Chirala Politics: బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్ పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఇప్పటికే రెండు సార్లు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై క్లారిటీ లేకుండా పోయిందంట. గత ఎన్నికల్లో చీరాల వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ అదే నియోజక వర్గంలో కొనసాగే పరిస్థితి లేదంటున్నారు. మరి వెంకటేష్ ముందున్న ప్రత్నామ్నాయం ఏంటి? ఆయన ఏ నియోజకవర్గానికి మకాం మారుస్తారు?
2024 ఎన్నికల్లో చీరాలలో పరాజయం పాలైన కరణం వెంకటేష్
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ్ అంటే తెలియని వారు ఉండరు…పార్టీ ల కంటే అతనికి వ్యక్తిగత ఫేమ్ ఎక్కువ… ఆయన తనయుడు కరణం వెంకటేష్ పొలిటికల్ ఫ్యూచర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చీరాల వైసీపీ ఇన్ ఛార్జ్‌గా ఉన్న కరణం వెంకటేష్ 2024 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2014లో అద్దంకి నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెంకటేష్ పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాతకరణం వెంకటేష్ చీరాలలో సైలెంట్ అయ్యారు. అయితే కరణం వెంకటేష్ చీరాల నుండి సిట్టింగ్ స్థానం మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫ్యాన్ పార్టీలో టాక్ వినిపిస్తోంది. దీంతో కరణం వెంకటేష్ చీరాల కాదనుకుంటే ఎక్కడి వెళ్తారన్న చర్చ జరుగుతోంది.
మార్టూరు, అద్దంకి, చీరాలల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం
ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వెంకటేష్ తండ్రి కరణం బలరామ్ సీనియర్ నేత. మార్టూరు, అద్దంకి, చీరాల నియోజక వర్గాల్లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒంగోలు పార్లమెంట్ నుండి ఒక సారి ఎంపిగా గెలుపొందిన కరణం బలరాం, ఒక సారి ఎమ్మెల్సీగా పని చేశారు. ఓడినా గెలిచినా…అద్దంకి నియోజక వర్గంలో కరణం బలరామ్‌కి సొంత కేడర్ ఉంటూ వస్తోంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో ఉన్న కరణం బలరామ్‌ని నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అద్దంకి నుంచి చీరాలకి మార్చింది అధిష్టానం. చీరాలలో టీడీపీ నుండి పోటీ చేసిన కరణం బలరామ్ గెలుపొందారు. అయితే ఏడాది తిరిగే సరికి కరణం బలరామ్ తన కుమారుడు కరణం వెంకటేష్ తో సహా వైసీపీలో చేరిపోయారు.
కరణం కుటుంబానికి చీరాల వైసీపీ బాద్యతలు
అప్పట్లో చీరాల వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కరణం రాకని వ్యతిరేకించినా…జగన్ పట్టించుకోలేదు. పైగా చీరాల వైసీపీ బాధ్యతలు కూడా కరణం కుటుంబానికి అప్పగించారు. అయితే గత ఎన్నికల్లో బలరామ్ వారసుడు కరణం వెంకటేష్ కి వైసీపీ టిక్కెట్ కేటాయించింది. చీరాల వైసీపీ టిక్కెట్ కోసం 2019లో ఆపార్టీ నుండి పోటీ చేసి ఓటమిపాలైన ఆమంచి కృష్ణమోహన్ ప్రయత్నించినా…జగన్ పట్టించుకోలేదు.
కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వెంకటేష్ ఓటమికి కారణమైన ఆమంచి
దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆపార్టీ నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ నుండి ఆమంచి పోటీ కరణం వెంకటేష్ కి ఎదురుదెబ్బగా మారింది. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ ఓట్లలో చీలిక తీసుకురావడం, కూటమి ప్రభంజనం కొనసాగడంతో 2024 ఎన్నికల్లో కరణం వెంకటేష్ కి ఓటమి తప్పలేదు.
Also Read: క్షణక్షణం ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు..
చీరాలలో వెంకటేష్‌కి పొంచి ఉన్న ఆమంచి గండం
2014లో అద్దంకి నుండి పోటీ చేసిన కరణం వెంకటేష్…ఆ ఎన్నికల్లో కూడా ఓటమిపాలయ్యారు. పోటీ చేసిన రెండు సార్లు ఓటమిపాలు కావడంతో కరణం వెంకటేష్ నిరాశకు గురవుతున్నారంట. ప్రస్తుతం చీరాల వైసీపీ ఇన్ ఛార్జ్ గా కరణం వెంకటేష్ ఉన్నారు. అయితే చీరాలలో తిరిగి 2029లో పోటీ చేయాలన్నా…ఆమంచి గండం కరణం వెంకటేష్‌ని వెంటాడుతోందట. ఈనేపథ్యంలో సేఫ్ ప్లేస్ అయిన నియోజకవర్గానికి మారిపోవాలని కరణం వెంకటేష్ వ్యూహరచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కరణం కుటుంబానికి గెలుపు అవకాశాలు ఇచ్చిన అద్దంకి నియోజకవర్గానికి తిరిగి వెళ్తే ఇబ్బందులు కాస్తయినా తగ్గుతాయని వెంకటేష్ భావిస్తున్నారట.
అద్దంకి నుంచి పోటీ చేసే ఆలోచనలో కరణం వెంకటేష్
ప్రస్తుతం అద్దంకి వైసీపీ ఇన్ ఛార్జ్‌గా ఉన్న పానెం హనిమిరెడ్డి కూడా నియోజక వర్గంలో యాక్టివ్‌గా లేరంట. అందులోనూ హనిమిరెడ్డి అద్దంకికి నాన్ లోకల్. ఈ నేపథ్యంలో అవకాశం దొరికితే అద్దంకి వెళ్లాలని కరణం వెంకటేష్ యోచిస్తున్నట్టు సమాచారం. గతంలో కరణం వెంకటేష్ తండ్రి బలరామ్ అద్దంకి నుండి రెండు సార్లు గెలుపొందారు. అద్దంకి నియోజక వర్గంలో కరణం కుటుంబానికి సొంత అనుచరగణం ఉంది. ఈనేపథ్యంలో చీరాల నుండి అద్దంకి కి షిప్ట్ అయితే బెటరని కరణం వెంకటేష్ ఆలోచన చేస్తున్నారంట. కరణం వెంకటేష్ నియోజక వర్గ మార్పు పై జరుగుతున్న ప్రచారంతో చీరాల, అద్దంకి రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. మరి అద్దంకి, మరోసారి చీరాల నుండి పోటీ చేసి ఓటమిపాలైన కరణం వెంకటేష్ తన పొలిటికల్ ఫ్యూచర్ ని చక్కదిద్దుకునేందుకు ఎలా ముందడుగు వేస్తారో చూడాలి.