BigTV English

Karedu Farmers: ఏపీలో నిశబ్ద నిరసన.. అసలు కరేడులో ఏం జరుగుతోంది?

Karedu Farmers: ఏపీలో నిశబ్ద నిరసన.. అసలు కరేడులో ఏం జరుగుతోంది?

Karedu Farmers: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఓ నిశబ్ద నిరసన జరుగుతోంది. కానీ ఆ నిశబ్దం క్రమంగా బద్దలవుతోంది. ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఆక్రందన పెరుగుతోంది. ఉన్న ఊరును ఉన్నఫళంగా వదిలి వెళ్లాలని, ఉపాధి కల్పించే పంట పొలాలను కంపెనీలకు ఇచ్చేయాలని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది? అదే ఆవేశం కరేడు గ్రామస్తుల్లో కనిపిస్తోంది. ఎందుకు రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కారు? ఎందుకు తిరగబడుతున్నారు? అసలు కరేడులో ఏం జరుగుతోంది? ఎందుకది పెద్ద ఉద్యమంగా మారింది? ఛలో కరేడు..


కరేడు రైతుల పోరుబాటు

వీళ్లంతా పెద్ద ఎత్తున రోడ్డెక్కడం వెనుక ఆవేదన ఉంది.. ఆక్రందన ఉంది. ఉన్న ఊరు పోతుంది.. ఉపాధి పోతుంది.. రోడ్డున పడుతామన్న బాధ ఉంది. భవిష్యత్ తరాలు నష్టపోతాయన్న భయం ఉంది. అందుకే సేవ్ కరేడు ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఇలా ఉద్యమం చేద్దామని ఎవరూ పిలుపునిచ్చిన వాళ్లు లేరు.. ఎవరూ నాయకత్వం వహించలేదు.. గుండెలోతుల్లో నుంచి వచ్చిన ఆవేదనతోనే ఇదిగో వీళ్లంతా ఇలా రోడ్డెక్కారు. సేవ్ కరేడు అంటూ వాయిస్ పెంచుతున్నారు.


ఇండోసోల్‌కు 8,300 ఎకరాలకు ఇచ్చేలా ప్రతిపాదనలు

కరేడు గ్రామస్తులు స్వచ్ఛందంగా రోడ్డెక్కడానికి కారణం ఉంది. ఇక్కడి భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇండోసోల్ కంపెనీ రెడీ అవుతోంది. ఈ కంపెనీకి 8,300 ఎకరాల భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ చేసింది. ఎవరినీ అడకుండా ఎవరి భూములు ఎవరికి ఇస్తున్నారన్న ఆవేదన గ్రామస్తుల్లో పెరుగుతోంది. 3 కాలాలు పంటలు పండే పచ్చని భూములే దొరికాయా అన్నది మెయిన్ క్వశ్చన్. సారవంతమైన భూముల్ని ధారాదత్తం చేస్తారా అన్న పాయింట్ వినిపిస్తున్నారు. పరిశ్రమలకు పచ్చని పొలాలే కావాలా అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండో సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్‌కు 8348 ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 15న ఇండోసోల్‌కు రామాయపట్నం దగ్గర భూముల కేటాయించింది. అయితే ఈ ప్రాజెక్ట్ వద్దని రామాయపట్నం రైతులు ఆందోళన చేస్తే.. ఆ భూముల్ని BPCLకు కేటాయించింది. అయితే ఇండోసోల్ కు ఇప్పుడు కరేడు దగ్గరే అంతే మొత్తంలో లాండ్ అలొకేట్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అవడం, రైతులకు భూసేకరణ నోటీసులు రావడంతో ఒక్కసారిగా భగ్గుమన్నారు.

పరిశ్రమలు రావాల్సిందే.. ఉపాధి కల్పించాల్సిందే..

ఎవరి భూములు.. ఎవరికి ఇస్తున్నారు.. ఏం నిర్ణయాలు ఇవి.. అసలేం అనుకుంటున్నారు.. ఇదీ కరేడు గ్రామస్తుల ఆవేదన. ఆవేశం. కరేడు భూముల విషయంలో చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాల్సిందే. ఫ్యాక్టరీలు తెరవాల్సిందే. ఉపాధి కల్పన, ప్రొడక్షన్ అన్నీ కీలకమే. అయితే ఎక్కడో బంజరు భూములు లేదంటే వ్యవసాయ యోగ్యం కాని వాటిని సేకరించాల్సింది పోయి 3 పంటలు పండే వాటిని తీసుకోవడం ఏంటన్న ఆవేదన రైతుల్లో కనిపిస్తోంది. ఇంత చేస్తే రైతు చేతి నుంచి భూమి పోతే రోడ్డున పడుతారు. వేరే వ్యాపారాలు చేయలేరు. తరతరాలుగా భూమినే నమ్ముకుని వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న వారు దిక్కుతోచని వారు అవుతారు. వ్యవసాయ పనులపై ఆధారపడి కూలీలు ఉంటారు. అనుబంధ పరిశ్రమలు ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తులతో రైతులకు ఆదాయం ఉంటుంది. ఆహార భద్రత ఉంటుంది. ఇన్ని అంశాలు ముడిపడి ఉన్న పంటపొలాల విషయంలో రైతులు చాలా సెంటిమెంట్ తో ఉంటారు. మరి వారికి ఇచ్చే సమాధానం ఏంటి?

సంప్రదింపులు జరపకుండానే భూసేకరణా?

కరేడు చుట్టుపక్కల సారవంతమైన భూములున్నాయి. ఇక్కడ 19 రకాల పంటలు పండిస్తారు. 30 అడుగుల లోతునే భూగర్భ జలాలు ఉంటాయి. వీటిని తీసుకుంటే తమ జీవనాధారం కోల్పోతామని ఆందోళనతో ఉన్నారు. ఈ భూములు తరతరాలుగా జీవనోపాధికి ఆధారంగా ఉన్నాయంటున్నారు. ప్రభుత్వం రైతులతో సరైన సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా భూ సేకరణను ముందుకు తీసుకెళ్లడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. కరేడు గ్రామంలో 12 వేలకు పైగా జనాభా ఉంది. ఈ భూములే వారికి జీవనోపాధి. ఈ సోలార్ ప్రాజెక్టు వల్ల నిండా మునుగుతామన్న ఆవేదన కనిపిస్తోంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కు అనుబంధ సంస్థే ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. అత్యాధునిక సోలార్ PV మాడ్యూల్స్ తయారీ కోసం ఈ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. 500 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారు చేసే ప్లాంట్ టార్గెట్. అక్టోబర్ 2026 నాటికి 5 గిగావాట్ లక్ష్యం. అయితే వీటికి కేటాయించిన భూముల చుట్టూనే ఇప్పుడు మ్యాటర్ అంతా తిరుగుతోంది. కరేడు రైతులు కదం తొక్కడానికి కారణాలు చాలా ఉన్నాయి.

కరేడు సహా చుట్టుపక్కల 19 రకాల పంటల సాగు

రెన్యువబుల్ ఎనర్జీని ప్రోత్సహించడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. ఇది ఆహ్వానించదగ్గదే. అయితే సారవంతమైన భూముల్ని ఇవ్వాలనుకోవడమే సమస్యలను పెంచుతోంది. ఇందుకు నిదర్శనం కదం తొక్కిన కారేడు రైతుల ఉద్యమమే. కరేడు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 19 రకాల పంటలు సాగవుతున్నాయి. వరి, గోధుమ, జొన్నలు, సజ్జలు వంటి ధాన్యాలు సాగు చేస్తున్నారు. వరి ఈ ప్రాంతంలో ప్రధాన పంట. భూగర్భ జలాలు 30 అడుగుల లోతులోనే ఉండడంతో వరిసాగుకు అనుకూలంగా భూములున్నాయి. ఇక కూరగాయల్లో టమాట, బంగాళదుంప, క్యాబేజీ, బీన్స్, కాలీఫ్లవర్ వంటివి సాగు చేస్తున్నారు ఇక్కడి రైతులు. భూములు బాగున్నాయి. నీటి వనరుల లభ్యత ఉంది. అందుకే మూడు కాలాల పాటు పచ్చగా పంటలు సాగవుతూనే ఉంటాయిక్కడ. బంగారం పండే భూముల్ని ఇచ్చేదే లేదంటున్నారు కరేడు వాసులు.

కరేడు చుట్టుపక్కల పెద్ద ఎత్తున మామిడి తోటలు

ఇక కారేడు చుట్టపక్కల పప్పు ధాన్యాలైన కంది, పెసర, మినుము వంటివి పండిస్తారు. వాణిజ్య పంటల్లో చెరకు, పొగాకు, మిరప వంటివి ఉన్నాయి. ఇవి స్థానిక రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. ఇక కరేడు చుట్టుపక్కల ప్రాంతాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. మామిడి ఉత్పత్తుల్ని లోకల్ గా అలాగే బయటి మార్కెట్లలో అమ్ముతుంటారు. వీటికి తోడు నిమ్మ, బత్తాయి, జామ, సపోట, దానిమ్మ వంటి పండ్ల తోటలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ తోటలు రైతులకు లాంగ్ టర్మ్ ఇన్ కం అందిస్తున్నాయి. పసుపు, అల్లం వంటివి కూడా ఇక్కడ పండుతున్నాయి. ఇంతటి ఆదాయాన్ని విడిచిపెట్టి భూములు ఇచ్చేయాలంటే ఎవరైనా ఇస్తారా.. కరేడులోనూ అదే జరుగుతోంది. ప్రశాంతంగా బతుకుతున్న తమ జీవితాల్లో సోలార్ మంటలు రేపుతున్నాయంటున్నారు కరేడు వాసులు. గ్రామసభలోనూ అదే తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు తీసుకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. భూములు ఇవ్వడం ఇష్టం లేదంటూ అప్లికేషన్లు ఇచ్చారు. అసలు ఈ సమస్యంతా ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించడం చుట్టూ మొదలైంది. సేవ్ కరేడు పేరుతో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు పెట్టారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండో సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్‌కు 8348 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థ ఈ ఇండో సోల్ పేరుతో ప్రాజెక్ట్ పెడుతోంది. గత ప్రభుత్వ హయాంలో కీలక ప్రాజెక్టులు దక్కించుకుంది షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్. ఈ కంపెనీ చుట్టూ గతంలో వివాదాలు చుట్టుముట్టాయి. ఈడీ, ఇన్ కమ్ టాక్సులు సోదాలు కూడా చేశాయి.

11,500 మందికి ఉద్యోగావకాశాలన్న ఇండోసోల్

2022 సెప్టెంబర్ 15న ఇండోసోల్‌కు రామాయపట్నం దగ్గర మొదట భూముల్ని కేటాయించారు. మొదట 5148 ఎకరాలను అప్పటి జగన్ సర్కార్ కేటాయించింది. 43,143 కోట్ల పెట్టుబడి పెడతామన్నది ఇండోసోల్‌. తమ ప్రాజెక్ట్‌ ద్వారా 11,500 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నది. దీనికి సంగం బ్యారేజ్ నుంచి 50 MLD నీటి కేటాయింపులు కూడా జరిగాయి. ఇండోసోల్ ప్రాజెక్ట్ విషయంలో 2023 నవంబర్ 9న మరో జీవో జారీ చేశారు. గతంలో కేటాయించిన 5148 ఎకరాలకు అదనంగా మరో 3200 ఎకరాలు ఇచ్చారు. సో ఇండోసోల్‌కు మొత్తం 8348 ఎకరాలను రామాయపట్నంలో గత జగన్ సర్కార్ కేటాయించింది. నీటి కేటాయింపులను 115 MLDకి పెంచారు కూడా. అయితే నాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రామాయపట్నం రైతులు ఆందోళన చేశారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ను కలిసి పోరాటానికి మద్దతివ్వాలని రైతులు కోరారు. దీంతో అప్పట్లో ఈ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. సీన్ కట్ చేస్తే ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ తెరపైకి ఇండోసోల్‌ వచ్చింది. అయితే ఈసారి ప్రభుత్వం మారాక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఇండోసోల్ భూములను BPCLకు కేటాయించింది కూటమి ప్రభుత్వం. అక్కడ 6వేల ఎకరాల్లో 92,862 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీని BPCL ఏర్పాటు చేయనుంది. అయితే ఇండోసోల్ తమకు కరేడు దగ్గర భూములు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. మొత్తం 8348 ఎకరాలను ఇండోసోల్‌కు కేటాయించేలా ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. అక్కడే నిరసనలు పెరిగాయి. రామాయపట్నం దగ్గర కాదని తమ దగ్గర ఎందుకు పెడుతున్నారంటూ కరేడు రైతులు నిలదీస్తున్నారు.

ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తానని హామీ

కరేడు ఉద్యమం కాస్తా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేకపోయినా రైతులు, గ్రామస్తులే స్వచ్ఛందంగా ఉద్యమాన్ని నిర్మించారు. ఈ నిరసనల తీవ్రతను గమనించిన సబ్ కలెక్టర్ పూజ, రైతులతో చర్చలు జరిపారు. భూ సేకరణను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తానని కరేడు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ హామీతో నిరసనలు ఆపారు. తాజాగా గ్రామ సభ కూడా నిర్వహించారు. ముక్తకంఠంతో భూసేకరణను వ్యతిరేకించారు. భూములు ఇవ్వం.. వెనక్కు తగ్గాల్సిందే అన్నారు. రైతులతో సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. రైతుల ఉద్యమానికి ఏపీ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. సో ఓవరాల్ గా ఇక్కడ జరిగిందేంటంటే.. భూ సేకరణలో పారదర్శకత లోపం, జీవనోపాధిపై రైతుల్లో ఆందోళన, సంప్రదింపుల్లో లోపం వంటి సమస్యలున్నాయి. ఇప్పుడు కరేడు వాసులు నచ్చజెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. సోలార్ వద్దే వద్దంటున్నారు. మరి ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారుతోంది.

Related News

Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

kavitha Political Future: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?

Tadipatri Politics: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

×