Janasena: ప్రకాశం జిల్లాలో జనసేన పరిస్థితి విచిత్రంగా తయారైంది. రోజురోజుకి పెరుగుతున్న గ్రూప్ వార్‌లో జనసేన ఓన్ ఐడెండిటీ కోల్పోయే పరిస్థితి వచ్చిదంటున్నారు. పార్టీకి బలం పెంచుకోవడానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పవన్‌కళ్యాణ్ స్వయంగా పార్టీలోకి తెచ్చుకున్నారు. బాలినేని చేరికను ముందు నుంచి వ్యతిరేకించిన జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్‌కు, బాలినేనికి మధ్య అగాధం పూడ్చలేనంతగా పెరిగిపోతోంది. దాంతో జిల్లాలో ఉన్న అంతో ఇంతో ఉన్న జనసేన క్యాడర్ కాస్తా రెండు గ్రూపులుగా మారిపోయారట… ఆ క్రమంలో వారికి టీడీపీ జనసేన, వైసీపీ జనసేన గ్రూపులన్న పేర్లతో సెటైర్లు పెరిగిపోతున్నాయి
ప్రకాశం జిల్లా లో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షేక్ రియాజ్ కొనసాగుతున్నారు.. జిల్లాలో పూర్తిస్థాయి బలం లేకపోయినా ప్రభావితం చూపే అనుచరగణానికి మాత్రం జనసేన పార్టీకి కొదవలేదు.. కాపు సామాజికవర్గం లెక్కలు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ప్రభావంతో జనసేనాని ఏ కార్యక్రమానికి పిలుపిచ్చినా.. దండిగానే అభిమానులు హాజరవుతుంటారు. అయితే జనసేనకు సంస్థాగత నిర్మాణం జరగకపోవడంతో 2019 ఎన్నికల్లో ఆ పార్టీ కొన్ని స్థానాలలో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ ప్రభావితం చూపే ఓట్లు మాత్రం సాధించలేకపోయింది.
2024 ఎన్నికల్లో కూటమి గెలుపులో జనసైనికులు కీలకపాత్ర మాత్రం పోషించారు.. రాష్ట్రంలో కూటమి పార్టీ భారీ విజయం సాధించడంతో పాటు జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించగలిగింది. ప్రకాశం జిల్లాల్లో పొత్తులు లెక్కలు కుదరక, జనసేన పోటీ చేయలేకపోయింది. దాంతో గెలిచాక ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జనసేనకు నూతన ఊపు ఉషారు తీసుకువస్తారని క్యాడర్ ఆశిస్తూ వచ్చారు… అందులో భాగంగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జిల్లా పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నా పవన్‌కళ్యాణ్ పార్టీలో చేర్చుకున్నారు.
జిల్లా వైసీపీలో ఎదురులేని నేతగా వెలుగొందిన బాలినేని చేరికతో జనసేన బలం పెరుగుతుందని అంతా ఆశించారు.. కానీ అప్పటి నుంచే జనసేనకు ఉన్న బలం కూడా కకావికలవుతోందంట.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోనికి తీసుకోవద్దని జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ తో పాటు, స్థానిక ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కూడా జనసేన అధినేతకు ఫిర్యాదులు చేశారట… కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మెగా ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్న బాలినేని చేరికకే ప్రాధాన్యత ఇచ్చారు.
బాలినేని జనసేనలో చేరడంతో జిల్లా వ్యాప్తంగా వైసీపీ నుంచి భారీస్థాయిలో వలసలు ఉంటాయన్న అంచనాలు తప్పాయి. మాజీ మంత్రి గతంలో తన వెంట నడిచిన కేడర్ను వెంట తీసుకురావడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు… ఒంగోలులో తాను నిలబెట్టి గెలిపించుకున్న 20 మంది వైసిపి కార్పొరేటర్ లను మాత్రం జనసేనలోకి తీసుకు రాగలిగారు. అయితే వైసీపీ క్యాడర్‌ని మాత్రం కదిలించలేకపోయారు. ఇక జనసేనలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇంత వరకు పదవుల పరంగా ఎలాంటి ప్రాధాన్యతా దక్కలేదు.
బాలినేని పార్టీలో చేరి సంవత్సరం గడిసిపోయినప్పటికీ ఎటువంటి పదవి కట్టబెట్టకపోవడంతో మాజీ మంత్రితోపాటు అతని వెంట వచ్చిన క్యాడర్ కూడా అసంతృప్తితో కనిపిస్తోంది.. జిల్లాలో మొక్కుబడి కార్యక్రమాలలో పాల్గొనడం తప్ప మాజీ మంత్రి వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదనే భావన కూడా అధిష్టానంతో పాటు క్యాడర్లో ఉందట… పార్టీ బలోపేతానికి బాలినేని కృషి చేస్తారనుకుంటే, ఆయన ఎంట్రీతో పార్టీలో గ్రూపుల పోరు పీక్ స్టేజ్‌కి చేరింది.
గ్రూపు రాజకీయాలను కంట్రోల్ చేయకపోగా జనసేన అధిష్టానం బాలినేని, రియాజ్ వర్గాలకు వేర్వేరుగా బాధ్యతలు అప్పగిస్తుండటంతో.. రీసెంట్ గా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఆనుకున్న స్థాయిలో విజయవంతం అవ్వలేదంటున్నారు… పార్టీకి అభిమానులు, జనసేనకు సినీ ఫ్యాన్స్ అపారంగా ఉన్నప్పటికీ.. వారందరినీ ఏకతాటిపై నడిపించగలిగే నాయకుడు లేకపోవడంతో జనసేన బలోపేతం ఏమో కాని… పార్టీకి కోలుకోలేని నష్టం జరుగుతోందంటున్నారు. నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అధిష్టానం ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడంతో రోజురోజుకీ వర్గ పోరు పెరిగిపోతోంది.
ఇదే సమయంలో పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న షేక్ రియాజ్ క్యాడర్ లో ఉన్న చిన్నపాటి విభేదాలను కూడా సరిదిద్దలేకపోతున్నారన్న విమర్శలున్నాయి .. దాంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న జనసేన నేతలు కూడా కొందరు బాలినేని వెంట నడవడం మొదలుపెట్టారట…. ఇలా వైసీపీ నుంచి వచ్చిన నేతలతో పాటు రియాజ్ మీద కోపంతో. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట నడుస్తున్న నేతలతో జనసేనలో ఒక సెపరేట్ గ్రూపు తయారైంది… జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం హూడా చైర్మన్‌గా కొనసాగుతున్న రియాజ్ తన వెంట ఉన్న వారితో, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల వెంట నడుస్తున్నారంట…
ఆ వర్గపోరుతో జిల్లా వాసుల్లో జనసేనపై తెగ సెటైర్లు వినిపిస్తున్నాయి. బాలినేని వర్గాన్ని వైసీసీ జనసేన, దామచర్ల వెంట నడుస్తున్న రియాజ్ గ్రూపుని టీడీపీ జనసేన…. అని పిలుచుకుంటూ.. ఒంగోలు వాసులు ఇక ఆ పార్టీ బలోపేతం అయ్యేదెప్పుడని చర్చించుకుంటున్నారు. రెండు గ్రూపులను ఏకం చేసే పని మాత్రం పార్టీ అధిష్టానం చేపట్టకపోవడంతో కేడర్ ఎవరి వెంట నడవాలో అంతుపట్టక సతమతమవుతుందట…
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇలా ఎడముఖం, పెడమొహంగా ఉన్న రెండు గ్రూపులను ఏకం చేయకపోతే జనసేనతో పాటు కూటమికి కూడా నష్టం తప్పదంటున్నారు… పీట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు … ఈ జనసేనలో లుకలుకలు వైసీపీకి కలిసి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి పోటీ చేయని జనసేనకు స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ ప్రాధాన్యత పెంచుతుందన్న ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కింద స్థాయి నుంచి నిర్మాణం చేపట్టాలటే రెండు గ్రూపులను ఏకం చేయడానికి అధిష్టానం చర్యలు తీసుకోవాలని కేడర్ కోరుతోంది. మరి జనసేనాని ఆ ప్రక్షాళన చర్యలు ఎప్పటికి మొదలు పెడతారో చూడాలి.
Also Read: కేసీఆర్‌కు కవిత షాక్.. ‘TRS’ పేరుతో కొత్త పార్టీ? గులాబీ కోటలో ముసలం!
Story by: Apparao, Big Tv