TGMIDC Tenders: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఫర్నీచర్ సరఫరా చేసే కీలక సంస్థ ‘తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఇప్పుడు అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఓ ‘స్పెషల్ ఆఫీసర్’ వ్యవహారశైలి ఇప్పుడు వైద్యారోగ్య శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ, కనీసం కమిటీ అప్రూవల్ కూడా లేకుండానే కోట్లాది రూపాయల విలువైన టెండర్లను తనకు నచ్చిన వారికి కట్టబెడుతున్నారంటూ బాధిత కాంట్రాక్టర్లు నేరుగా ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
సాధారణంగా వైద్య పరికరాలు, మందుల నాణ్యత, మార్కెట్ ధరలపై పూర్తి అవగాహన, టెక్నికల్ అనుభవం ఉన్న వారినే ప్రొక్యూర్మెంట్ విభాగంలో నియమిస్తారు. కానీ, సదరు స్పెషల్ ఆఫీసర్‌కు ఎలాంటి సాంకేతిక అనుభవం లేకపోయినా, కేవలం పైరవీల ద్వారా డిప్యూటేషన్‌పై సంస్థలోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా, ఇటీవల సంస్థలో డ్రగ్స్ అండ్ సర్జికల్, డయాగ్నస్టిక్ ఇన్‌చార్జీగా ఉన్న జనరల్ మేనేజర్ పై ప్రభుత్వం వేటు వేయడంతో, ఆ కీలక విభాగాల అదనపు బాధ్యతలు కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ చేతికే చిక్కాయి. దీంతో ఆయన ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ అధికారి తన అక్రమ దందాను సాఫీగా నడిపించుకోవడానికి సంస్థలో ఓ సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు అత్యంత నమ్మకస్తులైన ఏడుగురు వ్యక్తులకు సంస్థలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించారు. టెండర్ల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కేటాయింపుల వరకు అంతా అత్యంత రహస్యంగా ఉంచుతూ, ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగులనే కాంట్రాక్టర్ల వద్దకు మధ్యవర్తులుగా పంపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. “ముందు మాతో డీల్ కుదుర్చుకోండి.. కమీషన్ ఎంత ఇస్తారో తేల్చుకోండి.. అప్పుడే మీకు టెండర్ ఓకే అవుతుంది. లేదంటే ఏదో ఒక సాకుతో టెండర్‌ను రద్దు చేస్తాం” అంటూ ఈ ముఠా కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు సమాచారం.
వైద్య పరికరాల కొనుగోళ్లలో నాణ్యతను నిర్ధారించేందుకు నిపుణులైన డాక్టర్లతో కూడిన టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అయితే, నిష్పక్షపాతంగా వ్యవహరించే నిపుణులను పక్కనపెట్టి, తాను సూచించిన డాక్టర్లనే కమిటీలో నియమించుకోవడంలో ఈ అధికారి సఫలమయ్యారు. తద్వారా నాణ్యత లేని పరికరాలు, మార్కెట్ ధర కంటే అధిక రేట్లకు కోట్ చేసిన తన అనుకూల కాంట్రాక్టర్లకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.
Also read: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ బాబు..డేట్ కూడా ఫిక్స్!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సనత్‌నగర్ టిమ్స్ , అల్వాల్ టిమ్స్, గడ్డిఅన్నారం టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీలకు భారీ ఎత్తున ఫర్నీచర్, వైద్య పరికరాల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ కొనుగోళ్ల టెండర్లలోనే భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.
ఈ అధికారి అక్రమాలకు నిదర్శనంగా ఇటీవల జరిగిన ఓ టెండర్ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈఎస్డబ్లూ పరికరాల టెండర్లలో నిబంధనల ప్రకారం తక్కువ ధర కోట్ చేసిన ఎల్ 1 కాంట్రాక్టర్‌కు కాకుండా, ఎక్కువ ధర కోట్ చేసిన ఎల్ 2 కాంట్రాక్టర్‌కు టెండర్ అప్పగించేందుకు ఈ అధికారి విశ్వప్రయత్నాలు చేశారు. దీనిపై సదరు ఎల్ 1 కాంట్రాక్టర్ న్యాయస్థానాన్నిఆశ్రయించడంతో పాటు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో అధికారి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. విషయం బయటకు పొక్కడంతో ఇప్పుడు ఆ కాంట్రాక్టర్‌తో రాజీ కుదుర్చుకునేందుకురాయబారాలు నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
టెండర్ల ఖరారుకు ముందు బిడ్ ఫైనలైజేషన్ కమిటీ కి పూర్తి ఎజెండాను ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది. కానీ, ఈ స్పెషల్ ఆఫీసర్ మాత్రం కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఫైళ్లను పంపి, “ఇది అత్యవసరం ” అంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి సంతకాలుపెట్టించుకుంటున్నారు. ఈ వ్యవహారశైలిపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇన్ని ఆరోపణలు వస్తున్నా, ఆధారాలతో సహా ఫిర్యాదులు అందుతున్నా సదరు స్పెషల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవడానికి టీజీఎమ్ఐడిసి అధికారులు వెనుకాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. వైద్యారోగ్య శాఖలో చక్రం తిప్పే ఓ కీలక అధికారి ఈయనకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారని ప్రచారం ఉన్నది.. ఆయన అండ చూసుకునే ఈ స్పెషల్ ఆఫీసర్ కమీషన్ల దందాను సాఫీగా సాగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also read: బిర్యానీ ప్రియులకు ఝలక్.. హైదరాబాద్‌లో అమాంతంగా పెరిగిన ధరలు!