Manipur Violence: మణిపూర్.. మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఏడాదిన్నరగా అక్కడ జరుగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయ్. ఇటీవలే.. ఉఖ్రుల్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకొచ్చాయ్. ఉఖ్రుల్, కామ్జోంగ్ జిల్లాల్లో కుకీ వర్గీయుల రాకపోకలపై నాగా సంస్థలు ఆంక్షలు విధించిన తర్వాతి రోజే.. దాడులు జరగడం మొదలయ్యాయ్. సాయుధులు ఇళ్లని తగలబెట్టగా, వందలాది మంది గ్రామస్తులు భయంతో ఇళ్లని వదిలి, సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. కాల్పులను ఆపడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు భద్రతా దళాలతో వాగ్వాదానికి దిగారు. తంగుల్ నాగా గ్రామాలకు చెందిన మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రాణాలను కాపాడుకోవడానికి పక్కనే ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాకు తరలివెళ్లిపోతున్నారు. అక్కడ వీరంతా తలదాచుకుంటున్నారు. అయినప్పటికీ.. ఆ ప్రాంతంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అల్లర్లను ఆపడానికి ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరించింది.
లిటాన్ సరీఖోంగ్ గ్రామంలో.. సాయుధ గ్రూపులు ఇళ్లను తగలబెట్టి, గాల్లోకి అనేక రౌండ్లు కాల్పులు జరిపి, కొండ జిల్లాలో భయాందోళనలు సృష్టించడంతో అశాంతి చెలరేగింది. మరింత హింసకు భయపడి, చాలా మంది గ్రామస్తులు అవసరమైన వస్తువులతో పొరుగున ఉన్న సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కొంతమంది తంగుల్ గ్రామస్తులు కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. గ్రామ సరిహద్దుల విషయంలో జరిగిన చిన్న తగాదా కాస్తా.. కాల్పులు, నిరసనకారులు రెచ్చిపోయి ఇళ్లకు నిప్పు పెట్టడం దాకా వెళ్లింది. ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దాంతో.. ఉఖ్రుల్ పట్టణంలో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఉద్రిక్తతలు తీవ్రం కావడం, ప్రజా భద్రత, శాంతికి ముప్పు కలిగిస్తున్న క్రమంలో.. మణిపూర్ ప్రభుత్వం ఉఖ్రుల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, పుకార్ల వల్ల మరింత హింస చెలరేగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అల్లర్లు మిగతా ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించి శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. పోలీసు అధికారులు ప్రభావిత గ్రామాలను సందర్శించి.. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నారు.
మణిపూర్‌లో మైతీలు, కుకీలు, నాగాల మధ్య దశాబ్దాలుగా ఉన్న భూమి, రిజర్వేషన్ల వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఒక వర్గం తీసుకునే చర్యను మరో వర్గం తమ ఉనికికే ముప్పుగా భావిస్తోంది. గతంలో జరిగిన అల్లర్ల సమయంలో పోలీసు స్టేషన్ల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు లూటీ అయ్యాయి. అవి ఇప్పటికీ సామాన్యుల చేతుల్లో ఉండటం వల్ల చిన్న గొడవ కూడా కాల్పులకు దారితీస్తోంది. మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉండటం వల్ల.. చొరబాట్లు, డ్రగ్స్ మాఫియా, వేర్పాటువాద గ్రూపుల ప్రమేయం కూడా శాంతికి విఘాతం కలిగిస్తోంది. రాష్ట్రపతి పాలన లాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉన్న విద్వేషం ఇంకా తగ్గలేదు. పదే పదే ఇక్కడ మంటలు చెలరేగడానికి భౌగోళిక పరిస్థితులు, జనాభా లెక్కలు, చారిత్రక వైషమ్యాలు అన్నీ కలిపి.. మొత్తం రాష్ట్రాన్నే అగ్నిపర్వతంలా మార్చేశాయ్.
మణిపూర్ మధ్యలో ఇంఫాల్ వ్యాలీ ఉంటుంది. చుట్టూ కొండ ప్రాంతాలు ఉంటాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతం వీరే. వీరంతా.. ఇంఫాలో లోయలో ఉంటారు. ఇది రాష్ట్ర భూభాగంలో కేవలం 10 శాతం మాత్రమే. కుకీ, నాగ తెగలకు చెందిన వారు కొండ ప్రాంతాల్లో ఉంటారు. జనాభా 40 శాతమే ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని 90 శాతం భూభాగం వీరి పరిధిలో ఉంటుంది. ఈ భౌగోళిక కారణాల వల్ల.. మైతీలు తమకు భూమి సరిపోవడం లేదని, కొండ ప్రాంతాల్లో భూమి కొనే హక్కు తమకు లేదని ఆవేదన చెందుతుంటారు. అందువల్ల.. అల్లర్లు చెలరేగిన ప్రతిసారీ.. ప్రభుత్వం బలగాలతో శాంతిని నెలకొల్పడమే కాకుండా, అన్ని వర్గాల పెద్దలతో చర్చలు జరిపి, శాశ్వత రాజకీయ పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరముందనే చర్చ జరుగుతోంది.
మణిపూర్‌లో.. ఇటీవలే రాష్ట్రపతి పాలన ఎత్తేసింది కేంద్రప్రభుత్వం. కొత్త సీఎం కూడా వచ్చేశారు. అంతా సెట్ అయిందనుకుంటున్న సమయంలో.. మళ్లీ అల్లర్లు చెలరేగాయ్. గత రెండేళ్లుగా సాగుతున్న జాతుల మధ్య ఘర్షణలు, కొద్దిరోజుల నిశ్శబ్దం తర్వాత మళ్లీ ఉఖ్రుల్ జిల్లాలో హింసాత్మక రూపం దాల్చడం.. అత్యంత ఆందోళనకరమైన విషయం. సాధారణంగా ఈ హింస.. మైతీ, కుకీ వర్గాల మధ్యే ఉండేది. ఇప్పుడది.. నాగా ప్రాబల్యం ఉన్న జిల్లాకు పాకడమే.. ఇప్పుడున్న సంక్షోభంలో కొత్త మలుపు. ఉఖ్రుల్ జిల్లాలోని లిటాన్ గ్రామంలో టాంగ్‌ఖుల్ నాగా వర్గానికి చెందిన ఓ వ్యక్తిపై.. కుకీ వర్గ సభ్యులు దాడి చేశారనే వార్తే.. ఈ చిచ్చుని రాజేసింది. ఈ దాడి తర్వాత రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తర్వాత.. ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయ్. లిటాన్ గ్రామంలో కొందరు దుండగులు పదుల సంఖ్యలో ఇళ్లను తగలబెట్టారు. దాంతో.. ప్రాణభయంతో వందలాది మంది ప్రజలు తమ ఇళ్లని వదిలి పక్కనే ఉన్న జిల్లాకు, అటవీ ప్రాంతాలకు పారిపోయారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం ఖేమ్‌చంద్ సింగ్ ప్రభుత్వానికి.. ఈ పరిస్థితులు సవాల్‌గా మారాయ్.
మణిపూర్ సంక్షోభంలో ఇప్పటివరకు నాగాల ప్రమేయం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు నాగాలు వర్సెస్ కుకీల మధ్య గొడవలు మొదలవ్వడం ప్రమాదకర సంకేతాన్ని పంపాయ్. లిటాన్ లాంటి గ్రామాలు మిశ్రమ జనాభా కలిగి ఉండటం వల్ల, గొడవలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇదే నెలలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వారంలోపే.. ఇంతటి హింస జరగడం.. శాంతి భద్రతల వైఫల్యంగా విమర్శలు వస్తున్నాయ్. ప్రధానంగా.. మయన్మార్ నుంచి కుకీ తెగకు చెందిన వారు అక్రమంగా మణిపూర్‌లోకి వస్తున్నారని, దీనివల్ల స్థానిక జనాభా సమతుల్యత దెబ్బతింటోందని మైతీలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన.. రిజర్వ్‌డ్ ఫారెస్ట్ సర్వే, ఆక్రమణల తొలగింపు కూడా కుకీల్లో ఆగ్రహం తెప్పించింది. పైగా.. మణిపూర్ అసెంబ్లీలోని 60 స్థానాల్లో.. 40 సీట్లు ఇంఫాల్ లోయ ప్రాంతం నుంచే ఉన్నాయ్. దీనివల్ల.. కొండ ప్రాంత ప్రజల్లో.. తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావనలో ఉన్నారు.
2023 మేలో.. మణిపూర్‌లో మొదలైన హింసకు ప్రధాన కారణం మైతీ సామాజిక వర్గం ఎస్టీ హోదా కావాలని డిమాండ్ చేయడమే. తమ సంస్కృతిని కాపాడుకునేందుకు, కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేందుకు ఎస్టీ హోదా అవసరమని వారు కోరుతున్నారు. ఇప్పటికే మైతీలు రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్నారని, వారికి ఎస్టీ హోదా ఇస్తే.. కొండ ప్రాంతాల్లోని తమ భూములు, ఉద్యోగ అవకాశాలు పోతాయని కుకీలు ఆందోళన చెందుతున్నారు. లోయలో ఉండే మైతీలు, కొండ ప్రాంతాల్లో భూమి కొనడానికి ఉన్న నిషేధంపై అసంతృప్తిగా ఉన్నారు. గతేడాది జరిగిన అల్లర్లలో పోలీస్ స్టేషన్ల నుంచి వేల సంఖ్యలో ఆయుధాలు లూటీ అయ్యాయి. ఇవి ఇంకా పౌరుల చేతుల్లోనే ఉండటం వల్ల.. చిన్న గొడవ కూడా పెద్ద యుద్ధంలా మారుతోంది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయ్. కేవలం బలగాలతోనో, ఇంటర్నెట్ సేవల నిలిపివేతతోనో శాంతిని తీసుకురాలేమని గత రెండేళ్ల అనుభవం నేర్పింది. అందువల్ల.. మైతేయి, కుకీ ప్రాంతాల మధ్య ఉన్న బఫర్ జోన్లని.. కేంద్ర బలగాల ద్వారా మరింత కఠినంగా పర్యవేక్షించాలి. ఏ వర్గం కూడా సరిహద్దులు దాటకుండా చూడాలి.
కేవలం ప్రభుత్వం వైపు నుంచే కాకుండా, కుకీ, మైతీ, నాగా వర్గాల పౌర సమాజ ప్రతినిధులతో ఉన్నత స్థాయి చర్చలు జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికే కొమ్ముకాస్తుందనే అపనమ్మకం ప్రజల్లో ఉంది. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని నిరూపించుకోవాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నేరుగా పర్యవేక్షణ పెంచాలి. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న తప్పుడు ప్రచారాలను, విద్వేషాలను అరికట్టేందుకు స్పెషల్ ట్రాక్ ఫోర్స్ ఉంచాలి. మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వడంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలి. మయన్మార్ నుంచి అక్రమ చొరబాట్లు, డ్రగ్స్ రవాణా జరగకుండా సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పనుల్ని వేగవంతం చేయాలి. మణిపూర్ సమస్య కేవలం.. శాంతిభద్రతల సమస్య కాదు. ఇది నమ్మకానికి సంబంధించింది. ఓ వర్గం తీసుకునే చర్యని మరో వర్గం తమ అస్తిత్వానికి ముప్పుగా భావించడం వల్ల.. పదే పదే అల్లర్లు చెలరేగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. అందువల్ల.. మణిపూర్‌లో శాంతి అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. రెండు వర్గాల మధ్య పెరిగిన భావోద్వేగ అగాధాన్ని పూడ్చడమే అతిపెద్ద సవాల్.
Also Read:గెలుపే లక్ష్యం.. ఎంతైనా ఖర్చు చేద్దాం.. మున్సిపల్ బరిలో అభ్యర్థుల భారీ ప్లాన్!
Story by: Anup, Big Tv