Madanapalle MLA: ఆ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. గెలుపోటములతో సంబంధం లేకుండా వారు పార్టీ కోసం నాయకుల కంటే తామే ముందుంటారు. అయితే ఇప్పుడు ఆ క్యాడర్ సైతం పార్టీకి దూరం అవుతున్న పరిస్థితులు ఆ నియోజకవర్గంలో ఏర్పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీనే అయినప్పటికి క్యాడర్ సభ్యత్వ నమోదుకు దూరంగా ఉంది. రాష్ట వ్యాప్తంగా సభ్యత్వ నమోదులో 145 స్థానానికి పడిపోయింది. సభత్వ నమోదు పై ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో పాటు సీనియర్ నాయకుల నిరాసక్తత అందుకు కారణమంటున్నారు. సభ్యత్వ నమోదును ముందుండి నడిపించాల్సిన నాయకులు సైడ్ అయిపోవడంతో కార్యకర్తలు కూడా సైలెంట్ అయిపోయారంట. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? ఏవరా ఎమ్మెల్యే?
ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం ప్రస్తుతం అన్నమయ్య జిల్లా లో ఉంది. టీడీపీ అవిర్బావం నుంచి మదనపల్లిలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. 1983 నుంచి అక్కడ పది సార్లు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఆరు సార్లు విజయం సాధించింది. అక్కడ అభ్యర్థుల మార్పు పక్రియతో 2009 నుంచి 2019 వరకు మూడు సార్లు వరుస ఓటములతో పార్టీ ఇబ్బంది పడింది.2014లో పొత్తుల్లో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయించారు. అప్పట్లో బిజెపి అభ్యర్థి టిడిపి నాయకులతో సమన్వయం చేసుకోకపోవడంతో 16 వేల500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌కు టికెట్ కేటాయించినా విజయం దక్కలేదు.
2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషకు అనూహ్య రీతిలో మైనార్టీ కోటాలో సీటు దక్కింది. సీనియర్ల సహాకారం లేకున్నా క్యాడర్ పట్టుదలతో పనిచేయడంతో ఆయన విజయం సాధించారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే షాజహాన్ భాష వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా తయారయ్యారు. బాషా వైఖరితో ఎన్నికల్లో ఆయన విజయానికి పనిచేసిన తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబుతో పాటు మిగతా నాయకులు ఆయనకు దూరం అయ్యారు. టీడీపీలో ఒకరిద్దరు సీనియర్లు మాత్రమే అయనతో ఉన్న పరిస్థితి.
జనసేన, బీజేపీ నాయకులు సైతం ఎమ్మెల్యేను కలవడమే మానేశారు. ఎమ్మెల్యే వర్సెస్ తహాసిల్ధార్ ఇష్యూలో అయన ప్రతిష్ట సగం గంగలో కలిసిందని క్యాడర్ బాహటంగానే విమర్శిస్తుంది. దానికి తోడు పాత కాంగ్రెస్ వారితో పాటు వైసిపి బ్యాచ్ నిరంతరం అయన చుట్టు ఉంటు దందాలు చేస్తున్నారన్న విమర్శులున్నాయి. బాషా టీడీపీ క్యాడర్‌ను సమన్వయం చేసుకోకుండా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ వర్గం ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో అటుపోట్లు ఎదురైనా రమేష్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ ఆయన పరాజయానికి జనసేన ఓట్ల చీలికే కారణమన్న అభిప్రాయం ఉంది. తర్వాత ఐదు సంవత్సరాల పాటు అయన ఇన్ చార్జీగా పార్టీ కార్యక్రమాలు కొనసాగించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అంగల్లు దాడులకు సంబంధించి కేసులు ఎదుర్కొన్నారు.
దొమ్మలపాటి రమేశ్ జిల్లా సాధన ఉద్యమాన్ని ముందుండి నడిపించి చేతి చమురు కూడా వదిలించుకున్నారు. అయితే సొంత సామాజిక వర్గంతో పాటు టీడీపీలోని లుకలుకలు అయనకు గత ఎన్నికల్లోటికెట్ రాకుండా చేసాయని అంటారు. అదే సమయంలో మైనార్టీ కార్డు షాజాహాన్ భాషకు ప్లస్ అయింది. రమేష్ వర్గం ఎన్నికల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. రాష్ట్రవ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో షాజహాన్ బాషా 5 వేల 500 ఓట్ల మెజార్టీతో ఒడ్డున పడ్డారు.
Also Read: కూటమిలో.. ‘ఉప’రితల ద్రోణి!
కాంగ్రెస్ నుంచి వచ్చిన బాషాకు అన్ని కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. కూటమి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇలాంటి తరుణంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సింది పోయి.. సొంత వర్గాన్ని బలోపేతం చేసుకోవడానికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని క్యాడర్ అరోపిస్తుంది. సొంత వ్యవహారాలు చూసుకుంటూ టీడీపీ సభ్యత్వ నమోదు గురించి ఏమాత్రం పట్టించుకోలేదని ప్రచారం జరగుతుంది.. సభ్యత్వ నమోదులో రాష్ట వ్యాప్తంగా మదనపల్లి నియోజకవర్గం 145 స్థానంలో ఉందంట.
మదనపల్లి నియోజకవర్గంలో 2,66,589 మంది ఓటర్లు ఉండగా కేవలం 41 వేల మంది మాత్రమే సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. వారిలో ఎక్కువ మంది అన్ లైన్‌లో తమంతకు తామే చేసుకున్నవారు ఉన్నారని తెలుస్తోంది.. రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం రాష్టంలో 5వ స్థానంలో కొనసాగుతుండగా మదనపల్లి 140 స్థానాలు వెనుకబడి 145 స్థానంలో నిలవడం అక్కడ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది. పట్టించుకునే వారు లేక మదనపల్లిలో రోజుకు 30 సభ్యత్వాలు కూడా నమోదు కావడం లేదంట.
మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పట్టించుకోక పోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమంటున్నారు. అలాగే రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనిలోని సీనియర్ల నియోజకవర్గాలు కూడా సభత్వ నమోదులో వెనుకబడి ఉండటం గమనార్హం. పీలేరు 81, పుంగనూరు 89, మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి 51 స్థానంలో ఉన్నాయి. అయితే పార్టీలో వర్గపోరు ఎక్కువగా ఉన్న తంబల్లపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున సభ్యత్వ నమోదు పక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఆ సెగ్మెంట్ 27 స్థానంలో ఉండగా, పార్టీలో మూడు గ్రూపులు అరు విభేదాలు అన్నట్లు ఉంటే కోడూరు కూడా 26 స్థానంలో ఉంది.
రాజంపేట లోక్‌సభ సెగ్మెంట్ అంటేనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డా అని పేరుంది. రాజంపేట ఎంపీగా మాజీ మంత్రి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి వరుసగా రెండో సారి గెలుపొందారు. పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డే కొనసాగుతున్నారు. అలాంటి చోట టీడీపీ బలోపేతానికి మరింత కృషి చేయాల్సింది పోయి.. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వంటి వారు అసలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నే పట్టించుకోక పోవడంపై పార్టీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.