Kothagudem: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక కాంగ్రెస్లో కాక రేపుతోంది .. నగరపాలక సంస్థగా రూపాంతరం చెందాక కొత్తగూడెంకు తొలిసారి జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు వివిధ పార్టీలు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి.. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం వివాదానికి కారణమైంది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళైనా ఆ జిల్లాలో ఆ నేతల వర్గీయుల మధ్య సయోధ్య కుదర్చడానికి ఎవరూ ప్రయత్నించలేదంట. దాంతో మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి అనుచరులు ఎవరికి వారే యమున తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారట.. ఆ క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ హవా కొనసాగించాలని మంత్రులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. అయితే కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సహకారంతో కార్పొరేషన్ ఎన్నికల్లో ఎర్ర జెండా ఎగురవేయాలనీ సీపీఐ యాక్షన్ ప్లాన్ చేస్తోండటం ఆసక్తి రేపుతోంది
భట్టి, తుమ్మల, పొంగులేటి వర్గీయుల ఆధిపత్యపోరు
కాంగ్రెస్ అంటేనే కయ్యాలు, కుమ్ములాటలు .. వర్గపోరుకు కేరాఫ్ అనేలా ఆ పార్టీ పాలిటిక్స్ చూస్తుంటాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువంటారు.. అందుకే నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి .. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నేతలమధ్య అదే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వర్గీయలు మధ్య వర్గపోరును పట్టించుకోకుండా అధిష్టానం ఎన్నికలకు వెళ్తే పరాభవం తప్పదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కొత్తగూడెం కార్పొరేషన్‌కు తొలిసారి జరగనున్న ఎన్నికలు
ఎన్నికల నేపధ్యంలో పాత కొత్త నేతల మధ్య పార్టీ అధిష్టానం రాజీ ఫార్ములా కుదురుస్తుందా?..కొత్తగూడెంకు తొలిసారిగా జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందనేది చర్చనీయాంశంగా మారింది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పక్కనే ఉన్న పాల్వంచ మున్సిపాల్టీ ఉండగా… రెండిటిని కలిపి కార్పోరేషన్ గా ఏర్పాటు చేశారు.. కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్పోరేషన్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రతిపాదన పెట్టారు. దానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతు తెలపడంతో కొత్తగూడెం కార్పోరేషన్ అవతరించింది..
కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు, లక్షా 35 వేల మంది ఓటర్లు
60 డివిజన్లు, లక్షా ముఫ్ఫై ఐదు వేల మంది ఓటర్లు ఉన్న కొత్తగూడెం నగరపాలక సంస్ధకు తొలి సారిగా జరగనున్నాయి. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, సీపీఐ ,సీపీఎం, తెలుగుదేశం, బిజేపి పార్టీలు కసరత్తులు చేస్తున్నాయంట. కాని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా చైర్మన్ సీటు సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. అయితే కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ స్థానిక ఎమ్మెల్యే కూనంనేనీ సాంబశివరావు అధికార పార్టీ నేతల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎలాగైనా గూడెం చైర్మన్ పదవిని తమ ఖాతాలు వేసుకోవాలని చాప కింద నీరులా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట
కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామాంటున్న కూనంనేని
అంతేకాకుండా కలిసి వచ్చే పార్టీలతో కార్పొరేషన్ ఎన్నికల్లో ముందుకెళ్తామని కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలతో అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం మొదలైందట..అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రపక్షాలైన కాంగ్రెస్, సీపీఐల మధ్న సహాయ సహకారాలతో పాటు ఓట్ల బదలాయింపు జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో సైతం కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీ తమ హవా కొనసాగించింది. ఇప్పుడు తాజాగా జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం మరోసారి తమ హవా కొనసాగించి, చైర్మన్ గిరీ దక్కించుకోవాలని కూనంనేని భావిస్తున్నారంట.. కానీ అధికార పార్టీకి చెందిన మంత్రులు తుమ్మల, భట్టి, ఖమ్మం ఎంపీ రామసహాయం సైతం, సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి కొత్తగూడెం కార్పొరేషన్ కైవసానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేస్తూ, రానున్న రోజుల్లో మరికొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉంటాయంటూ ప్రజా బలాన్ని ఇంకాస్త పెంచుకునే దిశగా కృషి చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు
ఆహ్వానం లేదని భట్టి వర్గీయుల అసంతృప్తి..
వచ్చే నెలలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుంచే పార్టీ సమన్వయ సమావేశాలు నిర్వహించారు..ఈ సమావేశాలకు ఖమ్మం ఎంపీ రామసహయం రఘురామరెడ్డి హాజరయ్యారు. ఆ సమావేశాలపై పార్టీ లో కొందరి నేతలకు సమాచారం లేకుండా ఏక పక్షంగా నిర్వహిస్తున్నారని భట్టి వర్గం నాయకులు అసంతృప్తి వెళ్ళగక్కారట. మంత్రి పొంగులేటి అనుచరులు వలస నేతలు కావడంతో కొత్తగూడెం కాంగ్రెస్ నేతలకు వారితో సమన్వయం కుదరక రెండు గ్రూపులు ఏర్పడ్డాయ. పాత నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరులు. వారు సర్పంచ్ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని, చివరకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో స్థానం దక్కలేదని ఆగ్రహంతో ఉన్నారు. నామినేటెడ్ పదవులు గాని లేదా ఇతర ఆలయ ట్రస్టుల పదవుల పంపకాల్లో సైతం ఆన్యాయం జరిగిందంటూ భట్టి వర్గం నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు..
మూడు ముక్కలాట నడుస్తోందని సీనియర్ల ఆవేదన
పార్టీ సమన్వయ సమావేశాలు ఏర్పాటుపై సమాచారం లేకుండా ఒంటెత్తు పోకడలు పోతున్నారని పీసీసీ అధ్యక్షుడుకి పిర్యాదు చేస్తామని భట్టి అనుచరులు వార్నింగ్ ఇచ్చారట. దాంతో అధికారంలో ఉన్న పార్టీగా తొలిసారిగా జరగనున్న కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామంటే, వర్గపోరుతో పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోందని సీనియర్ కాంగ్రెస్ నేతలు వాపోతూ తల పట్టుకుంటున్నారట. ఇటీవల జరిగిన సర్పంచి ఎన్నికల్లో రెబల్స్ అభ్యర్థుల ఎఫెక్ట్‌తో ఖచ్చితంగా గెలవాల్సిన పంచాయతీలను బీఆర్ఎస్ ఎగరేసుకుపోయిందని, మరికొన్ని సీపీఐ కైవసం చేసుకుందని అక్కడ పాత కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు లేదా ఆ తర్వాత వచ్చే పరిషత్ ఎన్నికల్లో అధిష్టానం రెబల్స్‌కు చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే, వలస నేతల వైఖరి అసలు పార్టీ నేతలకు తలవంపులు తెస్తుందంట
పార్టీ పెద్దల జోక్యం చేసుకోవాలంటున్న సీనియర్లు
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ముందే రాష్ట్ర పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వర్గపోరుకు తెర దించాలని సీనియర్ నేతలు కోరుతున్నారు . పదవులపై ఆశలతో ఉన్న సదరు కాంగ్రెస్ సంప్రదాయవాదులు కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా తమ కల నెరవేరబోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు . కొత్తగూడెం కాంగ్రెస్ లో పాత కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరులుగా ఉంటే కొత్త బ్యాచ్ అంతా మంత్రి పొంగులేటి మద్దతు దారులుగా ఉన్నారు. తెలుగుదేశం మద్దతుదారులు మంత్రి తుమ్మల ఫాలోవర్స్ గా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండే సరికి ముగ్గురు మంత్రుల అనుచరుల మధ్య ఆధిపత్య పోరుతో కొత్తగూడెం కాంగ్రెస్ రాజకీయం కాక రేపుతుంది.. ఎవ్వరికి వారే తగ్గేదేలే అంటున్నారట.. వర్గపోరుతో కార్పోరేషన్ ఎనికల్లో టికెట్ ల లొల్లి ఇంకా ముదిరే అవకాశం ఉందని ఆదిలోనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ జోక్యం చేసుకుని పార్టీని క్రమశిక్షణలో పెట్టాలని కాంగ్రెస్ క్యాడర్ అంటోంది.
Also Read: తెలంగాణకు బీజేపీ బడా నేతలు.. ప్లాన్ ఇదేనా!
తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క స్థానం కొత్తగూడెం. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. మిత్రపక్షంగా ఉంటూనే కొత్తగూడెం నియోజకవర్గాన్ని సీపీఐ కంచుకోటగా మార్చే పనిలో ఉన్నారట కామ్రేడ్ కూనంనేని. అందులో భాగంగా పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలిచేలా పావులు కదపగలిగారు. మంత్రి పొంగులేటి అనుచరులు ఎంత కిరికిరి చేసినా తనదైన వ్యూహంతో కూనంనేని పంచాయతీల్లో పట్టు సాధించారు.. కొత్తగూడెం కార్పొరేషన్ ఆవిర్భావానికి బాటలు వేసిన కూనంనేని తొలిసారిగా జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎర్ర జెండా ఎగురవేయాలనీ పట్టుదలగా ఉన్నారట.. మిత్రధర్మం పాటించి కాంగ్రెస్ తమకు సహకరించాలని కోరుతున్నారు. ఓ పక్క కాంగ్రెస్ లో కయ్యాలతో ఆ పార్టీ నేతలు ఉంటే మరోపక్క ఎమ్మెల్యే కూనoనేని మాత్రం కార్పొరేషన్ లో ఎర్ర జెండా ఎగిరేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారట..మరి చూడాలి అక్కడ పొత్తుల లెక్కలు ఎంత వరకు ఫలిస్తాయో? లేకపోతే కాంగ్రెస్ వర్గపోరు అసలుకే మోసం తెస్తుందో?
Story By Apparao, Bigtv