KTR Plan Failed: నరం లేని నాలుక, రెక్కలు తెగిన గులాబీ ఒకటే అన్నట్లుగా ప్రస్తుత సీన్ మారిపోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమ పాలనా వైఫల్యాల బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఏకంగా ధర్నాచౌక్ నే ఎత్తేశారా? అన్న ప్రశ్నలను ఫేస్ చేయాల్సి వస్తోంది. నాడు ఎవరినీ రోడ్డెక్కకుండా కట్టడి చేసినప్పుడు లేవని నోళ్లు.. ఇప్పుడెందుకు లేస్తున్నాయన్నదే అసలు పాయింట్.
ధర్నాకు అనుమతి ఇవ్వకపోతే ఎస్పీ ఆఫీస్ పై బాటిల్స్ విసురుతారా? ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయం? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల్లో బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని ధర్నాలు, నిరసనలు చేపట్టలేదు అని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అనుమతి రాకపోతే కోర్టులకు వెళ్లే ఛాయిస్ ఉన్నప్పటికీ.. అలజడి సృష్టించడమే నిరసనల ఉద్దేశమా అన్న వాదన తెరపైకి వస్తోంది. గత పదేళ్లు ఎవరినీ రోడ్డెక్కకుండా కట్టడి చేసిన టైంలో అప్పుడు నోళ్లెందుకు లేవలేదన్న ప్రశ్నలకు జవాబు ఎవరి దగ్గరైనా ఉందా? శాంతియుతంగా నిరసనలు తెలిపే ధర్నాచౌక్ నే ఎత్తేసిన ఘనుల గురించి మాట్లాడుతారా? నో ఆన్సర్.
శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యంలో అందరి హక్కు. అనుమతి రాకపోయినా నిరసన తెలపడం కూడా హక్కే. అయితే ఆ ఫ్రస్టేషన్ తో ఏకంగా ఎస్పీ ఆఫీసుపైకే బాటిల్స్ విసురుతారా? ఇదెక్కడి రాజకీయం..? దాడుల సంస్కృతి తీసుకురావాలనుకుంటున్నారా.. మాఫియా రాజకీయాలా..? జనంలో అలజడి రేపి ఏం చేయదలుచుకున్నారు. ఈ ప్రశ్నలకు బదులు లేదు. ధర్నా అనుమతి కోసం హైకోర్టుకు వెళ్లారు. అక్కడ వెయ్యి మందితో ధర్నా చేసుకోవాలని అనుమతి వచ్చింది. ఈనెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైకోర్టు ఛాన్స్ ఇచ్చింది. సో అక్కడ అలజడి చెలరేగకుండా పోలీసులకు కూడా టైం దొరికినట్లయింది. ఇలా ప్రజాస్వామ్యంలో సింపుల్ గా అయిపోయే పనులను కూడా అలజడి సృష్టించడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారన్నదే అసలు పాయింట్.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడవక ముందే కేసీఆర్.. ధర్నాచౌక్ అంటే చాలు ఎందుకో చాలా షేక్ అయ్యారు. పాలనా వైఫల్యాలపై నిలదీతలు ఎక్కువవుతాయని అనుకున్నారో ఏమోగానీ ఎందరికో గొంతుకగా ఉన్న ధర్నా చౌక్ ను ఎత్తేశారు. ధర్నాకు ఎవరు పిలుపునిచ్చినా అక్రమ బైండోవర్లు పెట్టిందెవరు? పాలకులు ఎక్కడికి వెళ్లినా ముందస్తు అరెస్టులు చేయించింది ఎవరు? గతంలో ఏ ధర్నా చేయాలన్నా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఇందులో ఒక్కదానికి కూడా ఆన్సర్ లేదు. కానీ ఇప్పుడు కొత్త పలుకులకైతే లెక్కలేదు. నిరసనలు తెలపడానికి ప్రజలు అడవుల్లోకి వెళ్లాలంటూ చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది అని ధర్నాచౌక్ పునరుద్ధరించే క్రమంలో హైకోర్టు వ్యాఖ్యానించింది.
Also Read: లగచర్ల కేసులో సంచలనం.. దాడిలో కేసీఆర్ కుట్రపై కోర్టుకు సాక్ష్యాలు..
ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నాచౌక్.. హైదరాబాద్ లో ధర్నాలు, బైఠాయింపులు, సభలు, సమావేశాలు, ఆందోళనలు, నిరసన దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలకు వేదిక. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఎలాగో మన దగ్గర ప్రజా గొంతుకలను వినిపించే సభాస్థలి ఇది. ప్రజా సంఘమైనా, కుల, మత, కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళా, ఉద్యోగ సంఘమేదైనా.. తమ డిమాండ్ల సాధనకు ఈ ధర్నా చౌక్‌నే వేదికగా చేసుకునేవి. చెప్పాలంటే ఇదో గుండె చప్పుడు. కానీ 2014లో కేసీఆర్ అధికారంలోకి వస్తే రెండేళ్లకే 2016లో ధర్నా చౌక్‌ను ఎత్తేశారు. అక్కడ దర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, బైఠాయింపులు, సభలు, సమావేశాలను నిషేధించారు. ధర్నా చౌక్‌ను నగరం వెలుపలకు తరలిస్తామన్నారు. ఇంత చేసిన వారు ఇప్పుడు ధర్నాల గురించి హక్కుల గురించి మాట్లాడడమే అసలు విడ్డూరం.
2017 మే నెలలో సేవ్ ధర్నా చౌక్ పేరుతో నాటి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహించాయి. ఇది కాస్తా హింసాత్మకంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంతో నలుగురు ఆందోళనకారులు గాయపడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ మ్యాటర్ నాడు హైకోర్టుకు చేరడం, అక్కడ విచారించడం, 2018 నవంబర్ 13న ధర్నా చౌక్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిపోయాయి. ఇంతలా పోరాటం చేస్తేనే నాడు ప్రజాస్వామ్య వాదులు ధర్నాచౌక్ ను తిరిగి సాధించగలిగారు. ఇంత చేసిన కేసీఆర్ పార్టీ.. మళ్లీ అదే ధర్నా చౌక్ లో కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా 2021లో అధికారంలో ఉన్నప్పుడే నిరసన తెలిపింది. అదే విచిత్రమంటే.
ఓయూ విద్యార్థుల నిర్బంధాలు, ధర్నాకు దిగిన ఆర్టీసీ కార్మికుల నిరసనలను అణచివేయడం, అక్రమ బైండోవర్లు ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూసినవే. ఇంత చేసి ఇప్పుడు ధర్నా గురించి హక్కుల గురించి నిరసనల గురించి మాట్లాడడమే ట్విస్ట్. పోనీ అదీ చేయకుండా అలజడి సృష్టించే ప్లాన్లు మరో వివాదానికి దారి తీస్తోంది. నిజానికి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ వర్గాలను రెచ్చగొడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై కృత్రిమ ఆందోళనకు ప్లాన్ చేస్తుందని, ఈ వ్యవహారంలో నిరసనలకు దిగిన వారే బలి అవుతున్నారన్న వాదన కూడా పెరుగుతోంది. ఎస్పీజీ పోలీసుల నిరసనలు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ విషయంలో సర్పంచుల ఆందోళన, ఇప్పుడు లగచర్ల ఇలాంటి ఘటనల్లో ప్రేరేపించడం, పక్కకు తప్పుకోవడం గులాబీ పార్టీకి అలవాటుగా మారిందంటోంది కాంగ్రెస్. ఇంత చేస్తున్నా ఎక్కడా ధర్నాలకు పర్మిషన్లు అడ్డుకోవడం లేదని గుర్తు చేస్తున్నారు.