BigTV English

KCR Meeting: వరంగల్ సభపైనే గులాబీ బాస్ ఆశలన్నీ!

KCR Meeting: వరంగల్ సభపైనే గులాబీ బాస్ ఆశలన్నీ!

KCR Meeting: భారత రాష్ట్ర సమితి వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకల బహిరంగ సభకు సన్నాహాలు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ పెద్దలు చారిత్రాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ఆ సభను విజయవంతం చేసి పునర్వైభవాన్ని తిరిగి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, తెలంగాణ మద్దతుదారులు మరియు నాయకులు బహిరంగ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఎలాగైనా సభను సక్సెస్ చేసేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారనే టాక్ నడుస్తోంది. ఏకంగా కేసీఆరే జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి జనసమీకరణకు సన్నాహాలు చేయాల్సివస్తోందంట. గులాబీబాస్ అంత ప్రత్యేక ఫోకస్ పెడుతుండటంతో ముఖ్యనేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట.


1,213 ఎకరాల్లో బీఆర్‌ఎస్ ప్లీనరీ సభకు భారీ ఏర్పాట్లు

వరంగల్ జిల్లా హన్మకొండ ఎల్కతుర్తి శివార్లలో సుమారు 1, 213 ఎకరాల్లో బీఆర్ఎస్ ప్లీనరీ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ ప్రధాన వేదికను 154 ఎకరాల్లో సిద్ధం చేస్తున్నారు. మిగిలిన 1,059 ఎకరాలను పార్కింగ్, డైనింగ్ హాళ్లు మరియు ఇతర సౌకర్యాల కోసం కేటాయించారు. ఇది ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ సమావేశం అవుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మరియు సీనియర్ నాయకుల కోసం దాదాపు 12 వేల అడుగుల భారీ వేదికను సిద్దం చేస్తున్నారు


ప్రధాన రహదారి నుండి వేదిక చేరుకోవడానికి తాత్కాలిక రోడ్లు

జాతీయ రహదారుల ద్వారా సిద్దిపేట, వరంగల్ మరియు కరీంనగర్‌లను అనుసంధానం చేసేలా ఎల్కతుర్తిని సభా వేదికగా ఎంపిక చేశారు. ప్రధాన రహదారి నుండి వేదిక చేరుకోవడానికి తాత్కాలిక రోడ్లు వేస్తున్నారు. బహిరంగ సభకు ముందు పట్టణం మొత్తం గులాబీ రంగు బ్యానర్లు, తోరణాలు, జెండాలు మరియు పూలతో అలంకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మరియు ఇతర సీనియర్ నాయకులు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రజలను ఆహ్వానిస్తున్న నేతలు

పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ఎన్నికైన ప్రతినిధులు, మాజీ మంత్రులు ఇప్పటికే తమ నియోజకవర్గాలు, మండల స్థాయిల్లో పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ కార్యకర్తలను సమీకరించే పనిలో పడ్డారు. కొన్ని గ్రామాల్లో, పార్టీ నాయకులు ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రజలను బహిరంగ సభకు ఆహ్వానిస్తున్నారు.

ఎండల తీవ్రత, వరి కోతల సీజన్ టెన్షన్

ఎండల తీవ్రత, వరి కోతల టైమ్ కావడంతో వరంగల్ సభకు జనాన్ని సమీకరించడం అసాధ్యమని పార్టీ అధిష్టానం భయపడుతున్నట్లు సమాచారం. సభకు జనాన్ని తరలించడం కష్టమవుతుందని నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. సభకు 5 లక్షలకుపైగా జనాన్ని తరలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కేడర్ లో జోష్ నింపాలంటే సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని బిఆర్ఎస్ అధిష్టానం బావిస్తోందట. ఒక వేళ సభను సక్సెస్ చేయకపోతే క్యాడర్ మరింత నైరాశ్యంలో పడటంతో పాటు.. రాబోయే స్థానిక, మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికలపైనా ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని పార్టీ పెద్దలకు భయం పట్టుకుందంట.

గ్రేటర్లో గులాబీ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలు

గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు పట్టుంది. 24 అసెంబ్లీ స్థానాలకు గాను 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా కంటోన్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ బలం15 స్థానాలకు చేరింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టినా గ్రేటర్లో గులాబీ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలున్నారు. దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ పార్టీకి క్యాడర్ ఉంది. సిల్వర్ జూబ్లీ వేడుకలకు గ్రేటర్‌ నుంచి జనాన్ని తరలించడం సులభం అవుతుందని పార్టీ అధిష్టానం భావింస్తున్నట్లు తెలిసింది. జిల్లాల నుంచి ఆశించిన మేర రాకున్నా గ్రేటర్ నుంచి జనం వస్తే సభ భారీ సక్సెస్ అవుతుందని అంచనాకు వచ్చిందట. గ్రేటర్ లోని ప్రతి సెగ్మెంట్ నుంచి 10 నుంచి 20వేల మందిని తరలించేలా పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్‌లకు టార్గెట్ ఫిక్స్ చేశారంట.

కేసీఆర్ ఆదేశాల అమలుకు నానా పాట్లు పడుతున్న నేతలు

రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాలకు 5 వేలు టార్గెట్ పెట్టినా సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నారంట. అందుకు ఎప్పుడూ లేని విధంగా ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగి మరీ ఉమ్మడి జిల్లాల వారీగా ఫాంహౌజ్ లో సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షలు నిర్వహిస్తూ, నేతలకు డైరెక్షన్‌లు ఇస్తున్నారంట. పార్టీ ముఖ్యనేతలందరికీ ప్రత్యేక భాధ్యతలు అప్పగించి వరంగల్ సభ సక్సెస్ కు అయ్యేలా కేసీఆర్ ఇస్తున్న ఆదేశాలను అమలు చేయడానికి నేతలు పడరాని పాట్లు పడుతున్నారంట.

త్వరలోనే ఉపఎన్నికలు వస్తాయని కేటీఆర్ ప్రచారం

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, త్వరలోనే బై ఎలక్షన్స్ వస్తున్నాయని కేటీఆర్ పదేపదే ప్రకటిస్తుండటం.. క్యాడర్‌లో జోష్ నింపి వరంగల్ సభ సక్సెస్ చేయడం కోసమే అనే ప్రచారం సాగుతోంది. ఇక ఖర్చు సైతం భారీగానే వెచ్చిస్తున్నట్లు తెలుస్తుంది. రవాణా సౌకర్యం, భోజనం, ఇతరాత్రా ఖర్చులు మొత్తం నేతలకు సంభందం లేకుండా పార్టీనే భరిస్తుందని అధిష్టానం హామీ ఇస్తుందట. ఖర్చు విషయంలో నేతలను నమ్ముకుంటే అసెంబ్లీ ఎన్నికల మాదిరి ఫలితాలు వస్తాయనే భావించే బీఆర్ఎస్ అధిష్టానం వరంగల్ సభ సక్సెస్ కోసం అతిజాగ్రత్త వహిస్తుందట.

Also Read: బాబుపై కేశినేని పోస్ట్.. టీడీపీలోకి రీఎంట్రీ?

10 ఏళ్లలో జిల్లా నేతలను కనీసం కన్నెత్తి చూడని కేసిఆర్

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. సభను సక్సెస్ చేసి ప్రజా వ్యతిరేకతను సభ ద్వారా నిరూపించాలని బిఆర్ఎస్ భావిస్తుందట. ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉంటే ఇంత డబ్బు ఖర్చుపెట్టి ఎన్నడూ లేనంతగా కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలకు ఆ పార్టీ వారి దగ్గర సమాధానం దొరకడం లేదు. గత 10 ఏళ్లలో కనీసం కన్నెత్తి కూడా చూడని జిల్లాల నేతలను ఫాంహౌజ్ కు ఆహ్వానించి కేసీఆర్ అతిధి మర్యాదలు ఎందుకు చేస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ని పార్టీ నేతలు ఎంత వరకు సక్సెస్ చేస్తారో చూడాలి.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×