Kotamreddy vs Ys Jagan: మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓటమి పరాభవంతో అసెంబ్లీకి రావడం మానేశారు. తనతో పాటు గెలిచిన మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వడం లేదు . వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర వేధింపులకు గురైన అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణంరాజులు సభాపతి స్థానాల్లో ఉండటంతో ముఖం చెల్లకే ఆయన బాయ్‌కాట్ మంత్రం పఠిస్తున్నారు. అయితే అసెంబ్లీలో జగన్ చూడాలనే ఆత్రుత, ఉత్సుకత అధికార కూటమి సభ్యుల్లో పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. సభలో లేని మాజీ సీఎం కోసం ఎమ్మెల్యేలు కలవరిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
తాను అనుకున్నది జరగాలంతే.. మాజీ సీఎం జగన్ గురించి ఇంటాబయటా వినిపించే టాక్ అది. తాజాగా ఆయన తీసుకున్న రెండు నిర్ణయాలు మరోసారి ఆయన వైఖరిని స్పష్టం చేశాయి. అదే వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్ధులను కూడా ప్రకటించిన జగన్ ఇటీవల ఆ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సొంత పార్టీ వారికి షాక్ ఇచ్చారు . ఇక ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు శాసనసభకు వెళ్లేది లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అంతవరకూ తానే కాదు, పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లనవసరం లేదని తేల్చి చెపుతున్నారు.
ఎమ్మెల్యేలుగా మనం సభకు వెళ్లకపోవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. జగన్ వారికి పెద్ద క్లాస్ తీసుకున్నారంట. మనమేమీ సభకు శాశ్వతంగా వెళ్లం అనడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటే వెళతాం. 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీని శాసనసభలో ప్రతిపక్షంగా, ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించరా? అలా గుర్తించకుండా సభకు వెళితే మామూలు ఎమ్మెల్యేకిచ్చినట్లు రెండు నిమిషాలు మైక్ ఇస్తామంటే ప్రజా సమస్యలను అక్కడ ఏం ప్రస్తావించగలనని వితండ వాదం చేశారంట. అయన మీడియా ముందు కూడా అదే చెప్తున్నారు. ఆయన ప్రశ్నిస్తారన్న భయంతోనే ప్రభుత్వం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదంట.
అయితే సభకు ఒకసారి వెళ్లి చూస్తే మేలని, వెళ్లాక కూడా మైక్ ఇవ్వకపోతే అప్పుడే అసెంబ్లీకి రామంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారంట. దానికి వాళ్లు మైక్ ఇవ్వరు. అంతదానికి వెళ్లడమెందుకని జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీకి వెళ్లనంటున్న జగన్ మీడియాముఖంగా అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలను మాట్లాడతానంటున్నారు. జగన్ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యేలు బయటపడకపోయినా.. తీవ్ర అసహనంతో ఉన్నారంట.
Also Read: చంద్రబాబుకైతే అలా.. గనుల వెంకట్ రెడ్డికి ఇలానా?
బాయ్‌కాట్ నిర్ణయంపై అటు సొంత ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నా.. ఇతర పక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా జగన్ పట్టించుకునే పరిస్థితి లేదు. తాను పట్టి కుందేలుకి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. అయితే అసెంబ్లీలో మాత్రం జగన్‌ని అందరూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. జగన్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై సెషన్స్‌లో రోజు ప్రస్తావనకు వస్తూ.. విచారణ జరిపించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అదలా ఉంటే కూటమి ఎమ్మెల్యేలు జగన్‌ను సభలో చూడాలన్న ఉత్సుకత, ఆసక్తి ప్రదర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉందని, రోజుకు ఒక గంట జగన్‌కు మాట్లాడేందుకు టైం ఇస్తే ఆయనే సభకు వస్తారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు. 2017లో ఆయన పాదయాత్రకు వెళ్ళే సమయంలో బాధ్యతలు బుగ్గనకు గానీ ఇంకెవరికైనా అప్పగించి వెళ్ళాలి.. కానీ జగన్ అలా చేయలేదని… ఎందుకంటే ఆయన మినహా మిగతావారెవరూ మాట్లాడటం అతనికి ఇష్టం ఉండదని చెప్పుకొచ్చారు. అందుకనే జగన్ అసెంబ్లీకు రావడంలేదని… ఎవరిని రానివ్వడం లేదని వైసీపీలో ఉన్నప్పుడు జగన్‌ని దగ్గర నుంచి చూసిన వివరిస్తున్నారు.
జగన్‌ను చూసి చాలా రోజులు అవుతుంది.. కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. దానికి పరిష్కారం జగన్‌కు స్పీకర్ గంట సమయం మాట్లాడటానికి ఇస్తానంటే రేపే అసెంబ్లీకు వస్తారని అంటున్నారు. దానికి ఒక కండీషన్ కూడా ఉందంట. జగన్ సభకు వచ్చి ఏం మాట్లాడినా ఎవరూ అడ్డం పడకూడదంట. అదే జగన్ ఫిలాసఫీ అంట. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ ఎప్పుడు సమస్యల కోసం పోరాడలేదని.. తనకు మైక్ కోసమే పోరాడమని చెప్పేవారని ఎమ్మెల్యే కోటంరెడ్డి జగన్ గుట్టు బయట పెట్టారు.
ఇక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అయితే అసెంబ్లీకి జగన్ రాక కోసం వెయిట్ చేస్తున్నారంట. అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై చర్చలో మాట్లాడి విష్ణుకుమార్ రాజు గత ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పుడు అవలంభించిన నిరంకుశ విధానాలపై సమాధానం చెప్పడానికి జగన్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నట్టు రాజు చెప్పుకొచ్చారు. ఆయనైతే జగన్‌ని రప్పించే బాధ్యతను ఏకంగా రఘురామకృష్టం రాజుకు అప్పజెప్పడం విశేషం మొత్తానికి సభలో లేని జగన్ చుట్టే అటు సభలోనూ, ఇటు లాబీల్లోనూ చర్చలన్నీ నడుస్తున్నాయి. మరి ఆయన అసెంబ్లీకి వస్తారో లేదు కాని.. ఆయన గురించి కలవరించే వారు ఎక్కువైపోతున్నారిప్పుడు.