Violence in Iran: ఒకప్పుడు చమురు సంపదతో తులతూగిన దేశం.. నేడు ఆకలితో అల్లాడుతోంది. ఆకాశాన్నంటుతున్న ధరలు, పాతాళానికి పడిపోయిన కరెన్సీ విలువతో.. ఆ దేశ ప్రజల కడుపుమండింది. వారి సహనం కట్టలు తెంచుకుని.. రోడ్లపైకి చేరింది. తిరుగుబాటు రూపంలో విస్ఫోటనంగా మారి..ఇరాన్‌ను దహించివేస్తోంది. నిరసన జ్వాలలు ఇరాన్ సరిహద్దులను దాటుతున్నాయి. అంతర్యుద్ధంతో అట్టుడుకుతోన్న ఇరాన్‌పై నేటి ప్రత్యేక కథనం.
తేహ్రాన్ గ్రాండ్ బజార్‌లో నిరసన జ్వాలలు
ఇరాన్ అగ్నిగుండంగా మారింది. దశాబ్దాల నియంతృత్వం, పాతాళానికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ, ఆకలి కేకల మధ్య ఆ దేశ ప్రజలు వీధులకెక్కారు. గత నెల 28న తేహ్రాన్ గ్రాండ్ బజార్‌లో మొదలైన నిరసన జ్వాలలు, దేశంలోని 31 ప్రావిన్స్‌లలో 21 ప్రాంతాలకు దావాగ్నిలా వ్యాపించాయి. నిరసనలు తీవ్రం కావడంతో ప్రభుత్వం గత్యంతరం లేక పబ్లిక్ హాలిడే ప్రకటించి దేశాన్ని షట్‌డౌన్ చేసింది.
50 శాతం దాటిన ద్రవ్యోల్బణం
ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ ఊహించని విధంగా దిగజారడమే ఈ విస్ఫోటనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2015లో ఒక డాలరుకు 32 వేల రియాల్స్‌గా ఉన్న విలువ.. నేడు ఏకంగా 1.38 మిలియన్ల స్థాయికి పడిపోయింది. ఇరాన్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం, ఆర్థిక ఆంక్షల కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ద్రవ్యోల్బణం 50 శాతం దాటడంతో సామాన్యుడికి బతుకు భారమైంది. సగటు ఉద్యోగి నెల సంపాదన కేవలం 100 డాలర్లకు పడిపోయింది. ఈ సొమ్ము కనీసం ఆహారం కొనుగోలుకే సరిపోవడం లేదు. ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్‌లో ఆహార పదార్థాల ధరలు 72 శాతం, ఆరోగ్య సంబంధిత వస్తువుల రేట్లు 50 శాతం పెరిగాయి. ఇంధన ధరల పెంపు, పన్నుల పెంపు ప్రతిపాదనలు ప్రజలపై మరింత భారాన్ని పెంచాయి. దీనికి తోడు 2026 బడ్జెట్‌లో పన్నును ప్రభుత్వం 62శాతానికి పెంచింది. దీంతో ప్రభుత్వ చర్యలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమను నిట్టనిలువునా దోచుకోవడమేనని విమర్శిస్తూ.. రోడ్లపైకి చేరి ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
ఆందోళనల్లో పాల్గొన్న 10 విశ్వవిద్యాలయాల విద్యార్థులు
టెహ్రాన్‌లోని గ్రాండ్ బజార్ ఇరాన్ ఆర్థిక జీవనాడి. గత నెల 28వ తేదీన ఇక్కడి వ్యాపారులు షట్టర్లు మూసివేసి రోడ్లపైకి రావడంతో దేశం ఒక్కసారిగా స్తంభించిపోయింది. 1979లో ఇరాన్ రాజరికాన్ని కూల్చివేసి ఇస్లామిక్ విప్లవం రావడానికి ఈ గ్రాండ్ బజార్ సమ్మెలే నాంది పలికాయి. ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతమవుతుండటంతో పాలకుల్లో వణుకు మొదలైంది. నిరసనలు కేవలం టెహ్రాన్‌కే పరిమితం కాకుండా కరాజ్, హమేదాన్, ఖెష్మ్, ఇస్పహాన్, షిరాజ్ వంటి ప్రధాన నగరాలకు విస్తరించాయి. సుమారు 10 విశ్వవిద్యాలయాల విద్యార్థులు చదువును పక్కనపెట్టి ఆందోళనల్లో భాగస్వామ్యులయ్యారు. కేవలం ఆర్థిక ఇబ్బందులతో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు రాజకీయ విప్లవంగా మారింది. నిరసనకారులు నేరుగా సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యం చేసుకుని డౌన్ విత్ ది డిక్టేటర్, డౌన్ విత్ ఖమేనీ అంటూ నినదిస్తున్నారు. నియంతలకు మరణశిక్ష విధించాలంటూ ప్రజలు నేరుగా దేశ నాయకత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు.
రాజీనామా చేసిన మహమ్మద్ రెజా ఫర్జీన్
ఆర్థిక పరిస్థితి చేయిదాటడంతో సెంట్రల్ బ్యాంకు గవర్నర్ మహమ్మద్ రెజా ఫర్జీన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అబ్దుల్ నాజర్ హెమ్మతిని ప్రభుత్వం నియమించింది. అయితే, గతంలో విఫలమైన విధానాలు అమలు చేశారని పార్లమెంటు చేత తొలగించబడిన హెమ్మతిని మళ్ళీ నియమించడంపై ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్ ప్రభుత్వ ద్వంద్వ వ్యూహం
నిరసన జ్వాలలతో రగులుతున్న ఇరాన్‌లో ప్రభుత్వం.. ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకవైపు ఆందోళనకారుల డిమాండ్లను వింటామని చెబుతూనే, మరోవైపు శాంతి భద్రతల పేరుతో కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ప్రజా విప్లవాన్ని అణచివేసేందుకు పాలకుల వద్ద ఉన్న క్యారెట్ అండ్ స్టిక్ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. దేశంలో నెలకొన్న అశాంతిపై ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ మహమ్మద్ మోవహెది-ఆజాద్ కీలక ప్రకటన చేశారు. నిరసనకారులు పరిధి దాటవద్దంటూ ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు తమ ఆర్థిక ఇబ్బందులపై శాంతియుతంగా నిరసనలు తెలిపితే తమకేమి ఇబ్బంది లేదంటూనే వార్నింగ్ ఇస్తున్నారు. నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, ప్రజా జీవనానికి విఘాతం కలిగించినా లేదా భద్రతా దళాలపై దాడులకు దిగినా తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
ప్రజలకు నచ్చ చెబుతున్న అధ్యక్షుడు పెజెష్కియాన్
ప్రభుత్వం ఆందోళనకారులను చర్చలకు పిలిచినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవైపు అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రజల కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు విప్లవ దళాలు వీధుల్లో భారీగా మోహరించాయి. ఇప్పటికే పలు నగరాల్లో టియర్ గ్యాస్ ప్రయోగాలు, లాఠీఛార్జీలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ సేవలను అడ్డుకోవడం ద్వారా సమాచార మార్పిడిని నియంత్రించే ప్రయత్నం కూడా జరుగుతోంది.
విదేశీ నిఘా సంస్థల కుట్ర
ప్రభుత్వ అనుకూల మీడియా ఈ నిరసనలను విదేశీ నిఘా సంస్థల కుట్రగా అభివర్ణిస్తోంది. విదేశీ నిఘా సంస్థలు ఇరాన్ అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు సామాన్యులను పావులుగా వాడుకుంటున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణల ద్వారా నిరసనకారులను దేశద్రోహులుగా ముద్ర వేసి, మరింత కఠినంగా అణచివేసేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
2022లో మహ్సా అమినీ మరణం తర్వాత ప్రజా విప్లవం
2022లో మహ్సా అమినీ మరణం తర్వాత ఇరాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజా విప్లవం ఇదే. ప్రభుత్వం ఆంక్షలతో అణచివేయాలని చూస్తున్నా, ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రజలు మాత్రం చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ప్రజాగ్రహంతో ఇరాన్‌లో పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా ఉంది. ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటి కనీస అవసరాలు తీరని స్థితిలో ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన జ్వాలలు.. ఇరాన్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త విప్లవానికి దారితీస్తుందా ? లేదా అనేది వేచి చూడాలి.
ఇరాన్‌లో ప్రజా ఆగ్రహం ఎటువైపు దారితీయనుంది..? ఉరిమి ఉరిమి మంగళం మీదపడ్డట్లు.. ఈ ఆగ్రహ జ్వాలలు.. సుప్రీం లీడర్ కిందకు నీళ్లు తెస్తాయా..? ఏళ్లకు ఏళ్లుగా ఇరాన్‌ను ఏలుతున్న ఖమేనీ.. పని ఖతమేనా..? ఇరాన్‌లో ఆగ్రహ జ్వాలల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థల హస్తముందా..?
వీధుల్లో ఎగిసిపడుతున్న జనాగ్రహం.. అమెరికా విధిస్తున్న ఉక్కిరిబిక్కిరి
ఇరాన్ ప్రస్తుతం త్రిముఖ పోరాటాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు వీధుల్లో ఎగిసిపడుతున్న జనాగ్రహం, మరోవైపు అమెరికా విధిస్తున్న ఉక్కిరిబిక్కిరి చేసే ఆంక్షలు, ఇంకోవైపు ఇజ్రాయెల్‌తో యుద్ధం తెచ్చిన విధ్వంసం. ఈ పరిణామాలు 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారానికి ముప్పుగా పరిణమించాయనే ప్రచారం అంతర్జాతీయ స్థాయిలో ఊపందుకుంది. ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచేయడంలో అమెరికా ఆంక్షలు కీలక పాత్ర పోషించాయని చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ఏ దేశం కూడా ఇరాన్ నుంచి చమురు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇరాన్ ఆదాయ మార్గాలను మూసివేసింది. ఇరానీ బ్యాంకులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించింది. దీనివల్ల ఇరాన్ క్రమంగా ఆర్థికంగా బలహీనపడింది. ప్రస్తుతం వీధుల్లో చెలరేగుతున్న నిరసనలకు ట్రంప్ హయాంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలే పరోక్ష కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం
గతేడాది ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం ఇరాన్ ఆత్మవిశ్వాసాన్ని నామరూపాలు లేకుండా చేసింది. ప్రపంచం మొత్తం మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని భయపడిన వేళ, ఇజ్రాయెల్ తన అధునాతన వాయుసేనతో ఇరాన్ గుండెకాయ లాంటి అణు కేంద్రాలను ఛిన్నాభిన్నం చేసింది. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రధానంగా ఇరాన్ అణ్వాయుధ తయారీని అడ్డుకోవడమే లక్ష్యంగా సాగింది. ఇరాన్ అత్యంత భద్రంగా భావించే ఫోర్డో, నటాంజ్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. అమెరికా సరఫరా చేసిన బంకర్ బస్టర్ బాంబులతో భూగర్భంలో ఉన్న కీలక యంత్రాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల వల్ల ఇరాన్ అణు కార్యక్రమం కనీసం రెండు నుంచి మూడు ఏళ్లు వెనక్కి నెట్టబడింది. కేవలం ఆస్తులు మాత్రమే కాదు, ఇరాన్ మేధో సంపత్తిని కూడా ఇజ్రాయెల్ దెబ్బతీసింది.
అశాంతాని రేకెత్తించడంలో మొసాద్ కీలకం
ఇరాన్‌లో చెలరేగుతున్న నిరసనలు, ప్రజా ఆగ్రహం వెనుక అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థల ప్రమేయం ఉందన్న చర్చ అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇరాన్ ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలను బలంగా వినిపిస్తోంది. ఇరాన్ ప్రావిన్సుల్లో అశాంతిని రేకెత్తించడానికి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ నిరసనకారులకు సాంకేతిక సాయం, నిధులు, ఆయుధాలను అందిస్తోందని ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొసాద్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇరానియన్లను ఉద్దేశించి మేము మీతో ఉన్నాం.. రోడ్లపైకి రండి అంటూ పర్షియన్ భాషలో సందేశాలు పంపడం చర్చనీయాంశమైంది.
కరెన్సీ పతనం, పెరిగిన నిత్యావసరాల ధరలు
అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ కరెన్సీ పతనమై, నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఈ ఆర్థిక ఇబ్బందులే ప్రజలను రోడ్లపైకి తెచ్చాయంటున్నారు విశ్లేషకులు. అమెరికా నేరుగా నిరసనల్లో పాల్గొనకపోయినా, ప్రజలు తిరగబడే పరిస్థితులను కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. ఇరాన్ ప్రభుత్వ సమాచార వ్యవస్థలను, టీవీ ఛానళ్లను హ్యాక్ చేసి ప్రజలను రెచ్చగొట్టేలా CIA సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న వాదనలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంస్థలు నిరసనకారులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం, ప్రభుత్వ కమ్యూనికేషన్లను అడ్డుకోవడం ద్వారా ఉద్యమానికి పరోక్షంగా సహకరిస్తున్నాయని ఇరాన్ నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఖమేనీ సామ్రాజ్యానికి చరమగీతం..?
ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లు.. ఈ నిరసన జ్వాలలు.. ఖమేనీ సీటు కిందకు నీళ్లు తెచ్చేలా కనిపిస్తున్ఆనయి. గడిచిన మూడు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజాగ్రహ జ్వాలలు ఖమేనీ సామ్రాజ్యానికి చరమగీతం పాడే సూచలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఖమేనీ వయస్సు 86 ఏళ్లు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అంతర్జాతీయ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే రివల్యూషనరీ గార్డ్స్, భద్రతా సంస్థలు, మతపరమైన సంస్థల్లో ఖమేనీకి బలమైన పట్టు ఉంది. ఆయన పదవిలో ఉన్నంత వరకు ప్రభుత్వం కూలే అవకాశం కనిపించడం లేదు. కానీ నూరు గొడ్లను తిన్న రాబంధు.. ఒక్క గాలి వానకు కూలినట్లు.. ప్రజలు తలచుకుంటే.. ఎంతటి బలమైన ప్రభుత్వం అయినా కూలిపోవాల్సిందే. ఈ క్రమంలో ప్రజల నిరసన జ్వాలలు.. ఖమేనీ నియంతృత్వాన్ని కాల్చివేస్తాయని అంచనా వేస్తున్నారు.
Also Read: కొత్త ఏడాదిలో పరుగులు పెడుతున్న పసిడి.. నేడు తులం ఎంతంటే?
ఇరాన్ చరిత్రలో ఇది అత్యంత క్లిష్టమైన సమయం అని చెప్పాలి. అమెరికా ఆంక్షలు ఒకవైపు, ఇజ్రాయెల్ భయం మరోవైపు ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటన్నింటికీ తోడు అంతర్గత తిరుగుబాటు.. ఈ పరిస్థితుల్లో..
ఇరాన్ నియంతృత్వ పాలనకు ముగింపు పలుకుతుందా లేదా అన్నది వేచి చూడాలి.
Story By Kishan, Bigtv