చీమలపెట్టిన పుట్టలు పాములకిరువైనయట్లు..! అనేది సుమతీ శతకంలోని ఓ పద్యంలో కొంత భాగం. కానీ ఇక్కడ ఇది రివర్స్ అయ్యింది. పాములు దూరిన పుట్టను చీమలు కైవసం చేసుకున్నయట్లు..! అని అనాలేమో. సేమ్ అట్లనే ఉంది బీహార్‌లోని బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ గెలుపు.
ఏళ్ల తరబడి పాతుకు పోయిన ఈ బంగారు పుట్టలోకి వేలు పెట్టాడు .. కాదు కాదు.. మొత్తం దూరిపోయి.. పామును బయటకు పంపించేశాడు తన గెలుపుతో. సమీప బీజేపీ అభ్యర్థిపై దాదాపు 19వేల ఓట్ల మెజారిటీతో ఆయన జన్ సూరజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నిక కావడంతో వచ్చిన ఈ ఉప ఎన్నిక ఫలితాల ద్వారా బీజేపీలో అంతర్మథనం మొదలైందని చెప్పాలి.
అధికార పార్టీ అదే.. ఆ స్థానం జాతీయ అధ్యక్షుడిది.. గతంలో తిరుగులేని విజయపరంపర రికార్డు.. వీటన్నింటినీ బద్దలు కొట్టి.. ఇదే తన తొలి బోణిగా మలుచుకుని అసెంబ్లీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ కిషోర్. ఇదిప్పుడు దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. బీజేపీ ఓటమిని ఆ పార్టీ మీద జనాలకు పెరుగుతున్న వ్యతిరేకతగా అభివర్ణిస్తున్నారు నేతలు. బీజేపీయేతర పార్టీలన్నీ మూకుమ్మడిగా ప్రశాంత్ గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
మోడీకి ఇది రెండో ఎదురు దెబ్బగా కూడా పోల్చుతున్నారు. జంతర్‌మంతర్ వద్ద జెన్‌జీ చేతులో ఘోరంగా దెబ్బతిని.. ఓటమిని చవిచూసి తలొగ్గిన మోడీ.. ఇప్పుడు ఓట్ల ద్వారా జనాల మన్‌కీ బాత్ ఎలా ఉందో చూశాడంటున్నారు. ఈ ఫలితాలు మొత్తంగా ప్రభావితం చేసేలా ఉన్నాయని, మొన్నటి జంతర్‌మంతర్ ప్రభావం కూడా బీజేపీ మీద ఉందంటున్నారు.
ఉత్తర భారతదేశంలో తను తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న క్రమంలో ఒక్కొక్కటిగా ఇలా ఎదురుదెబ్బల రూపంలో బీజేపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మొత్తం మూడు రాష్ట్రాల్లో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. .. గుజరాత్‌లోని మంజల్‌పూర్‌లో బీజేపీ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ ఓడింది. మధ్య ప్రదేశ్‌లోని దతియాలో బీజేపీపై కాంగ్రెస్ గెలిచింది. అంటే రెండు చోట్ల బీజేపీ ఓటమి పాలైంది. ఒక్క చోట మాత్రం ఉనికి కాపాడుకోగలిగింది.
మొత్తంగా ఈ ఫలితాలు బీజేపీ వ్యతిరేక పవనాలు దేశ వ్యాప్తంగా వీస్తున్నాయనే సందేశం ఇచ్చిందంటున్నారు జనాలు. మెల్లమెల్లగా పతనం దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని కూడా అభిప్రాయపడుతున్నారు. జాతీయ అధ్యక్షుడి ఇలాఖాలోనే పార్టీ పరిస్థితి ఇలా ఉంటే.. దేశ వ్యాప్తంగా బీజేపీ ఇకపై గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం తథ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కాక్రోచ్ జనత పార్టీ దెబ్బకు మొన్న ధర్మేంద్ర ప్రధాని రాజీనామాతో బీజేపీ కొంచెం వెనక్కి తగ్గింది. మోడీ అర్థరాత్రుల వేళ వీడియోలు రిలీజ్ చేసి ..యువతతో మాట్లాడే ప్రయత్నం చేయడం కూడా కేంద్రం తను చేసిన తప్పిదానికి తలొగ్గిందనే సంకేతం వెళ్లింది. దీంతో మోడీ కూడా రెండు మూడు మెట్లు దిగి రావడం.. ప్రధాన్ రాజీనామా చేయడంతో దీనికి పుల్ స్టాప్ పడింది. కానీ ఇది దేశ వ్యాప్తంగా చర్చకు తెర తీసింది. ఇప్పుడు బంకీపూర్ ఫలితాలు మరోసారి చర్చకు కారణమయ్యాయి.