Kolagatla Veerabhadra Swamy: కౌన్సిలర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మినిస్టర్ స్థాయి ప్రోటోకాల్ అనుభవించిన ఆయన ఇప్పుడు ఏ పదవీ లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారంట. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో రెండంటే రెండే సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైసీపీ హయాంలో క్యాబినెట్ హోదా దక్కించుకుని ప్రోటోకాల్ కోసం చేసిన హడావుడి అంతా ఇంతా కాదంట.. ఆయన పేరు చెప్తే అక్కడి యంత్రాంగం ఇప్పటికీ ఆయన హాడావుడి గుర్తు తెచ్చుకుని ఉలిక్కి పడుతోందంట. అంత హవా చలాయించిన ఆయన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనపడకుండా పోవడంతో వైసీపీ శ్రేణులు చిర్రుబుర్రులాడుతున్నాయి. ఇంతకీ ఎవరా లీడర్?
వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన కోలగట్ట వీరభద్రస్వామి
వైసీపీ హయాంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఓ వెలుగు వెలిగిన వారిలో విజయనగరం మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఒకరు. ముఖ్యంగా ప్రొటోకాల్ విషయంలో ఏ చిన్న పొరపాటు దొర్లినా అధికారులను తొక్కి నార తీసేవారు . అప్పట్లో ఆయన హవా మామూలుగా ఉండేది కాదు. జిల్లాకే చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతో సమానంగా తనకూ ప్రోటోకాల్ ఉండాలని, తనతో పాటు ఎంతమంది మీటింగ్ కి హాజరైతే అందరికీ కుర్చీలు వేసి మర్యాదలు చేయాల్సిందేనంటూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేవారు.
తేడా వస్తే బహిరంగంగానే అధికారులపై చిందులు
కోలగట్ల వీరభద్రస్వామి తాను ఆశించిన స్థాయిలో మర్యాదలు జరగకపోతే బహిరంగంగానే ఆఫీసర్ల పై కస్సుబుస్సు మనేవారు. బొత్స సత్యనారాయణను సత్తిబాబు అని సంభోదించే ఆయన… సత్తిబాబు వస్తే ఇలానే చేస్తారా అంటూ అధికారులపై ఫైర్ అయ్యేవారు. దీంతో అధికారులు కూడా లోలోపల తిట్టుకుంటూ.. నానా పాట్లూ పడి ప్రోటోకాల్ కి మించి మర్యాదలు చేసేవారు . కోలగట్లను చూసి ఆయన అనుచరవర్గం కూడా అధికారులపై అలానే జులుం ప్రదర్శించేవారు. ఆ క్రమంలో వీరభద్రస్వామి ఏదైనా కార్యాక్రమానికి వస్తున్నారంటే.. అధికారులు తిట్టుకుంటూనే అలర్ట్ అయ్యే పరిస్థితి ఉండేది.
1983లో కాంగ్రెస్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కోలగట్ల
అధికారం పోయి మూలన కూర్చున్న కోలగట్ల గురించి ఇంత ఉపోద్ఘాతం ఇప్పుడెందుకు అంటారా.. అయిదేళ్లు అంత హడావుడి చేసిన ఆయన ఇప్పుడు అసలు అడ్రస్సే లేకుండా పోయారు. విజయనగరంలో కోలగట్ల 1983లో కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. విజయనగరం కౌన్సిలర్‌గా, అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానం పెట్టి 1989లో తొలిసారి విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గజపతి వంశానికి పెట్టని కోటైన విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో అశోక్‌గజపతిరాజుపై అలుపెరుగని పోరాటం చేస్తూ వచ్చిన కోలగట్ల అదృష్టం కలిసి వచ్చి 2004లో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. వెయ్యి ఓట్ల మెజర్టీతో ఆశోక్‌గజపతిని ఓడించిన ఘనత దక్కించుకున్నారు.
2019 ఎన్నికల్లో అదితి గజపతి విజయం
ఆ తర్వాత మళ్లీ పదిహేనేళ్లకి 2019 ఎన్నికల్లో తిరిగి అదితి గజపతిపై గెలిచి రెండో సారి ఎమ్మెల్యే అయిన కోలగట్ల దశ తిరిగింది . ఆయన్ని డిప్యూటీ స్పీకర్ చేసిన జగన్.. ప్రత్యేక జీఓ తెచ్చి మరీ మినిస్టర్ తో సమానంగా ప్రోటోకాల్ హోదా ఇచ్చారు. అంతేనా కోలగట్ల కుమార్తె కోలగట్ల శ్రావణిని డిప్యూటీ మేయర్ చేయడంతో.. ఆయన మున్సిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని తన కనుసైగతో శాసించారు. మేయర్‌ని డమ్మీ చేసి కూతురు, అల్లుడితో వెనకుండి కథంతా నడిపించారు. కోలగట్ల ఎంత వెనకేసుకున్నారన్న దానిపై ఆయన పక్కన తిరిగిన వారే లెక్కలు చెప్పలేకపోతున్నారిప్పుడు.
ఏసీ వేసుకుని ఇంట్లో కూర్చొన్నారని మండిపడుతున్న కేడర్
ఆ క్రమంలో ఇప్పుడు పార్టీ జిల్లాలో వైసీపీ డకౌట్ అయితే కోలగట్ల తాపీగా ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చోవడం ఎంతవరకు సమంజసమని పార్టీ కేడర్ మండిపడుతుంది. పదవులు పొంది కోట్లు వెనకేసుకుని అధికారం పోగానే మొహం చాటేస్తున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు కోట్లకు పడగలెత్తి ఇపుడు వాటితో ఎంజాయ్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తన్నారు. బొత్సతో సమానమని ప్రగల్భాలు పలికిన వ్యక్తి ఆయనలా ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని దెప్పి పొడుస్తున్నారు. కనీసం కార్యకర్తలని కలిసి వారికి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయడం లేదట ఈ తాజా మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి.
Also Read: సినీ స్టైల్లో జగన్ వార్నింగ్‌లు.. బాబు ఏంటిది? తెలుగు తమ్ముళ్లు గగ్గోలు
అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పిలిపించుకుని ప్రెస్‌మీట్లు
అధికారంలో ఉన్నపుడు ఉమ్మడి విజయనగరంలోని అందరి ఎమ్మెల్యేలని ఇంటికి పిలిపించుకుని ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుపై ఒంటి కాలిపై లేచిన స్వామి.. పార్టీ ఓటమిపాలు కాగానే ముసుగు తన్ని పడుకున్నారట. అంతేకాదు అధికారం కోల్పోయి 8 నెలలు గడుస్తున్నా కేడర్ తో కనీసం సమావేశం కూడా నిర్వహించలేదంట. అధికారంలో ఉన్నపుడు తనకు పదవులతో సంబంధం లేదని ఓడినా, గెలిచినా ప్రజల్లోనే ఉంటానని తన అనుచరులతో రోజుకి ఒక్కసారైనా చెప్పేవారంట ఆయన. అయితే ఓటమి తరువాత ఒక్క కార్యకర్తని కూడా పిలిచి మాట్లాడిన పాపాన పోలేదంట.
పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో స్వామి
అయితే వచ్చే ఎన్నికల్లో వీరభద్రస్వామి తిరిగి పోటీ చేయబోరని, జగన్ ఆయనకి టికెట్ ఇవ్వబోనని అప్పుడే సంకేతాలు ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లా కేంద్రంలో కొత్త నాయకుడైతేనే బెటర్ అనే అభిప్రాయంతో వైసీపీ అధ్యక్షుడు ఉన్నారంట. అది తెలిసే వీరభద్రుడు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో పడ్డారంట. మొత్తానికి విజయనగరంలో కోలగట్ల 40 ఇయర్స్ పొలిటికల్ జర్నీ అలా ముగియబోతుందన్న మాట.