Kavitha: ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే పోరాటాలకు పురుడి గడ్డ అన్న పేరుంది..అక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. ఏదైనా పార్టీని ఆదరించాలన్న లేదా ఆ పార్టీని అధ:పాతాళానికి తొక్కేయాలన్నా ఖమ్మం జిల్లా ప్రజలకే చెల్లింది. అలాంటిది జిల్లాపై కొత్త పార్టీ పెడతానంటున్న కల్వకుంట్ల కవిత ఫోకస్ పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెడతానని ప్రకటించిన నాటి నుంచే జాగృతి నేతలతో పాటు సింగరేణి కార్మిక నేతలతో కవిత పలు దాఫాలు భేటీ అయి చర్చలు జరిపారు. ఇంకోవైపు కవిత ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. అగ్ర సామాజిక వర్గాలకు చెందిన నేతలతో పాటు, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న వ్యక్తుల కోసం తెగ అన్వేషిస్తున్నారంట. మరి కారు పార్టీనే కాదన్న ఖమ్మం జిల్లాలో కవిత స్పీడ్ కనబర్చగలరా?
నిజామాబాద్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత .. పలు మార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నేతలతో భేటీ అవుతూ.. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి బీజం పడిందో .. ఆ జిల్లా నుంచే తన సత్తా చాటాలనే వ్యూహంతో కవిత పావులు కదుపుతున్నారన్న చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీ రెండు పర్యాయాలు అధికారంలో వచ్చినా ఖమ్మం జిల్లాలో పెద్దగా ప్రాబల్యం చాటుకోలేక పోయింది.
ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని, కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని కేసీఆర్ ఖమ్మం జిల్లాలో బలప్రదర్శనలు చేశారు. పోనీ వలస నేతలతో పార్టీ బలోపేతమైందనుకున్నా.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గులాబీ పార్టీ స్పందించిన పాపాన పోలేదట. చివరకు కవిత తెలంగాణ ఉద్యమ సమయంలో స్థాపించిన జాగృతి సంస్థలో ఉన్న వ్యక్తులను సైతం ఏనాడు గులాబీ పార్టీ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి
ఇప్పుడు కొత్త పార్టీ సన్నాహాల్లో ఉన్న కవిత జాగృతి గ్రూపును యాక్టివ్ చేసుకుంటూ ఇంకోవైపున సింగరేణి సంస్థల కార్మికులను ఏకం చేసే పనిలో బిజీ అవుతున్నారు. గతంలో గులాబీ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలను సైతం అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి ధీటుగా తన సైన్యం ఉండాలని కవిత వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తున్నారంట. బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు, ఉద్యమకారులను తన వైపు తిప్పుకోవడానికి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తన అన్న కేటీఆర్ తో పాటు, మొన్నటి వరకు ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలను సైతం సమయం దొరికినప్పుడల్లా ఏకిపారేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
తన వ్యూహాలతో బీఆర్ఎస్‌ను గట్టిగానే ఇరకాటంలో పెడుతున్న కవిత, అదే ఊపుతో తన కొత్త పార్టీ కోసం రాష్ట్రంలో ఇప్పటికే అన్ని జిల్లాలలో అధ్యక్షులు, కార్యదర్శిల ఎంపిక కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లారాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజంగా కవిత ఖమ్మం జిల్లాలో తెతన పార్టీకి తరఫున బలమైన అగ్ర సామాజిక వర్గం నేతలను ఎంపిక చేసుకుంటే, ఆమె పార్టీకి చేకూరే లబ్ధి సంగతేమో కాని.. ముఖ్యంగా జిల్లాలో అసలే అంతంత మాత్రంగా ఉన్న బీఆర్ఎస్‌కు చావుదెబ్బ తప్పదని.. ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో వైఎస్ షర్మిల సైతం సొంతగా పార్టీ పెట్టుకుని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. అక్కడ తన సామాజిక వర్గానికి చెందిన బలమైన ఓటు బ్యాంకు ఉండడం కొంత మేరకు కలిసి వచ్చే అంశంగా భావించి, తండ్రి సెంటిమెంట్ తో వారిని ఓటు బ్యాంకుగా మలుసుకోవచ్చని స్కెచ్ గీశారు. అందుకే అక్కడ రూరల్ ప్రాంతంలో తన క్యాంపు కార్యాలయం కోసం స్థలం కొనుగోలు చేయడంతో పాటు కార్యాలయం నిర్మాణ సైతం చక చకా జరిగిపోయాయి. కానీ తీరా ఎన్నికల ముందు ఆమె పార్టీ సర్దేసి, కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లడంతో ఆమె రాజకీయ ప్రస్థానానికి ఖమ్మం జిల్లాలో బ్రేకులు పడ్డాయి.
షర్మిల తెలంగాణలో తన సొంత పార్టీ పెట్టుకున్న సమయంలో కూడా ఆమె వెంట జిల్లాకు చెందిన బలమైన నేతలు లేరు. పెద్దగా క్యాడర్‌ని కూడా ఏర్పరచుకోలేక పోవడం.. ఆ సమయంలో పెద్ద మైనస్ గా మారింది. ఆ క్రమంలో షర్మిల పార్టీ కి ఖమ్మం జిల్లాలో ఆదరణ కరువైనట్లు కనిపించింది, చివరకు ఆ జెండాను మోసే బలమైన వర్గం కూడా కరువై ఆమె ఏపీ రాజకీయాల్లోకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది.
మరోవైపు సీపీఎం ఒకానొకప్పుడు ఖమ్మం జిల్లాలో చాలా పటిష్టంగా ఉండేది. గ్రామీణ స్థాయిలో ఆ పార్టీకి కొన్ని మండలాల్లో ఇప్పటికీ గట్టిపట్టే ఉంది.. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఎల్ఎఫ్‌తో పొత్తుపెట్టుకున్న సీపీఎం, రాష్ట్రమంతా గులాబీ పార్టీ నేతలకు లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకుందన్న ప్రచారం జరిగింది. దాంతో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి ఘోర పరాభవం చవిచూసింది. సీపీఎం అభ్యర్థులకు డిపాజిట్ సైతం దక్కలేదు. అంటే ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజలు రాజకీయంగా ఎంత చైతన్యవంతులో అర్థమవుతుంది
ఇప్పుడు కవిత పుట్టింటి పార్టీని వదిలేసి సొంతగా రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. తమిళనాడు రాజకీయం తరహాలో తండ్రి వారసురాలు తానే అని ఫోకస్ అయి, రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం ఆమె రాజకీయ పయనంలో తోడుంటారా అంటే కష్టమే అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు అంత ఈజీగా ఏ పార్టీని నమ్మరనడానికి, ఇప్పుడు మనం చెప్పుకున్నవి కొన్ని ఉదాహరణలే.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తన పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదరణ ఉంటుందన్న నమ్మకంతో కనిపిస్తున్నారు.. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలో ఉంచుతానని ఆమె ఇటీవల ప్రకటన కూడా చేశారు.. మరి ఖమ్మం జిల్లా రాజకీయ చదరంగంలో కవిత నెగ్గుకు రాకపోయినా.. కనీసం ఉనికి చాటుకుంటారా? లేక జిల్లాలో ఏదో పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.
Also Read: ఇరాన్ చేతికి అణు బాంబు.. ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?
Story by: Apparao, Big Tv