Janatha Garage Special Story : గువ్వల గుట్టలో గుబులు.. ఓ పల్లె వ్యథ..

Janatha Garage Special Story : గువ్వల గుట్టలో గుబులు.. ఓ పల్లె వ్యథ..

Guvvalagutta Health Issue
Share this post with your friends

Guvvalagutta Health Issue

Janatha Garage Special Story : ఇది ఓ పల్లె కథ .. గుక్కెడు మంచి నీటికోసం అవస్థలు పడుతూ అవి దొరకక తన బిడ్డలధాహర్తిని తీర్చేందుకు గరళాన్ని తాపుతున్న అంతులేని వ్యథ గొంతుదిగిన ఆ నీరే ఆ పల్లెబిడ్డల పాలిట శాపమై వారిజీవితాలను అంపశయ్యపైకి చేర్చుతూ వారి భవిష్యత్ పై ఆంధకార మేఘాలను కమ్మేలా చేస్తుంది. ఇంత జరుగుతున్నా.. ఊపిరి నిలుపుకోవడం కోసం కొండకోనల నడుమ ఆ పల్లెజనులు ఆక్రందన చేస్తున్నా .. వారి వేదన అరణ్యరోదనగా మారి ఎవరిచెవికి ఎక్కడంలేదు.. ఆ పల్లెజనుల గుండె బాధ ను జనతా గ్యారేజ్ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం..

కొండగుట్టల నడుమ .. రణగొన ధ్వనులకు తావేలేని ప్రశాంతమైన పల్లెటూరది. నగరాలకు దూరంగా ఉండటం .. చుట్టూ దట్టమైన అడవుల వల్ల వాయుకాలుష్యం అన్నది అక్కడ మచ్చుకైనా కనిపించదు. ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకున్నట్లుగా ఆ ప్రాంతం కనువిందు చేస్తుంటుంది. అక్కడి పల్లె ప్రజానికానికి బతుకు తెరువు వ్యవసాయమే. గిరిధరుల నడుమ ఉన్న పంట పొలాలను సాగు చేసుకుంటూ తమకున్న జీవాలను మేపుకుంటూ బతుకులు వెల్లదీస్తారు . నల్లమల సానువుల్లో కొలువైన ఆ పల్లెకు అత్యంత సమీపంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ గంభీరంగా ప్రవహిస్తుంటుంది. మెత్తంగా చెప్పాలంటే అందమైన ఓ క్యాన్వాస్ పేయింటింగ్ లా చూడముచ్చటగా ఉండే అందమైన పల్లె అది.. అదే గువ్వల గుట్ట . పేరుకు తగ్గట్లుగానే రకరకాల పక్షులకు జీవవైవిద్యానికి నెలవైన గువ్వల గుట్ట అది.

ఇంత అందమైన పల్లెకు అంతులేని కష్టంవచ్చింది .భూగర్బంలో ఉన్న జల గరళం జనాల గొంతుదిగి వారి శరీరాలను చిక్కి శల్యం చేస్తోంది. ఏళ్లు గడుస్తున్నా ఆ గండాలు తీరకపోగా అవి సుడిగుండాలుగా మారి పల్లె మెడకు ఉరితాడుగా మారుతుండటంతో అమ్మలాంటి పచ్చని పల్లె గుండెపగిలింది . నీరింకిన కన్నీటి చెలిమెలతో చెప్పలేని వేదన అనుభవిస్తోంది.

నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న ఈ పల్లెటూర్లో ఏ కుటుంబాన్ని కదిలించినా అంతులేని వేదనే వినిపిస్తోంది. పట్టు మని పదేళ్లు కూడా లేని స్వప్న.. ఆటపాటలతో చదువుసంధ్యల్లో మునిగితేలాల్సిన వయసులో కిడ్ని జబ్బుతో అనారోగ్యపాలై ఇంటికే పరిమితమైపోయింది. తన శరీరంలో ఏం జరుగుతుందో తానెందుకు ఇంట్లో ఉంటుందో తనకు తెలియదు .అంతులేని అలసట ..భరించలేని బాధ.. తననెందుకు బాధిస్తున్నాయో ఆ పసిబిడ్డకు అర్ధంకావడంలేదు . స్వప్న ఆరోగ్యం కాపాడాలని తల్లిదండ్రులకు ఉన్నా ఆస్పత్రుల చుట్టూ తిప్పేంత ఆర్థిక స్థోమత లేదు. కూలి చేస్తేనే పొట్ట నిండే పరిస్ధితి ఉండటంతో కొడుకును ఇంట్లో స్వప్నకు తోడుంచి నిత్యం పొలం పనులకు వెల్లిపోతారు తల్లితండ్రులు. దీంతో అనారోగ్యం మిగిల్చే బాధలను .. భరిస్తూ మౌన మునిగా మారిపోయింది. తానెందుకు అనారోగ్యానికి గురైందో తన భవిష్యత్ అనేది ఎలా ఉంటుందో తెలియని స్థితి స్వప్నది. తాగే నీరే పాప పాలిటశాపమై.. వ్యవస్థ చేసిన తప్పిదానికి గాలిలో దీపంగా మారిపోయింది స్వప్నజీవితం.

ఒక్క స్వప్నేకాదు ఆ గ్రామంలో ఎందరో కిడ్నీ జబ్బులతో అవస్థలు పడుతున్నారు. అంధకారంగా మారిన భవిష్యత్ ను తలుచుకొని ఆవేదన చెందుతున్నారు. రాజీ అనే వృద్ధురాలు భర్త, ఇద్దరు కుమారుల కుటుంబాలతో కలిసి గ్రామంలో నివసిస్తోంది. ఉన్న మూడెకరాల పొలంలో ఇంటిళ్ల పాది కష్టం చేస్తేనే వారి కుటుంబం గడిచేది. అయితే ఏడాది క్రితం రాజీ అనారోగ్యానికి గురైంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపిస్తే కిడ్నీలు రెండు చెడిపోయాయని చెప్పారు. కిడ్నీ మార్చాల్సిన పరిస్థితి అని చెప్పారు. దీంతో అంత ఆర్థిక స్థోమత లేక మందులతో కాలం వెల్లదీస్తున్నారు . రాజీ ఆరోగ్యం రోజు రోజుకు క్షీనిస్తోంది. ప్రస్తుతం రోజుకి లీటర్ నీరుమాత్రమే తాగాలి అవి కూడా మినరల్ వాటర్ తాగమని చెప్పడంతో కుమారులు నిత్యం 30 నుంచి 40 రూపాయలు పెట్టి తల్లికి తాగడానికి నీరు కొనుక్కొస్తున్నారు. ఎప్పుడైనా డబ్బులు లేకుంటే అందుబాటులో ఉండే నీరే తాగాల్సిన పరిస్థితి రాజిది. ప్రస్తుతం నెలకు రెండు సార్లు ఆస్పత్రికి తీసుకు వెల్లి చూపిస్తున్నారు. వెల్లినప్పుడల్లా 15వేలకు పైగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో అప్పుచేసి మరి తల్లికి చికిత్స కోసం ఖర్చుపెట్టాల్సిన దుస్థితి ఈ కుటుంబానిది. రాజీకి ఈ జబ్బురావడానికి ప్రధాన కారణం వారు తాగే నీరే. ఇంటి ఆవరణలోని బోరు నుంచి వచ్చే నీటినే గతంలో తాగే వారు కానీ బోరు నీరు తాగడం వల్లె కిడ్నీలు చెడిపోవడంతో ప్రస్తుతం తాగునీటికోసం ఆ కుటుంబం నిత్యం మినరల్ వాటర్ కొనుక్కుంటోంది. వంట కోసం మాత్రం బోరు నీరే వాడుతున్నారు. ఈ కుటుంబ అవస్థలకు కారణం భూగర్భ జలం.

గ్రామంలో కిడ్నీ జబ్బుల ప్రభావం ఎందరో విద్యార్థుల చదువులకు సమాధులు కడుతున్నాయి. దానికి నిదర్శనమే గణేష్ . గణేష్ తండ్రి బామ్నా కిడ్నీ జబ్బుతో మంచానికే పరిమితం కావడంతో ఉన్న కాస్తా పొలాన్ని సాగుచేసి కుటుంబ బాధ్యత మోసే పని గణేష్ భుజాలపై పడింది. దీంతో 8వ తరగతితోనే చదువు ఆపేసి వ్యవసాయం చేస్తూ తండ్రిని ఆస్సత్రుల చుట్టూ తిప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందదని భావించి బామ్నాను నెలకు రెండుమూడుసార్లు మిర్యాలగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళుతున్నారు .అక్కడ ఆస్పత్రులకు తండ్రిని తీసుకెళ్లి మందులు తెచ్చి వాడాలంటే నెలకు దాదాపు 20 వేలపైనే ఖర్చు అవుతోంది. ప్రస్తుతం వ్యవసాయం నుంచి వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకురావడమే కష్టంగా ఉండడంతో తండ్రి ఆరోగ్యం కోసం బైట వడ్డికి 5 లక్షలు, బ్యాంకులో 2లక్షలు తెచ్చి ఖర్చుపెట్టినా ఆరోగ్యం మెరుగుపడని పరిస్థితి. ఈ కష్టాలకు కారణం జల గరళం

ఒక్కరు కాదు ఇద్దరు కాదు గ్రామంలో ఏ ఇంటికి వెల్లినా కిడ్నీ సమస్యను ఎదుర్కుంటున్న బాధితులే కనిపిస్తారు. పిల్లల నుంచి పెద్దల దాకా రిపోర్టులు పట్టుకొని తమ గోడును చెప్పుకుంటారు. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగామో డాక్టర్లు ఏమంటున్నారో చెప్పుకొస్తారు. భయం నీడన నిత్యం బతుకుతూ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. కొందరైతే పట్టించుకునే వారులేక వచ్చే పెన్షన్ ను దాచుకొని రెండుమూడు నెలలోకోసారి పట్నానికి వెళ్లి ప్రైవేటు ఆస్సత్రుల్లో వేలకు వేలు ఖర్చులు పెట్టి డాక్టర్లకు చూయించుకొని మందులు తెచ్చుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరికొందరు బతికినన్నాళ్లు బతుకుతాం అంటూ ప్రాణాలను గాలిలో దీపంగా మార్చేసి బతుకులీడుస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే స్కూల్ చదివే చిన్నారులు సైతం కిడ్నీలలో రాళ్లు వచ్చి అవస్థలు ఎదుర్కునేంతగా ఉంది .

కిడ్నిలు పాడై ఆస్పత్రులకు వెళ్లలేని దైన్యంలో కొందరుంటే.. అప్పులు చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవడానికి అవస్థలు పడేవారు మరికొందరు.. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తమ ఆస్పత్రి రిపోర్టులను పట్టుకొని తమ బతకులకు భవిష్యత్ ఉండో లేదో అనే దైన్యంలోనే కనిపిస్తారు గువ్వల గుట్టలో. దీంతో పాటు కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నెముక సమస్యలు, లివర్ సమస్యలు సైతం ఎదుర్కుంటున్నారు. తమ అనారోగ్యాలకు మూలకారణం. తాము తాగే భూగర్భజలమైన నీరని వారికి తెలుసు కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో వేరే దారిలేక అదే తాగుతున్నామని కొందరు చెప్పగా మరికొందరు గ్రామంలో క్యానుకు 10 రూపాయలు పెట్టి ఫిల్టర్ నీరు కొనుక్కొని తాగుతున్నామన్నారు. గువ్వల గుట్టలో ప్రజల మంచినీటి ఇక్కట్లను తీర్చాలని గతంలో దేవరకొండ సబ్ డివిజన్ పోలీసు అధికారులు ఆర్వో వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసినా అది కొన్నాళ్లకే పాడైపోయింది. దీంతో గ్రామస్థులకు మళ్లీ బోరునీరే దికైంది. దీంతో మళ్లీ వీరికి అనారోగ్యాలు తప్పడంలేదు. ఈ ప్రాంత గ్రామస్తులంతా నిత్యం రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల వారే కావడంతో నీటితో వస్తున్న ఈ అనారోగ్యాలు వారికి ఆర్థికంగా సహితం తట్టుకోలేనంత భారంగా మారుతున్నాయి.

గ్రామంలో పరిస్థితి బాలేకపోవడంతో చాలామంది తమ పిల్లలను గ్రామాలకు దూరంగా ఉన్న పట్టణాలలోని హాస్టళ్లకు పంపేస్తున్నారు. మరికొందరు బతికుంటే బలుసాకైనా తినొచ్చు అని ఇళ్లకు తాలాలు పెట్టి వలసబాట పడుతున్నారు. మరికొందరు వ్యవసాయం తప్పా మరో పని రాక పోవడం గ్రామంలో ఉన్న పెద్దవారిని చూసుకోవల్సిన బాధ్యతల కారణంగా పసిబిడ్డలతో కలిసి ఊర్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. అయితే గ్రామంలో ఉన్న వారి మనస్సుల్లో మాత్రం పిల్లల భవిష్యత్ పైన అంతులేని దిగులు ఉంది. ఎలాగోలా ఫిల్టర్ నీటిని కొని పిల్లలకు తాపుతున్నా.. అవి కూడా భూ గర్భజలం శుద్ధి చేస్తేనే కదా వచ్చేది. మరి అవిపిల్లలకు మంచిదేనా.. వాటిలో ఉన్న హానికర లవణాలు ఫిల్టర్ వల్ల పోతాయా అని రకరకాల సందేహాలున్నా విధిలేక మంచివే అని తమకు తాము సరిపెట్టుకొని తాము తాగుతూ పిల్లలకు కూడా ఆ నీటినే తాపాల్సిన దైన్యం ఆ గ్రామస్థులది.

పక్కనే పారేనీరు ఉన్నప్పటికీ వీరెందుకు బోర్లపై ఆదారపడుతున్నారు. గ్రామస్థులంతా కలిసి తలా ఓ చేయి వేసుకొని పైప్ లైన్ వేసుకొని కృష్ణానీటిని గ్రామంలోకి తెచ్చుకోవచ్చుకదా అని ప్రశ్నిస్తే .. దాదాపు తమ గ్రామానికి రెండు కిలోమీటర్లకు లోపే కృష్ణానది బ్యాక్ వాటర్ ఉందని వర్షాకాలంలో నదినీరు తమ గ్రామాన్ని తాకుతుందని అయితే నది నుంచి గ్రామానికి మంచి నీటిని తెచ్చుకోవడానికి పైప్ లైన్ వేయించుకొని వాటిని ఫిల్టర్ చేయించాలంటే దాదాపు 15 లక్షల దాకా ఖర్చవుతుందని అంత భరించి భగీరధ ప్రయత్నం చేయడం కూలి నాలి చేసుకుని బతికే తమకు శక్తికి మించిన భారమనేది గ్రామస్థుల అభిప్రాయం.

రాష్ట్రంలో తాగునీటి సమస్యేలేదని గ్రామ గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది. అయితే మహానగర శివార్లలో ఈ పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉన్నా మారుమూల గ్రామాల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. జనతా గ్యారేజ్ టీం గువ్వల గుట్టకు సమీపంలో ఉన్న కంబాలపల్లి, పోగిళ్ల రేకులారం లాంటి చాలా ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీరు వస్తుందా అక్కడ గ్రామాల్లో పరిస్ధితి ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయగా చాలా చోట్ల మంచినీరు సక్రమంగా అందడంలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో చాలామంది బోరు నీటిని బావుల నీటిని తాగి గొంతుతడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల బావులలో ఉరే నీటిని ఇళ్లలోకి పైపులైన్లద్వారా వేసుకొని తాగునీటిని వంట అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. భూగర్భజలం మంచిది కాదుకదా అడిగితే వారి నుంచి వచ్చిన సమాధానాలు వారి దైన్యాన్ని తెలుపుతాయి. అమావాస్యకు, పౌర్ణమికి వచ్చే మిషన్ భగీరథ నీటి ట్యాంకులు ఉండి ప్రయోజనం లేని సమానంగా మారిన తీరును తేటతెల్లం చేస్తాయి.

గువ్వల గుట్టలో కూడా మిషన్ భగీరథ కథ ఓ పేల్యూర్ స్టోరీగా మారింది . ట్యాంకు ప్రారంభం అయ్యాక మూడు నెలలు నీరందిందో లేదో తర్వాత నుంచి ఆ నీటి జాడేలేదు. దీంతో గ్రామంలో అందరూ తాగునీటికి వంట అవసరాలకు బోరుపైనే ఆధారపడి బతుకుతున్నారు. గత కొన్ని సంవత్సరాల కాలంగా గువ్వల గుట్టలో బోరు నీటినే తాగుతుండటం, ఆ బోరు నీటిలో సుద్ధ ఇతర హానికర లవణాలు ఉండటంతో కొన్నేళ్లుగా ఈ గ్రామస్థులు తీవ్ర స్థాయిలో అనారోగ్యాలబారిన పడుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ జబ్బుల పాలవుతున్నారు. గతంలో కిడ్నీ వ్యాధులతో ఈ ఒక్క గ్రామంలో 20 మంది దాక మరిణించగా ప్రస్తుతం 150 మంది దాకా రకరకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ విషయం అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చినప్పటికీ వారు ఇచ్చిన హమీలు సాక్షాత్తు కృష్ణమ్మ సాక్షిగా నీటిమీద రాతలుగా మారి పోయాయి. దీంతో చెంతనే కృష్ణమ్మ ఉన్నా వారికి గుక్కెడు మంచినీరు అందని పరిస్థితి నెలకొంది. ఎవరిని కదిలించినా వారు విన్నవించేది ఒక్కటే తమ బతుకులను కాపాడమని తమ భవిష్యత్ తరాలను వ్యాధులబారిన పడకుండా చూడమని. తమ గ్రామాలకు మంచి నీటి భాగ్యం కల్పించమని.

గొంతు తడిపే గుక్కెడు జలం గరళంగా మారి ప్రజారోగ్యాన్ని అంపశయ్యపై చేర్చినా అందరూ చోద్యం చూస్తున్నా వాళ్లే తప్పితే వారికి సహాయ సహకారాలందించి వారి ఆపతి తీర్చేవారే కరువయ్యారు. ప్రాణాల కోసం పరితపిస్తూ తాము చేసే ఆక్రందన ఏ నేతలకు ఎందుకు వినిపించడం లేదు. అప్పులు తెచ్చి ఆరోగ్యాలను కాపాడు కోవాల్సిన దైన్యంలో తాముంటే .. పాలకులేం చేస్తున్నట్లు. ఇవి అక్కడి జనం సందిస్తున్న ప్రశ్నలు. ప్రభుత్వం అధికార యంత్రాంగం తప్పక సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు.

.

.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Lok Sabha new bills: IPC, CRPCలకు రాం రాం.. సరికొత్త ‘భారతీయ’ చట్టాలకు శ్రీకారం..

Bigtv Digital

CBI: వివేకా హత్య కేసులో జగన్ పేరు!.. అవినాష్‌రెడ్డి కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు సీబీఐ కౌంటర్

Bigtv Digital

Ishan Kishan: త్రిపుల్ సెంచరీ చేసేవాడిని.. ఇషాన్ కిషన్ విక్టరీ మెసేజ్..

BigTv Desk

Congress Election Campaign : బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ అస్త్రాలు.. రేపటితో ప్రచారానికి తెర

Bigtv Digital

CM Revanth Tweet | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సిఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్

Bigtv Digital

Online Delivery Shit | ఆన్ లైన్ డెలివరీలో మలం!.. కస్టమర్ కోపంతో ఏం చేశాడంటే?

Bigtv Digital

Leave a Comment