BigTV English

Operation Karre Gutta: క్షణక్షణం ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు..

Operation Karre Gutta: క్షణక్షణం ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు..

Operation Karre Gutta: కర్రెగుట్టల్లో కూంబింగ్ కథ చాలా దూరమే వెళ్తోంది. ఆపరేషన్ కగార్ ఏంటోగానీ భద్రతాదళాలు కంగారెత్తే పరిస్థితి వస్తోంది. ఓవైపు బీర్ బాటిల్ బాంబులు, ఇంకోవైపు భారీ గుహలు కనిపిస్తున్నాయి. క్షణక్షణం ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 24 వేల మంది బలగాలతో అతిపెద్ద భారీ ఆపరేషన్ నడుస్తోంది. కూంబింగ్ టైంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అదే సమయంలో మావోయిస్టులు కూడా తప్పించుకుంటున్నారు. సో ఆపరేషన్ కర్రెగుట్టలు ఎటు దారితీయబోతోంది?


కర్రెగుట్టలు- దుర్గం గుట్టలు 800 చ.కి.మీ.

ఒకరు కాదు ఇద్దరు కాదు.. 24 వేల మంది భద్రతా బలగాలు… అంతా ఒక్కటయ్యారు. కర్రెగుట్ట, దుర్గం గుట్టలను జల్లెడపడుతున్నారు. మొత్తం ఏరియా 800 చదరపు కిలోమీటర్లు. ఏప్రిల్ 21న మొదలైన ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఛత్తీస్ గడ్ సరిహద్దులవైపు నుంచి ఈ బలగాలు దూసుకొచ్చాయి. ఇప్పుడు కర్రెగుట్టల్లో కథ నడిపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. హెలికాప్టర్లు.. డ్రోన్ల పహారాలో.. గుట్టల్ని అష్టదిగ్బంధం చేస్తున్నారు. ఈ దెబ్బతో మావోయిస్టుల ఖేల్ ఖతమే అంటున్నారు. సీన్ కట్ చేస్తే కర్రెగుట్టల్లో కూంబింగ్ అంత ఈజీ కాదని భద్రతా బలగాలకు తొలిరోజే అర్థమైంది.


2026 మార్చి నాటికి మావోయిస్టుల అంతమే పంతం

బీజాపూర్-ములుగు జిల్లా సరిహద్దుల్లో కూంబింగ్ అంటే అంత ఈజీ కాదు. అయితే 2026 మార్చి నాటికి ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే జల్లెడ పడుతూ చివరికి కర్రెగుట్టల దాకా మ్యాటర్ వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 24 వేల మంది కూంబింగ్ చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అందుకే నక్సల్ ఫ్రీ స్టేట్‌గా మార్చే క్రమంలో దొరికిన వారిని దొరికినట్లు ఎన్ కౌంటర్లు చేస్తున్నారు. లొంగిపొమ్మంటున్నారు. సో ఇప్పుడు కూడా ఛత్తీస్ గఢ్ వైపు నుంచే భారీ ఎత్తున కూంబింగ్ చేస్తూ బలగాలు ముందుకు కదులుతున్నాయి.

చాలా దట్టమైనవి కర్రెగుట్టలు-దుర్గం గుట్టలు

ఇప్పుడు బలగాలు కూంబింగ్ చేస్తున్న కర్రెగుట్టలు, దుర్గం గుట్టలు చాలా దట్టమైన అడవి. సాయంత్రం నాలుగైందంటే చాలు చీకటి వాతావరణం ఉంటుంది. 5 మీటర్ల దూరంలో మనిషి ఉన్నా గుర్తు పట్టే పరిస్థితి ఉండదు. అంత దట్టంగా చెట్లు ఉంటాయి. ఇది మావోయిస్టులకు చాలా సేఫ్ ప్లేస్. అందుకే అక్కడ కథ ముగించాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. PLGAకు చెందిన 500 మందికి పైగా నక్సలైట్లు ఇక్కడ ఉన్నారని భావిస్తున్నారు. అందులో టాప్ లీడర్లైన హిడ్మా, బర్సే దేవా, దామోదర్ లాంటి వాళ్లంతా మీటింగ్ కోసం కర్రెగుట్టలకు వచ్చారని అనుకుంటున్నారు. అందుకే ఈ భారీ ఆపరేషన్ నడుస్తోంది.

టఫ్ కండీషన్ ఫేస్ చేస్తున్న బలగాలు

సీన్ కట్ చేస్తే భద్రతా దళాలు ఊహించినంత ఈజీగా కర్రెగుట్టలు, దుర్గం గుట్టలు లేవు. చాలా టఫ్ కండీషన్ ఫేస్ చేస్తున్నారు. భారీ ఎండదెబ్బలకు సెక్యూరిటీ ఫోర్సెస్ డీహైడ్రేషన్ కు గురవుతున్నారు. అస్వస్థతకు గురైన వారిని హెలికాప్టర్ లో బీజాపూర్ తరలిస్తున్నారు. వారి ప్లేస్ లో బ్యాకప్ టీములను పంపిస్తున్నారు. ఏం జరిగినా సరే.. ఈ గుట్టలను జల్లెడ పట్టాల్సిందేనన్న ఆదేశాలు వెళ్లాయి.

కర్రెగుట్టలను అధీనంలోకి తెచ్చుకునే యత్నాలు

ములుగు జిల్లా వెంకటాపురం బార్డర్ సెంట్రిక్‌గా ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చిన ఉట్లపల్లి, పెద ఉట్లపల్లి, పూజారి కాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భారీ గుహలు గుర్తించారు. అందులో వెయ్యి మంది వరకు తలదాచుకునేలా ఏర్పాట్లు చూశారు. ఆ వీడియోలను బలగాలు రిలీజ్ చేశాయి. అందులో నీటి వసతి కూడా ఉన్నట్లు గుర్తించారు. అటు బీర్ బాటిల్ బాంబులను కూడా ఐడెంటిఫై చేశారు. వాటిని నిర్వీర్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

మావోలు కర్రెగుట్టల నుంచి మకాం మార్చేశారా?

చెప్పాలంటే బలగాలకు కర్రెగుట్టల్లో కూంబింగ్ కత్తిమీద సాము అన్నట్లుగా మ్యాటర్ మారింది. సహజంగా ఏర్పడ్డ గుహలు మరిన్ని ఉంటాయంటున్నారు. అడుగు తీసి అడుగు వేస్తే ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మధ్యే ముందుకు కదులుతున్నాయి బలగాలు. వీరికి హెలికాప్టర్లు, అడ్వాన్స్ డ్ డ్రోన్లు కూడా హెల్ప్ అవుతున్నాయి. మరోవైపు ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు కూడా కర్రెగుట్టల నుంచి మకాం మార్చేశారా.. లేదంటే గుహల్లో తలదాచుకున్నారా అన్నది క్లారిటీ లేకుండా పోతోంది.

కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడి నుంచే కథ నడపాలి. మావోయిస్టులకు గట్టి దెబ్బ కొట్టాలి. రెడ్ కారిడార్ నెట్ వర్క్ ను బలహీనపరచాలి. ఇదీ భద్రతా దళాలు వేసుకున్న ప్లాన్. అందుకోసమే తెలంగాణ-ఛత్తీస్‎గఢ్-మహారాష్ట్ర మూడు వైపుల నుంచి కర్రెగుట్టలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అయితే అది అనుకున్నంత ఈజీగా లేదు. మరోవైపు ఆపరేషన్ కగార్ ఆపాలని, చర్చలు జరపాలన్న డిమాండ్లు పౌరహక్కుల సంఘాల నుంచి పెరుగుతున్నాయి. అయితే ఎవ్వరి మాటా వినేదేలేదంటూ కేంద్రం ఇంకింత స్పీడ్ పెంచుతోంది.

బ్లాక్ హిల్స్‌గా మావోలకు స్ట్రాటజిక్ లొకేషన్

బ్లాక్ హిల్స్‌గా పేరొందిన కర్రెగుట్టలు.. మావోయిస్టులకు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్. గోదావరి నది ఒడ్డున, దట్టమైన అడవులు, కొండలతో కూడిన ప్రాంతమిది. అంతేకాదు.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర బార్డర్ లొకేషన్. దీంతో ఈజీగా తప్పించుకునే వీలు ఉంటుంది. ఈ ప్రాంతం మావోయిస్టుల రెడ్ కారిడార్‌లో కీలక భాగం, ఇది జార్ఖండ్ నుంచి ఏపీదాకా విస్తరించి ఉంది. ఇక్కడ నియంత్రణ సాధిస్తే, మావోయిస్టుల నెట్‌వర్క్‌కు తీవ్ర దెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతోనే భద్రతా బలగాలు ఆపరేషన్ కర్రెగుట్ట చేపట్టాయి. ఈ బ్లాక్ హిల్స్ మావోయిస్టుల సెంట్రల్ గెరిల్లా జోన్ లో భాగం. ఇది కేంద్ర కమిటీ సభ్యులు, శిక్షణా శిబిరాలు, ఆయుధాలకు కేంద్రస్థానంగా ఉంది. ఇక్కడ వెయ్యి మంది ఉండగలిగేలా సొరంగాలు, బంకర్లు ఉన్నాయి. ఇవి మావోల రహస్య కార్యకలాపాలకు వీలుగా ఉండడంతో బలగాలు స్థావరాలను డీకోడ్ చేసే పని పెట్టుకున్నాయంటున్నారు.

బచావో కర్రె గుట్టలు పేరుతో ఆపరేషన్ స్టార్ట్

కర్రె గుట్టలపై బేస్‌‌ క్యాంప్‌‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్న భద్రతా బలగాలకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. బచావో కర్రె గుట్టలు పేరుతో ఆపరేషన్‌‌ స్టార్ట్‌‌ చేశాయి. ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో గన్స్, పేలుడు పదార్థాలు, రోజువారీ వస్తువులను భుజాన వేసుకొని కొండలు ఎక్కుతున్న బలగాల్లో చాలా మంది డీ హైడ్రేషన్‌‌కు గురవుతున్నారు. ఇప్పటిదాకా వందమందికి పైగా జవాన్లు ఎండ దెబ్బబారిన పడ్డారంటున్నారు. అటు మావోయిస్టుల కోసం వెతుకుతున్న జవాన్లకు గుట్టల్లో గుహలు కనిపిస్తున్నాయి. కర్రె గుట్టల్లో ఇలాంటి గుహలు చాలానే ఉన్నాయని స్థానిక ఆదివాసీలు చెబుతున్నారు. ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ ఇలాంటి బంకర్స్ పెద్ద సంఖ్యలోనే కనిపించే అవకాశం ఉంది. ఇంతకాలం వీటిని షెల్టర్లుగా ఉపయోగించుకున్న మావోయిస్టులు బలగాలు వచ్చే సరికే ఖాళీ చేసి వెళ్తున్నాయంటున్నారు. దీంతో వారికి సమాచారం ఎలా వెళ్తుందోనని బలగాలు ఫోకస్ పెంచాయి.

హెలికాప్టర్లు, డ్రోన్లతో గుట్టులపై నిఘా

కర్రెగుట్టలకు బ్లాక్ హిల్స్ అని పేరు ఉంది. ఇక్కడ బాంబుల శబ్దాలు, కాల్పుల మోతతో మోగిపోతోందని స్థానిక ఆదివాసీలు అంటున్నారు. నాలుగు హెలికాప్టర్లు అడవిపై చక్కర్లు కొడుతున్నాయి. ఆకాశంలో నిఘా, గుట్టల్లో కాలిబాటన నిఘాతో కథ మార్చేస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే భారీ ఎత్తున మావోలు హతమయ్యారన్న ప్రచారం నిజం కాదంటున్నారు. టాప్ నక్సల్ లీడర్లు ఎక్కడున్నారు హిడ్మా టీమ్ ఏదీ లేదా.. లేదంటే బలగాల దృష్టి మళ్లించేందుకు మావోలు ప్లాన్ చేస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

నెలరోజుల కూంబింగ్ ఆపాలన్న డిమాండ్లు

నిజానికి చర్చలు జరపాలని మావోయిస్టులు డిమాండ్ చేసిన సందర్భాలు లేవు. మధ్యవర్తులుగా ఉండే పౌర హక్కుల నేతలు, లెఫ్టిస్టులు కోరుతుంటారు. బ్లాక్ హిల్స్ ను రౌండప్ చేయడంతోనే చర్చల డిమాండ్ తెరపైకి తెచ్చారా అన్నది కీలకంగా మారుతోంది. గెరిల్లా యుద్ధ తంత్రంలో భాగంగా మావోయిస్టుల ప్లాన్ మరోలా ఉందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి సెక్యూరిటీ ఫోర్సెస్ అలర్ట్ గా ఉండాలన్న సూచనలు వస్తున్నాయి. కర్రెగుట్టలు మావోయిస్టుల అడ్డా. అక్కడ వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. టెక్నాలజీతో సమన్వయం చేసుకోవాలి. స్థానికంగా ఇన్ఫార్మర్లు మావోయిస్టులకే సపోర్ట్ ఇస్తుంటారు. అందుకే ఈ టార్గెట్ అంత ఈజీ కాదంటున్నారు. వీరి హెల్ప్ తోనే 11 మంది కేంద్ర కమిటీ సభ్యులు భద్రాచలం వైపు తప్పించుకున్నట్లుగా చెబుతున్నారు.

మావోలతో చర్చలు జరపాలని ప్రతిపాదనలు

కర్రెగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ కగార్‌పై రాష్ట్రంలోని కమ్యూనిస్టులు, పౌరహక్కుల నేతలు, విద్యావేత్తల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. కాల్పులను వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు పదే పదే ప్రతిపాదిస్తున్నా.. కూంబింగ్‌ నిర్వహించడం ఎంత వరకు కరెక్ట్ అని హరగోపాల్, కూనంనేని వంటి వాళ్లు విమర్శిస్తున్నారు.

Also Read: పాక్ టార్గెట్ మిస్.. ఇక భారత్ వంతు.. మొదలెడదామా!

అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్‌గా మారడం ఖాయమా?

మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపకపోవడం వెనుక కార్పొరేట్‌ శక్తులు, బహుళజాతి కంపెనీలు ఉన్నాయన్న వాదనను వినిపిస్తున్నారు. మరోవైపు మావోయిస్టులకు స్థానిక ఆదివాసీలు రక్షణకవచంగా ఉన్నారంటున్నారు. ఇది ఆపరేషన్ ను క్లిష్టం చేస్తోందని తెలుస్తోంది. ఒకవేళ బలగాలు చేపట్టిన భారీ కూంబింగ్ ఆపరేషన్ సక్సెస్ అయితే గనుక అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ గా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ప్రాంతంలో 2018లో జరిగిన ఎన్ కౌంటర్ లో 40 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరచాలంటే ఇక్కడ ఆధిపత్యం సాధించడం కీలకంగా చెబుతున్నారు. మొత్తంగా ఆపరేషన్ కగార్ లో భాగంగా 2023 డిసెంబర్ నుంచి 2025 ఇప్పటి వరకు 365 మంది మావోయిస్టుల్ని హతమార్చారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే ఛత్తీస్ గఢ్ లో 140 మంది మావోయిస్టులు మృతి చెందారంటున్నారు.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×