Jana Reddy VS Rajagopal: మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ కీలక నేతలకు సీనియర్ నాయకుడు జానారెడ్డి రాసిన లేఖ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ పెద్ద కసరత్తే చేస్తోంది. ఈ నేపధ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ దిగ్గజం కుందూరు జానారెడ్డి హైకమాండ్‌కు లేఖ రాయడం ఆ జిల్లా నేతలను ఉలిక్కిపడేలా చేస్తోందంట. నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ, మూడో బెర్త్ కూడా దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జానారెడ్డి ఎవరికి చెక్ పెట్టడానికి ఆ లేఖ రాసారన్నది హాట్ టాపిక్‌గా మారింది.. అసలింతకీ పెద్దాయన లేఖ వెనుక మతలబు ఏంటి?
ఎన్టీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన జానారెడ్డి
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ కురవృద్ధుడు. తెలుగుదేశం పార్టీ నుంచి తన పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన చలకుర్తి నియోజకవర్గం నుండి తొలిసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1988లో 30 మంది క్యాబినెట్ మంత్రులను మార్చడంపై ఎన్‌టి రామారావుతో విభేదించిన జానా రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో అత్యధక కాలం మంత్రిగా పనిచేసిన నాయకుడిగా రికార్డు సృష్టించారు.
రాజకీయ సలహాదారునిగా ప్రభుత్వంలో కీలకపాత్ర
కాంగ్రెస్ హై కమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉన్న జానారెడ్డి గత ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని.. ప్రస్తుతం రాజకీయ సలహా దారునిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జానారెడ్డి కుమారుల్లో ఒకరైన కుందూరు రఘువీరారెడ్డి ప్రస్తుతం నల్గొండ ఎంపీగా కొనసాగుతున్నారు. మరో కొడుకు జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాను పోటీ నుంచి తప్పుకుని కుమారులిద్దర్నీ పొలిటికల్‌గా సెటిల్ చేయడంలోనే జానారెడ్డి రాజకీయ చాణక్యం, ముందు చూపు అర్థమవుతుంది. .
శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కడంలో కీలక పాత్రం
ఇక మొన్నీమధ్య జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జానారెడ్డి తన శిష్యుడు శంకర్ నాయక్‌ను అనూహ్యంగా తెర మీదకు తెచ్చి ఎమ్మెల్సీని చేయగలిగారు. కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర అంత పలుకుబడి ఉన్న జానారెడ్డి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ సలహాదారుడిగా తన కెరీర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి జానారెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గేలకు లేఖ రాసి నల్గొండ జిల్లా ఆశావహులకు పెద్ద షాకే ఇచ్చారంట. జానా లేఖతో నల్గొండ జిల్లాకు వచ్చే మంత్రి పదవి రాకుండా పోతుందేమో అనే భయం నాయకులకి పట్టుకుందట.
జానారెడ్డి రంగారెడ్డి జిల్లా గురించి ప్రస్తావించడంపై చర్చ
హైదరాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ గెలవలేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వంటి వారు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ మారి వచ్చిన వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకూడదన్నది హైకమాండ్ నిర్ణయంగా చెపుతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ నేపధ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి తనకు ఎలాంటి సంబంధం లేని రంగారెడ్డి జిల్లాకు మంత్రి ఇవ్వాలని సూచించడంపై పెద్ద చర్చే జరుగుతోంది.
మంత్రి పదివిపై నమ్మకంతో ఉన్న కోటమిరెడ్డి రాజగోపాల్
నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. అదే జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనకు ఎన్నికల ముందే కాంగ్రెస్ అధిష్టానం మంత్రిపదవిపై హామీ ఇచ్చిందంట. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అవకాశం దక్కదన్న ఉద్దేశంతోనే జానారెడ్డి ఆ లేఖ రాసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
రాజగోపాల్‌కు చెక్ పెట్టడానికి లేఖ రాశారా?
జానారెడ్డి రాసిన లేఖలో ఎవరికీ ప్రత్యేకంగా మద్దతు ప్రకటించనప్పటికీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదనే విమర్శలు వస్తాయని పేర్కొన్నారు. ఆ క్రమంలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రిపదవి దక్కకుండా చేయడంలో భాగంగానే లేఖ రాసారన్న టాక్ వినిపిస్తోంది.
జానారెడ్డి లేఖపై నల్గొండ జిల్లలో భిన్నభిప్రాయాలు
ఆ లేఖపై నల్గొండ జిల్లా నాయకుల్లో ఒక వర్గం జానారెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరో వర్గం వ్యతిరేకిస్తోందంట. పార్టీలో ప్రాంతీయ సమతుల్యత కోసం ఆయన ఈ లేఖ రాసి ఉండవచ్చని ఓ వర్గం ఆయన్ని సమర్ధిస్తోందంట. నల్గొండ జిల్లాకు ఇప్పటికే రెండు మంత్రి పదవులు దక్కాయి కాబట్టి, రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీ బలం పెరుగుతుందని వారు వాదిస్తున్నారంట. అయితే మరో వర్గం మాత్రం ఆ లేఖను జానారెడ్డి వ్యక్తిగత రాజకీయ వ్యూహంగా చూస్తోందట. ముఖ్యంగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా చేయడానికే ఆయన లేఖరాసినట్లు వారు ఆగ్రహంతో ఉన్నారంట.
Also Read: నాగబాబూ.. ఈ టైమ్‌లో ఇది అవసరమా?
రేవంత్‌రెడ్డిపై పొగడ్తల వర్శం కురిపిస్తున్న రాజగోపాల్
హైకమాండ్ గతంలో ఇచ్చిన హామీతో రాజగోపాల్ తనకి మంత్రి ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన రాజగోపాల్.. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినట్లు హైకమాండ్ తర్వాత ముఖ్యమంత్రి పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మా సీఎం మంచోడు కాబట్టి మీరు బతికిపోయాడు లేకుంటే జైలులో ఉండే వారని అసెంబ్లీ సాక్షిగా రాజగోపాల్ పై బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. గతంలో జిల్లాలో సీఎం రేవంత్ మీటింగ్ పెట్టినా మంత్రులు ఆహ్వానించినా హాజరు కాని రాజగోపాల్ ఇటీవల జానారెడ్డి జాన్‌పహాడ్‌కు ఆహ్వానించగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి జానా రెడ్డి ఇచ్చిన విందులో ఉత్సాహంగా పాల్గొన్నారు .
కోమటిరెడ్డి వర్గీయుల్లో గుబులు రేపుతున్న జానా లేఖ
ఇక అందరి ఆశీసులు ఉన్నాయి మంత్రి పదవి ఖాయమనుకుంటున్న తరుణంలో జానారెడ్డి లేఖ కోమటిరెడ్డి వర్గీయుల్లో గుబులు రేపుతోందంట. కేబినెట్లో భర్తీ కావాల్సిన ఆరు బెర్తుల్లో రెడ్డి సామాజికి వర్గానికి రెండు దక్కే అవకాశం ఉందంటున్నారు. ఆ క్రమంలో కొత్త మంత్రులుగా నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ ఫోకస్ అయ్యారు . సీనియర్ అయిన సుదర్శన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మద్దతు ఉందంటున్నారు. ఈ నేపధ్యంలో రంగారెడ్డి జిల్లాతో మెలికపెట్టి జానారెడ్డి రాసిన లేఖతో రాజగోపాల్‌రెడ్డి ఒక్కసారిగా ఖంగుతిన్నారట.
జిల్లా నాయకుల మధ్య ఐక్యతపై ప్రభావం చూపుతుందని ఆందోళన
జానారెడ్డి ఈ లేఖ రాయడంలో మతలబు ఏంటి అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. జిల్లాలో సీనియర్ నేతగా, వివాదరహితుడుగా ఉన్న జానారెడ్డి తన లేఖ తో జిల్లాలో అగ్గి రాజేసినట్టయింది. రాజగోపాల్‌కి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్న ఉత్తమ్‌కి తోడు ఇప్పుడు జానారెడ్డి కూడా కలవడంతో రాజగోపాల్ అయోమయంలో ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఒకవేళ రాజగోపాల్‌కి మంత్రి పదవి రాకుంటే ఏమైనా జరుగొచ్చనే చర్చ జిల్లాలో బలంగా వినపడుతుంది. ఈ లేఖ ఎఫెక్ట్ జిల్లా నాయకుల మధ్య ఐక్యతపై ప్రభావం చూపుతుందేమో అన్న ఆందోళన కూడా కొందరిలో కనిపిస్తోందట. జానారెడ్డి సీనియర్ నాయకుడిగా తన అనుభవాన్ని ఉపయోగించి పార్టీ హైకమాండ్ దృష్టిని రంగారెడ్డి జిల్లా వైపు మళ్లించినప్పటికీ.. నల్గొండ జిల్లా నాయకుల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరిచూడాలి జానన్న లేఖాస్త్రం ప్రభావం ఎలా ఉంటుందో?