Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ చేసింది హైకమాండ్. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంపై దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడంపై అడుగులు వేస్తోంది. ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రేసు నుంచి బీఆర్ఎస్ తప్పుకోవడంతో అధికార కాంగ్రెస్-విపక్ష బీజేపీలు నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం చేస్తున్నాయి. మూడు సీట్లు గెలుచుకోవాలని ఇరుపార్టీలు ఉవ్విల్లూరుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం రాత్రి పార్టీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు హాజరయ్యారు. వీరితోపాటు 42 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ(NSUI) సేవాదల్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు హాజరయ్యారు.
కీలక సమావేశం
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పకడ్బందీగా ప్రచారం చేయాలన్నారు. 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జ్ చొప్పున నియమించాలన్నారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకులు గ్రామ స్థాయి నుంచి వ్యూహాలు రచించాలన్నారు. ఓటర్లకు మన మీద మంచి అభిప్రాయం ఉన్నా వారితో ఓటు వేయించేలా బాధ్యత తీసుకోవాలన్నారు. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేపట్టాలన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు ఎన్నికల వ్యూహంతో పని చేయాలన్నారు. మొదటి, రెండో ప్రాధాన్యత ఓటులపై దృష్టిపెట్టాలన్నారు. ఎలిమినెట్ సిస్టమ్ లో ఓట్ల లెక్కింపు ఉన్నందున ప్రతి ఓటును చాలా కీలకంగా తీసుకోవాలన్నారు. ఓటర్ మ్యాపింగ్, ఓటర్లను ప్రత్యేకంగా కలవడం, గ్రామ స్థాయి నుంచి బూత్‌కు తీసుకెళ్లడం లాంటి అంశాలు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయకూడదన్నారు. గాంధీ భవన్ నుంచి కంట్రోల్ రూమ్ పెట్టి నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
ALSO READ: రాష్ట్రప్రజలకు శుభవార్త
మీనాక్షి సలహాలు
ఎమ్మెల్సీ ఎన్నిక చాలా కీలకమైనది,అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్. సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు ఒకటైతే, రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అవన్నీ ప్రచారంలోకి తీసుకెళ్లి విజయం సాధించేలా చేయాలన్నారు.
ఫ్యూచర్ ప్లాన్
ఈ నెల 23న పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు కానుంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన ఆదివారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు.
వీరితోపాటు జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఎన్నికల కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాలు, కార్పొరేషన్‌ల ఛైర్‌పర్సన్లు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, పీసీసీ అధికార ప్రతినిధులు పాల్గొంటారు. మండల, బ్లాక్ కాంగ్రెస్ మొదలు, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే అంశంపై అందరి అభిప్రాయాలు తీసుకోనున్నారు. హామీలను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో ఎందుకు విఫలమవుతున్నామనే విశ్లేషించనున్నారు. మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డిలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.