Big Stories

Lok Sabha Polls 2024: గ్రేటర్.. ఓటర్.. ఎటువైపు..?

Lok Sabha Polls 2024
Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024 Greater Hyderabad Constituencies: తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్ఎస్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా అధికారం కోల్పోయినా గ్రేటర్‌లో మాత్రం సత్తా చాటింది. ఈ పరిధిలో గెలిచిన స్థానాల కారణంగానే అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా దక్కింది. లేకపోతే అంతే సంగతులు. తమ అభివృద్ధిని గ్రామాల్లో ప్రచారం చేసుకోలేకపోయామని.. గ్రేటర్ ప్రజలు గుర్తించారని గులాబీ నేతలు చెప్పుకున్నారు. అయితే.. పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

గ్రేటర్‌లో ఎవరికెన్ని..?

- Advertisement -

గ్రేటర్ పరిధిలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి. గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలు నాలుగు పార్టీలు గెలుచుకున్నాయి. హైదరాబాద్ ఎప్పటిలాగే ఎంఐఎం, సికింద్రాబాద్ బీజేపీ, చేవెళ్ల బీఆర్ఎస్, మల్కాజ్ గిరి కాంగ్రెస్ దక్కించుకున్నాయి. వీటిలో చేవెళ్ల, మల్కాజ్ గిరి స్థానాల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే గ్రేటర్ కు దగ్గరగా ఉంటాయి.

హైదరాబాద్ లోక్ సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇందులోని మలక్ పేట, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్ పుర, బహదుర్ పురలో ఎంఐఎం పార్టీ గెలిచింది. ఒక్క గోషామహల్‌ను బీజేపీ దక్కించుకుంది.

సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ముషీరాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ గెలిచింది. ఒక్క నాంపల్లి ఎంఐఎం వశమైంది.

చేవెళ్ల లోక్ సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్లలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ స్థానాలు గ్రేటర్‌కు దగ్గరలో ఉంటాయి. మిగిలిన పరిగి, వికారాబాద్, తాండూర్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది.

మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్.. ఈ స్థానాలన్నింటిలోనూ బీఆర్ఎస్ గెలుపొందింది.

మారుతున్న లెక్కలు.. జారుకుంటున్న నేతలు

లోక్ సభ ఎన్నికలను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ, ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ కు వరుస షాకులు తప్పడం లేదు. గులాబీ దండు నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకుంటున్నాయి. ఇటీవలే గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్. తర్వాత అదే బాటలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నడిచారు. ఇటు చాలామంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

గ్రేటర్ హైదరాబాద్‌ లోని 150 డివిజన్లలో మెజార్టీ సీట్లను గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఎంఐఎం సహకారంతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మార్పులు, చేర్పులు పోనూ బల్దియాలో 52 మంది బీఆర్ఎస్, 42 మంది ఎంఐఎం, 40 మంది బీజేపీకి ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది కార్పొరేటర్ల బలం మాత్రమే ఉంది. త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలకు ముందు గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా మెజార్టీ నేతలు హస్తం నాయకులతో టచ్‌లోకి వెళ్లడం బీఆర్ఎస్‌లో ఆందోళనలకు దారితీసింది.

నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ వ్యూహం

పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు చూస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉంది. ఇక్కడి నుంచి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పర్యాయం ఎలాగైనా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం ఎలాగూ కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది.

Read More: BRS Scams: పాపాల పుట్ట..! తవ్వేకొద్దీ బయటపడుతున్న బీఆర్ఎస్ బాగోతాలు..

ఇక్కడి నుంచి గత లోక్ సభ ఎన్నికలలో విజయం సాధించిన రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం పదవిని దక్కించుకున్నారు. దీనిని కూడా చేజారిపోకుండా భారీ మెజార్టీ సాధించే దిశగా చూస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్‌కు రాజ్యసభ టికెట్ ఇచ్చారనే టాక్ వినబడుతోంది. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న చేవెళ్ల సీటును కూడా దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్. హైదరాబాద్ పార్లమెంట్‌లో కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు చూస్తోంది. కానీ, ఇక్కడ ఎంఐఎం హవా అధికంగా ఉంటుంది.

కాంగ్రెస్ పాలనతో జనం మూడ్ మారిందా..?

అధికారం చేపట్టినప్పటి నుంచి అనూహ్య నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రయత్నాలు చేస్తూనే.. ఇంకోవైపు కాంగ్రెస్ బలగాన్ని పెంచుతున్నారు. ప్రజా పాలనను బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం.. వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయడం ప్రభుత్వానికి ప్లస్ అయింది. అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది.

గ్రేటర్ పరిధిలోనూ కాంగ్రెస్ పై ప్రజలకు ఉన్న మూడ్ మారి ఉండొచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయని వారు.. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో తప్పకుండా హస్తం వైపే ఉండొచ్చని అంటున్నారు. పైగా, గులాబీ నేతల చేరికలతో హస్తం బలం పెరుగుతోందని.. ఆయా నేతల అనుచరగణం, మద్దతుదారుల ఓట్లు ఇటు వైపు టర్న్ అవుతాయని చెబుతున్నారు. అలాగే, గ్రేటర్ పరిధిలో బీజేపీకి ప్రభావం తగ్గిపోయిందని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News