Krishna: సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ ట్రెండ్ ను మార్చేసిన మొనగాడు. ఇండియన్ జేమ్స్ బాండ్. తెలుగు కౌబాయ్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. అంతా హాలీవుడ్ గురించి గొప్పగా చెప్పుకునే రోజుల్లోనే.. తెలుగునాట హాలీవుడ్ తరహా జోనర్ సినిమాలు చేసిన మోసగాళ్లకు మోసగాడు మనోడు.
తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ చిత్రం గూఢచారి 116. ఆ రోజుల్లో అలాంటి సినిమా చేయడం సాహసమే. తెలుగు ఆడియన్స్ ను మరోసారి షాక్ కు గురిచేస్తూ.. మోసగాళ్లకు మోసగాడుతో కౌబాయ్ గెటప్ లో అదరగొట్టారు. ఏకధాటి డైలాగ్స్ చెప్పటంలో ఆయనకు ఆయనే సాటి.
ప్రయోగాలతో టాలీవుడ్లో ట్రెండ్ క్రియేట్ చేసిన వ్యక్తి.. సూపర్ స్టార్ కృష్ణ. తేనెమనుసులు మూవీలో స్కూటర్ తో కారును ఛేజ్ చేస్తూ.. స్కూటర్ వదిలేసి కారు మీదకు జంప్ చేసే సీన్ అద్భుతం. డూప్ లేకుండా ఆ సీన్ లో నటించి ఔరా అనిపించారు కృష్ణ. అది చూసే నిర్మాత డూండీ తన జేమ్స్ బాండ్ సినిమాకు హీరోగా కృష్ణను సెలెక్ట్ చేసుకున్నారు. గూఢచారి 116 అప్పట్లో ఓ సంచలనం. ఆ హిట్ తో ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా ఛాన్స్ వచ్చాయంటే మాటలా.
పద్మాలయా పిక్చర్స్ బ్యానర్ పై రెండో సినిమాగా 1971లో వచ్చిన మోసగాళ్లకు మోసగాడు సూపర్ హిట్ కొట్టింది. తెలుగులో తొలి కౌబాయ్ చిత్రమైన మోసగాళ్లకు మోసగాడును.. ఇంగ్లీష్ లో ట్రెజర్ హంట్ పేరుతో డబ్ చేయగా.. 123 దేశాల్లో రిలీజ్ మంచి కలెక్షన్లు రాబట్టింది. అంటే, అప్పట్లోనే యూనివర్సల్ స్టార్ మన కృష్ణ.
సాంతకేతికంగానూ పలు తొలి తెలుగు సినిమాలు కృష్ణవే. ORW కలర్ సాంకేతికతతో తీసిన తొలి తెలుగు సినిమా గూడుపుఠాణి. మొదటి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం భలే దొంగలు. 70 MM టెక్నాలజీతో, స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సౌండ్ టెక్నాలజీతో తీసిన ఫస్ట్ టాలీవుడ్ మూవీ సింహాసనం. ఇక, అల్లూరి సీతారామరాజు తెలుగులో మొదటి ఫుల్‌స్కోప్ సినిమా. హైదరాబాద్ లో ఏడాది పాటు ఆడిన తొలి తెలుగు సినిమా అల్లూరి సీతారామరాజు.
ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుల తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ.. డైనమిక్ స్టార్ గా టాలీవుడ్ లో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. రామారావు, అక్కినేనిలతోనూ మల్టీస్టారర్ సినిమాలు చేశారు. తన తరం హీరో శోభన్ బాబుతో.. ఆ తర్వాతి తరానికి చెందిన కృష్ణంరాజు, రజనీకాంత్, మోహన్ బాబు తదితరులతో మల్టీస్టారర్ మూవీస్ చేసి మెప్పించారు కృష్ణ.
ఇక సంక్రాంతి పందెంకోడి కూడా కృష్ణనే. సుమారు 30 సంక్రాంతి పండగలకు థియేటర్లలో కృష్ణ సినిమాలు హంగామా చేశాయి. 1976 నుంచి 1996 వరకు.. 21 ఏళ్ల పాటు ప్రతీ ఏటా వరుసగా సంక్రాంతికి కృష్ణ సినిమాలు విడుదల అయ్యాయి.