Cabinet Reshuffle: స్వేచ్చ బ్యూరో: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉంటాయా? కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తారా? ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న కొందరికి ఉద్వాసన పలికి మరికొందరికి చోటు కల్పిస్తారా? కేంద్ర రాజకీయ వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు లభిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కేంద్ర నాయకత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సంకేతాలు వెలువడకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఈనెల 18న ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, సహాయ మంత్రులు(ఎంవోఎస్) ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రభుత్వ పనితీరు, పాలనాపరమైన సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలు, రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఈ భేటీలో సమీక్ష జరగనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.
మంత్రి మండలి సమావేశం నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో మార్పుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సమావేశం సాధారణ సమీక్షకే పరిమితమవుతుందా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఏదైనా సంకేతాలు వెలువడతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సమావేశ అజెండాలోనూ మంత్రివర్గ విస్తరణ ప్రస్తావనపై స్పష్టత లేకపోయినా.. ఈ అంశం ఎన్నో రోజులుగా అధిష్టానం నాన్చుడి ధోరణితో ఉండటంతో చర్చకు దారితీసింది. ఇక తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ విషయంలోనూ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇద్దరూ కేంద్ర మంత్రులుగా కొనసాగుతారా? ఒకవేళ మంత్రివర్గంలో మార్పులు జరిగితే తెలంగాణ నుంచి కొత్తవారికి అవకాశం దక్కుతుందా? అన్న చర్చ సాగుతోంది. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, పార్టీ అవసరాలు, జాతీయ స్థాయిలో నాయకత్వ ప్రాధాన్యతలు ఈ అంశంలో కీలకం కానున్నాయి.
Also read: తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదు.. పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ఆఫర్!
మరోవైపు మహిళా రిజర్వేషన్ చట్టం అమలు, డీలిమిటేషన్ అంశాలు కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా మారాయి. ఈ రెండు అంశాలకు సంబంధించిన బిల్లులపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశాలపై ఇటీవల జాతీయ రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 18న జరగనున్న మంత్రిమండలి భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసంలో జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా కూడా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల అంశాలు చర్చకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించే అంశంపై కేంద్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఈ అంశాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో అవసరమైన మద్దతు లభించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి బిల్లులను సభ ముందుకు తీసుకురావాలంటే రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడం కేంద్రానికి కీలకం కానుంది. మొత్తంగా చూస్తే.. ఒకవైపు కేంద్ర కేబినెట్‌లో మార్పులపై ఉత్కంఠ, మరోవైపు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై రాజకీయ కసరత్తు.. ఈ రెండింటి నేపథ్యంలో నవంబర్ 18 సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ అధ్యక్షతన జరిగే ఈ భేటీ అనంతరం కేంద్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే!
Also Read: జాగ్రత్త.. మీకు తెలియకుండానే ఈ యాప్స్ మిమ్మల్ని గమనిస్తున్నాయి, కెమెరా, మైక్ పర్మిషన్లను ఆపేయండిలా!