Nama Nageswara Rao: ఆ జిల్లాను చూస్తుంటే.. ప్రతిపక్షనేతలు అస్త్ర సన్యాసం చేశారా అన్నట్లుగా పరిస్థితి మారిందట. గత ప్రభుత్వం హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా.. ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లో వెళ్లిపోవటంతో.. పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారట. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కారు పార్టీ నేతలు మౌనం.. దేనికి సంకేతమేనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నమ్ముకున్న నేతలంతా.. అందుబాటులో లేక.. ఏం చేయాలో తెలియని స్థితిలో గులాబీ శ్రేణులు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ సైలెంట్ అయిన నేతలెవరు.. వారి మౌనం వెనుక మర్మమేంటి? వాచ్ దిస్ స్టోరీ..
ఖేల్ ఖతం.. దుకాణం బంద్. ఈ మాట BRS నేతలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటే అతిశయోక్తి కాదేమో. గులాబీ అధినేత కేసీఆర్ సహా చాలా మంది నేతలూ ఎన్నికల ఫలితాలు తర్వాత జనంలోకి రావటం లేదట. చాలాకాలంగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కాగా.. ఇతరకీలక నేతలూ.. నియోజకవర్గాల్లో ఉండని పరిస్థితి నెలకొంది. నమ్ముకున్న నేతలు తమను దూరం పెడుతున్నారంటూ గులాబీ శ్రేణులు, కార్యకర్తలూ ఆందోళనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
ఒకరిద్దరు BRS మాజీలు.. అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వస్తున్నా.. తూతూమంత్రంగా వచ్చి వెళ్లిపోతున్నారనే వాదనలు ఉన్నాయి. ఆ విషయాన్ని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి అయితే మరీ దారుణం అంటున్నారు రాజకీయ నిపుణులు. పదేళ్లపాటు అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన ప్రజాప్రతినిధులు.. అధికారం చేజారాక.. జిల్లా వైపు కనీసం చూడటం లేదని టాక్ నడుస్తోంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అయితే.. అసలు సొంత నియోజకవర్గంలో తిరిగిన సందర్భాలు లేవనేది స్థానికులు వాదనగా తెలుస్తోంది. తాము గెలిపించి ఆయన్ను పార్లమెంటుకు పంపించామని.. గెలుపు ఓటములు సహజం అని తెలిసినా.. నామా నాగేశ్వరరావు తమకు అందుబాటులో లేరంటూ కొందరు గులాబీబాస్‌కు కంప్లైంట్ చేసే పరిస్థితి వచ్చిందట.
నామా నాగేశ్వరరావు పదవిలో ఉన్నా… లేకున్నా జిల్లాలో కనిపించేది తక్కువేనని ఖమ్మం వాసులే చర్చించుకుంటున్నారట. పార్టీ సముచిత స్థానం కల్పించినా.. జిల్లా ప్రజలను సమస్యలు పక్కన పెట్టి.. సొంత ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన పనిచేస్తుంటారని.. సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసి.. ఆరు నెలలు కావొస్తున్నా.. పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నామా పర్యటించిన దాఖలాలు లేవట. ఎప్పుడో ఒకసారి కొత్తగూడెం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు తప్ప.. తమను పట్టించుకోవటం లేదనేది ఓటర్ల మాటగా తెలుస్తోంది. విపక్షంలో ఉన్నా.. తమ సమస్యలపై వినిపించాల్సిన వ్యక్తి.. కనీసం కంటికి కనిపించటం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లోని సమస్యలపై నాడు గళమెత్తిన నేత.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారన్నది కార్యకర్తల ప్రశ్నగా తెలుస్తోంది. కనీసం పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేనంత బిజీగా మారిపోయారా లేక మొహం చెల్లక సొంత ఇలాఖాలో ఉండలేకపోతున్నారా అనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోవటంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించింది. దీంతో నామా తనకు అవినీతి మరక అంటుకుంటుందనే భయంతోనే జిల్లాలో అడుగుపెట్టడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాంటి తప్పూ చేయనప్పుడు ఆయన ఎందుకు భయపడుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ కేసు తనపై నమోదవుతుందనే భావనలోనే నామా తమకు దూరం అయ్యారని సొంత పార్టీలోని కొందరు చర్చించుకుంటున్నారట.
Also Read: ఏడాదిలోనే ఎన్నో అభివృద్ధి ఫలాలు.. రేవంత్ సర్కార్ చేపట్టిన పనులు, చేసుకున్న ఒప్పందాలివే!
మరోవైపు.. నామా నాగేశ్వరరావు కూడా పార్టీ మారతారనే వార్తలూ గుప్పుమంటున్నాయి. దీనికోసం అనుచరులతో మాజీ ఎంపీ చర్చలు జరిపినట్లు సమాచారం. మూడుసార్లు ఎంపీగా గెలిపొందినా.. నామా నాగేశ్వరరావు సొంత క్యాడర్‌ను కానీ.. అనుచరగణాన్ని గానీ సమకూర్చుకోలేకపోయారనే అపవాదు మూటగట్టుకున్నారు. అధికారం ఉన్నప్పుడే అడపాదడపా పర్యటనలు మినహా చేసిన అభివృద్ధి లేదనేది మరికొందరి మాటగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో ఎమ్మెల్యేలకు తెలియకుండా నియోజకవర్గాల్లో తిరగవద్దని మాజీ సీఎం కేసీఆర్.. ఆనాడు ఆదేశించారట. కాబట్టి దీనికి లోబడే నామా ప్రవర్తిస్తున్నారనే వాదనలూ తెరపైకి వస్తున్నాయి.
అంతకుముందు టీడీపీలో ఉన్న సమయంలో కానీ.. తర్వాత బీఆర్‌ఎస్ గూటికి చేరినప్పుడు కానీ.. నామాకు.. నా అనే వాళ్లు లేరనేది కార్యకర్తల్లో సాగుతున్న చర్చ. తనకంటూ ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకోవటంలో ఆయన విఫలం అయ్యారనే పొలిటికల్ వర్గాల్లోనూ టాక్ నడుస్తోంది. ఈ ఘటనలు పరిశీలిస్తే.. నామా సొంత జిల్లాలో పర్యటిస్తే పట్టుమని పదిమంది కూడా రారని కాంగ్రెస్ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లు అవుతోందని పొలిటికల్ వర్గాల్లో టాక్.
గత ఎన్నికల్లో గులాబీపార్టీ జిల్లాలో భారీగా ఓటమి చెందడానికి నామా నాగేశ్వరరావు ఒంటెద్దు పోకడలు కూడా కారణమనే వార్తలు గుప్పుమంటున్నాయి. అధికారంలో ఉండగా.. తమను పట్టించుకోని మాజీఎంపీకి వ్యతిరేకంగా.. ఓ వర్గం నేతలు పనిచేశారనే వాదనలూ ఉన్నాయి. కారు పార్టీ జెండాను కష్టపడి మోసిన తమకు.. నామా ఎప్పుడూ సహకరించలేదనే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. జనంలోంచి వస్తున్న వార్తలతో మాజీ ఎంపీ మరింత సతమతం అవుతున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో సామాజిక, ఆర్థికబలాన్ని ముందుకు తెస్తూ.. వాటినే ఆయన నమ్ముకున్నారు తప్ప.. ప్రత్యేక బలం లేదనేది కాంగ్రెస్ ఆరోపణ. మరోవైపు.. జిల్లాలోని గులాబీ నేతల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలు నామాకు కలిసిరావటం లేదనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
గతంలో ఎంపీగా గెలిచినా ఓ మాజీమంత్రి అనుమతి లేకుండా నామా పర్యటనలు చేసిన దాఖలాలు లేవనేది ఇతరపార్టీల ఆరోపణగా తెలుస్తోంది. అప్పట్లోనే నామా నాగేశ్వరరావు.. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని.. గులాబీ బాస్ కూడా ఆ విషయంలో ఏమీ చేయలేదనే వాదనలు ఉన్నాయి. మాజీమంత్రి పువ్వాడ అజయ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధు మధ్య ఉన్న విభేదాలే.. నామా ఓటమికి కారణమనే వాదనలూ ఉన్నాయి. దీనివల్లే ఆనాడు కేసీఆర్.. నామాకు కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థలు జరగనున్న నేపథ్యంలో యాక్టివ్ కావాల్సిన గులాబీనేతలంతా ఇంకా సైలెంట్‌లో ఉండటంతో తమ భవిష్యత్ ఏంటనే యోచనలో కారుపార్టీ శ్రేణులు ఉన్నాయట. ఇకనైనా మాజీలంతా ఏకతాటిపైకి వచ్చి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని.. లేకుండా వచ్చే ఎన్నికల్లో మరిన్ని చిక్కులు తప్పవని రాజకీయ వర్గాలూ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.
పదేళ్లుగా తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు నేతలు జిల్లాలో అరాచకాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వారంతా యదేఛ్చగా భూమాఫియా, కుంభకోణాలకు పాల్పడిన విషయాలను జనంలోకి తీసుకెళ్లటంతో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్.. తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియకే చాలామందీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే నామా నాగేశ్వరరావు కనిపించటం లేదనేది ఇతర పార్టీల నేతలు ఆరోపణగా తెలుస్తోంది. ఇదే కంటిన్యూ అయితే.. జిల్లాలో పార్టీ పరిస్థితి.. ఖేల్ ఖతం..దుకాణం బంద్ అన్నట్లుగా ఉంటుందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.