La Nina Has Ended: ప్రపంచ వాతావరణం పసిఫిక్ మహాసముద్రం తీరుపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ సముద్ర ఉపరితల జలాలు వేడెక్కడం, లేదంటే చల్లబడడం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రకారమే రుతుపవనాలు యాక్ట్ చేస్తుంటాయి. ముఖ్యంగా మనదేశం విషయానికొస్తే నైరుతి రుతుపవనాలు మన ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. ఇది సరిగా ఉంటేనే పంటలు పండి, భారత ఎకానమీకి మేలు చేస్తుంది. లేకపోతే కష్టమే. అయితే తాజాగా లా నినాకు ఎండ్ కార్డ్ పడిందంటున్నారు ఇంటర్నేషనల్ వెదర్ సైంటిస్టులు. పసిఫిక్, హిందూ మహాసముద్రాలు తటస్థంగా ఉండే అవకాశాలే ఎక్కువంటున్నారు. మరి ఈసారి వర్షపాతం ఎలా ఉండబోతోంది?
వాతావరణాన్ని డిసైడ్ చేసే ఎల్ నినో, లా నినా
వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భూతాపం, కాలుష్యంతో వాతావరణం, రుతుపవనాలు గతి తప్పుతుంటాయి. అయితే ఈసారి ఎలా ఉండబోతోందన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ప్రపంచ వాతావరణాన్ని ఎల్ నినో, లా నినా కండీషన్స్ డిసైడ్ చేస్తుంటాయి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కితే ఎల్ నినోగా, చల్లబడితే లా నినాగా చెబుతారు. లా నినాతో వర్షం కండీషన్స్ నార్మల్ గా ఉంటాయని, ఎల్ నినోతో కాస్త ఎక్కువ ఉంటాయన్నది ఇప్పటిదాకా ఉన్న విశ్లేషణ. అయితే ఈసారి వెరైటీగా.. అటు ఎల్ నినో కాకుండా, ఇటు లా నినా కాకుండా తటస్థంగా ఉంటుందంటున్నారు. ఈ పరిస్థితి ఒకందుకు మంచిదే అంటున్నారు.
వింటర్ సీజన్ వరకు న్యూట్రల్ స్టేజ్ లో ఉండే ఛాన్స్
మ్యాటర్ ఏంటంటే.. పసిఫిక్ మహాసముద్రంలో లా నినా పరిస్థితులు ముగిశాయని అమెరికన్ వెదర్ సైంటిస్టులు ప్రకటించారు. పసిఫిక్ మహాసముద్రం వింటర్ సీజన్ వరకు న్యూట్రల్ స్టేజ్ లో ఉంటే ఛాన్స్ ఉందంటున్నారు. ఇది భారత్ లో నైరుతి రుతుపవనాలకు అనుకూలమే అని చెబుతున్నారు. ఎందుకంటే ఇది రెయినీ సీజన్ లో అతివృష్టి, అనావృష్టి లేకుండా సమతుల్యంగా ఉండే ఛాన్స్ కల్పిస్తుందంటున్నారు. అయితే విషయం ఏంటంటే రుతుపవనాల అంచనాలను మరింత క్లిష్టం చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఎలాంటి వర్షపాతం ఉంటుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి అన్న మాట. ఎందుకంటే ప్రతి ఏడాది వాతావరణ అంచనాలను సంస్థలు సరిగా వేయడంలో విఫలమవుతున్నాయి. ఈసారి కచ్చితమైన అంచనా మరింత కష్టమే అంటున్నారు.
తటస్థ పరిస్థితే ఉంటే 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
హిందూ మహాసముద్రంలో పరిస్థితులు ఆగస్టు వరకు తటస్థంగా ఉండే అవకాశం ఉందని ఆస్ట్రేలియన్ వెదర్ బ్యూరో తాజా బులెటిన్ లో తెలిపింది. పసిఫిక్‌తో పాటు, హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు భారత్ రుతుపవనాలలో కీలక పాత్ర పోషిస్తాయి. పసిఫిక్ లో సెప్టెంబర్ వరకు తటస్థ పరిస్థితులు ఉండే అవకాశం 50% కంటే ఎక్కువ ఉందని అమెరికా వాతావరణ అంచనా కేంద్రం అంటోంది. సంవత్సరం చివరి వరకు ఇది కొనసాగే అవకాశం ఉందని, లా నినా లేదా ఎల్ నినో కంటే ఎక్కువగా ఈ సిచ్యువేషనే ఉంటుందంటున్నారు. ఈ అంచనా నిజమైతే, 12 ఏళ్లోల రుతుపవనాల కాలంలో ఎల్ నినో లేదా లా నినా ఉనికిలో లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. జూన్-సెప్టెంబర్ కాలంలో భారత్ లో ఎంత వర్షపాతం నమోదవుతుందన్నది ఈ రెండు పరిస్థితుల ప్రకారమే అంచనా వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కండీషన్ డిఫరెంట్ గా ఉంది.
నైరుతి రుతుపవనాలకు అనుకూల పరిస్థితులుంటాయా?
పసిఫిక్ మహాసముద్ర పరిస్థితులు తటస్థంగా ఉన్నప్పుడు, నైరుతి రుతుపవనాలకు మంచి రూట్ ఉంటుందంటున్నారు. కరువు, లేదంటే వరద లాంటి పరిస్థితులు ఉండబోవన్న అంచనాలైతే ఉన్నాయి. అయితే చివరి దాకా దేన్నీ నమ్మలేని పరిస్థితి. పసిఫిక్‌లో తటస్థ పరిస్థితులుంటే సముద్రం తూర్పు మధ్య భూమధ్యరేఖ ప్రాంతాల్లో ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా వేడెక్కవు. ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటే రుతుపవనాల రాకకు ఇబ్బంది. ఇప్పుడు లా నినా కూడా ముగింపుగా ఉందని, తటస్థ పరిస్థితుల్లో వాతావరణనాన్ని అంచనా వేయడం వెదర్ సైంటిస్టులకు కూడా ఒకింత కష్టమే అంటున్నారు. అందుకే మరింత జాగ్రత్తగా అంచనాలు రూపొందించాల్సి ఉంటుందంటున్నారు.
ఎల్ నినో, లా నినా కండీషన్స్ లేవన్న జపాన్ వెదర్ స్టేషన్
లా నినా అన్నది మధ్య, తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున చల్లబడటాన్ని సూచిస్తుంది. ఇది ఉష్ణమండల వాతావరణంలో మార్పులతో పాటు గాలులు, పీడనం, రెయిన్ మోడల్స్ మార్పులతో ఉంటుంది. యూరోపియన్ యూనియన్ ఎర్త్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అయిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రకారం, 2025 జనవరి నెల అత్యంత వెచ్చగా రికార్డ్ అయిందంటోంది. సగటు ఉపరితల గాలి ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా నమోదైందన్నది. అటు జపాన్ వాతావరణ శాఖ కూడా ఇటీవలే ఎల్ నినో లేదా లా నినాకు స్పష్టమైన సంకేతాలు లేవని రిపోర్ట్ ఇచ్చింది. అయితే కొన్ని లా నినా లక్షణాలు బయటపడుతున్నాయన్న అబ్జర్వేషన్ చేసింది.
భారత్ లో చివరిసారిగా 2020-23లో లా నినా
లానినా పరిస్థితులు భారత్ కు ఎలా ఉంటుదన్న ప్రశ్నకు గతంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారత రుతుపవనాలపై లా నినా ప్రభావాన్ని ప్రస్తావించారు. లా నినా చివరిసారిగా 2020-23లో వచ్చిందని, దీంతో నైరుతి రుతుపవనాల టైంలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఉత్తర అలాగే ఈశాన్య భారత్ లో మాత్రం లా నినా కండీషన్స్ మరోలా రికార్డ్ అయ్యాయన్నారు. అక్కడ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని గుర్తించారు.
లా నినా గురించి ఒక్కో దేశం ఒక్కోలా ప్రిడిక్షన్స్
కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి పంటలకు నష్టం వాటిల్లింది. అదే సమయంలో కొన్ని ఖరీఫ్ పంటలకు మేలు చేసిందన్నారు. గత ఏడాది జులైలో లా నినా వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు వెదర్ సైంటిస్టులు లా నినా వచ్చే ఛాన్సెస్ 57-60% ఉన్నాయని సూచిస్తున్నారు. సో లా నినా గురించి ఒక్కో దేశం ఒక్కోలో ప్రిడిక్షన్స్ ఇస్తోంది. దీని వల్ల రుతుపవనాలు బలహీనపడవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. అందుకే ఈసారి వర్షాలు ఎలా ఉంటాయన్నది సరిగా అంచనా వేయలేని పరిస్థితి.
భారత్ కు నైరుతి రుతుపవనాలు ఎలాంటి వర్షాలను తీసుకురాబోతున్నాయి?
ఈసారి భారత్ కు నైరుతి రుతుపవనాలు ఎలాంటి వర్షాలను తీసుకురాబోతున్నాయి? ప్రైవేట్ వెదర్ కంపెనీ స్కైమెట్ ఏం చెప్పింది? భారత వాతావరణ శాఖ అంచనాల్లో ఏం చెప్పబోతోంది? ప్రతి సంవత్సరం సాధారణ వర్షపాతమే అంటున్నా.. అంచనాలు లెక్కలు తప్పుతున్నాయి. ఈ మొత్తం పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రం ఏప్రిల్, మే, జూన్ లో వేడెక్కుతుందా? చల్లబడుతుందా?
సముద్ర ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కామనే
మన శరీర ఉష్ణోగ్రత కొన్నిసార్లు పెరిగి, కొన్నిసార్లు ఎలా తగ్గుతుందో, అలాగే సముద్ర ఉష్ణోగ్రతలు కూడా మారతాయి. కొద్దికాలం పాటు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఆ తర్వాత న్యూట్రస్ స్టేట్ కు చేరుతుంది. ఇది సహజ పరిణామమే. అయితే ఇప్పుడు ఇది ఎటు దారి తీస్తుందన్న టెన్షన్లే ఎక్కువగా ఉన్నాయి. భూమధ్యరేఖకు సమీపంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే వేడెక్కితే అది ఎల్ నినో. కనీసం 0.5 డిగ్రీల టెంపరేచర్ పెరుగుదలను ఎల్ నినోగా చెబుతారు. సముద్ర ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటే లా నినా అంటారు. సాధారణం కంటే కనీసం 0.5 డిగ్రీలు పడిపోతే అది లా నినా ఎఫెక్ట్. కానీ ఇప్పుడు అటు ఎల్ నినో కాదు.. ఇటు లా నినా కాదు. మరి ఏం జరుగుతుంది?
జూన్-సెప్టెంబర్ నైరుతి సీజన్ లో 87 సెం.మీ. వర్షపాతం
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల టైంలో భారత్‌లో సగటున 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇది సగటు మాత్రమే. ఇందులో కచ్చితంగా జరుగుతుందని కాదు. ఎక్కువ తక్కువలు ఉంటాయి. అయితే లేటెస్ట్ టెక్నాలజీ ఎంత వచ్చినా వాతావరణ సంస్థలు కచ్చితంగా అంచనాలు వేయడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ప్రతి ఏటా పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు ఎలా మారుతున్నాయి, ఎంత మారుతున్నాయనే అంశాలపై ఎల్ నినో, లా నినా ప్రభావం ఆధారపడి ఉంటుంది. 1980లలో వీటి గురించి ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వీటి ఎఫెక్ట్ ఉంటుందన్న మాట. ఇవి భారత్‌లో ఉష్ణోగ్రతలు, వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి.
కచ్చితమైన అంచనాలు వెలువరించడంలో విఫలం
రుతుపవనాల రాకను అంచనా వేయడానికి భారత వాతావరణ శాఖ చాలా విధానాలను వాడుతోంది. సముద్ర ఉష్ణోగ్రతలు, యూరప్‌లో మంచు ప్రభావం వంటి అనేక అంశాలకు సంబంధించిన 150 ఏళ్ల హిస్టారికల్ డేటాను అనుసంధానించి రుతుపవనాల రాకను అంచనా వేయడం వాటిలో ఒకటి. ఒక నిర్దిష్టమైన రోజున ప్రపంచ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే అంచనాలను పరిగణలోకి తీసుకుని, లేటెస్ట్ కంప్యూటర్లను వాడి ఆ రోజు వాతావరణాన్ని అంచనా వేయడం మరో మార్గం. సో ఇప్పుడు నైరుతి రుతుపవనాలు భారత్ లో ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తాయన్నది చూద్దాం.
భారత్‌లో ఉష్ణోగ్రతలు, వర్షపాతాన్ని డిసైడ్ చేసే ఎల్ నినో, లా నినా
దేశ వ్యవసాయానికి దిక్సూచి నైరుతి రుతుపవనాలు. రాబోయే నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వెదర్ కంపెనీ స్కైమెట్ అంటోంది. తాజా వాతావరణ పరిస్థితులను విశ్లేషించిన తర్వాత రుతుపవనాల అంచనా రిపోర్ట్ రిలీజ్ చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో దేశంలో సగటున 868.6 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది. నైరుతి సీజన్ నెమ్మదిగా ప్రారంభమైనా మధ్యలో వర్షాలు వేగం పుంజుకుంటాయంటోంది స్కైమెట్.
వెస్ట్రన్ ఘాట్స్, కేరళ, కర్ణాటకలోని తీర ప్రాంతం
భౌగోళిక అంచనాల పరంగా ఈసారి పశ్చిమ, దక్షిణ భారత్ లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న అంచనాలున్నాయి. వెస్ట్రన్ ఘాట్స్, కేరళ, కర్ణాటకలోని తీర ప్రాంతం, గోవాలో అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు స్కైమెట్ చెబుతున్న విషయం. ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఇండియా కొండ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వానలు పడుతాయంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే 30 శాతం ఎక్కువ వర్షపాతం నమోదవుతుందంటున్నారు. ఈ ప్రాంతాలు మినహా తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాలే కురుస్తాయన్న అంచనాలున్నాయి. అటు జులైలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మినహా మిగిలిన జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవుతుందంటున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలుంటాయన్న ప్రిడిక్షన్ ఉంది.
త్వరలోనే IMD వెదర్ బులెటిన్ రిలీజ్
సో ప్రెజెంట్ వెదర్ సిచ్యువేషన్ ప్రకారం, మార్చిలో మార్చి వరకు నెలకొన్న వాతావరణ పరిస్థితుల డేటాతో పోలిస్తే.. రుతుపవనాలపై ఏప్రిల్ 15 నాటికి ఐఎండీ బులెటిన్ రిలీజ్ చేయనుంది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఇండియన్ ఓషన్ డైపోల్ రుతుపవనాల ప్రారంభానికి ముందు పాజిటివ్‌గా మారి మే నెల నుంచే వర్షాలు కురిసేందుకు ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో నైరుతి రాక కాస్త ఫాస్ట్ గానే ఉంటుందన్న లెక్కలున్నాయి. ఇక భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల గురించిన అంచనా రిపోర్ట్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతోంది. అది వస్తే భారత్ లో వర్షాలపై కొంత వరకు క్లారిటీ రాబోతోంది. అయితే ప్రస్తుతం లా నినా లేదు, ఎల్ నినో లేదు.. ఇలాంటి కండీషన్స్ లో IMD ఎంత జాగ్రత్తగా అంచనాలు రిలీజ్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
IMD లెక్కలు ఈసారైనా అంచనాలను అందుకుంటాయా?
స్కైమెట్ అంచనాలు ఒకలా ఉంటే.. యూకే వెదర్ డిపార్ట్ మెంట్, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ అంచనా ప్రకారం ఇండియాలో సగటు, అంతకంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని అంచనాలు రిలీజ్ చేశాయి. సో పసిఫిక్ లో టెంపరేచర్ ఆగస్టు వరకూ కొనసాగుతాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి. ఎట్టి పరిస్థితుల్లో నైరుతి సీజన్‌లో ప్రతికూల ఫలితాలు ఇచ్చే ఎల్‌నినో రాదని ఇప్పటికే ఐఎండీ స్పష్టం చేసింది. దీనికితోడు ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో తటస్థంగా ఉన్న ఇండియన్ ఓషన్ డైపోల్ జూన్‌కల్లా పాజిటివ్ దశకు చేరుకుంటుందంటున్నారు. జూన్, జూలై కంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయంటున్నారు. పశ్చిమ కనుమలు, దక్షిణ భారతంలో మంచి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
జూన్‌లో 159.7 శాతం మి.మీ. వర్షపాతానికి ఛాన్స్
జూన్‌లో సాధారణ వర్షపాతం 165.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 159.7 శాతం, జులైలో 280.5 మిల్లీమీటర్లకు గాను 286.1 మిల్లీమీటర్లు, ఆగస్టులో 254.9కి 275.3 మిల్లీమీటర్లు, సెప్టెంబరులో 167.9కి 174.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలను స్కైమెట్ ఇచ్చింది. ఎల్‌నినో రాకపోతే భారత్‌లో నైరుతి సీజన్ ఆశాజనకంగా ఉంటుందని అంటున్నారు. లానినా వస్తే ఎక్కువ వానలు ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు ఉండడంతో వాతావరణ విభాగాలు అంచనా వేసిన పరిస్థితులకంటే భిన్నంగా ఉండబోతోందన్న భయాలు పెరుగుతున్నాయి.