Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన కేసులో బుధవారం హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిపై ముందుజాగ్రత్త చర్యలు ఇప్పటికే ప్రారంభించారు.
కాళేళ్వరం ప్రాజెక్ట్‌ల్లోని బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి 2024 మార్చిన 14 జీవోను జారీ చేశారు. ఇప్పటికే ఈ కమిషన్ విచారణను పూర్తి చేసి తమ నివేదికను కూడా సమర్పించింది. అయితే ఈ కమిషన్ ఏర్పాటునే సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్‌రావు, IAS స్మితా సబర్వాల్, మాజీ IAS ఎస్‌కే జోషి జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించనుంది.
నిజానికి ఈ తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు బీఆర్‌ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇందులో వారికి వ్యతిరేకంగా తీర్పు వస్తే కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని చర్యలు చేపడుతోంది. అప్పుడు కేసీఆర్ సహా పార్టీలోని కీలక నేతలు చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదే సమయంలో హుటాహుటిన బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్‌రావు ఢిల్లీకి పయనమవడం మరో చర్చకు దారి తీసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. సంచలన ఆరోపణలు చేశారు.
హరీష్‌రావు ఢిల్లీ పర్యటన ఇప్పుడు పొలిటికల్‌గా ప్రకంపనలు రేపింది. అయితే హరీష్‌రావు పర్యటనకు అనేక కారణాలు ఉన్నా.. ఒక కారణం మాత్రం పక్కా. కాళేశ్వరం కేసులో చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌ల ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఇందులో ప్రతికూల తీర్పు వస్తే.. మరుసటి రోజే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి హరీశ్ రావు, వినోద్ రావు అడ్వకేట్లతో చర్చలు జరిపారు.
కానీ ఈ పర్యటనలో కేవలం న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు అడ్వకేట్లనే కాకుండా, పలువురు రాజకీయ నేతలతోనూ హరీశ్, వినోద్ సమావేశమైనట్లు ప్రస్తుతం ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల్ని కలిసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
నిజానికి కాళేళ్వరం స్కామ్‌పై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వానికి, హోం శాఖకు సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాశారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి కదలిక రాకపోవడంతో తాము మరోసారి లేఖ రాశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఇప్పుడు హైకోర్టులో తీర్పు కేసీఆర్ అండ్ కోకు వ్యతిరేకంగా వస్తే సీబీఐ రంగంలోకి దిగుతుందనే చర్చ అయితే జరుగుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖ ఏంటి? అందులో ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. బండి సంజయ్ ఇప్పుడు మరో కొత్త టాపిక్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అసలు కాళేశ్వం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఎంత? అని ప్రశ్నిస్తున్నారు ఆయన. లక్ష కోట్లు అని గతంలో ప్రకటించారని.. ఇప్పుడేమో 9 వేల కోట్లు అంటున్నారనేది బండి సంజయ్ వేస్తున్న ప్రశ్న.
ఇవన్నీ తేలాలంటే సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడానికి ఇంకా చాలా కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు, డీపీఆర్ సహా కీలక అంశాల్లో వాప్కోస్ సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రమేయం కూడా ఉంది. సో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు ఉండడంతోనే ఈ కేసును సీబీఐకి అప్పగించామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాటు నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ, అలాగే ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లు మరింత లోతైన దర్యాప్తు అవసరమని సూచించాయి. అందుకే మ్యాటర్ సీబీఐ చేతికి చేరిందంటున్నారు.
నిజానికి ఈ కేసులో సీబీఐ ఇంత వరకు ఎంట్రీ ఇవ్వకపోవడం కూడా కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే విచారణ కోరింది. అంతేకాదు తెలంగాణలో 2022లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి సంబంధించి సాధారణ సమ్మతిని రద్దు చేసింది. ప్రతి కేసుకు ప్రత్యేక అనుమతి తీసుకోవాలన్న రూల్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం కేసు విషయంలో ఆ కన్సెంట్ తొలగించింది. సో ఫస్ట్ ఈ కాళేశ్వరం కేసును సీబీఐ టేకప్ చేసేముందు కేంద్ర హోంశాఖ నుంచి ఫార్మాలిటీగా అనుమతి తీసుకొని.. FIR రిజిస్టర్ చేస్తే దర్యాప్తును అధికారికంగా ప్రారంబించినట్టు అవుతోంది. కానీ అది జరగడం లేదు. ఇవన్నీ జరగాలంటే బుధవారం కోర్టు ఇచ్చే తీర్పు అతి కీలకం కానుందనే చర్చ అయితే జరుగుతోంది.
కాళేశ్వరం కమిషన్‌పై బీఆర్ఎస్ నేతలు ఫోకస్ చేయడానికి చాలా కారణాలున్నాయి. ఎందుకంటే ఈ రిపోర్ట్‌ను బేస్ చేసుకొని విచారణ జరిపితే.. చాలా విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ అందులో పొందుపరిచిన వివరాలు అలాంటివి మరి. ఐదుగురు రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లతో వేసిన కమిటీ రిపోర్ట్ ను తొక్కిపెట్టడం పెద్ద తప్పుగా భావించింది కమిషన్. మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మించొద్దని లిఖిత పూర్వకంగా రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోలేదని కమిషన్ రిపోర్ట్ తేల్చింది. అంతేకాదు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని మొదట నిర్ణయం తీసుకున్నాకే.. ఆయా చోట్ల బ్యారేజీలు కట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసే బాధ్యతను వ్యాప్కోస్ అప్పగించారని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ధారించింది. ఆ తర్వాత వ్యాప్కోస్ రిపోర్ట్ ఆధారంగానే బ్యారేజీలు కట్టామని కేసీఆర్, హరీశ్ రావు కమిషన్ ముందు సాక్ష్యాలు ఇచ్చారు. ఇది కంప్లీట్ మిస్ లీడింగ్ వ్యవహారం తప్పుడు సాక్ష్యాలు అని ఘోష్ కమిషన్ గుర్తించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జీవోలు 231, 232, 233 జారీ చేశారని, కానీ వాటిని క్యాబినెట్ ముందు ఉంచలేదని, మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమేనని గుర్తించింది కమిషన్ రిపోర్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు 71,436 కోట్ల రూపాయలు అని ప్రధాన మంత్రికి 2016 ఫిబ్రవరి 21న నాటి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే అప్పటికి వ్యాప్కోస్ ఫైనల్ డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించలేదు. అలా జరగకముందే కేసీఆర్ స్వయంగా 71 వేల కోట్లు అవుతుందంటూ ప్రధానికి లేఖ ఎలా రాస్తారని రిపోర్ట్ లో క్వశ్చన్ చేశారు.
బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ టర్న్ కీ పద్ధతిలో జరగాలని కేంద్ర జలవనరుల సంఘం సూచించగా.. లంప్సమ్ పద్ధతిలో నిర్మాణ సంస్థలకు పనులు కట్టబెట్టడం ఏంటని ఘోష్ కమిషన్ రిపోర్ట్ తప్పుబట్టింది. ఎవరైనా అలా చేస్తారా అని క్వశ్చన్ చేసింది. అంతే కాదు ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచేయడం వెనుక మతలబులనూ బయటపెట్టింది. మొదట ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 38,500 కోట్లు కాగా.. ఆ తర్వాత దానిని 71,436 కోట్లకు, ఫైనల్ గా 1,10,248 కోట్ల రూపాయలకు పెంచేశారన్నది.
బ్యారేజీల డిజైన్‌ను ఫ్లోటింగ్ స్ట్రక్చర్లుగా అంటే తేలియాడే విధంగా చేసి, వాటిని రిజర్వాయర్లుగా వినియోగించారని, ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్ కు విరుద్ధమని గుర్తించింది కమిషన్. మేడిగడ్డ నిర్మాణం పూర్తి కాకుండానే పూర్తయినట్లు నిర్మాణ సంస్థకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని, బ్యారేజీల్లో లోపాలు బయటపడినా.. లీకేజీలు కనిపించినా పట్టించుకోకుండా వీటిని జారీ చేయడాన్ని కమిషన్ నివేదిక తప్పుబట్టింది.
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు అందరి నిర్లక్ష్యంతో కాళేశ్వరాన్ని కుప్ప చేసి పెట్టారని కమిషన్ తన 650 పేజీలతో మూడు వాల్యూమ్‌లుగా ఇచ్చిన రిపోర్ట్ లో స్పష్టం చేసింది. కాళేశ్వరంపై 2024 మార్చి 13న ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 58 అఫిడవిట్ల ఆధారంగా 115 మంది అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులను విచారించారు. గతేడాది ఆగస్టు 21న ఓపెన్ కోర్టు నిర్వహించి స్టేట్‌మెంట్లు సేకరించి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ తో కాళేశ్వరం డార్క్ సీక్రెట్స్ అన్నీ అఫీషియల్ గా ఓపెనప్ అయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చి, తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా మేడిగడ్డకు షిఫ్ట్ చేయించింది కేసీఆర్ అని కమిషన్ తెలిపింది. అప్పటి సీఎం కేసీఆర్‌తో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కూడా ఉద్దేశపూర్వకంగానే ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారన్నది కమిషన్. ఇక ఎస్కే జోషి.. అప్పట్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీఎస్‌గా ఉన్నారు. ఈయన ఎక్స్ పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని, పరిపాలనకు, అనుమతులకు సంబంధించి బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించారని, కాళేశ్వరం కార్పొరేషన్ ఫెయిల్యూర్‌కు బాధ్యుడన్నది కమిషన్. ఇక స్మితా సబర్వాల్.. అప్పటి సీఎంవో సెక్రటరీగా ఉన్నారు. ఆమె తన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోయారని, కేబినెట్ అనుమతులకు సంబంధించి బిజినెస్ రూల్స్ ప్రకారం నడుచుకోలేదన్నది కమిషన్.
అందుకే ఈ కమిషన్ ఏర్పాటునే సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషిది ఈ ప్రాజెక్ట్ నిర్మానంలో కీలక పాత్ర అని తెలిపింది కమిషన్. అందుకే వీరంతా కూడా కోర్టును ఆశ్రయించారు. మరి కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Also Read: పిక్చర్ ఇంకా బాకీ ఉంది.. సంబరపడొద్దు.. BRSకు చామల స్ట్రాంగ్ వార్నింగ్
Story by: Anup, Big Tv