీగా ఉన్న సమయంలో జరిగిన ఘటనల నేపథ్యంలో చాలా సీరియస్‌గా వ్యవహరించారు. ముఖ్యంగా జగన్‌కు అత్యంత ఆత్మీయుడైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం అంటూ తన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. అంతే కాకుండా అమ్మాయి విజువల్స్‌ను తన సోషల్ మీడియాతో పాటు పార్టీ సోషల్ మీడియాలోనూ, అదే విధంగా ఓ పత్రికలో వచ్చేటట్లు చేశారు. దానిపైన నమోదైన కేసులో మైనర్ బాలిక వివరాలు బయటకు చెప్పారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తో పాటు స్థానిక వైసీపీ నాయకుల మీద, అమ్మాయి ఆసుపత్రిలో ఉన్న సమయంలో హడావిడి చేసిన మాజీ మంత్రి రోజా, తిరుపతి వైసీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి , సత్యవేడు వైసిపి ఇంచార్జ్ నూకతోటి రాజేష్ తదితరులపైన కేసులు నమోదయ్యాయి.
సుబ్బారాయుడ్ని వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చిన జగన్
అయితే ప్రత్యేకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదు అయింది. రాజకీయ చరిత్రలో ఓ మాజీ ప్రజా ప్రతినిధిపై ఇలాంటి కేసు నమోదు కావడం మొట్టమొదటిసారి అంటున్నారు. దాంతోపాటు ఎక్కడికక్కడ గొడవలు చేస్తున్న వైసీపీ శ్రేణుల విషయంలో సుబ్బారాయుడు కఠినంగా వ్యవహరించారు . ఈ సందర్భంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్ ప్రత్యేకంగా సుబ్బరాయుడు పేరును ప్రస్తావిస్తూ ఆయన్ని రేపు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టనని బహిరంగంగా హెచ్చరించారు. అయితే సుబ్బరాయుడు సైతం తానేం తక్కువ కాదన్నట్లు.. జగన్‌ది రాయలసీమలోని కడప అయితే తనది అనంతపురం జిల్లా అని తాను ఎక్కడికి వెళ్ళను, ఉంటే డ్యూటీలో ఉంటాను.. లేకపోతే సొంతూరులో ఉంటానని ఘాటుగా కౌంటర్ ఇవ్వడం అప్పట్లో సంచలనం రేపింది.
సెట్ దర్యాప్తులో బయటకు వస్తున్న వైసీపీ కీలక వ్యక్తుల పేర్లు
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బదిలీ అయి, మద్యం సెట్‌తో పాటు రెడ్ శాండిల్ టాస్క్ఫోర్స్ చూస్తున్న సుబ్బరాయుడు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీట్ దర్యాప్తు కేసులో చాలా మంది వైసీపీకి సంబంధించిన కీలక వ్యక్తుల పేర్లు బయటికి రావడం, వారిని విచారించడం, కేసులు నమోదు చేయడం లాంటి విషయాల్లో సుబ్బరాయుడు కీలక పాత్ర వహిస్తున్నారు. సుబ్బరాయుడుతో పాటు కర్నూలు డీఐసీ కోయ ప్రవీణ్ కూడా లిక్కర్ స్కాం విచారణలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు ఇదేవిధంగా కోయ ప్రవీణ్‌ను టార్గెట్ చేసిన జగన్ ఆయనపై కక్షపూరితంగా విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులకు గురి చేశారు.
ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిల విచారణ
ఆ క్రమంలో సుబ్బరాయుడు సిట్ అధికారిగా కీలకంగా వ్యవహరిస్తూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించారు. జగన్ సన్నిహితుడిగా పేరున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అరెస్టులో కీలకంగా వ్యవహరించారంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3, 300 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందన్న లీకులు బయటకు రావడానికి కూడా సుబ్బరాయుడు కారణమని వైసీపీ అంటోంది. అందుకే సింహాచలం ఆలయం లో నిజరూప దర్శనానికి వస్తున్న భక్తుల మీద గోడకూలి భక్తులు మరణించిన సందర్భంగా వారిని పరామర్శించడానికి వచ్చిన జగన్.. అసలు పరామర్శ వదిలేసి సుబ్బరాయుడుపై తన అక్కసు మరోసారి బయటపెట్టుకున్నారని విమర్శకులు అంటున్నారు.
Also Read: భారత్ – పాక్ కాల్పుల విరమణ వెనుక ఏం జరిగింది?
తన పరి తాను చేసుకుని పోతున్న సుబ్బరాయుడు
మద్యం స్కామ్‌కు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న సుబ్బరాయుడు మాత్రం సింహాచలంలో జగన్ వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నారు. మొత్తం మీద నీను వీడని నేను.. అన్నట్లు వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ శ్రేణులు సుబ్బరాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా… ఆయన మాత్రం తనకు అప్పగించిన పనులను తాను చేసుకుంటూ వెళ్తున్నారంట. మరోసారి సీమలో వైసీపీ క్యాడర్ బలంగా ఉన్న చిత్తూరు జిల్లాకు గాని, నెల్లూరుకు గాని సుబ్బరాయుడు బదిలీ అవుతారని జరుగుతున్న ప్రచారంతో … ముందు జాగ్రత్త చర్యగా కావాలని సుబ్బరాయుడుని టార్గెట్ చేస్తూ.. ఆయనకు పోస్టింగ్ రాకుండా అడ్డుకోవడానికి వైసిపి శ్రేణులు జగన్‌తో అలా హడావుడి చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
రాప్తాడు నియోజకవర్గానికి చెందిన సుబ్బరాయుడు కుటుంబం
ఏదేమైనప్పటికీ వైసీపీకి మాత్రం సుబ్బరాయుడు టార్గెట్ అయ్యారన్నది మాత్రం నిజం. దానికి తోడు సుబ్బరాయుడు బ్యాక్ గ్రౌండ్ కూడా వారికి అనుకూలంగా కనిపిస్తుంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన సుబ్బరాయుడు బంధువులు కుటుంబాలు టిడిపికి బలమైన మద్దతుదారులు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబాలు టీడీపీ శ్రేణులతో కలిసి పనిచేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తూ సుబ్బరాయుడు మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారంటున్నారు.